శ్రీ గురుచరిత్ర
V
U
శ్రీ గురుచరిత్ర
నిత్య పారాయణ గ్రంథము
రచయిత:
పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ
ప్రచురణ :
శ్రీ మంగభరద్వాజ ట్రస్ట్,
for శ్రీ గురుపాదుకా పబ్లికేషన్స్
12-1-170/46P, Bhaktha Nivas
Jaipuri Colony, Nagole, Hyderabad - 500 068
Phone: 7416041550
w
W
X
www.saimasterforums.org
సర్వస్వామ్యములు :
మాతృశ్రీ ఎక్కిరాల అలివేలు మంగతాయారు గారివి
ప్రథమ ముద్రణ : 1982
Reprint - 2022
వెల: 150/-
ప్రతులకు
Cell : 7416041550.
SRI MANGA BHARADWAJA TRUST
Registered Office : Bhakta Nivas, 12-1-70/46P, Hanuman Nagar, Jaipuri Colony, Nagole, HYDERABAD, Telagana Dist. - 500 068.
Ph : 08592-233271
SRI MANGA BHARADWAJA TRUST
Ongole Branch Office : Kothapeta, Kondaiah Bunk Street, Ongole, Andhra Pradesh - 523 002.
శ్రీ గురుచరిత్ర పారాయణను కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకొనవచ్చును. ఈ చరిత్ర పారాయణ చేయదలచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినకముందు, దేవుని ముందు కూర్చుని, దీపారాధన చేసి, అగరువత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి. కాఫీ, పాలు మొదలైన ద్రవపదార్థాలు తీసుకొనవచ్చు. ఉదయము పారాయణ చేసుకొనుటకు అవకాశము లేనివారు సాయంత్రము స్నానము చేసి పారాయణ చేసుకొనవచ్చు. ఒక పూటలో ఆరోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలుపడనపుడు ఉదయం కొన్ని అధ్యాయాలు, సాయంత్రం మరల స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకొనవచ్చు. ఉదయం పారాయణ చేసుకొనుటకు ఏమాత్రమూ వీలుపడని వారు సాయంత్రముగాని, రాత్రిపూట గాని స్నానము చేసి భోజనము చేయకముందు పారాయణ చేసుకొనవచ్చు.
ఇంతకు మించి ఆహార విహారాదులలో ఎట్టి నియమములూ అవసరము లేదు.
ఒక్క రోజులో గ్రంధం మొత్తం పారాయణ పూర్తి చేయాలనుకున్నవారు పండ్లు తీసుకొనవచ్చును. పాలు వంటి ద్రవపదార్ధములు గూడ తీసుకొనవచ్చును.
సప్తాహ పారాయణ (ఒక వారము లేక 7 రోజులు) పూర్తి చేయలేనివారు ద్విసప్తాహపారాయణ (2వారాలు) గాని, త్రిసప్తాహ పారాయణ (21రోజులు) గాని చేసుకొనవచ్చు. అందుకుగూడ అవకాశం లేనివారు రోజుకు ఒక అధ్యాయము చొ॥న పారాయణ చేసుకొనవచ్చు. స్త్రీలు బహిష్టు సమయంలో ఈ చరిత్ర పారాయణ చేయకూడదు.
సామాన్యంగా మనం పారాయణ చేసే గ్రంధం ఎవరికీ ఇవ్వకుండడం మంచిది. కొన్ని ఆవర్తాలు (కొన్నిసార్లు) పారాయణ పూర్తి అయ్యాక, కొద్ది దక్షిణతో పాటు ఈ గ్రంధప్రతి నొకటి ఎవరికైనా దానం చేస్తే ముల్లోకాలలోను దానం చేసిన పుణ్యఫలం వస్తుంది.
స్నానానికి గూడ అవకాశం లేనపుడు గాని, ఆరోగ్యం సరిగా లేనపుడుగాని.
శ్లో॥ అపవిత్రః పవిత్రోవా సర్వావస్ధాన్ గత 2. పివా
యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యభ్యంతర శ్శుచిః ॥
అనే శ్లోకాన్ని చెప్పుకొని, తీర్ధాన్ని గురుపాదోదకంగా భావించి, కొంచెం త్రాగి, కొంచెం శిరస్సున చల్లుకొని పారాయణ చేయవచ్చు. "హృదయ కమలంలో వున్న చైతన్యమే తన నేత్రముగా గల భగవంతుని స్మరిస్తే ఎట్టి స్థితులలో వున్నవారైనా బాహ్యాభ్యంతరముల యందు శుచియౌతారు" అని ఈ శ్లోకానికర్ధం.
స్వయంగా పారాయణ చేయలేనివారు శ్రీ గురుచరిత్ర శ్రవణం చేసినా అదే ఫలితముంటుందని శ్రీగురుడు చెప్పారు.
పారాయణ చేయడానికి వీలుగాని సమయంలో 'దత్త దత్త' అనిగాని, శ్రీదత్త జయదత్త అన్న నామంగాని సప్తాహము చేయవచ్చు. ప్రతిరోజూ నిత్యపారాయణ అయిన తర్వాత దత్తస్తోత్రాలలో
శ్లో॥ అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః ।
స్మర్తృగామీ స్వభాక్తానాముద్ధర్తా భవసంకటాత్ ॥
అన్న శ్లోకం యథాశక్తి జపంచేస్తే కష్టాలు తొలుగుతాయి.
శ్లో॥ జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా ।
మృత్యుంజయ స్స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు ॥
అన్నశ్లోకం యథాశక్తి జపంచేస్తే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది.
శ్లో॥ దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతమ్ ।
యో...భూదభీష్టదః పాతు స నః సంతానవృద్ధికృత్ ॥
అన్న శ్లోకం యథాశక్తి జపంచేస్తే సంతానాన్ని ప్రసాదిస్తుంది.
శ్లో॥ దరిద్ర విప్ర గేహే యః శాకం భుక్త్వోత్తమ శ్రియమ్
దదౌ శ్రీదత్త దేవః దారిద్ర్యాత్ శ్రీప్రదోవతు ॥
అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే దారిద్ర్యాన్ని తొలగించి సంపదనిస్తుంది.
|
గ్రంథ పారాయణ పద్ధతిసప్తాహ పారాయణము
|
గురువారం 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు
శుక్రవారం 10వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు
శనివారం 22వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు
ఆదివారం 30వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు
సోమవారం 36వ అధ్యాయం నుండి 38వ అధ్యాయం వరకు
మంగళవారం 39వ అధ్యాయం నుండి 43వ అధ్యాయం వరకు
బుధవారం 44వ అధ్యాయం నుండి 52వ అధ్యాయం వరకు
|
గ్రంథ పారాయణ పద్ధతిద్విసప్తాహ పారాయణము
|
గురువారము 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం వరకు
శుక్రవారము 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు
శనివారము 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు
ఆదివారము 11వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు
సోమవారము 14వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు
మంగళవారము 19వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు
బుధవారము 24వ అధ్యాయం నుండి 27వ అధ్యాయం వరకు
గురువార 28వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు
శుక్రవారము 31వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు
శనివారము 36వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు
ఆదివారము 40వ అధ్యాయం నుండి 47వ అధ్యాయం వరకు
సోమవారము 42వ అధ్యాయం నుండి 45వ అధ్యాయం వరకు
మంగళవారము 46వ అధ్యాయం నుండి 49వ అధ్యాయం వరకు
బుధవారము 50వ అధ్యాయం నుండి 52వ అధ్యాయం వరకు
|
గ్రంథ పారాయణ పద్ధతిత్రిసప్తాహ పారాయణము
|
గురువారము 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం వరకు
శుక్రవారము 3వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు
శనివారము 5వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు
ఆదివారము 7వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు
సోమవారము 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు
మంగళవారము 12వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు
బుధవారము 14వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు
గురువారము 17వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు
శుక్రవారము 20వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు
శనివారము 23వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు
ఆదివారము 26వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు
సోమవారము 29వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు
మంగళవార 31వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు
బుధవారము 33వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు
గురువారము 36వ అధ్యాయం నుండి 38వ అధ్యాయం వరకు
శుక్రవారము 39వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు
శనివారము 41వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు
ఆదివారము 43వ అధ్యాయం నుండి 45వ అధ్యాయం వరకు
సోమవారము 46వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు
మంగళవారము 49వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు
బుధవారము 51వ అధ్యాయం నుండి 52వ అధ్యాయం వరకు
శ్రీ గురుచరిత్ర - పారాయణ పద్ధతి 5
ముఖ్య సూచన 19
ముందుమాట 20
దత్తస్తుతి - గ్రంథ స్తుతి 25
శ్రీ దత్తాత్రేయుని షోడశావతారములు : 29
16) శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు : 37
“శ్రీ గురుచరిత్ర" - గ్రంథమాహాత్మ్యం 39
'శ్రీ గురుచరిత్ర" గ్రంథమహిమ 44
శ్రీ దత్త మంత్రాత్మక శ్లోకములు 48
శ్రీ దత్తాత్రేయాష్టోత్తర శతనామావళి 50
ధ్యానము : 55
అంగపూజ : 57
*** గురువారం పారాయణ ప్రారంభం *** 60
అధ్యాయం - 1 60
శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము 60
గంగాధర సరస్వతీ స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము 63
కథారంభము 64
అధ్యాయం - 2 67
కథారంభము 67
అధ్యాయం - 3 75
కథారంభము 75
అధ్యాయం - 4 79
అధ్యాయం - 5 83
కథారంభము 84
అధ్యాయం - 6 89
కథారంభము 89
అధ్యాయం - 7 93
అధ్యాయం - 8 97
కథారంభము 97
శ్రీ గురుచరిత్ర 102
అధ్యాయం -9 102
*** గురువారం పారాయణ సమాప్తము *** 104
*** శుక్రవారం పారాయణ ప్రారంభం *** 105
శ్రీ గురుచరిత్ర 105
అధ్యాయం - 10 105
శ్రీ గురుచరిత్ర 108
అధ్యాయం - 11 108
ప్రస్తావన : 108
కథారంభము 109
శ్రీ గురుచరిత్ర 114
అధ్యాయం - 12 114
శ్రీ గురుచరిత్ర 119
అధ్యాయం - 13 119
ప్రస్తావన : 119
కథారంభము 119
శ్రీ గురుచరిత్ర 125
అధ్యాయం - 14 125
శ్రీ గురుచరిత్ర 127
అధ్యాయం - 15 127
శ్రీ గురుచరిత్ర 130
అధ్యాయం - 16 130
ప్రస్తావన : 130
కథారంభము 131
శ్రీ గురుచరిత్ర 136
అధ్యాయం - 17 136
ప్రస్తావన: 136
కథారంభము 137
శ్రీ గురుచరిత్ర 139
అధ్యాయం - 18 139
శ్రీ గురుచరిత్ర 141
అధ్యాయం - 19 141
శ్రీ గురుచరిత్ర 144
అధ్యాయం-20 144
ప్రస్తావన : 144
కథారంభము 144
శ్రీ గురుచరిత్ర 149
అధ్యాయం - 21 149
*** శుక్రవారం పారాయణ సమాప్తము ** 151
*** శనివారము పారాయణ ప్రారంభం *** 152
శ్రీ గురుచరిత్ర 152
అధ్యాయం - 22 152
ప్రస్తావన : 152
కథారంభము 152
శ్రీ గురుచరిత్ర 155
అధ్యాయం - 23 155
శ్రీ గురుచరిత్ర 158
అధ్యాయం - 24 158
శ్రీ గురుచరిత్ర 161
అధ్యాయం - 25 161
ప్రసావన : 161
కథారంభము 161
శ్రీ గురుచరిత్ర 165
అధ్యాయం - 26 165
శ్రీ గురుచరిత్ర 168
అధ్యాయం - 27 168
శ్రీ గురుచరిత్ర 170
అధ్యాయం - 28 170
ప్రస్తావన: 170
కథారంభము 170
శ్రీ గురుచరిత్ర 176
అధ్యాయం - 29 176
*** శనివారము పారాయణ సమాప్తము *** 179
*** ఆదివారం పారాయణ ప్రారంభం *** 180
శ్రీ గురుచరిత్ర 180
అధ్యాయం - 30 180
ప్రస్తావన : 180
కథారంభము 180
శ్రీ గురుచరిత్ర 186
అధ్యాయం - 31 186
శ్రీ గురుచరిత్ర 188
అధ్యాయం - 32 188
శ్రీ గురుచరిత్ర 193
అధ్యాయం - 33 193
ప్రస్తావన : 193
కథారంభము 194
శ్రీ గురుచరిత్ర 197
అధ్యాయం - 34 197
శ్రీ గురుచరిత్ర 199
అధ్యాయం-35 199
*** ఆదివారం పారాయణ సమాప్తము *** 203
*** సోమవారం పారాయణ ప్రారంభం *** 204
శ్రీ గురుచరిత్ర 204
అధ్యాయం - 36 204
ప్రస్తావన: 204
కథారంభము 204
శ్రీ గురుచరిత్ర 208
అధ్యాయం -37 208
శ్రీ గురుచరిత్ర 211
అధ్యాయం -38 211
ప్రస్తావన: 211
కథారంభము 211
*** సోమవారం పారాయణ సమాప్తము *** 214
*** మంగళవారం పారాయణ ప్రారంభం *** 215
శ్రీ గురుచరిత్ర 215
అధ్యాయం - 39 215
శ్రీ గురుచరిత్ర 220
అధ్యాయం - 40 220
శ్రీ గురుచరిత్ర 226
అధ్యాయం - 41 226
ప్రస్తావన : 226
కథారంభము 226
శ్రీ గురుచరిత్ర 232
అధ్యాయం - 42 232
శ్రీ గురుచరిత్ర 237
అధ్యాయం - 43 237
*** మంగళవారము పారాయణ సమాప్తము *** 240
*** బుధవారము - పారాయణ ప్రారంభం *** 241
శ్రీ గురుచరిత్ర 241
అధ్యాయం - 44 241
ప్రస్తావన: 241
కథారంభము 242
శ్రీ గురుచరిత్ర 248
అధ్యాయం - 45 248
శ్రీ గురుచరిత్ర 253
అధ్యాయం - 46 253
శ్రీ గురుచరిత్ర 256
అధ్యాయం - 47 256
ప్రస్తావన: 256
కథారంభము 257
శ్రీ గురుచరిత్ర 260
అధ్యాయం - 48 260
శ్రీ గురుచరిత్ర 265
అధ్యాయం - 49 265
శ్రీ గురుచరిత్ర 269
అధ్యాయం - 50 269
ప్రస్తావన : 269
కథారంభము 269
శ్రీ గురుచరిత్ర 279
అధ్యాయం - 51 279
శ్రీ గురుచరిత్ర 284
అధ్యాయం - 52 284
****బుధవారం పారాయణం సమాప్తము **** 286
అనుబంధం 287
అవధూతోపాఖ్యానం 287
ప్రస్తావన : 287
కథారంభము 288
శ్రీ గురుచరిత్ర - కాల నిర్ణయం 294
నిత్యపాఠం 302
శ్రీ దత్తాష్టకం 303
పూజ్య ఆచార్యుల వారిచే రచించబడిన 307
శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 307
శ్రీ గురుచరిత్ర కృతజ్ఞతా మహోత్సవము 308
సాయి లీలామృతం కృతజ్ఞతా మహోత్సవము 309
|
ముఖ్య సూచన
|
శిరిడీ సాయిబాబా భక్తులకు "శ్రీ గురుచరిత్ర" పారాయణ యెంతో అవసరం. హరివినాయక్ సాఠే, అన్నా సాహెబ్ దభోల్కర్ వంటి వారికి శ్రీసాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించడానికి "శ్రీ గురుచరిత్ర" పారాయణమే కారణమయింది. కుశాభావు అనే భక్తుడి విషయంలో యీ సత్యం యింకెంతో స్పష్టంగా కన్పిస్తుంది. అతడి చేత యీ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాథుడు దీనికెంత ప్రాముఖ్యమిచ్చారో తెలుస్తుంది. ఆయన మహాత్ములందరిలోకి తలమానికము - కోహినూర్ వంటి వారైనప్పటికీ తాను సద్గురువునని చెప్పక, అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా యెలా సేవించాలో యెన్నడూ చెప్పలేదు. భగవద్గీతా శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు ఒకటి రెండు మాత్రమే చెప్పారు. అందుకే ఆయనను ఆ రీతిన యెవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించిన కొద్దిమందీ గూడ చేయలేకపోయారు. అలాగాక, గురుచరిత్రలో శ్రీగురుడు ఎన్నో పురాణోపాఖ్యానాల సహాయంతో యీ విషయం వివరించారు. అంటే భక్తులు ఎలా శ్రీ సాయిని సేవించాలో "శ్రీ గురుచరిత్ర" నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట.
మేము ప్రచురిస్తున్న యీ " శ్రీ గురు చరిత్ర" కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అది తెలియాలంటే యీ క్రింది విషయాలు గమనించాలి.
సాయందేవుని వంశానికి చెందిన గంగాధరసరస్వతి ప్రస్తుత గురుచరిత్ర వ్రాసేనాటికే వేరొక గురుచరిత్ర గ్రంథముండేదని తెలుస్తుంది. నామ ధారకుడికి సిద్ధయోగి దానిని చూపినట్లు శ్రీ గురుచరిత్రలో చూస్తాం. అంతేగాక యీ గ్రంథంలో "నా తండ్రి శ్రీ గురుచరిత్ర శ్రవణాసక్తుడు" అని వ్రాసాడు. అయితే అది తానే కూర్చొనని గూడ చెబుతాడు. అంటే ప్రస్తుత గురుచరి యితడు కూర్చినదన్నమాట. కేవలం సాధువుకుండవలసిన నిరహంకారం వల్లనే అది తన రచనగా యెక్కడా చెప్పుకోలేదు. అది వ్రాతప్రతిగా వారిదగ్గరే వుండేది. కారణం శ్రీగురులీలల పానమే తమకు అన్నపానీయాలని ఆయన ఒకచోట శ్రీ గురుచరిత్రలో అంటారు.
ఇదిగాక శ్రీగురుడు గోకర్ణంలో వుండేనాటికే ఒక సంక్షిప్తమైన గురుచరిత్ర వుండేదని, శ్రీగురుడు ఏకాంతంలో వున్న సమయంలో వారి దర్శనానికి వచ్చిన భక్తులకు సిద్ధయోగి దానిని వినిపిస్తుండేవారనీ ఒక జనవాక్యమున్నది. కొందరు పరిశోధకులు గూడ యిలానే వ్రాశారు. అంటే శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమయ్యేనాటికే ఒక శ్రీగురుచరిత్ర గ్రంథమున్నట్లు, శ్రీగురుడు అంతర్థానమయ్యే ముందు చెప్పిన మాటలు సూచిస్తున్నాయి. అంటే సద్గురువు యొక్క లీలలను, బోధనలను, పారాయణ, శ్రవణము, చింతనము చేయడమన్నవి ఉత్తమ సాధనంగా శ్రీగురుడే తమ భక్తులకు, శిష్యులకూ విధించినట్లు స్పష్టమవుతుంది. అందుకే తర్వాతి దత్తాత్రేయుని పూర్ణావతారమైన శిరిడీసాయిబాబా గూడ తమ చరిత్ర పారాయణ ఉత్తమ సాధనగా నిర్ణయించే, దాసగణుచేత హరికథల రూపంలో తమ లీలలు గానం చేయనిచ్చారు. అన్నా సాహెబ్ దబోల్కర్ (ఉరఫ్ హేమాద్రిపంతు)కు ఆయన "శ్రీసాయి సచ్చరిత్ర" వ్రాయడానికి అనుమతినిచ్చి ఆశీర్వదించారు.
శ్రీగురుని కాలంలోనే రూపొందిన ఒక సంక్షిప్త గురుచరిత్ర సాయం దేవుడు కన్నడభాషలో గూడ వ్రాసాడని ఎందరో పండితులంటారు. అంతేగాక నరకేసరి, నందిశర్మ, నరహరి వంటి కవీశ్వరులు గూడ శ్రీగురుని లీలలను కీర్తించి రచనలు చేసారు.
మనదేశంలో గ్రంథముద్రణ అమలులో లేనప్పుడు “శ్రీ గురుచరిత్ర" వ్రాతప్రతులుగా ప్రచారమయ్యేది. అటువంటి వ్రాతప్రతులు యిప్పటికీ యెన్నో భక్తుల కుటుంబాల వద్ద వున్నాయి. కాని వీరిలో ఎక్కువమంది, ఆ వ్రాతప్రతులను పరమ పవిత్రంగా పూజలో వుంచుకొని, నేడు ముద్రించబడే గ్రంథాలను మాత్రమే పారాయణకు ఉపయోగిస్తారు. శ్రీగురుని నుండి ప్రత్యేకమైన సందేశమొస్తే దప్ప ఆ వ్రాత ప్రతులను తీసిచూడరు, యితరులకు చూపరు. ఇటువంటి రెండు కుటుంబాల వారికి తగిన సందేశం లభించినందువలన తమవద్దనున్న వ్రాతప్రతులలోని అంశాలు కొన్ని శ్రీగురుని అనుగ్రహం వలన నాకు లభించాయి. వీటిని యీ మూడవ ముద్రణలో పొందుపరుస్తున్నాను. అలనాడు శ్రీగురుని ప్రత్యక్షంగా సేవించిన భక్తులకు, భక్తురాండ్రకూ మహారాష్ట్ర దేశాచారాన్ననుసరించి రెండేసి పేర్లు వుండేవి. వారి అనుభవాలు శ్రీగురుచరిత్రలో వ్రాయబడినప్పుడు కొన్నివ్రాతప్రతులలో ఒక పేరు, మరికొన్ని వ్రాతప్రతులలో మరొక పేరూ వ్రాసారు. మన యీ ముద్రణలో యీ రెంటినీ ప్రస్తావించాను.
అన్నింటికంటే ముఖ్యమైన విషయాలు రెండున్నాయి. వెనుకటి వ్రాత ప్రతులలో ముఖ్యమైనదొకటి గాణాపురం ప్రాంతంలోనే ఒక సదాచార సంపన్నమైన కుటుంబం వద్ద వుండేది. ఒకప్పుడు ఖేడ్గాఁప్డేట్ (పూణే వద్ద)లో సిద్ధపురుషుడుగా ప్రసిద్ధికెక్కిన శ్రీనారాయణ్ మహరాజ్ గారు చిన్న వయస్సులోనే గాణాపూర్ వద్దనున్న సంగమానికి వచ్చి, చాలాకాలం శ్రీదత్తానుగ్రహం కోసం తపస్సు చేసారు. ఒకనాడు శ్రీగురుడు ఆయనకు స్వప్నదర్శనమిచ్చి, పైన చెప్పిన సబ్రాహ్మణ కుటుంబంనుండి వారివద్దనున్న ప్రాచీన వ్రాతప్రతిని పొందమని ఆదేశించారు. అదేరాత్రి ఆ కుటుంబీకులకు గూడ శ్రీగురుడే దర్శనమిచ్చి, అతని వద్దనున్న వ్రాతప్రతిని నారాయణ్ మహరాజ్ కు యివ్వమని ఆదేశించారు. ఆ రీతిన లభించిన ఆ వ్రాతప్రతి శ్రీ నారాయణ్ మహరాజ్ వద్ద జీవితాంతమూ వుండేది. శ్రీ గురుని నుండి వారికెట్టి ఆదేశమూ రానందువలన ఆ వ్రాతప్రతిని ఆ మహాత్ముని దేహంతో పాటు వారి సమాధిలో పెట్టేసారు. అరుదుగా దానిని శ్రీమహారాజ్ గారికి చదివి వినిపించే అదృష్టం కల్గిన ఒక భాగ్యశాలి నుండి రెండు విషయాలు తెలియ వచ్చాయి: ఆవ్రాతప్రతిలో చివరి అధ్యాయంగా "శ్రీగురుగీత", భాగవతం ఏకాదశ స్కంధంలో శ్రీకృష్ణుడు ఉద్దవునికి చెప్పిన అవధూతోపాఖ్యానం గూడ వున్నాయనితెలిసింది. అటువంటి వ్రాతప్రతుల ఆధారంగానే శ్రీవాసుదేవానంద సరస్వతీస్వామి తాము వ్రాసిన "శ్రీసంహితాయన గురుద్విసాహస్ర" అనే గ్రంథంలో యీ అవధూతోపాఖ్యానం పొందుపరచారు. ఇది మనకు యీనాడు లభించే ముద్రితమైన శ్రీగురుచరిత్ర గ్రంథాలలో కన్పించదు. ఈకారణంగానే శ్రీ గురుచరిత్రలోని అధ్యాయాల సంఖ్య 51 అని కొందరు, 52 అని కొందరు, 53 అని కొందరు తలచడానికి కారణం అయింది.
అందువలన యీ మూడవ ముద్రణలో అవధూతోపాఖ్యానం అను బంధంగా ముద్రించడమయింది. ఆ వ్రాతప్రతిలో "శ్రీగురుగీత" గూడ వుండడం వలన శ్రీగురుని భక్తులకు అదెంతో విలువైనదని స్పష్టమవుతున్నది. అంతేగాదు, శ్రీగురుని వంటి మహనీయుడు మాత్రమే నిజానికి గురువనదగిన వారని, ముముక్షువులు అట్టి వారిని మాత్రమే శ్రీ గురుగీతలో చెప్పిన విధంగా ఆశ్రయించి సేవించాలనీ స్పష్టమవుతుంది. అర్హతలేని వారి వద్ద మంత్రోపదేశం పొందడం యెంతటి అనర్ధమో యీ "శ్రీగురుచరిత్ర" చెబుతుంది. అందువలన త్వరలో "శ్రీగురుగీత" గూడ - పెక్కు వ్రాతప్రతులను పరిశోధించి, తాత్పర్యంతో కలిపి ముద్రించనున్నాము. ఇంకొక ముఖ్యాంశం వున్నది-
శిరిడీ సాయిబాబా భక్తులకు "శ్రీగురుచరిత్ర" పారాయణ యెంతో అవసరం. హరివినాయక్ సారే, అన్నాసాహెబ్ దభోల్కర్ వంటి వారికి శ్రీసాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించడానికి "శ్రీగురుచరిత్ర" పారాయణమే కారణమయింది. కుశాభావు అనే భక్తుడి విషయంలో యీ సత్యం యింకెంతో స్పష్టంగా కన్పిస్తుంది. అతడిచేత యీ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాథుడు దీనికెంత ప్రాముఖ్యమిచ్చారో తెలుస్తుంది. ఆయన మహాత్ములందరిలోకి తలమానికము, కోహినూర్ వంటి వారైనప్పటికీ తాను సద్గురువునని చెప్పక, అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా యెలా సేవించాలో యెన్నడూ చెప్పలేదు. భగవద్గీతా శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు ఒకటి రెండు మాత్రమే చెప్పారు. అందుకే ఆయనను ఆ రీతిన సేవించడానికి యెవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించిన కొద్దిమందీ గూడ చేయలేకపోయారు. అలాగాక, గురుచరిత్రలో శ్రీగురుడు యెన్నో ' పురాణోపాఖ్యానాల సహాయంతో యీ విషయం వివరించారు. అంటే భక్తులు యెలా శ్రీసాయిని సేవించాలో "శ్రీగురుచరిత్ర" నుండి నేర్చుకోమని శ్రీసాయి సూచించారన్నమాట.
అంతేగాక, శ్రీగురునికి - సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు యెన్నో వున్నాయి. జన్మించిన క్షణంనుండే యీ యిద్దరికీ తాము యెవరో తెలుసు. ఇద్దరూ లోకహితం కోసం అవతరించిన భగవత్స్వరూపులే. అయినప్పటికీ సత్సంప్రదాయాన్ననుసరించి ఇద్దరూ బాహ్యంగా గూడ ఒక గురువును ఆశ్రయించారు. శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్థానమయినప్పుడు తమ శిష్యులకు పూలు ప్రసాదంగా అందజేసి, వాటిని ప్రాణప్రదంగా వుంచుకోమని చెప్పారు. సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుక రాయిని అలానే పవిత్రంగా వుంచుకున్నారు. అది విరిగిపోయిన కొద్దికాలానికే ఆయన గూడ శరీర త్యాగం చేసారు. ఆయన తమను తమ గురువు ఒక బావిలోకి తలక్రిందులుగా వ్రేలాడదీసినట్లు చెప్పారు. గురుచరిత్రలో దీపకుడు, ఉపమన్యువు మొ ॥ న వారు చేసిన గురుసేవా విధానమంతా ఆ ఒక్క వాక్యానికి వివరణ అని తలచవచ్చు. శ్రీగురుడు యెంతోకాలం సన్యాసాశ్రమ ధర్మాన్ననుసరించి దేశసంచారం చేస్తూ లోకుల దృష్టినుండి గుప్తంగా వుండిపోయారు. ఒక్క నర్సోబావాడిలోనే 12 సం ॥ లు తపోనిష్ఠలో వున్నారు. శ్రీసాయి గూడ శిరిడీలో వేపచెట్టు క్రిందనున్న భూగృహంలో 12 సం ॥ లు వున్నారు. అందుండి బయటకు వచ్చాక గూడ సుమారు 30 సం ॥ లు గుప్తంగా పిచ్చి ఫకీరులా మాత్రమే జీవించారు. శ్రీగురుడు, తాము లోకానికి వెల్లడి కావలసిన సమయమొచ్చాకనే గంధర్వపురం చేరి ప్రకటమయినట్లు, శ్రీసాయి గూడ చివరి 23 సం॥లలోనే వెల్లడి అయ్యారు. కాకుంటే సాయి నైష్ఠిక బ్రహ్మచారి గనుక, యావజ్జీవితమూ తమ గురు సన్నిధిలోనే వుండిపోయారు. కేవలం ఆ గురువు ఆదేశించడం వల్లనే భక్తులనుద్ధరించడానికి మొదట్లో ఆయన దేశసంచారం చేసారని తలచవచ్చు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళి రావడం నిత్యమూ మహోత్సవంగా జరిగినట్లే, శ్రీసాయి రోజూ లిండీకి రావడం, రోజు విడచి రోజు చావడికి వెళ్ళడమూ గొప్ప ఊరేగింపుగా జరిగింది. కొద్దిలో చెప్పాలంటే, సాయి చరిత్రలో గురుస్థానం (వేపచెట్టు మూలం) నర్సోబావాడి వంటిది; లెండీవనమే సంగమం: ద్వారకామాయియే గంధర్వపురం. ఈ మహనీయులిద్దరూ తమ 16వ యేటనే బాహ్య ప్రపంచంలోనికి అడుగు పెట్టారు. ఇద్దరూ తమ భక్తులకు కవితాశక్తిననుగ్రహించి, వారికి బిరుదులు గూడా యిచ్చారు. శ్రీగురుడు ఒకనికి 'యోగీశ్వర్' అని మరొకరికి 'కవీశ్వర్' అని బిరుదులిస్తే- శ్రీసాయి ఒకరికి 'దాసగణు' అని, మరొకరికి 'హేమాద్పంత్' అని బిరుదులివ్వడమేగాక, జగేశ్వర్ భీష్మకు కవితాధారనిచ్చి 'సగుణోపాసన' వ్రాయించుకున్నారు. శ్రీగురుడు ఒక యవనరాజును అనుగ్రహించి అతనినుండి పూజలందుకున్నారు. సాయి యవనులందరిచేతా సేవించ బడుతున్నారు. ఇద్దరిదీ భిక్షా వృత్తియే. ఈ యిద్దరూ కర్మ ఫలానికీ, జన్మ పరంపరలకూ యెంతో ప్రాముఖ్యమిచ్చారు. ఇలా ఆలోచించినకొద్దీ యింకెన్నో పోలికలు స్ఫురిస్తాయి. కనుకనే “శ్రీసాయిబాబా జీవిత చరిత్ర", "శ్రీగురుచరిత్ర" ఒకదానికొకటి వివరణమని చెప్పాలి. ఆ రెండూ ఒకే దత్తాత్రేయుని చరిత్రలో వేర్వేరు అధ్యాయాలు. కనుక సాయి భక్తులందరికీ, "శ్రీసాయిబాబా జీవిత చరిత్ర", "శ్రీగురుచరిత్ర", "శ్రీగురుగీత"లు కలసి
ప్రస్థానత్రయము అనవచ్చు. ప్రస్థానత్రయమంటే సనాతనధర్మ మంతటికీ మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత.
భగవంతుడు ఒక్కడే. ఒకప్పుడు ఆయన అనేకమవదలచాడు. అట్టి సంకల్పమే మాయాశక్తి. దానివల్లనే ఆయన ఈ విశ్వమంతా అయ్యాడు. ఇలా సర్వాన్నీ సృష్టించడం వలన ఆయననే బ్రహ్మ అనీ, ఈ విశ్వాన్ని పాలించడం వలన ఆయననే విష్ణువనీ, సకాలంలో సృష్టిలోని రూపాలను ఆయనే నశింపజేస్తుండడం వలన శివుడనీ అన్నారు. ప్రతి కల్పాంత ప్రళయానికి ముందు తరించకుండా వుండిపోయిన జీవులు మరల జన్మించి, అనుభవం ద్వారా పూర్వకర్మను రహితం చేసుకుంటూ ఈసారి ధర్మబద్ధంగా జీవించడం వలన మరలా కర్మకు బద్ధులుగాకుండా వుండే అవకాశమివ్వడానికే భగవంతుడు మళ్ళీ మళ్ళీ సృష్టిచేస్తుంటాడు. ప్రతిసారీ సృష్టితో జన్మకువచ్చే జీవులు కర్మబద్ధులవకుండా జీవించగలగడానికి మార్గం గూడా ఆ భగవంతుడే యేర్పాటు చేస్తాడు. అందుకే ప్రతిసారీ మొదట మహాయోగులైన సనకాది బ్రహ్మమానస పుత్రులను, తర్వాత మహర్షు లైన వశిష్టాది ప్రజాపతులనూ సృష్టిస్తాడు. మరల అటువంటి ఋషుల ద్వారానే వేదాలు, శాస్త్రాలు, సదాచారము అనేవి జీవులకు ప్రసాదిస్తాడు. ఈ విషయం నిత్యజీవితంలో అనుక్షణము గుర్తుంచుకొని, అటువంటి దీక్షతో మనము జీవించగలగడానికి సాధనంగానే మనము గోత్రఋషులను ప్రతి కార్యానికి ముందు సంకల్పంలో భాగంగాను, పెద్దలను దర్శించినపుడు 'ప్రవర' చెప్పుకొనడం లోనూ స్మరించడం ఒక సదాచారంగా మహర్షులు నిర్ణయించారు.
అంతేగాదు అజ్ఞానం వలన జీవులు అనివార్యంగా చేసే దోషాలు ఎక్కువగా పేరుకొని, ఆ ప్రజలే ధర్మబద్ధంగా జీవించడానికి బాహ్యమైన ఆటంకంగా యేర్పడినప్పుడు దానిని తొలగించడానికి రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు ఆ భగవంతుడే ఎత్తుతుంటాడు. కాని సృష్టి పొడుగునా అటువంటి అవరోధాలు సాధ్యమైనంత వరకూ రాకుండా చేయడానికి ఆ భగవంతుడే పరిపూర్ణులైన సద్గురువులుగా అవతరించి, తన లీలల ద్వారా సాధ్యమైనంతమందికి మోక్షేచ్ఛ, ధర్మనిష్ఠ కలిగేలా చేస్తూ వుంటాడు. ఇలా యెల్లప్పుడూ భూమిమీద పూర్ణులైన మహాత్ములుగా అవతరించే భగవత్తత్వాన్నే 'దత్తాత్రేయుడు' అన్నారు. భాషలను బట్టి ఆయనకు పేర్లు వేరుగావున్నా, ప్రపంచంలోని అన్ని మతగ్రంథాలలోనూ ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది.
అంటే మనందరినీ సృష్టించడం వలన భగవంతుడే సర్వులకూ తండ్రి; తన నుండి యేర్పడిన పదార్థాలతోనే మనను పోషిస్తుండడం వలన ఆయనయే జగన్మాత. శాస్త్రాలద్వారా మనకు హితం చెబుతున్నాడు గనుక ఆయనయే మనకు మిత్రుడు. అధర్మాన్ని నిగ్రహిస్తుంటాడు గనుక ఆయనయే ప్రభువు. సద్గురువుగా అవతరించి మనలను అనుగ్రహిస్తాడు గనుక ఆయనయే గురువు. ఇలా ఆలోచిస్తే భగవంతుడే, తన బిడ్డలమైన మనకు నవవిధ భక్తులతో సేవచేస్తున్నాడు! చివరకు సద్గురువుగా మనకు ఆత్మసమర్పణ చేసుకుంటున్నాడు; దత్తం చేసుకుంటున్నాడు!! అందుకే ‘దత్తుడు' అనే పేరు అనుగ్రహమూర్తియైన భగవంతునికి అన్నింటికంటే - చక్కగా సరిపోతుంది. సర్వశక్తిమంతుడైన ఆయన - శక్తి హీనులము, అల్పజ్ఞులము అయిన మనకు సర్వమూ ప్రసాదించడమే గాక, ఆత్మ సమర్పణం గూడ చేసుకొనడంలోని ఆయన వాత్సల్యాన్ని అర్ధం చేసుకొని ఎల్లప్పుడూ గుర్తుంచుకొని, అందుకు తగినంతగా కృతజ్ఞతతో జీవించగల్గడమే మన పరమ కర్తవ్యము. ఇలా జీవించగల్గినప్పుడు మనకెంతటి ధన్యత కల్గుతుందో అలనాటి పురాణకథల నుండి నేటి మహాత్ముల అనుభవాల వరకూ అన్నీ మనకు తెల్పుతాయి. అలనాడు అత్రి అనే మహర్షి తపోమహిమచేత మూడు విధములైన (అధిభౌతికము,అధి దైవికము, ఆధ్యాత్మికము) తాపాలను తొలగించుకొని 'అత్రి' అయ్యాడు. ఆయన కామక్రోధాది దుర్గుణాలన్నింటికీ మూలమైన అసూయను జయించి 'అనసూయ పతి అయ్యాడు. అందుకు మెచ్చిన భగవంతుడు అతనికి పుత్రుడై దత్తాత్రేయుడుగా జన్మించాడు. చరిత్రలో గూడ అనన్యంగా ఆయనను కొలిచిన వారికెందరికో ఆయన దత్తమై, వారిని తన ప్రతిరూపాలుగా రూపొందించి కృతార్థులను చేశాడు. అందుకే ఆ సేతు హిమాచల పర్యంతమూ దేశమంతటా నాటినుండి నేటివరకూ భక్తులందరూ గురుధ్యాన శ్లోకం చదువుకొని త్రిమూర్త్యాత్మకుడైన ఆ దత్తాత్రేయుణ్ణి · స్మరిస్తున్నారు.
సర్వజీవులనూ వుద్దరించడమే తన అవతార కార్యంగా గల దత్తాత్రేయుడు చతుర్యుగావతారమని యోగీశ్వరుడైన చక్రధరుడు 'సూత్రపాఠ విచారము అనే గ్రంథంలో కీర్తించారు. రామ, కృష్ణాది అవతారాలకంటే ముందే ఒకానొక వైశాఖ బహుళ దశమీ గురువారంనాడు, రేవతీ నక్షత్రయుక్త మీన లగ్నంలో, మీనాంశ యందు దత్తుడు అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. ఈయన కార్త వీర్యార్జునునకూ, ప్రహ్లాదునికి యోగముపదేశించి కృతార్థులను చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈయన యిప్పటి నేపాల్ ప్రాంతంలోని చిత్రకూటం వద్దనున్న 'అనసూయా పహాడ్' అనేచోట మొదట అత్రి పుత్రుడుగా అవతరించారు. అందుకు గుర్తుగా యిప్పటికీ అక్కడ ఒక దత్తమందిరమున్నది. ఈయన తన అవతారం చాలించకుండా నేటికీ నీలగిరి శిఖరాన సూక్ష్మరూపంలో నివసిస్తుంటా డని మహనీయులు చెబుతారు. ఈయన ఎందరో మహానీయులకు అనుభవ గోచరుడవుతూ వున్నారు. ఈయన 'వాతరశన' అనే బుషి సాంప్రదాయానికి చెందినవాడని, మౌనప్రియుడని పరిశుద్ధ హృదయుడనీ భాగవతం చెబుతుoది. ఈ సాంప్రదాయం వారు శాంతులు, అమలులు, సన్యాసులు, బ్రహ్మజ్ఞానులు అని భాగవతం (11 : 647) చెబుతుంది. వీరు యోగ సాంప్రదాయకులని నారద పరివ్రాజకోపనిషత్తు చెబుతుంది. దత్తాత్రేయుడు ఎక్కువగా కావేరీ లోయలలో తిరుగుతూ, పురాణాలలో ‘సహ్యాద్రి'గా ప్రఖ్యాతమైన పర్వతగహ్వరాలలో ఆశ్రమాన్ని నెలకొల్పి, అక్కడ యోగ నిష్ఠలో నిమగ్నులయ్యారని మార్కండేయ పురాణం (17-12; 16-20) చెబుతున్నది. ఈయన యొక్క ఉపాసన గురించి స్కాంద పురాణంలోని కాశీఖండంలో వర్ణించబడింది. ఆగమ, తంత్ర, యోగ, పురాణాది ప్రాచీన గ్రంథాలలో శివుని అవతారంగా కీర్తించబడిన గోరక్షనాథుడు 'నాథ' సాంప్రదాయానికి పట్టుకొమ్మ అనవచ్చు. ఈయన కీర్తి భారతదేశంలోనే గాక, హిమాలయాలలోని వివిధ రాజ్యాలలోనూ, చివరకు ఆఫ్ఘనిస్తాన్ వరకు గూడ వ్యాపించినది. ఈ గోరక్షనాథునికి దత్తాత్రేయుడు దర్శనమిచ్చారని, ఆ యిద్దరికీ మహాద్భుతమైన సంవాదం జరిగిందనీ, నాథ సాంప్రదాయానికి చెందిన ముఖ్య గ్రంథాలలో ఒకటైన “గోరక్షవాణి” చెబుతున్నది. అంతేగాక, శ్రీ దత్తాత్రేయుడే “అవధూతగీత” మరియు “శ్రీగురుగీత” స్వయంగా గోరక్షనాథునికి బోధించినట్లు, శివాజీ చక్రవర్తికి గురువైన సమర్థ రామదాసస్వామి తమ “దాసబోథ” లో వ్రాశారు. అందుకే నాథ సాంప్రదాయంలో శ్రీదత్తాత్రేయుడు పరమగురువుగా కీర్తించబడ్డారు.
శ్రీ దత్తాత్రేయునికి 'అవధూత' అనే బిరుదున్నది. దానికి అర్ధం 'అవధూతో పనిషత్తు' యిలా వివరించింది -
శ్లో ॥ అక్షరద్వాద్వరేణ్యత్వాద్ధూత సంసార బంధనాత్
అంటే తత్త్వమస్యాది లక్ష్యత్వాదవధూత ఇతీర్యతే ॥
తా ॥ నాశరాహిత్యము, శ్రేష్ఠత్వము, విదిలించి వేయబడిన సంసార బంధము, 'తత్త్వమసి' అనే మహావాక్యానికి లక్ష్యమవడం వలన, అట్టివారిని 'అవధూత' ' యని చెబుతారు.
శ్రీ గోరక్షనాథుడు తన 'సిద్ధాంతపద్ధతి' అనే గ్రంథంలో యిచ్చిన అవధూత వర్ణన (6:1) - మార్కండేయ, భాగవతాది పురాణాలలోని దత్తాత్రేయ వర్ణనకు సరిపోతుంది. గోరక్షనాథుడు యిలా వ్రాశారు: “యోగులలో యెవరు అవధూతలని చెప్పబడుదురో యిచట తెల్పబడుచున్నది : (‘ధూమ్' అని ధాతువు) సర్వ ప్రకృతి వికారాలను విదిలించి వేయుట; దేహము మరియు యింద్రియ విషయాల యందు తగుల్కొన్న మనస్సును ఉపసంహరించి ఆత్మయందు లీనం చేసినవారు: నిష్ప్రపంచులు; ఆది మధ్యాంత భేదరహితులు ఇట్టివారే అవధూతలు. ఒక " మహాత్ముడు చెప్పినట్లు, "లోకంలో శ్రీకృష్ణుణ్ణి, వారి అంశావతారమైన శ్రీ చక్రధరులనూ కీర్తించేవారూ, నిరసించేవారూ గూడ వున్నారు. తరువాత అంశావతారమైన శ్రీ గోవింద ప్రభువులను కీర్తించేవారు, తటస్థులూ మాత్రమే వున్నారు. కాని శ్రీ దత్తప్రభువులకు మాత్రం సర్వత్రా, సర్వదా సన్మానమే వున్నది. ఇది ఈ అవతారానికి గల మరొక విశేషం".
చారిత్రకమైన - కాలంలో గూడ శ్రీ దత్తాత్రేయుడు ఎందరెందరో మహాత్ములను అనుగ్రహించి వారిచేత కీర్తించబడ్డారు. మహాయోగియైన జ్ఞానేశ్వరుడు ఒక ‘అభంగ'లో స్వయంగా యిలా కీర్తించాడు: “మేరువుకు అవతల (దక్షిణ దేశంలో) ఖేచరీముద్రలో కూర్చున్న నిరాకారుడైన దత్తయోగి ధ్యానంలో గాఢంగా నిమగ్నుడై బ్రహ్మానందమనుభవిస్తున్నాడు. నిస్సంగుడైన ఆయనకు తమ దేహంపైనగాని, వస్త్రాలమీదగాని అపేక్షయే లేదు. ఆయన గోదావరీ తీరంలో జ్ఞానాన్ని అపారంగా సేకరిస్తూ, పాంచాలేశ్వర్లో నిత్యమూ స్నానం చేస్తుండే శ్రీ దత్తయోగి, జ్ఞానదేవుడనైన నా హృదయంలో వున్నారు." మహా మహితాత్ముడై తుకారాము ఆయననిలా కీర్తించాడు: ''శ్రీ దత్తాత్రేయమహరాజా! నీ అవధూత మూర్తియే నా జీవితానికి విశ్రాంతి. నీ అండలేక ఈ జీవిత రహస్యాన్ని ఎవరు " విప్పగలరు?" ఈ మహాత్ముడే దత్తప్రభువు గురించి, "ఆయన-సుఖాలను మనకు విడిచి, భక్తుల బాధలను తాననుభవిస్తాడు అన్నాడు. మనమింతకు ముందు ప్రస్తావించిన చక్రధరునికి మాతాపూర్లో ఒకసారి, పైఠానులో ఒకసారీ దత్తస్వామి దర్శనమిచ్చి, సన్యాసదీక్షా వస్త్రాలు, జీవులనుద్ధరించమని ఆదేశమూగూడ యిచ్చారు. తర్వాత ఆయనయొక్క అనుగ్రహంతోనే బాయీశుడు, నాగదేవా 'చార్యులు అనే శిష్యులకు యోగసిద్ధి లభించింది. అందుకే "ఆయన దర్శనం అమోఘమైన ఫలితం గలది" అని, "ఈ (మహానుభావ) సాంప్రదాయానికి శ్రీ దత్త ప్రభువే ఆదికారణుడు” అనీ చక్రధరుడు వ్రాశాడు. (విచార వచనము : 285) ఇలాగే సమర్థ సాంప్రదాయ ప్రవర్తకులైన శ్రీ సమర్థ రామదాసస్వామి, ఆయన శిష్యుడైన దినకరస్వామి గూడ దత్తస్వామిని సిద్ధపురుషులని కీర్తించారు. శ్రీ సమర్థుల ముఖ్య శిష్యులైన కల్యాణస్వామి, “దత్తప్రభువుకు ముల్లోకాలలోనూ వందనములే. ఆయన భిక్షాన్నమే గ్రహిస్తారు. ఆయన చుట్టూ సుందరమైన తేజః పుంజముంటుంది. ఆయన దిగంబరి, సిద్ధసనాతనుడు, త్రిమూర్తుల అవతారము, త్రిపురారి. నిత్యము భాగీరధీ తీరంలో నిత్యనియమాలు, కరవీరం (ఈనాటి కొల్హాపూర్) లో భిక్ష చేస్తారు. ఆయనది నిగూఢమైన యోగలీల. ఎన్నో ప్రాచీన సాంప్రదాయాలవారు ఆయనను ధ్యానిస్తారు. ఆయన గిరినార్ పర్వతంపై వుంటారు. ఈ శ్రీగురురాజు మహాదయామయుడు, కల్యాణ్కు సుఖాన్ని చేకూర్చేవాడు.” ఆనంద సాంప్రదాయానికి గూడ మూల పురుషుడు శ్రీ దత్తుడేనని శ్రీధరస్వామి, శ్రీ కృష్ణ దయార్ణవ స్వామి చెప్పారు. అలానే, చైతన్య సాంప్రదాయ ప్రవర్తకులైన రాఘవ చైతన్యుడు, కేశవ చైతన్యుడు గూడ దత్తప్రభువును పరమగురువుగా చెబుతారు.
శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి పదహారు అవతారములని చెప్పబడినది. అయితే ఆయన తన పరతత్త్వంతో నిత్య భూలోక నివాసం చేస్తాడు గనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన యొక్క అవతారాలని కీర్తించారని మనం గమనించాలి. వాటిని గురించి శ్రీవాసుదేవానంద సరస్వతీస్వామి తమ 'దత్త పురాణము'లో వర్ణించారు. దాని సారాంశాన్నిక్కడ పొందుపరుస్తాను.
అద్వయానన్ద రూపాయ యోగమాయా ధరాయచ ।
యోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమోనమః ॥
నారాయణోద్భవుడైన బ్రహ్మ తన తపస్సుచేత అత్ర్యాదులను సృష్టించి, 'సృష్టి విస్తరణ చేయమని అత్రి అనసూయలనాజ్ఞాపించాడు. ఆ ఋషి దంపతులు రూక్ష పర్వతంమీద తపస్సు చేస్తుండగా ఒక కార్తీక పూర్ణిమ బుధవారం నాడు మొదటి ఝామున మొదటి యామంలో యోగి రాజుగా అవతరించాడు.
ఈనాడు యోగిరాజును మూడు అ అర్ధ్యాలతో పూజించి, కొబ్బరికాయ నైవేద్యమిచ్చి, యోగిరాజు మంత్రాన్ని జపించి స్తోత్రాలు, లీలాగానము చేయాలి.
అత్రి వాతాశనుడై ఇంద్రియాలను, మనస్సునూ నిగ్రహించి, ఒంటికాలు పై యోగిరాజును ధ్యానించాడు. యోగిరాజువంటి బిడ్డను కనాలని ఆయన సంకల్పం. బిడ్డనుకనాలని ఆయన శిరస్సునుండి వెడలిన యోగాగ్ని ముల్లోకాలనూ తపింప చేయగా దేవాసురులు త్రిమూర్తులను శరణువేడారు. ముమ్మూర్తులూ అత్రి ఆశ్రమానికి వచ్చి ఆయనను మేల్కొలిపారు. ఆయన ముమ్మూర్తులను పూజించి, 'నేను . ఒక్కరిని ధ్యానిస్తే ముమ్మూర్తులూ వచ్చారేమి?' అన్నారు. “నీవు ధ్యానించిన అద్వితీయుని రూపాలమే మేము. ముగ్గురమూ ఒక్కటే. సృష్ట్యాది కార్యాలు నెరవేర్చడానికి త్రిగుణాల నాశ్రయించి ముమ్మూర్తులుగా వెలిశాము. నీవు ముందు చూచిన రూపాన్నే ధ్యానించు" అన్నారు. అపుడు యోగిరాజు త్రిగుణాత్మకుడు, శుద్ధస్పటిక దీప్తిగల యోగాదేశకరుడుగా షడ్భుజాలతో దర్శనమిచ్చాడు. ఇది ఒక బహుళ పాడ్యమీ రోహిణీ నక్షత్రయుక్త గురువారమునాడు జరిగింది. మొదటి యామమున మొదటి ఘడియ. ధ్యానం:
శ్లో ॥ మాలా కమండలు ధర కరపద్మ యుగ్మే
మధ్యస్థ పాణి యుగళే డమరూ త్రిశూలే
యస్యస్త ఊర్థ్వకరయోః శుభశంఖ చక్రే
ధ్యాయేత్తమత్రి వరదం భుజషట్క యుక్తం ॥
ఈయన దేహంలోని కుడి పార్శ్వము గురువు. ఎడమ పార్శ్వము క్షకారాంత వర్ణాలు భగవంతుడు. కుడిచేతిలో మంత్రాలకాధారమైన అకారాది కకారాంత క్షకారాంత వర్ణాలు గల 52 పూసల జపమాల. ఈ మాలలో సకల మంత్రాలూ బీజాలతో సహా వుంటాయి - ఇవి మందాధికారులైన భక్తులకోసం. డమరులో శృత్యాది శాస్త్రాలన్నీ మధ్యమాధికారుల కోసమున్నాయి. పై చేతిలోని చక్రము ఉత్తమాధికారులకు సత్వరం బంధ విచ్ఛేదము చేసి తన జ్ఞానతేజాన్ని వారికి ప్రసాదిస్తుంది. ఇవి కుడివైపునున్నవి. ఇది మోక్షప్రదమైన గురుతత్వం. అర్జంట్
ఎడమ చేతిలో జీవులకు కర్మఫలాన్నిచ్చే కర్మసూత్రమనే జలాన్ని కలిగిన కలశమున్నది. జీవులకన్నపానాదులు ప్రాప్తించడం దీనిపై నాధారపడి యున్నది.
మరొక చేతిలోని త్రిశూలముల కొసలు ఆచార, వ్యవహార, ప్రాయశ్చిత్తాలు; ధర్మార్థ కామాలని జీవులకిస్తాయి. సృష్టికి స్థిమితమిస్తాయి. మరొక చేతిలోని శంఖం నిత్యం ధ్వనిస్తూంటుంది. ఆ ధ్వని అపూర్వ, నిత్య, పరిసాంఖ్య విధులను సూచిస్తుంది. ఈ మూడింటితో గూడిన యజ్ఞవిధి వలన సృష్టి చక్రం ప్రవర్తిస్తుంది. సృష్టి పాలన జరుగుతుంది. ఇది భగవత్తత్త్వం.
మూడర్ఘ్యాలతో (పూజా వస్తువులతో) పూజించి, అరటి పండ్లు నైవేద్యమిచ్చి, ఆ రోజున స్తోత్రము, లీలాశ్రవణాలతో గడపాలి. లు డయ నేంద్రలు.
శ్లో॥ దత్తాత్రేయం శివం శాంతమింద్రనీల నిభం ప్రభుమ్ ।
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ॥
భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూట ధరం విభుమ్ ॥
చతుర్బాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ॥
అత్రి తపస్సుకు మెచ్చిన భగవంతుడు వరం కోరుకోమన్నాడు. "నీవంటి. కొడుకు కావాలి " " అన్నాడు ఋషి. మాట యిచ్చాను గదా అని, తనంతవాడు లేనందువల్ల, తనను తానే దత్తం చేసుకొన్నాడు భగవంతుడు. ఆరోజు శుక్రవారం, కార్తీక బహుళ విదియ, మృగశిరా నక్షత్రం, మొదటి ఝామున మొదటి గంట. ఆయనయే జ్ఞాననిధి, యోగి జనవల్లభుడు, జగద్గురువు. ఆయనకాదంపతులు ప్రణమిల్లి తమ గర్భజనితుడైన బిడ్డ కావాలని, సాక్షాత్కరించిన రూపం భూమి పై నిలిచిపోవాలనీ కోరారు. అందుకని అత్రివరదుడు నిలచాడు. దత్తాత్రేయునికి మూడర్ఘ్యాల పూజ, చెరకు నివేదనాదులు చేయాలి.
శ్లో॥ జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్ని శమనాయ చ ।
భక్తారిష్ఠ వినాశాయ నమోస్తు పరమాత్మనే ॥
ఆశ్రమంలో ధ్యాననిష్ఠుడైన అత్రినుండి జనించిన యోగాగ్ని ఆయనను దహించబోయింది. దత్తుడు ఋషి శిరస్సు ప్రవేశించగానే కోటి చంద్రుల చల్లదనం కల్గింది. తెరచిన ఋషి కన్నులనుండి దివ్యకాంతి వెడలి ఋతుస్నాతయైన అనసూయ దేహంలో అందరి సమక్షంలో ప్రవేశించింది. అది మార్గశిరమాసం పూర్వార్థంలోని సప్తమి. గర్భ జ సప్తమి. గర్భస్థుడైన భగవంతుడు 9 దినాలను 9 మాసాలని తలచి మార్గశిర పూర్ణిమా బుధవారంనాడు మృగశిరా నక్షత్రంలో సాయంత్రం జన్మించాడు. సకల సృష్టి పులకించింది. జగత్ప్రభువపుడు చంద్ర, దత్త, దూర్వాసుల రూపంలో దర్శనమిచ్చాడు. త్రిమూర్త్యాత్మకుడైన బిడ్డడిని చూచి వారు పొంగిపోయారు. అనసూయాస్తన్యపానంతోనూ, జలక్రీడలతోనూ వారిని భగవంతుడు సంతోష పెట్టాడు.
మార్గశిర పూర్ణిమనాడు మూడర్యాల పూజ, పంచామృత నివేదన బ్రాహ్మయిల భోజనము విధి.
శ్లో॥ యోగ విజ్జననాథాయ భక్తానందకరాయచ ।
దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమః ॥
కాలాగ్ని శమనులు అనసూయ గర్భాన జన్మించారని తెలిసి సిద్ధ, గంధర్వాదులు, యోగులు దర్శింపరాగా ఆయన బాల్యరూపాన్ని విడిచి తేజోమూర్తిగా దర్శనమిచ్చి దానిని ధ్యానించమన్నాడు. "నాకు జన్మ, కర్మ, గుణ, రూప, మాయ, నాశాలు లేవు. సర్వవ్యాపిని, ఈ మూర్తిని ధ్యానించి తరించండి" అన్నాడాయన. నాడు మార్గశిర పున్నమి, గురు వారము, మధ్యాహ్నము : అనాడు అర్ఘ్యం, ముత్యాలు, పంచభక్ష్యాలు సమర్పించి 'ఓమ్ యోగిజన వల్లభాయ నమః' అని జపం చేయాలి.
శ్లో॥ పూర్ణబ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వంభరాయచ ।
దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షిణే ॥
బాల దత్తుడైన యోగిజన వల్లభులొకసారి అనసూయ వడిలో పాలు త్రాగుతుండగా అతివృష్టి మొ॥న ప్రకృతి వికారాల వలన పీడితులైన మానవులు, మునులు ఆయనను శరణు వేడగా ఆయన తన విశ్వరూపంనుండి యోగ లీలగా లీల వారికి వలసినవన్నీ ప్రసాదించాడు. ఒక్కొక్కసారి శిష్యులకు వేదము నేర్పేవాడు. ఒకప్పుడు ధ్యాననిష్ఠుడై యుంటాడు. ఒకప్పుడు తన యోగ మాయచేత యీ సంసారాన్ని అరణ్య రూపం ధరింపచేసాడు. అహంకారం పర్వతమైంది. కామము సింహము, క్రోధం సివంగి, మనస్సు సరస్సు, యజ్ఞాదులు వృక్షాలు అయ్యాయి. ఆ ఆ వృక్షాల నిండా పండ్లున్నాయి. "ఈ పండ్లు ఆశ గొల్పుతాయి గాని వివేచిస్తే అవి కోరదగినవిగాదు, వాటినీడగూడ విషపూరితమే. జలమూ అంతే, సుఖాన్ని కోరేవాడు వీటిననుభవించాలన్న భ్రాంతితో యిక్కడ నివసించ కూడదు." అన్నాడు. ఆ మాటలు లెక్కచేయక వారంతా వాటిననుభవించారు. ఆయన అదృశ్యుడయ్యాడు. వారంతా దారి తప్పి భయంతో భగవంతుని స్మరించి శ్రీ గురుచరిత్ర ” ఈంతులయ్యారు. కాని మరలా వనముచేత భ్రాంతులై మరలా మరచారు. అప్పుడు వారి కళ్ళు తెరిపించేందుకు అరణ్యాన్ని అదృశ్యం చేయగా వారు దత్తుని ఎడబాసినందుకు దుఃఖపడనారంభించారు. ఆయన దర్శనమిచ్చాడు. వారాయనను వదలి కర్మాచరణకు వెళ్ళలేదు. వారి భక్తిని పరీక్షించడానికి ఆయన ఒక సరస్సులో మునిగి 100 సం॥లున్నాడు. ఒక వనితను తోడ్కొని మద్యం సేవిస్తూ బయటకొచ్చాడు అయినా వారాయనను విడువలేదు.
ఇన్ని లీలలు చేసిన యీయనను శ్రీ లీలా విశ్వంభరుడంటారు. ఇలా యీయన ప్రకటమైనది పుష్య పౌర్ణమినాడు - పుష్యమీ నక్షత్రం, బుధవారం, సూర్యోదయకాలం. ఆనాడు యీయనను విధియుక్తంగా పూజించాలి.
శ్లో॥ సర్వ సిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే ।
సిద్ధరాజాయ సిద్ధాయ మంత్ర దాత్రే నమో నమః ॥
అపుడు అదృశ్యుడైన లీలా విశ్వంభరుడు గుప్తంగా బదరికావనం చేరాడు. అక్కడ కఠోర తపస్సుచేత వివిధ సిద్ధులను పొందిన సిద్ధులెందరో అహంకార అగ్రహాలతో వాదులాడుకొంటున్నారు. వారు యీయన దివ్య రూపానికి చకితులై ప్రశ్నించగా తానొక అనామకుడనని, ఒక గురువు ఆశ్రయమును లేదని, కర్మనిష్ఠయే లేదని, చిత్తయోగమే తన సాధనయని, నిరంజనియే ముద్ర అనీ అన్నాడు. ధ్యానానికతీతమైనదే తన లక్ష్యమన్నాడు. దుర్లభమైన ఆనందమే మార్గమన్నాడు. అంతలో గగన మార్గాన పోతున్న వసురుద్రాదిత్యాది దేవతలు నిలవబడి అక్కడ దిగారు. సిద్ధులందరూ అది తమ తమ సిద్ధియేనని ప్రగల్భాలు పల్కారు. “వాధించకండి. ఎవరు మాట మాత్రం చేత వారిని పంపగలరో వారి సిద్ధియది” అన్నాడాయన. వారి ప్రయత్నం విఫలమై లజ్జాక్రాంతులవగానే ఆయన ఆజ్ఞతో వారు వెళ్ళారు. అప్పుడు వారు ఆయనను శరణు పొంద్ 'మీ యోగాన్నీ, సిద్ధినీ యిచ్చి, పరుల సిద్ధిని రద్దుచేసే మంత్రముపదేశించ' మని కోరగా ఆయనలానే చేసారు. ఇలా సిద్ధిరాజుగా “ఆయన అవతరించిన రోజు మాఘ పూర్ణిమ, మఖానక్షత్రయుక్త గురువారము, వీరిని యథోక్తం పూజించాలి.
శ్లో॥ సర్వత్రా 2 జ్ఞాననాశాయ జ్ఞానదీపాయచాత్మనే ।
సచ్చిదానంద బోధాయ శ్రీ దత్తాయ నమోనమః ॥
అజ్ఞానమే జీవులన్నింటినీ క్షోభింపచేస్తోందని తలచిన దత్తుడొక ఫాల్గుణ శుద్ధ దశమినాడు జ్ఞానిగా ప్రకటమయ్యాడు. నాడు పునర్వసూ నక్షత్రయుక్త రవివారం. ఆయన సిద్దులనడుమ గాలిలో కూర్చుని కన్పించగా వారు తమ సి ఆయనను పడగొట్టచూచి విఫలులై శరణు పొందగా, “ఆకాశంనుండి పుట్టిన వాయువు ఆకాశాన్నేమీ చేయలేనట్లు, సర్వకారణుడైన నన్ను మీరేమీ చలింపచేయలేరు” అని చెప్పి తాను పూర్వముపదేశించిన మంత్రాన్ని జపించమని చెప్పి జ్ఞానాన్ని గూడ ఉపదేశించాడు. యథాక్తపూజ, మందిర నిర్మాణము వీధి.
శ్లో॥ విశ్వంభరాయ దేవాయ భక్తప్రియకరాయచ ।
భక్తప్రియాయ దేవాయ నామ ప్రియాయ తే నమః ॥
ఒకసారి ఒక వికృతరూపియైన అవధూతగా సిద్ధుల మధ్యకొచ్చి చూస్తే కొందరు ధ్యానస్థులై, కొందరు కలహాదులలో తగుల్కొని, కొందరు ధ్యానంలో చంచలులుగానూ వున్నారు. తన లీలలతో వారందరిని ఆత్మస్థులను చేసి మరలా విడవగానే వారు యోగభగ్నులయ్యారు. ఆయనను బాధింపజూచి, చేతగాక శరణుపొందారు. అపుడాయన తన విశ్వరూపాన్ని చూపాడు. నాడు చైత్ర పూర్ణిమ, చిత్రా నక్షత్రయుక్త మంగళవారం, రెండవ యామంలో రెండవ గంట, సహస్రాక్ష సహస్ర శిరస్కుడైన ఆయన తన మాయకు తానే ఆశ్రయమని, తాను నిర్గుణుడననీ చెప్పి భక్తులకభయమిచ్చాడు. అర్ఘ్యము, గోదానము యిచ్చి యీయనను పూజించాలి.
శ్లో॥ మాయా యుక్తాయ శుద్ధాయ మాయాగుణహరాయ తే ।
శుద్ధబుద్ధాత్మరూపాయ నమోస్తు పరమాత్మనే॥
ఒక స్వాతీ నక్షత్రయుక్త వైశాఖశుద్ధ చతుర్దశీ బుధవారం మధ్యాహ్నం ఒక భిక్లు రూపంలో భిక్షకోసం శీలుడనే బ్రాహ్మణుడింటికి శ్రాద్ధ సమయంలో భిక్షకెళ్ళాడు. కౌపీనధారి, యువకుడు, ద్విబాహువు, దండ భిక్షా పాత్రధారియైన ఆయన ఆ యింట ప్రవేశించి పీటమీద కూర్చున్నాడు. కూడా నల్లని కుక్క వున్నది. శీలుడు తిరస్కారంగా ప్రశ్నలడిగి, సమాధానాలు విని శరణుపొంది, నెయ్యి, తేనె, పూలతో పూజించి, శ్రాద్ధాన్నమిచ్చి, తాంబూల ఆరతులిచ్చాడు. శ్రాద్ధభోక్తలు ఆగ్రహించి వెళ్ళిపోయారు. పట్టణములోని బ్రాహ్మణులంతా కట్టుగా వచ్చి ఆయనను నిలదీసారు. “బ్రహ్మకర్మను భ్రష్టం చేస్తారా?” అన్నారు. ఆయన “బ్రహ్మ, కర్మ అంటే నాకు తెలియదు. ఆత్మ ఒక్కటే తెలుసు” అన్నాడు. వారు, “ఓంకారమే బ్రహ్మము. నిత్య నైమిత్తికమని కర్మలు ద్వివిధము. నీవు భ్రష్టుడవు గనుక వేదాలు వినరాదు” అన్నారు. "కుక్కవంటి సగుణమైన నిత్యనైమితకర్మలకనర్హుడనే. కారణం నేను మాయా రహితుడను. ఈ నా కుక్కకవన్నీ తెలుసు" అనగానే కుక్క వేదాలు, షట్ఛాస్త్రాలను చెప్పింది. శీలుడికి ఉపదేశించి ఆయన బయటకు వచ్చాడు. వారు శరణుపొంది అనుసరించారు. ఈయనను మూడు అక్ష్యాలు. పెరుగు, అన్నముతో పూజించాలి.
శ్లో॥ స్వ మాయాగుణగుప్తాయ ముక్తాయ పరమాత్మనే ।
సర్వత్రా2 జ్ఞాననాశాయ దేవదేవాయ తే నమః ॥
అవుడా, అవధూత అడవిలో ఆననంపై ధ్యానన్ద్రుడై కూర్చున్నాడు. బ్రాహ్మణులు చేరారు. ఆయన వారికి పెద్ద పులులు, నర్పాలు, అగ్నులు చూపినా వారు పారిపోలేదు. అపుడాయన తన మాయను విడిచి స్వాతీ నక్షత్రయుక్త గురువారము, జేష్ఠ శుద్ధ త్రయోదశిన సూర్యోదయమప్పుడు దర్శనమిచ్చాడు. ఆయన అంకంమీదనున్న స్త్రీని ముద్దాడుతూ మధ్య మాంస సంగీతాలతో ప్రొద్దుపుచ్చుతున్నాడు. బ్రాహ్మణులు ఆయన పతితుడని తలచి వెళ్ళిపోయారు. "ఆది బాగుందనుకున్నాడు. దత్తుడు. అయితే జంభాసురునితో యుద్ధంలో "పరాజితులైన దేవతలు బృహస్పతి సలహాననుసరించి ఆయనను విడువక సేవించారు. ఆయన ఆజ్ఞపై రాక్షసులను యుద్ధానికి పిలచి, దత్తుని వడిలోని 'సుందరిని రాక్షసులపహరించుకొని పోతున్నపుడు దేవతలు వారిని సంహరించారు. లక్ష్మి మరలా ఆయన వడిలో చేరినది.
కార్తవీర్యార్జునుడు ఆయన మాయకు చలించక సేవించి దత్త భక్తియోగాన్ని నేర్చి 12 రోజులనుండి క్రమంగా మాసము, 3 మాసాలు, 6 మాసాలు, 1 సం॥ము యోగ సమాధిలో వున్నాడు. తర్వాత అతనిననుగ్రహించి స్వధర్మపాలన చేయించాడు దత్తుడు.
భూమిని నిక్షాత్రం చేయదలచిన పరశురాముని యోగసిద్ధుని చేసి ఆజ్ఞాపించగా అతడు స్వామి ఆజ్ఞపై పర్వతాన్ని బాణంతో కొట్టగానే సకల తీర్థాలూ వెడలివచ్చాయి. వాటిలో స్నానం చేసి తండ్రి జమదగ్నికి అగ్ని సంస్కారం చేసాడు పరశురాముడు. రేణుక సహగమనం చేసింది. మరుక్షణమే దత్తానుగ్రహంతో వీరిద్దరూ తమ తేజస్సుతో దిక్కులను వెలిగిస్తూ దర్శనమిచ్చారు. తర్వాత రాముడు భూమిని నికాత్రం చేసి వారి రక్తంతో అర్ఘ్యమిచ్చి, సోమయాగంచేసి, స్వామిని పూజించి, వరం పొంది పశ్చిమ సముద్రతీరాన తపస్సుకు వెడలిపోయాడు. యథా విధి మాయాముక్తావధూతను పూజించాలి.
సుబాహువు మొ॥న ముగ్గురు కొడుకులకు జ్ఞానియైన మదాలస జ్ఞానాన్ని బాల్యంలోనే బోధించి ముక్తులను చేసింది. భర్త ఆజ్ఞవలన అలర్కుడికి జ్ఞానోపదేశం చేయక రాజ్యపాలనకు విడిచింది. అలర్కుడు ధర్మబద్ధ రాజ్యపాలనలో నిమగ్నుడయ్యాడు. అతడికి వివేకముదయింప చేయదలచిన అన్న సుబాహుడు కాశీరాజును ప్రేరేపించి దండెత్తేలా చేశాడు. అడవిలోకి పారిపోయిన అలర్కుడికి తల్లి గుర్తొచ్చి మెడలోని తాయత్తును తెరచి చూడగా ముముక్షువై సద్గురువునాశ్రయించడమే ఉత్తమమన్న ఆమె ఆదేశం కన్పించింది. సహ్యాద్రిలోని తపస్వియైన దత్తుని, ఆమలక వృక్షం క్రింద ఆషాడ పూర్ణిమయుక్త శనివారంనాడు దత్తాశ్రమంలో దర్శించాడు. దత్తుడతనికి ఆది గురువుగా దర్శనమిచ్చి ఆత్మ విచారాన్ని బోధించి తరింప చేసాడు. ఈయనను యథావిధి పూజించాలి.
శ్లో॥ సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మనే ।
దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే ॥
దిగంబరుడు, ఆచారహీనుడు అయి వేదాలు చదువుతున్న దత్తుని ఒక బ్రాహ్మణుడు, "నీకు ఆశ్రమ ధర్మం లేదు. దిగంబరుడవు. స్త్రీ, మద్య లోలుడవేమి?" అన్నాడు. తాను అత్యాశ్రమినని చెప్పి దత్తుడు పింగళ నాగునికి సుందరము, శుభమూ అయిన శివరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించాడు : అది శ్రావణమాసం పూర్వార్థంలోని అష్టమి, సోమవారం. అభిషేకము. అర్హ్యసహిత పూజ విధి.
శ్లో॥ ఇంటడ అదర్ అki eds. సర్వాపరాధ ‘నాశాయ సర్వపాప హరాయ చ ।
దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే ॥
దత్తుడు సహ్యాద్రి చేరి ఆమలక వృక్షం క్రింద ముని రూపంలో తపస్సు చేస్తుంటే సిద్ధాదులు మొదలు సర్వప్రాణులూ సహజవైరాన్ని మాని కలసి జీవించాయి. భాద్రపద పూర్వార్థంలోని చతుర్దశీ శతతారకా నక్షత్ర (శతభిష) ఆయనను యుక్త గురువారం మొదటి యామంలోని మొదటి గంటలో బ్రహ్మ దర్శించినపుడు, ఆయన శంకచక్ర గదా పద్మహస్తుడై దర్శనమిచ్చాడు.. ఆ దర్శనంతో ఆ దండకారణ్యాశ్రమంలో బ్రహ్మాది దేవతలందరూ దర్శనం చేతనే ముక్తులై ఆయనలో లీనమయ్యారు. మూడర్ఘ్యాలు, తాంబూలము విధి.
సోమవంశజుడైన యదుమహారాజుకు దిగంబరుడు దర్శనమిచ్చి 24 మంది సాధక గురువులనుండి తాము నేర్చిన జ్ఞానాన్ని బోధించి ముక్తుని చేసినది ఆషాఢ పూర్ణిమ, బుధవారం, సూర్యోదయకాలంలో, యదువు అవధూతగా సంచరించాడు. దత్తానుగ్రహం వలన అతడి వంశంలో శ్రీకృష్ణుడు జన్మించాడు.
ఇలానే ప్రహ్లాదుడు గూడ ఆయననుండి జ్ఞానం పొంది తరించాడు.
కార్తవీర్యార్జునుడు ఆయన సేవవలన, స్మరణ వలన, వేదధర్ముడు నామజపంచేత; దీపకుడు ఆయన లీలాశ్రవణంచేత; విష్ణుధర్ముడు ఆయన పాదార్చనచేత; పరశురాముడు స్నేహభక్తిచేత తరించారు.
మూడు అర్ఘ్యాలు, వస్త్ర మాలాదులతో పూజ విధి.
శ్లో॥ అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే ॥
జ్ఞానతల్పం మీద విశ్రమించిన దత్తుని, శిష్యులు దర్శించినపుడు ఆయన కార్తీక పూర్వార్థ ద్వాదశీ బుధవారం రేవతీ నక్షత్రంనాడు, సూర్యోదయ కాలంలో ఇంద్రనీల ప్రభతో దర్శనమిచ్చాడు. కనుక యీయన పేరు కృష్ణ శ్యామ కమలనయనుడు.
మూడు అర్ధ్యాలు, యథాశక్తి బ్రాహ్మణ భోజనము విధి.
మనదేశంలో యిన్ని ఆధ్యాత్మ సాంప్రదాయాల వారిచేత పరమగురువుగా, మూల పురుషుడుగా కీర్తించబడిన దత్తస్వామి, చరిత్రలో యింకెందరు సాధకులనో అనుగ్రహించి, మహాత్ములుగా రూపొందించారు. అంతేగాక, ఈయన 13వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో రాజు-సుమతి అనే పుణ్య దంపతులైన తమ భక్తులను అనుగ్రహించి, వారికి పుత్రుడుగా అవతరించారు.
ఆయనయే ఈ శ్రీపాద శ్రీ వల్లభులు, ఆయనే మరలా శ్రీ నృసింహ సరస్వతిగా రెండవసారి అవతరించారు. వీరిద్దరి దివ్యలీలలను వర్ణించినదే ఈ "శ్రీ గురుచరిత్ర".
మహారాష్ట్ర దేశంలోని మార్గాఁవ్ అనే గ్రామంలో గణేశభట్టు - రమాబాయి అనే పుణ్య దంపతులకు జన్మించాడు వాసుదేవశాస్త్రి. ఇతడు తన ఎనిమిదవయేట ఉపనయనమైన దగ్గరనుండి ఆదర్శ బ్రహ్మచారిగాను, వివాహమయ్యాక సదాచార సంపన్నుడైన గృహస్థుగాను జీవించాడు. గాయత్రీ అనుష్ఠానము, వేదాధ్యయనము, అగ్నిహోత్రము నిష్ఠతో ఆచరిస్తుండేవాడు. కేవలం వంశాచారంగా మాత్రమే మహారాష్ట్ర భాషలోని "శ్రీ గురుచరిత్ర" లాంఛనంగా నిత్య పారాయణ చేస్తుండే వాడు. తన తపశ్శక్తి వలన మానవులకు, పశుపక్ష్యాదులకూ గూడ వేద మంత్రోచ్చారణతో ఆరోగ్యం చక్కబరచడమేగాక, జ్యోతిశ్శాస్త్రంలో ప్రావీణ్యం గడించి, ఆర్తుల బాధలకు పరిష్కారం చెప్పి, ఆర్ష సాంప్రదాయ ప్రాశస్త్యాన్ని ప్రజలకు నిరూపిస్తూండేవాడు. ఉదాహరణకు, అతడొక రోగితో గోదానం చేయమని చెప్పాడు. ఆ గోవుపై ఆశతో వాసుదేవశాస్త్రికి తెలియకుండా అతని సోదరుడు ఆ దానం స్వీకరించి, వెంటనే జబ్బు పడ్డాడు. అపుడు వాసుదేవశాస్త్రి తన తమ్ముణ్ణి మందలించి, రెండింతలు దక్షిణతో ఆ గోవును మరొక బ్రాహ్మణునికి దానమిప్పించి, అతనిని రోగ విముక్తుని చేసాడు. తపోబలంతో యితరుల కర్మదోషాలను గూడ భరించగలవారే దానం స్వీకరించాలనేవాడు శాస్త్రి.
ఇతనికి "శ్రీ గురుచరిత్ర" పారాయణ వలన దత్తానుగ్రహం అనుభవమవుతూండేది. ఒకనాడతడు ఒక అడవిలోనుండి వెళ్తూండగా దత్తస్వామి సీతారాంజుడియా అనే వ్యక్తి రూపంలో దర్శనమిచ్చి, అతనిని ఒక పులిబారినుండి రక్షించారు. నాటి రాత్రి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి, ఆ రహస్యం బైటపెట్టారు. తర్వాత ఒకసారి అతడు నరసోబావాడి వెళ్ళాలనుకుంటుండగా, ఒకనాటి రాత్రి దత్తస్వామి స్వప్నంలో కన్పించి, "నీ తల్లి అనుమతిస్తుంది: ప్రయాణానికి అవసరమైన పైకము, తోడూ గూడ దొరుకుతాయి" అని చెప్పారు. నిజంగానే తెల్లవారేసరికి అన్నీ అలానే సమకూడడం వలన అతడు బయల్దేరి, దారిలో గోరేగాంలో బస చేసాడు. నాటిరాత్రి దత్తస్వామి మరలా స్వప్నంలో కనిపించి, నరసోబావాడిలో గోవిందస్వామి అనే సిద్ధపురుషుడున్నారని, ఆయనను దర్శించమనీ చెప్పారు. మరుసటిరోజు అతడు నరసోబావాడి చేరగానే, ఆ స్వామియే అతనికి యెదురై పేరు పెట్టి పిలిచి, అతని యోగక్షేమాలు విచారించారు. ఒకరోజు అచటి ఆలయ పూజారులు వాసుదేవుణ్ణి దత్తపాదుకలకు అభిషేకం చేయనివ్వలేదు. అపుడు దత్తస్వామి, ఆ సంగతి గోవిందస్వామికి తెలిపి, అతడు అభిషేకం చేసుకోవడానికి అనుమతి యిప్పించారు. మరొకరోజు అతనికి దత్తస్వామి కలలో కన్పించి, "శ్రీ గురుచరిత్ర" పారాయణ చేయమని ఆదేశించారు. అతనివద్ద ఆ గ్రంథం లేదని చెప్పగానే, మీరజ్లో వున్న శంకరభట్టు వద్ద ఆ గ్రంథం తీసుకోమని చెప్పారు. ఈ భట్టు తన పారాయణ గ్రంధం యెవరికీ యిచ్చేవాడు గాదు. కాని దత్తస్వామి కలలో కనపడి ఆదేశించడం వల్లనే అతడాగ్రంథం వాసుదేవశాస్త్రికి యిచ్చాడు. తర్వాత ఒకనాడు వాసుదేవశాస్త్రిని “శ్రీ గురుచరిత్ర" పారాయణే ముఖ్యసాధనగా చేసుకొమ్మని గోవిందస్వామి చెప్పారు. "నేను శిష్టాచారం ప్రకారం సూర్యుణ్ణి, అగ్నినీ సేవిస్తున్నాను గదా! ఇంకా అదెందుకు?" అన్నాడు. వాసుదేవశాస్త్రి. కాని నాటి రాత్రి స్వప్నంలో దత్తస్వామి అతనికి మంత్రోపదేశం చేసి అతనికి ప్రత్యక్ష గురువయ్యారు. తెల్లవారగానే అతనికి గోవిందస్వామి యెదురై, "రాత్రి నీకు ఉపదేశమైంది గదా?" అని చెప్పి, దాని అనుష్ఠాన విధానమంతా అతనికి బోధించారు!!
ఒకప్పుడు వాసుదేవశాస్త్రిని 7 సం॥లు కదలకుండా మార్గాఁవ్లోనే వుండమని దత్తస్వామి ఆదేశించారు. అతడు ఒక దత్తమూర్తిని తీసుకు వెళ్ళదలచి కాగల్ అనే వూరు వెళ్ళాడు. అక్కడ బజారులో అకస్మాత్తుగా ఒక శిల్పి ఎదురై, ఒక దత్తమూర్తిని యిచ్చి, తనను ఆ స్వామియే అలా చేయమని ఆ ముందటి రాత్రి స్వప్నంలో ఆదేశించారని చెప్పాడు. శాస్త్రి మార్గాఁవ్ చేరేసరికి అక్కడొక విధవరాలు అతనికి కొంచెం స్థలమిచ్చి "నిన్న నా భర్త కలలో కనిపించి, కొంత స్థలం ఒక సబ్రాహ్మణునికి దానమిమ్మని చెప్పారు" అని చెప్పింది. శాస్త్రి ఆ స్థలంలో ఒక దత్త మందిరం నిర్మించి, ఆ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఆ మందిరం లోని దత్తస్వామి పిలిస్తే పలికేవాడు. ఒక దత్త జయంతికి వాసుదేవ శాస్త్రిగారి బంధువొకరు మరణించారు. నాటి జయంతి కార్యక్రమానికి విఘ్నం కలుగుతుందని వెరిచి, ఆ సంగతి శాస్త్రిగారికి యెవరూ చెప్పలేదు. ఆనాడు అతడు మందిరానికి వెళ్ళగానే దత్తస్వామి, "శివ శివ! నన్ను తాకవద్దు. నీకు మైల వచ్చింది" అన్నారు. అప్పుడు విచారిస్తే అసలు విషయం బైటపడింది. అలాగే, ఒక చంద్రగ్రహణమప్పుడు పంచాంగాలన్నీ ఆ ప్రాంతంలో గ్రహణం కనిపించదని చాటాయి. కాని ఆ ముందటి రాత్రి దత్తస్వామి శాస్త్రిగారికి దర్శనమిచ్చి, "రేపు గ్రహణం కనిపిస్తుంది. కనుక నాకు భిక్ష, నైవేద్యము వద్దు" అన్నారు. మరుసటిరోజు ఆ మాట అక్షరాలా నిజమైంది!
ఒకసారి వాసుదేవశాస్త్రి, అతని తల్లీ నరసోబావాడి చేరి ఒక ధర్మశాలలో విడిది చేసారు. నాటిరాత్రి దత్తస్వామి ఆ యిద్దరికీ కలలో కన్పించి, "ఈధర్మశాల శిథిలమైంది. వేరొకచోటుకు వెళ్ళండి" అని చెప్పారు. ఉదయమే శాస్త్రి స్నానసంధ్యలు పూర్తిచేసుకొని, తన తల్లిని తీసుకొని ధర్మశాలనుండి బయటకు రాగానే ఆ భవనం కూలిపోయింది. అలానే ఒకప్పుడు వాసుదేశాస్త్రి తన భార్యను తీసుకొని దత్తక్షేత్రాలు దర్శిస్తూ గంగాఖేడ్ చేరుకొన్నాడు. అక్కడ ఒకనాటి రాత్రి దత్తస్వామి అతనికి స్వప్నంలో కన్పించి, నేటినుండి నాల్గవ రోజున మీ యిద్దరినీ నా సన్నిధి చేర్చుకుంటాను" అన్నారు. శాస్త్రి "నేను సన్యసించాలి; కనుక మీరు ఆమెను మాత్రమే తీసుకుపోండి. " అన్నాడు. ఆమెకు మరురోజే కలరావచ్చి, కొద్దిరోజులలో మరణించింది. ఆమెకు కర్మచేసి, 14వ రోజున శాస్త్రి సన్యసించాడు. ఆ ముందటి రాత్రి దత్తస్వామి అతనికి గోవింద స్వామి రూపంలో స్వప్న దర్శనమిచ్చి ప్రణవముపదేశించి, మరుసటిరోజు నుండి భిక్షువుగా జీవించమని ఆదేశించారు. అంటే ఈయనకు అసలైన దీక్ష దత్తస్వామియే యిచ్చారన్నమాట! నాటి నుండి ఈయన శ్రీవాసుదేవానంద సరస్వతీ స్వామిగా ప్రసిద్ధికెక్కాడు. అటు తర్వాత ఈయన అతి కఠోరంగా తమ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ దేశ సంచారం చేసారు. ఎన్నో ప్రాంతాలలో మొత్తంమీద 24 చాతుర్మాస్యాలు చేసారు. వీరు తమ పాదయాత్రలో ఒకసారి, నాటి శృంగేరీ జగద్గురు శంకరాచార్యులైన శ్రీ నృసింహ భారతీస్వామి వారిని దర్శించారు. శ్రీ శంకరాచార్య వీరినెంతగానో సన్మానించి, తమ శిష్యులతో, "అయంహి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయో స్వయం యతిః" - "ఈ యతి సాక్షాత్తూ దత్తాత్రేయుడే!" అని చెప్పారు - ఒకసారి శ్రీవాసుదేవానందులు కాలినడకన గిరినార్చేరి, బాగా డస్సిపోయారు. అప్పుడొక గుజరాతీ శ్రీమంతుడు కొన్ని పూరీలు తెచ్చి యివ్వబోయాడు. ఆయన తమ ఆచారాన్ననుసరించి, వాటిని స్వీకరించలేదు. అప్పుడతడు, "నేనే కేవలం కర్మసన్యాసిగా వుంటే, నీవు మాత్రం అలా యెందుకుండవు?" అని గదమాయించి వెళ్ళిపోయాడు. ఆ రూపంలో వచ్చినది దత్తస్వామియేనని తర్వాత తెలిసింది.
శ్రీవాసుదేవానందులు దేశ సంచారం చేస్తున్నపుడు ఆంధ్రదేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, నెల్లూరు, శ్రీశైలం సందర్శించారు. ముక్త్యాలలో 1908లో చాతుర్మాస్యం చేసారు. తర్వాత హంసలదీవికి వచ్చి సాగరసంగమంలో స్నానం చేసారు. తర్వాత మచిలీపట్నం మీదుగా సప్తగోదావరిని సందర్శించారు. అక్కడ గోదావరినది వశిష్ఠ, కోటిలింగ, కౌశిక, వృద్ధ గౌతమి, భరద్వాజ, ఆత్రేయ, తురీయ అను ఏడు పాయలై సముద్రంలో కలుస్తుంది. తర్వాత రాజమండ్రి విచ్చేసి, అక్కడ నుండి పిఠాపురం చేరి, ఆ పట్టణ వాసులకు అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు అవతరించారని చెప్పి, వారి జన్మస్థలం గూడ చూపి, అక్కడ దత్త పాదుకలు ప్రతిష్ఠించారు. తర్వాత కాకినాడ చేరి సముద్రస్నానం చేసారు. మరలా రాజమండ్రి చేరి అచట శృంగేరి శంకరమఠంలో 'భక్త వత్సలుడు' అను పేర సం॥ 1910 ప్రాంతంలో దత్తమూర్తిని ప్రతిష్ఠించారు. చివరకు 1914 సం॥లో జ్యేష్ఠ బహుళ చతుర్దశినాడు ఆయన తన శిష్యులతో "రేపు రాత్రి అమావాస్య ఘడియలు వెళ్ళాక మేము శరీరము త్యజిస్తాము" అన్నారు. ఆ సమయానికి దత్తమూర్తి యెదుట ధ్యానంలో కూర్చుని పరమపదించారు. "శ్రీ గురుచరిత్ర" పారాయణ ద్వారా వీరిని దత్తస్వామి తమ ప్రతిరూపంగా రూపొందించడమేగాదు, వారి ద్వారా ఆయన మరొక అవతార మెత్తారు. ఆయన, "శ్రీ గురుచరిత్ర" లో కీర్తించబడిన శ్రీగురుడు గా అవతరించినపుడు చివరకు శ్రీశైలంలో అంతర్థానమయ్యే ముందు "శ్రీ గురుచరిత్ర" గ్రంథం రూపంలో తామెల్లప్పుడూ వుంటామని ప్రమాణం చేసారు. ఒకప్పుడు ఆ గ్రంథాన్ని 7 వేల సంస్కృత శ్లోకాలలోకి అనువదించమని దత్తస్వామి ఆదేశించారు. మరొకప్పుడు వాసుదేవా నందులతో ఈ గ్రంథాన్ని రెండువేల సంస్కృత శ్లోకాలలోకి అనువదించి దానికి "సంహితాయన గురుద్విసాహస్ర" అని పేరు పెట్టమని దత్తుడు చెప్పారు. అలానే శ్రీ వాసుదేవానంద సరస్వతీస్వామి చేసిన ఈ రెండు రచనల రూపాలలో దత్తస్వామి నేడు దేశమంతటా తాండవిస్తున్నారు. నా చేత (రచయిత) దత్తస్వామి చేయించుకొన్న ఈ స్వేచ్ఛానువాదంలో ఈ రెండు గ్రంథాలలోని విశేషాంశాలను గూడ పొందుపరచాను. కారణం : అది శ్రీ దత్తావతార కథః శ్రీగురుని అక్షరస్వరూపం; వారి ప్రత్యక్ష శిష్యుడైన సిద్ధయోగిచేత వ్రాయబడింది; మరల శ్రీ దత్తాత్రేయ స్వరూపులైన శ్రీవాసుదేవానంద సరస్వతీ స్వామిద్వారా సంస్కృతంలో శ్రీ దత్తాత్రేయుడు అక్షరస్వరూపం ధరించారు.
శ్రీవాసుదేవానంద సరస్వతీస్వామి మనదేశ చరిత్రలో మహోజ్వలమైన కాలం (1850-1950) లో అవతరించారు. ఆ కాలంలో విశ్వగురుడైన దత్తాత్రేయస్వామి మరి నాల్గు రూపాలతో అవతరించారు. ఆ ఐదు దత్తావతారాలు - శ్రీఅక్కల్కోట స్వామి, శ్రీ శిరిడీ సాయిబాబా, ధునీవాలా దాదా, తాజుద్దీన్ బాబా, గజానన్ మహరాజ్. ఈ విషయం శ్రీ శిరిడీ సాయిబాబా ఒక భక్తునితో చెప్పారు. సద్గురువు దర్శనం కోరి "శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తున్న సాధకులెందరికో దత్తస్వామియే ఈ విషయం స్వయంగా చెప్పారు. (ఈ వివరం నాచేత దత్తస్వామి వ్రాయించుకున్న ఆయా మహనీయుల చరిత్రలలో చూడవచ్చు.) శ్రీవాసుదేవానంద సరస్వతులు వీరిలో ముగ్గురిని కలుసుకున్నారు. ఒక భక్తుడు శ్రీ వాసుదేవానందుల సన్నిధిలో ఒక మహాయజ్ఞం చేయ తలపెట్టాడు. శ్రీ వాసుదేవానందులు, “సాక్షాత్తూ దత్తావతారమైన అక్కల్కోటస్వామి సన్నిధిలో దీనిని నిర్వహించడం సముచితం. లేకుంటే, వారి ఆశీస్సులతోనైనా యిక్కడ జరిపించాలి" అన్నారు. ఒకప్పుడు ఆయన అక్కల్కోటస్వామిని దర్శించారట గూడ అలానే శ్రీ గజానన్ మహరాజ్లను గూడ దర్శించారు. శ్రీవాసుదేవానందులు రాజమండ్రిలో వున్నపుడు నాందేడ్ నుండి దాసగణు అను భక్తుడు వచ్చి ఆయనను దర్శించాడు. అతడు తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీ వాసుదేవానందులు అతడికొక కొబ్బరికాయ యిచ్చి, “ఇది మా నమస్కారాలతో మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు. మమ్మల్ని మరువక ప్రేమతో కనిపెట్టి వుండమను. సన్యాసులమైన మేము యెవరికీ నమస్కరించము. కాని వారి విషయం వేరు” అన్నారు. తర్వాత దారిలో దాసగణు, అతని మిత్రులూ యేమారి వేరొక కాయ అని పొరపాటుపడి దానిని తినివేశారు. వాళ్ళు శిరిడీ చేరాక, ఇంకా యేమీ చెప్పకముందే సాయిబాబా, “నా సోదరుడిచ్చిన కొబ్బరికాయ యేది?" అని అడిగారు. వాళ్ళు జరిగినది చెప్పి, దానికి బదులు వేరొక కాయ యిస్తామన్నారు. ఆయన, “నా సోదరుడిచ్చిన కాయతో మరేదీ సాటిగాదు” అని వాళ్ళను క్షమించి విడిచిపెట్టారు.
వెయ్యిమంది భక్తులలో నిజంగా ముక్తికోసం ప్రయత్నించేవాడు యే ఒక్కడో వుంటాడని ద్వాపరయుగంలోనే శ్రీ కృష్ణుడు చెప్పాడు. అటువంటప్పుడు యీ కాలం సంగతి వేరే చెప్పాలా? అటువంటప్పుడు ఆత్మ జ్ఞానం గల సద్గురువులెంతు అరుదు! అట్టివారిని మాత్రమే ముముక్షువులు ఆశ్రయించాలని భగవద్గీత (4:34] చెబుతున్నది. అయితే వారిని గుర్తించి ఆశ్రయించేదెలా?” శ్రీ గురుచరిత్ర" అట్టి సంకల్పంతో పారాయణ చేస్తుంటే దత్తాత్రేయుడే మనలను అట్టి మహాత్ముని వద్దకు పంపుతారు. ఒక శ్రీమంతుడు, 'తనకు మగబిడ్డ కలిగితే, వేయిమంది బ్రాహ్మణులకు భోజనమిస్తానని మ్రొక్కుకొని గాణాపురంలో "శ్రీగురుచరిత్ర" పారాయణ చేసాడు. త్వరలో ఆ కోరిక నెరవేరిందిగాని, వ్యాపారంలో సర్వమూ కోల్పోయి, అతడు దిగులుతో మరణించాడు. అతడి భార్య కష్టం చేసి బిడ్డను పోషిస్తున్నది గాని, మ్రొక్కు గురించి భయపడి, గాణాపురం వెళ్ళి, ప్రత్యామ్నాయం తెల్పమని దత్తస్వామినే ప్రార్ధించింది. ఆ రాత్రి కలలో దత్తస్వామి కన్పించి, “అక్కల్కోటలోని స్వామిని నేనే. వారికి భిక్షయిస్తే వేయిమందికి పెట్టినట్లే” అన్నారు. ఆమె అక్కల్కోటలో స్వామిని దర్శించగానే, వారు భిక్షకోరి ఆరగించి, "అమ్మా, వేయిమంది బ్రాహ్మణులకూ భోజనం ముట్టింది" అన్నారు! శ్రీ దత్తానుగ్రహం వలన ఆమె కోరిన ప్రత్యామ్నాయానికి తోడు సద్గురు దర్శనం గూడ లభించింది.
తలంగపూర్ (గుజరాత్)లో కల్యాణ్ జీ అనే ఒకరుండేవారు. వివాహమైన కొద్దికాలానికి అతడు విరాగియై సద్గురువుకోసం "శ్రీ గురుచరిత్ర" పారాయణ, సాధన చేసేవాడు. ఒకప్పుడొక సాధువు కన్పించి, శ్రీ వాసుదేవానంద స్వామిని ఆశ్రయించమని చెప్పాడు. నర్మదాతీరాన వున్న ఆ స్వామిని అతడు దర్శించగానే ఆయన కల్యాణ్జీని గృహస్థుగా వుంటూనే సాధన చేయమని చెప్పారు. త్వరలో అతడు సిద్ధుడై, గోదావరీతీరాన 'గూంజ్ లో స్థిరపడి, శ్రీ గాండా మహరాజ్ గా ప్రసిద్ధి చెందాడు.
పాండురంగని అనుగ్రహం వలన 1898 లో జన్మించిన తమ బిడ్డకు తల్లిదండ్రులు ఆ పేరే పెట్టుకున్నారు. అతని తల్లి అతని 8వ ఏట సరసోబా వాడిలోవున్న వాసుదేవానందుల దర్శనానికి తీసుకెళ్ళింది. అతడు ఆ యతీశ్వరుని కౌగిలించుకొని, “నేను మీవాణ్ణి!” అన్నాడు. నాటినుండి అతడు వారినే ధ్యానించే వాడు. ఒకరాత్రి కలలో, “శ్రీగురు చరిత్ర పారాయణ చేయి!" అని వినిపించింది. మరురోజే అకస్మాత్తుగా అతని మేనమామ వచ్చి అతనికి ఆ గ్రంథమిచ్చి వెళ్ళాడు. మేనమామకు ప్రసాదించినది శ్రీ సాయినాథులేనట! ఆ ప్రతిని అతని పాండురంగడు చాలా కాలం దానిని పారాయణ చేసి, దత్తస్వామి స్వప్న సందేశా న్ననుసరించి సన్యసించారు. దత్తస్వామి చూపిన 'అంగదీ స్వామి' అనే మహ నీయుడు ఆదేశించినట్లు రంగడు శీతోష్ణాలు లెక్కచేయక, కౌపీనధారియై ఏకాం తముగా తపస్సు, “శ్రీ గురుచరిత్ర" 108 పారాయణలూ చేసి సిద్ధుడై, శ్రీరంగావ ధూతగా నారేశ్వర్లో స్థిరపడ్డారు.
చాలిస్ గాఁవ్ (ఖాండేశ్)లో శంకరశాస్త్రి కుమారుడు మార్తాండ్ 11వ సం|| నుండే శ్రేష్ఠమైన గురువు దొరకాలన్న దీక్షతో సంధ్యావందనము, పూజ, "“శ్రీగురుచరిత్ర” పారాయణ చేసాడు. క్రమంగా అతడు నిరాహారియై తండ్రి అనుమతి, - ఆశీస్సులతో ఒక గదిలో ఏకాంతవాసం చేసాడు. ఎన్నాళ్ళకూ తన ఆశయం సిద్ధించలేదని ఒకరోజు అతడు దుఃఖిస్తుంటే, అకస్మాత్తుగా అతని యెదుట శ్రీ వాసుదేవానందస్వామి ప్రత్యక్షమై; "నీవింత కఠోరదీక్ష యెందుకు చేసావు? నేను చాతుర్మాస్యవ్రతం భంగం చేసుకురావలసి వచ్చింది” అన్నారు. ఆయనను మంత్రముపదేశించమని కోరగా, స్వామి అలానే చేసి అంతర్హితు లయ్యారు. నాటి నుండీ మంత్రజపము, పూజ, శ్రీ గురుచరిత్ర పారాయణ, దత్త నామస్మరణలతో నిరంతరం గడిపేవాడు. వివాహమై బిడ్డలు జన్మించాక భార్య మరణించింది. రెండవ భార్య గూడ అలాగే మరణించింది. ఆ తర్వాత శంకరశాస్త్రి యాత్రలు, నర్మదా ప్రదక్షిణము చేసారు. ఆయనకు గిర్నార్లో దత్తస్వామి, నవనాధులు, అనసూయాదేవీ దర్శనమిచ్చారు. పూణేలో గుళవణి, గుజరాత్లో మౌనీబాబా, రంగావధూత, నిత్యానంద (వజ్రేశ్వరి), బాపూరావ్ మహరాజ్ గార్లను దర్శించి, తరణేలో శ్రీనానే మహరాజ్గా ప్రసిద్ధి చెందారు.
నేను (రచయిత) 1973లో గాణా(పూర్ లో నిత్యమూ, "శ్రీ సాయిబాబా "గురుగీత" పారాయణ చేస్తూ కొద్ది రోజులున్నాను. ఒకరోజాక మద్రాసీ సాధువుగారితో నేను, “ఇచట భక్తులు శ్రద్ధతో భిక్ష యివ్వటం కోసం ఆ స్వామి అలా చెప్పారేమో గాని, యిన్ని శతాబ్దాల తర్వాత ఆయనింకా భిక్షకు ఎలా ?" అన్నాను. ఆ సాధువిలా అన్నారు: "మొదట నేనూ అలాగే తలచాను గాని, యిక్కడ భక్తులకయ్యే అనుభవాలు విని, నిజమన్పించి, వారే | రూపంలో భిక్షకు వస్తారో గుర్తించి వారి పాదాలు పట్టుకోవాలని తలచి దీక్షగా “శ్రీ గురుచరిత్ర” పారాయణ చేస్తూ, భిక్షకు వచ్చే వారిని జాగ్రత్తగా గమనించ నారంభించాను. ఒకరాత్రి స్వామి స్వప్న దర్శనమిచ్చి, 'నారాక దైవరహస్యం. నన్ను గుర్తించ యత్నించవద్దు' అని హెచ్చరించారు. కాని నేను పట్టు విడువలేదు. మరురోజు కృష్ణలో స్నానం చేయగానే తీవ్రమైన జ్వరము, తలనొప్పి వచ్చి భిక్షకు పోకుండా నిద్రపోయాను. మధ్యాహ్నం 3-30 గం||లకు మెలకువ వచ్చేసరికి జ్వరము, తలనొప్పి తగ్గిపోయాయి. ఆకలి భరించలేక భిక్షకు వెళితే ఒక గృహస్థు, 'మధ్యాహ్నం నేనే గదా నీకు భిక్ష వేసాను?"
అని కసిరాడు. జరిగినది యెంత చెప్పినా అతడు నమ్మలేదు. నాటిరాత్రి స్వామి మళ్ళీ స్వప్నదర్శనమిచ్చి, 'నన్ను నీవేమి పట్టగలవు? నీ రూపంలో నేనే భిక్ష చేస్తాను' అన్నారు. ఆయన నేటికీ భిక్షకు వచ్చేమాట నిజం!"
శ్రీ దత్త ప్రదక్షిణము : అనాదిగా యెందరో మహనీయులు ఆచరించిన ప్రదక్షిణ విధానమిలా వున్నది: బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి, "అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివాః యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచి:" అన్న శ్లోకం భావ యుక్తంగా చదువుకొని, శుచి అవాలి. అప్పుడు శుద్ధి చేయబడి, రంగవల్లులు దిద్దబడిన చోట కడిగి తుడిచిన ఒక చెక్క పీటనుంచాలి. దానిమీద దత్తస్వామి చిత్రపటము, 'శ్రీ గురుచరిత్ర' గ్రంథమూ వుంచాలి. వాటికి ధూప దీపాలర్పించాలి. ఆ దీపం 112 ప్రదక్షిణలయ్యేవరకూ నిలచేలా అమర్చాలి. అపుడు,
నమస్తే యోగిరాజేన్ద్ర, దత్తాత్రేయ దయానిధే J
స్మృతి దేహి మాం రక్ష భక్తితే దేహిమే దృఢాం ॥
అన్న శ్లోకం భావయుక్తంగా చదువుకుంటూ ప్రదక్షిణ ప్రారంభించాలి. “యోగి రాజేన్రా, దత్తాత్రేయా, ఓ దయానిధీ, మీకు నమస్కారము. నాకు మీపై దృఢమైన భక్తితో కూడిన స్మరణ ప్రసాదించి నన్ను రక్షించు" అని దీని భావం. మొదటి ప్రదక్షిణ కాగానే 1) ఓం వరదాయ నమః, అని చెప్పి, అటు తర్వాత ఒక్కొక్క ప్రదక్షిణం చివర ఈ క్రింది నామాలు ఒక్కొక్కటి చొప్పున స్మరించాలి: 2) కార్తవీర్యాది రాజరాజ్య ప్రదాయనమః 3) అనఘాయనమః 4) విశ్వశ్లాఘ్యయ నమః 5) అమితాచారాయనమః 6) దత్తాత్రేయాయనమః 7) మునీశ్వరాయనమః 8) పరాశక్తి పదాశిష్టాయనమః 9) యోగానందాయనమః 10) సదోన్మదాయనమః 11) సమస్త వైరి తేజోహృతేనమః 12) పరమామృత సాగరాయనమః 13) అనసూయా గర్భరత్నాయనమః 14) భోగమోక్ష సుఖప్రదాయనమః 15) శ్రీపాద శ్రీవల్లభాయ నమః 16) శ్రీ నృసింహసరస్వతీస్వామి సద్గురు పాదుకాభ్యాం నమః
పై నామాలు చెప్పినపుడెల్లా ప్రతిసారి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. పై నామాలు ఏడు ఆవర్తాలు అయ్యేసరికి విధిపూర్వకమైన 112 ప్రదక్షిణలు పూర్తి అవుతాయి. పురుషులు మాత్రమే సంపూర్ణ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. స్త్రీలు తమ రెండు కాళ్ళను కలిపి కుడివైపునుండి వక్షస్థలం నేలను తాకకుండా అర్థ సాష్టాంగ నమస్కారం మాత్రమే చేయాలి.
పై రీతిన 112 ప్రదక్షిణలయ్యాక పీటయెదుట ప్రశాంతంగా కూర్చుని ఈక్రింది శ్లోకాలను కలిపి 108 సార్లు జపించాలి:
వరదః కార్తవీర్యాది రాజరాజ్య ప్రదోనఘః
విశ్వశ్లాఘ్యో మితాచారో దత్తాత్రేయో మునీశ్వరః ॥
పరాశక్తి పదాశిష్టో యోగానందః సదోన్మదః
సమస్త వైరి తేజోహృత్ పరమామృత సాగరః ॥
అనసూయా గర్భరత్న, భోగ, మోక్ష సుఖప్రదః
శ్రీ పాదవల్లభః పాతు శ్రీ నృసింహ సరస్వతీ ॥
ఉంది ఈ రాచంలో ఇంతవరకు ఉదయం ప్రదక్షిణమైనది.
సాయంత్రం పై చెప్పిన రీతిన శుచియై పట్టువస్త్రం ధరించి, జగన్మాతను పీఠంపై ప్రతిష్టించి పంచోపచార పూజచేసి దాని చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణం చేసేటప్పుడు - "సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే" అనే శ్లోకం పఠించాలి. ప్రతి ప్రదక్షిణం చివర -
"శరణాగతదీనార్త పరిత్రాణ పరాయణే
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే”
అనే శ్లోకం చదివి, సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ప్రదక్షిణలు 108 అయ్యాక సుఖంగా పీట పై కూర్చుని ఈ క్రింది శ్లోకం 108 సార్లకు తక్కువలేకుండా యథాశక్తి జపించాలి.
“నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో
సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే"
గ్రహపీడ తొలగడానికి పై శ్లోకంలో "సర్వబాధా” అనే పదం ఉపకరిస్తుంది. రోగ విముక్తి కోరేవారు ఆ పదానికి బదులు "సర్వరోగ" అనే పదం చేర్చి చదువు కోవాలి. విఘ్నాలు తొలగించుకొనగోరేవారు "సర్వ విఘ్న" అన్న పదం చేర్చుకోవాలి. . నిత్యమూ వెయ్యిసార్లు జపించేవారికి విముక్తి కలుగుతుం ప్తి కోరేవారు పై శ్లోకంలో “సర్వబాధా ప్రశమనం కురు" అనే పదాలకు బదులు "అభీష్టసిద్ధి మే దేహి", అని చదువుకోవాలి. అభీష్టసిద్ధికి ఈ శ్లోకాన్ని 1,2 లేక 3 లక్షల సార్లు జపించాలి. ఇందుకు కొన్ని మాసాల వ్యవధి పట్టవచ్చు.
దత్త సాక్షాత్కారం కోరినవారు గురుచరిత్ర పారాయణ, ప్రదక్షిణ పై చెప్పిన రీతులలో చెయ్యాలి. అందరూ చేసి తీరాలని నియమంలేదు.
ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమ:
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం విష్ణుదత్తాయ నను:
ఓం శివదత్తాయ ననుః
ఓం అత్రిదత్తాయ నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అత్రి వరదాయ ననుః
ఓం అనసూయాయై నమః
ఓం అనసూయాసూననే నమః
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయనమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధిపతయే నమః
ఓం సిద్ధి సేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం మహిష్ఠాయ నమః
ఓం మహాత్మనే నమః నమ
ఓం యోగాయ
ఓం యోగగమ్యాయ నమః
ఓం యోగదేశకరాయ నమః
ఓం యోగపతయే నమః
ఓం యోగీశాయ నను:
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్ర పoకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్పమోహనాయ నమః
ఓం అర్ధాంగలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం విరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షిణే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహాయ నమః
ఓం స్థవిరాయ నమః
ఓం స్ధవీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూఢాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్షాయ నమః
ఓం అనేకవక్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలుధారిణే నమః
ఓం శూలినే నమః
ఓం ఢమరుధారిణే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం మునయే నమః
ఓం మౌళినే నమః
ఓం విరూపాయ నమః
ఓం స్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రాయుధాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః నంది వ
ఓం పద్మపాదాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞాన విజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్ఠాయ నమః
ఓం ధ్యానస్థిమితమూర్తయే 'నమః
ఓం ధూళిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్త మూర్తయే నమః
ఓం భస్మోద్ధూళిత దేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః .
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః
ఓం అష్టేశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం దత్తాత్రేయాయ నమో నమః
గురుర్ర్బహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః I
గురుస్సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥
ఆవాహయామి సద్భక్త్యా నిత్యానందం మహామతిం I
సర్వధర్మపరం నిత్యం పూర్ణానందైక విగ్రహం ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః, ఆవాహయామి.
నియాయ శ్రీ ఉడి కల్పద్రుమూలే మణివేది మధ్యే, సింహాసనం స్వర్ణమయం సురత్నం I
విచిత్ర వస్త్రావృతమచ్యుతప్రభో, గృహాణ లక్ష్మీ ధరణీసమన్విత ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః, ఆసనం సమర్పయామి.
గంగాజలం సమానీతం సుగంధద్రవ్య సంయుతమ్ I
పాద్యం గృహాణ భో స్వామిన్। తీర్ధపాద దయాకర ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః, పాదయోః పాద్యం సమర్పయామి.
చంది ధర్మస్వరూప ధర్మజ్ఞః తులసీ దామ భూషణ I
ఉండవల్లి కంబుగ్రీవ మయాదత్తం గృహాణార్ఘ్యం నమోస్తుతే ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.
జ్ఞానవైరాగ్య సంపన్న భవరోగైకభేషజ I
గృహాణత్వం మయాదత్తం ఇదమాచమనీయకం ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః, ఆచమనీయం సమర్పయామి.
గంగాది పుణ్యసలిలై: మయానీతైః శుభావహైః I
స్నాపయిష్యామ్యహం భక్త్యా ప్రసన్నో భవ సద్గురు ॥
శ్రీ సద్గురు సరబ్రహ్మణే నమః, స్నానం సమర్పయామి.
స్వర్ణాంచలం చిత్రవిచిత్ర శోభితం కౌశేయ యుగ్మం పరికల్పితం మయా I
దామోదర ప్రావరణం గృహాణ మాయాచల ప్రాకృత దివ్యరూప ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః, వస్త్రయుగ్మం సమర్పయామి.
కస్తూరికా చందనకర్దమాని కాశ్మీరసంయోజిత గంధసారైః I
విలేపనం స్వీకురు దేవ దేవ! శ్రీ భూమివక్షోజవిలేపనార్హమ్ ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః గంధం ధారయామి.
తంతుం తన్వన్ మయాభక్త్యా బ్రహ్మసూత్రం వినిర్మితం I
దాస్యామి ధారణార్థంపై గృహాణ బ్రహ్మవిద్వర ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః, యజ్ఞోపవీతం సమర్పయామి.
యజ్ఞోపవీత ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి.
కల్హరైశ్చంపకైర్జాజీ పున్నాగైర్మల్లికాదిభిః I
మందారైః పూజయిష్యామి స్వీకుర్వాచార్య సత్తమ ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః పుష్పైః పూజయామి.
ఓం తీర్థపాదాయ నమః - పాదౌ పూజయామి.
ఓం బలాయ నమః - జంఘే పూజయామి.
ఓం ఆధారభూతాయ నమః - జానునీ పూజయామి.
ఓం విశ్వప్రపూజితాయ నమః - ఊరూ పూజయామి.
ఓం జితేంద్రియాయ నమః - గుహ్యం పూజయామి.
ఓం స్థితప్రజ్ఞాయ నమః - కటిం పూజయామి.
ఓం మితాశనాయ నమః - ఉదరం పూజయామి.
ఓం విశాల వక్షాయ నమః - వక్షస్థలం పూజయామి.
ఓం శుద్ధ హృదయాయ నమః - హృదయం పూజయామి.
ఓం శిష్య వత్సలాయ నమః - స్థనౌ పూజయామి.
ఓం ఆత్మోద్ధారకాయ నమః - భుజౌ పూజయామి.
ఓం దానహస్తాయ నమః - హస్తా పూజయామి.
ఓం కంబుకంఠాయ నమః - కంఠం పూజయామి.
ఓం ప్రసన్న వదనాయ నమః - ముఖం పూజయామి.
ఓం మృదుభాషణాయ నమః - జిహ్యాం పూజయామి.
ఓం కరుణాజలనిధయే నమః - నేత్రే పూజయామి.
ఓం శాస్త్రానుసారిణే నమః - కరౌ పూజయామి.
ఓం సర్వజ్ఞాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి.
వనస్పతిర సైర్దివ్యైర్నానాగంధైస్సుసంయుతమ్
ఆఘ్నేయస్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్ ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః - ధూపమాఘ్రాపయామి.
నడి రోడ్డ జ్ఞానజ్యోతి స్వరూపస్త్వం ఆత్మజ్ఞాన ప్రదాయక
ఘృతవర్త్యాకృతం దీపం దాస్యామి స్వీకురుప్రభో
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః దీపం దర్శయామి.
సత్యంచిత్తేన పరిషించామి అమృతమస్తు ।
అమృతోపస్తరణమసి స్వాహా ॥
శ్లో॥ పక్వాన్నం పంచభక్ష్యాణి గోఘృతం సూపసంయుతమ్
లేహ్యం పేయం తథాచోష్యం స్వీకురు ప్రాణవల్లభ ॥
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయస్వాహా,
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ఉత్తరాపోశనం సమర్పయామి,
హస్త ప్రక్షాళనం సమర్పయామి, పాదప్రక్షాళనం సమర్పయామి,
శుద్ధాచమనీయం సమర్పయామి.
పూగీఫలై స్సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతమ్ ।
ముక్తాచూర్ణ సమాయుక్తం - తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః, తాంబూలం సమర్పయామి.
శ్లో॥ నీరాజనమిదం జ్ఞానదీపక సద్గుణాకర ।
పూరయిత్వా మనోవాంఛాం స్వీకురు భజన ప్రియ ॥
శ్లో॥ మంగళం జ్ఞానసంపన్న మంగళం సుజనప్రియ ।
మంగళం జగదుద్దార మంగళం దేశికోత్తమ ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః నీరాజనం సమర్పయామి.
శ్లో॥ శ్రద్ధాభక్త్యా అక్షతైశ్చ హృత్పద్మసహితం గురో I
మయార్పితం మంత్రపుష్పం స్వీకురు శిష్యవత్సల ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః, మంత్రపుష్పం సమర్పయామి.
శ్లో॥ నమః ప్రసన్నవదన నమః కారుణ్యసాగర ।
నమః కర్మఫలత్యాగిన్ నమః పాప నికృంతన ॥
శ్లో॥ నమోస్తనంతాయ సహస్ర మూర్తయే
సహస్ర పాదాక్షి శిరోరు బాహవే ।
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే ॥
సహస్రకోటీ యుగధారిణే నమః
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః, సప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
శ్లో॥ త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ ।
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ॥
శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః, ఛత్రమాచ్ఛాదయామి.
చామరం వీచయామి - నృత్యం దర్శయామి
ఆందోళికానారోహయామి
అశ్వానారోహయామి, గజానారోహయామి
సమస్తరాజోపచార, దేవోపచారు, శక్త్యుపచార, భక్త్యువచార పూజాం సమర్పయామి.
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
శ్రీ కులదేవతాయై నమః శ్రీ శ్రీపాద శ్రీ వల్లభ -
శ్రీ నృసింహ సరస్వతీ -దత్తాత్రేయ గురుభ్యో నమః.
శ్లో॥ బాలార్క ప్రభమింద్రనీల జటిలం, భస్మాంగరాగోజ్వలం
శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం ।
బ్రహ్మజై స్సనకాదిభిః పరివృతం సిద్దెస్సమారాధితం
దత్తాత్రేయ ముపాస్మహే హృదిముదా ధ్యేయస్సదా యోగిభిః ॥
మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము. కాని తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి, భయము తొలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే వున్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కల్గుతాయి. ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది. అపుడు భయానికి, దుఃఖానికీ కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది. అంటే యీ జగత్తు మిధ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్త్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్త్వాన్ని బోధించడానికి అత్రిమహర్షి పుత్రుడై జన్మించి, శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొ।।న వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్దరించాడు. ఆయనయే మరల శ్రీపాదవల్లభుడుగాను, తరువాత శ్రీ నృసింహసరస్వతియనే పేరుతోనూ అవతరించి, తన శిష్యులైన సిద్ధాదులనుద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికీ కృష్ణా - భీమా సంగమతీరంలోని గంధర్వపుర నివాసియై, స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు.
ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకతీతుడు, అక్రియుడు, కోరికలు లేని వాడు, అద్వితీయుడు. అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవాలని సంకల్పిం చాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత యీ జగత్తును సృష్టించి, దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మరూపంలో దాగి యుంటారు. వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్తయైన బ్రహ్మ నుండి, స్థూలము, జడమూ అయిన స్తంభము వంటి వస్తువులు: సూక్షము, సజీవములూ అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలూ మొదలుగా గల యీ చరాచర జగత్తూ యేర్పడ్డాయి. ఇలా యీ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు. ఇంద్రియాలు, వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము, రసము (లేక రుచి), గంధము (లేక వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని యెవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన, దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు. (హృదయశుద్ధి, సుస్థిరమైన తత్త్వజ్ఞానము, యోగాభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము (ధర్మనిష్ఠ), అహింస, సత్యము, క్రోధము లేకుండడం, త్యాగము, శాంతి, యితరుల దోషాలను ప్రకటించకుండడం, ప్రాణులయందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండడం, మృదు స్వభావము, లజ్జ (వలన అనుచిత కార్యములను చేయకుండడం), చాపల్యం లేకుండడము, సహనము, ఓరిమి, చెక్కు చెదరని యుక్తా యుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచనలేకుండడం, నిగర్వము - యీ శుభ లక్షణాలను దైవీసంపద అంటారని భగవద్గీత చెబుతున్నది.) అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవరూపంతో జన్మించాడు. ఇలా ప్రతియుగంలోనూ అవతరించి ధర్మ రక్షణము, స్వధర్మ పాలనము చేసి, తర్వాత తన అవతార శరీరాలు విడిచి పెడ తాడు. ఇలా బ్రహ్మదివసాన శ్వేత వరాహకల్పంలో యిప్పటికి 28 యుగ చతుష్టయాలు గడిచాయి. (432 కోట్ల సం।।లు ఒక బ్రహ్మదివసము. అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన (బ్రహ్మ యొక్క) అహోరాత్రాల కాలం ఒక కల్పము. 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం. వీటిలో మొదటిది శ్వేత వరాహకల్పం.)
మానవులలో కలి ప్రభావం వలన సత్యము, ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలూ కొరవడ్డాయి. యజ్ఞదాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు గూడ మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మయైన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్దరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణా - అమరజానదీ సంగమ తీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా యిప్పటికీ వున్నాడు.
ఈయన మహాత్మ్యం చెప్పనలవిగానిది. పుట్టినవెంటనే ఏడిచే బదులు ప్రణవ ముచ్ఛరించాడు. ఇనుమును తాకి బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం గూడ లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానముపదేశించాడు. చిన్న వయసులోనే సర్వతీర్థ క్షేత్రాలూ పాదచారియై దర్శించి పావనం చేసాడు. అష్టాంగయోగమభ్యసించాడు. నానాటికీ పతనమవు తున్న సన్యాసమార్గాన్ని పునరుద్ధరించాడు. అపథ్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలీ (ప్రయాగ, కాశీ, గయ) యాత్ర చేయించాడు. చచ్చినవాణ్ణి బ్రతికించాడు. గొడ్డు బజ్జెను పాడిగేదెగా చేసాడు. త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు. విద్వాంసులు విద్యాగర్వమణచాడు. తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యమిచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మమార్గం బోధించాడు. ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేసాడు. తన అమృతదృష్టిచేత ఒకనికి కుష్టురోగం తగ్గించాడు. ఒక దీపావళినాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు. అకాలంలో కోసిన పంటచేనును మాటమాత్రం చేత తిరిగి సస్యసమృద్ధిగా మార్చాడు. ఇలాటి మహాకార్యాలు యిదివరకు చేసాడు; ఇప్పటికీ చేస్తున్నాడు; ఎప్పటికీ చేస్తాడు. ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపైనున్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువు లనూ లెక్కపెట్టవచ్చునేమో గాని, ఆ భగవంతుని కల్యాణగుణాలను, శక్తులనూ లెక్కించడం సాధ్యం గాదు.
భగవంతుడు నిజానికి రూపంలేనివాడైనాగూడ తన మహిమ మరియు తన కల్యాణగుణాలరూపంలో అవతరించి భక్తుని చెవియనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి, అతని దుష్ట సంస్కారమనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు, జీవించియుండగానే ముక్తుడవుతాడు. సుఖ దుఃఖాలనే ద్వందాల చేత స్పర్శించబడక, వాటిపట్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారబ్ధకర్మరూపమైన అతడి దేహం నశించినా, నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖదుఃఖరూపమైన ద్వంద్వాలింకా మిగిలియున్నా, ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేనివారికి, యింద్రియసుఖలోలురైన ఆసురీ సంపదగల వారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకూ యీ సత్యం తెలియదు. స్వధర్మ మాచరిస్తూ సాధు, గురు, దేవతలయందు భక్తిగలవాడై, సత్సంగం వలన వివేకియై 'నేనే కర్తనూ, భోక్తను' అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసియై ఈ మార్గంలోనే అతడు భుక్తి, ముక్తి పొందుతాడు.
శ్రీ గురుని అనుగ్రహానికి పాత్రుడై, 'సాకరే' అనుపేర ప్రసిద్ధికెక్కిన సాయందేవుడను సద్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది ఆపస్తంభశాఖ. కౌండిన్యస గోత్రము. వారి కుమారుడు దేవరావు. అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రిగారు. ఆయన శ్రీ గురునికి భక్తుడు. మా తల్లి యొక్క తండ్రిగారిది అశ్వలాయనశాఖ, కాశ్యపస గోత్రం. ఆయన జను, భగీరధ మహర్షులవంటివాడు. మా తల్లి చంపాదేవి, పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి, సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది. ఆ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి.
వేదాధ్యయనపరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్వులు, సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా! మీకు నా నమస్కారములు. నేను మీ పాదధూళివంటివాడను. రచనా సామర్ధ్యం లేని నేను కేవలం వంశ పారం పర్యంగా శ్రీ దత్తానుగ్రహం వుండడం వల్లను, శ్రీగురుని ప్రేరణవల్లనూ మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను. 'అమృత కుంభం వంటి శ్రీ గురుచరిత్ర నీకు ప్రసాదించబడినది. నీవీ కథ వ్రాయి. దానివలన నీకు, నీ వంశస్థులకు గూడ సర్వమూ సిద్ధిస్తాయి' అని శ్రీగురుడు నన్నాజ్ఞాపించారు. భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతీ స్వామి ఆదేశం కామధేనువు వలె యీ కార్యాన్ని నెరవేర్చగలదు.
త్రిమూర్తియైన శ్రీ దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర అపారము. దానిని సంపూర్ణంగా చెప్పడం యెవరితరము గాదు. ఆయన ప్రేరణతో వ్రాసిన యీ గురు కథను పారాయణ, శ్రవణము చేసేవారి వంశం పవిత్రమై రోగాలు, పీడలు లేకుండా కలకాలం సిరిసంపదలతో శోభిస్తుంటుంది. దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. ఇది నా స్వానుభవము. నేను అల్పుడ నైనప్పటికీ, శ్రీ గురుని అనుగ్రహం వలన నా నోటినుండి వెలువడే యీ దత్తాత్రేయ కథ - అల్పమైన తేనెటీగ నోటినుండి లభించే తేనెలాగ, విలువలేని ముత్యపు చిప్పనుండి లభించిన విలువైన ముత్యంలాగ, కాకి రెట్ట నుండి మొలచిన దివ్యమైన అశ్వత్థ (రావి) వృక్షంలాగ - అభీష్టాలు, జ్ఞానమూ గూడ ప్రసాదించగలదు.
ప్రస్తావన : ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచములోని సర్వమత గ్రంధాలు, మహనీయులూ చెబుతున్నారు. కాని పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయనను గుర్తించడము ఎలా? అంతటి గురువు తారసిల్లినా, మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప తొలగించేదాక అయస్కాంతం వైపు ఆకర్షించబడదు గదా!
స్వల్పంగా పాపం చేసిన వారికి జపధ్యానాలు, ప్రాయశ్చిత్తాలూ ఉపయోగపడతాయి గాని, అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్త మని శాస్త్రం. మొదట ముముక్షువు 'గురుచరిత్ర' వంటి గ్రంధాలు పారాయణ, లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షుత్వము, గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరమౌతాయి. అపుడే దైవకృపచేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథమహిమ వలన స్వప్నంలో తానాశ్రయించ వలసిన సద్గురువెవరో తనకు తెలుపబడుతుంది. అంతవరకూ 'శ్రీ గురుచరిత్ర' పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు, నిరంతర ప్రార్థనలు చేస్తూ, ముముక్షువు వేచియుండాలి. అపుడు మాత్రమే ఎట్టి సంశయానికీ తావులేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుందీ అధ్యాయం.
గంధర్వనగరంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి మహిమ లోక ప్రసిద్ధమై, దూర దూర ప్రాంతాలనుండి గూడ యెందరెందరో వచ్చి వారిని సేవించి, పెళ్ళికానివారు పెళ్ళి, సంతానము లేనివారు సంతానము, పేదవారు ధనము - యిలా యెవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. వారిని దర్శించాలను కొన్నప్పటినుండే కోరినవి నెరవేరుతున్నవారున్నారు. నామధారకుడనే బ్రాహ్మణుడు యెన్నో కష్టాలకు గురియై, యెన్ని చేసినా ఒక్కటీ తీరక యెంతో వ్యాకులపడ్డాడు. ఆ పరిస్థితులలో అతడు శ్రీ గురుని మహాత్మ్యం గురించి విని, వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించకుంటే తన జీవితమే వ్యర్థ మని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ, ఆకలి దప్పులు గూడ మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనమవకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీ గురుని స్మరించి యిలా మొర పెట్టుకున్నాడు.
"అందరి కష్టాలూ తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలెందుకు తొలగడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే, సర్వపాపహరమైన మీ నామం వాటినెందుకు నశింపజేయలేదు? అన్ని జీవులనూ కరుణించే మీరు నన్ను మాత్రం యెందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని, తలచిన వెంటనే ఫలితమిస్తాడనీ వేదాలు, స్మృతులూ చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చిందిగదా, మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడంలేదు? మీరు సాటిలేని పెన్నిధియన్నది నిస్సంశయంగా అందరి అనుభవమున్నూ! కాని నా మనస్సులో మీపై భక్తి యెందుకు కల్గడం లేదు? నా మనస్సు మీ పై స్థిరంగా నిలవడంలేదేమి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడూ, నీడా అని నమ్మి యిపుడు మిమ్మల్నే ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు, నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మా మీరు దీనులపాలిటి కల్పవృక్షము, దయాళువూ, మహాదాత. దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వసాక్షియని వేదాలు చెబుతున్నాయి గదా! మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరినీ వుపేక్షించని మీరు నన్నెందుకు వుపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదనా? సాక్షాత్తూ లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేనేమి యివ్వగలను? బిడ్డనుండి యేమి తీసుకొని తల్లి స్తన్యమిస్తున్నది? నన్ననుగ్రహించే సమయం యింకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించనిమాట నిజమే. కాని సేవిస్తేనే ప్రసాదించేది దానమెలా అవుతుంది? స్వామి, లౌకికుడైన రాజు గూడ తన సేవకుల వంశంలో పుట్టినవారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకు లందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా ఋణం రాబట్టుకుంటాను. 2 మీరు నా పై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటివారిపట్ల తగునేమో గాని, అల్పుడనైన నాయందు తగదు.
1. నిష్ఠ, ఓరిమిలతో గూడిన నిరంతర సేవ వలన మాత్రమే భక్తుని హృదయం శుద్ధమై, ఎప్పుడూ అన్ని జీవులపై వర్షిస్తుండే గురు కృప అనుభవమవుతుందని సాయిబాబా, రమణమహర్షి, అక్కల్కోట స్వామి వంటి మహనీయులందరూ చెప్పారు. అనుగ్రహమన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్దుడు గూడ యితడికి చెబుతాడు.
2. గురు భక్తుడు యే మహాత్ములను దర్శించినా తనకు గురు కృప లభించేలా ఆశీర్వదించమని కోరాలి.
ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో! అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపిలేడు; కాని మీవంటి పాపహారకుడూ లేడు. కనుక నన్నుద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు - నన్ను బుజ్జగించాలి గాని, నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతోచెప్పవచ్చుగదా? 3 ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణుపొందుతున్నాను. చైతన్యమూర్తివి. దయానిధివీ అయిన నీ కారుణ్యమేమైంది ప్రభూ! మృత్యుముఖంలో వున్న నన్నెందుకు వుద్ధరించకుండా వున్నావు?" ఇలా దారిపొడుగునా నామధారకుడు అనేక విధాలుగా శ్రీ గురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడై, శోషవచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టుక్రింద పడుకున్నాడు. అతనికి నిద్రతూగినపుడు కలలో గూడ అతడు శ్రీ గురుణ్ణి స్మరిస్తున్నాడు. ఆవు తననెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు, భక్తులపాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూతవేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులి చర్మమూ ధరించి యున్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి, వాటితో అభిషేకించి, గంధమలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి, అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలచింది. అపుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి, తలపై చేయి వుంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవమలానే వున్నది. 4 అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు. అక్కడ మరెవ్వరూ లేరు! అపుడతడు లేచి, తనకు స్వప్నదర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు.
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః,
3. అతడు చేసిన తప్పేమో ముందు ముందు సిద్ధుడు చెబుతాడు. అయినా దానిని గూడ మన్నించి శ్రీ గురుడు అతనికి త్వరలో స్వప్న దర్శనమిస్తాడు. సిద్ధుని దర్శనం, సన్నిధి ప్రసాదిస్తాడు.
4. ఈ రీతిన శ్రీ గురుడు అతడు కోరినదానికి శతకోటి రెట్లు అధికంగా అనుగ్రహించి అతనిని తన శిష్యునిగా అంగీకరించారు. స్వప్నంలో లభించే గురు దర్శనము, గురు కృప ఉత్తమమైన శుభసూచనలని శాస్త్రాలు చెబుతున్నాయి.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః
ప్రస్తావన:- "గురుచరిత్ర" పారాయణ వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురు దర్శనాభిలాష, మరొకవంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవు తాయి. అపుడు మొదట స్వప్నంలోను, తర్వాత ప్రత్యక్షంగాను గురుదర్శనమూ లభిస్తుంది. ఆ గురువు కూడ అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు. అట్టి సద్గురువు తారసిల్లినపుడు మన హృదయం ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది. వేరు నిదర్శనాలు అవసరం లేకనే, కేవలం దర్శనమాత్రం చేతనే శాంతి - ఆనందాలు కల్గుతాయి. అటుపైన వారిపట్ల మనకు కల్గినభావాన్ని నిశ్చ లంగా నిల్పుకోవాలి. అందుకు గూడ వారి లీలలు, చరిత్ర పారాయణ, చింతనలే సాధనాలు. అంతటి పూర్ణ గురుని తెల్పే అనన్య గురు భక్తుడు లభించడం గూడ మన జీవితాకాశంలో ఉదయిస్తున్న గురుకృపకు చిహ్నమే. అంటే 'గురుచరిత్ర' పారాయణ చేసే అవకాశం గూడ యిట్టిదేనన్నమాట.
ఈ అధ్యాయంలోని గురుసేవ వృత్తాంతం కల్పితం గాదు. శ్రీ శిరిడీ సాయినాధుని గురుసేవ అక్షరాలా అలానే వుండడం గమనార్హం. సద్గురుసేవ, అనుగ్రహం వలన సచ్ఛిష్యుడు క్షణంలో వేదవేదాంగ పారంగతుడు అవచ్చని, అతనికి సకల సిద్ధులూ ప్రాప్తిస్తాయని పతంజలి మొ।।న మహర్షులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథాలు, 'శ్రీ గురుగీత' గూడ చెబుతున్నాయి. శ్రీ అక్కల్కోటస్వామి, తాజుద్దీనాబ్బాబా మొ।।న వారి చరిత్రలలో గూడ యిందుకెన్నో తార్కాణాలు చూడవచ్చు.
`స్వప్నంలో జడలు, విభూతి, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు, ద్వంద్వారా తుడూ అయిన ఒక యోగి పుంగవుడు కనిపిం చాడు. ఆయన పీతాంబరము, దానిపై పులిచర్మము, దేహమంతటా విభూతి, జడలు ధరించి వున్నాడు. ఆయన సాక్షాత్తూ అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే! ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి. అతడు పారవశ్యంతో నమస్కరించి "స్వామీ, నేను శ్రీగురుని దర్శనంకోసం తపించి, అది లభించకుంటే మరణించా లనుకున్నాను. కాని స్వప్నంలో మీ దర్శనమవగానే నాహృదయంలో సంతోషం ఉప్పొంగింది. కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమయింది. స్వామీ, నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే వేరు దిక్కులేదు. నా అదృష్టం వలన మీ దర్శనమయింది. మానవులకు సిరిసంపదలు వున్నపుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. ఆపత్సమయంలో అందరూ వదిలిపెడతారు. సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు. యోగీశ్వరా! అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞానజ్యోతిస్వరూపులు మీరు. నా పేరు నామధారకశర్మ. తమ పేరేమి? ఎక్కడనుండి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగాడు.
ఆ యోగి యిలా చెప్పారు "నాయనా, ఎవరి భక్తులు తప్పక భుక్తిని, ముక్తినీ పొంది తీరుతారో, ఎవరిని యోగులు గూడ ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తియవ తారమైన శ్రీ నృసింహసరస్వతీ స్వామి శిష్యుణ్ణి నేను. ఆయనయే సద్గురువు. తననాశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలూ అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడంటారు. లోకానుగ్రహార్థం భూలోక, సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను."
నామధారకుడు, "స్వామీ! శ్రీ నృసింహ సరస్వతీ స్వామి మహిమ గురించి యెందరో చెప్పగా విన్నాను. మా వంశీయులందరూ ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయనయందు భక్తి కల్గింది. నేను యెల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను. కాని నేనెంత కష్టాలలో వున్నా, నేనెంతగా ఆయనను ప్రార్ధించినా నన్నాయన అనుగ్రహించలేదేమి? ఆయన నాపై ఆగ్రహించారెందుకు?" అనడిగాడు.
సిద్ధయోగి వాత్సల్యంతో యిలా అన్నారు "విప్రుడా! నేను చెప్పేది శ్రద్ధగావిని, యెప్పుడూ గుర్తుంచుకో! భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైనా, ఎల్లప్పుడూ వర్షిస్తూనే వుంటాడు. అందులో యెట్టి లోపమూ వుండదు. ఆయన కృపకు పాత్రులైన వారికేగాక, వారి వంశంలో గూడ యెవరికీ యెట్టి దైన్యమూ కలుగదు. ఆయనను సేవించినా నీ దైన్యం పోలేదంటే యెంతో ఆశ్చర్యముగా వున్నది. నీవు మనస్సులో ఆయనను సంశయించి వుండాలి. అందువలననే నీకన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణశుద్ధిగా ఆయననే నమ్మి సేవించేవారికి యెట్టి కొరవా వుండజాలదు. నీ గురుభక్తి యింకా దృఢంకాలేదు. శ్రద్ధలేనివాడు, సంశయాత్మ కుడూ యెవరిచేతా యెన్నడూ అంగీకరించబడడు. శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించినా సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు. కాని ఆ సద్గురువే కోపిస్తే వానిని రక్షించగల వారు మరెవరూ లేరు. అయినా ఆయన యెన్నడూ యెవరిపైనా కోపించరు. అలాంటి శ్రీ గురుణే శంకించేవాణ్ణి అనుగ్రహించగలవారెవరు?"
అప్పుడు నామధారకుడు, "స్వామీ! సద్గురువు త్రిమూర్తి స్వరూపము యెలా అయ్యారు?” అనడిగాడు. సిద్ధుడు, "మొదట పరమాత్మ ఒక్కడే వున్నాడు. ఆయనొకప్పుడు, 'నేను అనేకమౌదునుగాక!' అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తుంటాడు. అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్త్వజ్ఞానం కలిగించడం వలన, అజ్ఞానం నుండి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపజేయడం వలన గురువు సృష్టి, స్థితి, లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు" అని చెప్పాడు. అంతట నామ ధారకుడు, " స్వామీ, దేవతలు కోపించినా సద్గురువు రక్షించగలరంటిరే, అదెలా సంభవము? అందుకు తార్కాణమేమి? నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరం ప్రసాదించండి" అని వేడుకున్నాడు.
సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి యిలా చెప్పాడు "నీవు బుద్ధి మంతుడవు. మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాననేక మవాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణుని నాభినుండి ఒక కమలము. దానినుండి బ్రహ్మ పుట్టారు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞననుసరించి, ఆయననుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటినీ సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మనిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనూ, తర్వాత ప్రజాపతులైన మరీచి, అత్రి, అంగిరస, పులహ, పులస్త్య, క్రతు, వశిష్టులనూ సృష్టించాడు. తర్వాత ముల్లోకాలను, దేవతలను, నానావిధములైన జీవరాశినీ, మానవులను సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారములననుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలనేర్పరచాడు. అలాగే నాలుగు యుగాలను సృష్టించి, క్రమపద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేసాడు.
మొదటగా ఆయన, సత్యమే ఆకారముగా గలిగి, యజ్ఞోపవీతము, ఆభరణాలు ధరించియున్న కృతయుగాన్ని భూలోకంలో 17 లక్షల 28వేల సం।।లు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. జ్ఞాన వైరాగ్యాలు యీ కృతయుగ లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరంగలిగియుండి, చేతిలో యజ్ఞసామగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి, భూమిపై 12 లక్షల 96వేల సం।।లు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్ర మెరిగి, యజ్ఞ యాగాదులనుష్ఠించారు. అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచం కోడు, ధనుర్భాణాలూ ధరించిన ద్వాపరయుగాన్ని పిలిచి, భూమిపై 8 లక్షల, 64 వేల సం।।లు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో శాంతి-ఉగ్రత్వము, దయ-కాఠిన్యము మొ।।న పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలి పురుషుని పిలిచాడు.
ఈ కలి పురుషుడు మలినుడు. తగవులంటే అతడికెంతో యిష్టం. 'కలి' అంటేనే 'తగవు' అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు. పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్నీ, కుడిచేతితో నాల్కనూ పట్టుకుని ఆనందంతో గంతులువేస్తూ వచ్చాడు. పిశాచరూపం గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి, వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు. కలిపురుషుడు, 'నేను మానవులందరినీ కాముకులుగానూ, జిహ్వా చాపల్యం గలవారుగానూ చేసి, వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞపూనాను. అదే నా ఈ చేష్టకు అర్ధం' అన్నాడు. అపుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి, అక్కడ 4 లక్షల, 32వేల సం।।లు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అపుడు కలిపురుషుడు భయపడి, 'స్వామీ! నేను నిద్ర, కలహము, దుఃఖములంటే యిష్టపడేవాణ్ణి. సిగ్గులేనివాడను. ఇతరుల వస్తువులను, స్త్రీలనూ అపహరించేవారు; దంభము మాత్సర్యము గలవారు; కొంగజపంచేసే దొంగ సన్యాసులు: నమ్మినవారికి ద్రోహం చేసేవారు; ధర్మాచరణకవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు; స్త్రీ పుత్ర ధన వ్యామోహాలలో చిక్కినవారు; వేదశాస్త్రాలను నిందించే వారు: శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారూ నాకెంతో యిష్టులు. పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శతృవులు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్ళగలను? బ్రహ్మజ్ఞానులను, భక్తులను, చిత్తశుద్ధితో జపధ్యానాదులు చేసేవారినీ చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది' అన్నాడు.
అపుడు బ్రహ్మ, 'కలీ, నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి, తదితరులలోని అధర్మాన్ననుసరించి వారిని లోబరుచుకొని, నీ ధర్మాన్ని ప్రవర్తింప జేయి. శివకేశవులొక్కరేనని తెలిసి పూజించేవారిని, తల్లి-తండ్రి- గురువులను సేవించేవారిని, కాశీలో నివసించేవారిని, గోవు- తులసి మొ।।న వాటిని పూజించే వారిని, వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని, వివేకం పొంది, ధర్మమాచరించేవారినీ నీవు బాధించవద్దు. ప్రత్యేకించి గురు సేవయందు దీక్ష వహించినవారిని, గురు భక్తులనూ నీవేమీ చేయలేవు. నీవు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలినవారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించ గలరు' అని చెప్పాడు.
కలి పురుషుడు, 'స్వామీ, గురువంటే యెవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనమేమిటి?' అని అడిగాడు. బ్రహ్మయిలా చెప్పాడు: 'గురువు త్రిమూర్తుల స్వరూపము. ఆయనయే బ్రహ్మ, విష్ణువు. మహేశ్వరుడు. అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తిచెందుతారు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో యే ఒక్కరూ రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్త్వముపదేశించి, పాపము నశింపజేసి, అతనియందు బ్రహ్మజ్ఞానం. కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు. అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు గాని, త్రిమూర్తులలో యే ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు గాకపోవచ్చు. కనుక యెవడు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్ధయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సదసద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి గూడ లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం గురువు లేనిదే శాస్త్ర శ్రవణము, తత్త్వ శ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవిగావు. శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము. సద్గురుసేవ వలన సర్వమూ సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెబుతాను విను:
పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేకమంది సద్రాహ్మణులు, వ్రతదీక్ష పూనినవారు, తపస్వులూ వుండేవారు. వారిలో ఫైలుని కుమారుడు వేదధర్ముడనే ముని వుండేవారు. ఆయనకెందరో శిష్యులుండేవారు. ఒకసారి ఆయన తన శిష్యుల భక్తిశ్రద్ధలను పరీక్షించదలచి, అందరినీ పిలిచి యిలా అన్నారు: “నా పూర్వ జన్మ పాపాలలో యెక్కువభాగం యీ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను. మిగిలివున్న కొంచెము అనుభవిస్తేగాని తీరదు. ఒకవేళ దానిని నా తపఃశక్తితో పోగొట్టుకొన్నా, అది నామోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వపాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆకర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ననుసరించి గళత్కుష్టురోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయి 21 సం॥లు కర్మఫలం అనుభవిస్తాను. అంతకాలమూ అక్కడ నాకు తోడుగా వుండి సేవచేయగలవారు మీలో యెవరున్నారు?"
గురుసేవలో లోపమొస్తే యేమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి "స్వామీ, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం వుంచుకోరాదు. కాని మీరనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవచేస్తాను. అనుగ్రహించండి" అని విన్నవించుకున్నాడు. అపుడా గురువు సంతోషించి, "ఈ పాపం నేననుభవించ వలసిందే. వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగికంటే అతనికి సేవ చేసేవారి కష్టమే. యెక్కువ. అందుకు యిష్టమైతే నీవు నాతో గూడ రావచ్చు" అన్నారు. దీపకుడంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు.
అక్కడ వేదధర్మడు మణికర్ణికా ఘట్టంలో స్నానంచేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు. అటు తర్వాత కంబలాశ్వతర ప్రదేశములో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివశించసాగాడు. వెంటనే ఆయనకు గళతుష్టురోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్టురోగంతో కుళ్ళిపోయి, పురుగులుపడి దుర్వాసన కొట్టసాగింది. దానికితోడు మతిస్థిమితం గూడ తప్పింది. సహజంగా యెంతో ప్రేమమూర్తియైన ఆ ముని · యెంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తూ విశ్వనాథుడని విశ్వసించి నిత్యమూ ఆయన శరీరం శుభ్రంచేసి, సర్వోపచారాలతో పూజచేసి, అన్నం తెచ్చి పెడుతుండేవాడు. ఆ మునిమాత్రం అతనిని యెన్నో రీతుల బాధిస్తుండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినాగూడ కొంచెమే తెచ్చాడని కోపించి, ముని దానిని నేలపై విసిరి కొట్టేవారు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినపుడు, ఆయన దానిని రుచి చూచి బాగాలేదని విసిరికొట్టి, రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, "అబ్బాయి, నీవు ఉత్తమశిష్యుడివి. నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు!" అని లాలించేవారు. కాని మరుక్షణమే కోపించి, "దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు. నీవు వెళ్ళిపో! నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు. అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి. తోలకుండా చూస్తావేమి?" అని కసురుతారు. దీపకుడు ఆ పని చేయబోతే ఆయన, "దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతున్నది. ఇంకా భిక్షకుపోయి అన్నం తీసుకురాలేదేమి?" అని తిట్టేవారు, కొట్టేవారు. దీపకుడు మాత్రం కొంచెం గూడ చలించలేదు. పాపము ఎక్కువగా వున్నవారికి కష్టాలతోపాటు దుష్టత్వం గూడ కల్గుతుందని తెలుసుకుని, దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకలదేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్రయాత్ర గూడ చేయక, అచటి దేవతలను గూడ దర్శించక, గురుసేవలోనే లీనమయ్యాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడుగాదు. తన శరీరానికి కావలసిన పనులుగూడ చేసుకునేవాడు గాదు.
ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి, దర్శనమిచ్చి, వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా యెట్టి వరమూ కోరలేనన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి, వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు యిష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అపుడాయన, "ఏమిరా, నా సేవ చేయడం నీకంత కష్టంగా వుందా? నాకోసం నీవెట్టి వరమూ కోరనక్కరలేదు. వరం వలన యీ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి, నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను" అని చెప్పారు. కాశీ విశ్వనాథుడు దీపకునిద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి, దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు. విష్ణుమూర్తి ఆనందించి, ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడు. ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి, "స్వామీ, వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని వుపేక్షించి, మిమ్మల్ని యెన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చా రేమి?" అని అడిగాడు. విష్ణుమూర్తి "నాయనా, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే! అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడను. తల్లిదండ్రులను విద్వాంసులను, విప్రులను తపస్వులను, యతులను పూజించేవారు. పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు గూడ నన్ను సేవించినవారే అవుతారు" అని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి "గురువే సకలదేవతా స్వరూపమని, సకల తీర్థస్వరూపియనీ వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరం గురువు యివ్వగలడుగదా?" అన్నాడు. శ్రీమన్నారాయణుడు, "మేమిద్దరమూ ఒక్కటే, మాయిద్దరి సంతోషం కోసం వరం కోరుకో! నేను అది ప్రసాదించి యెల్లప్పుడూ నీ ఆధీనంలోనే వుంటాను" అన్నాడు. దీపకుడు, "స్వామీ, అలా అయితే, నా గురుభక్తి నిరంతరమూ వృద్ధిచెందేలా అనుగ్రహించు" అని కోరాడు. విష్ణువు సంతోషించి, "నీవు గురుసేవ వలన తరించావు. నీవీ లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు. నీ వెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి యిలానే సేవిస్తూండు. వేదము, వేదాంగాలు, వేదాంతవాక్యాల అర్థం తెలుసుకొని, గురువే పరమార్ధమని, పరబ్రహ్మమనీ తెలుసుకొని గురువును యెవరైతే సేవిస్తారో, వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరమూ సద్గురువును సేవించేవారు గూడ లోకపూజ్యులే. త్రిమూర్తులమైన మా అనుగ్రహంవల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు" అని చెప్పి విష్ణువు అంతర్థానమయ్యాడు.
తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి, దీపకుని గురుభక్తికి మెచ్చి. “చిరంజీవ! నీవు కాశీలోనే నివశించు. అష్టసిద్ధులు, నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి. నిన్ను స్మరించిన వారి కష్టాలు గూడ నశిస్తాయి" అని ఆశీర్వదించి, వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావము తెల్పడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికీ వేదధర్ముడు కుష్టురోగివలె కన్పించాడేగాని, నిజానికి ఆయనకు పాపమెక్కడిది? ఆయన తన శిష్యులనుద్ధరించడంలో' అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు. ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారబ్దాన్ని సంతోషంగా యెలా అనుభవించాలో సాధకులకు తెల్పడానికీ, శిష్యుని భక్తిని, నిష్ఠ ఓరిమిలను, విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్టురోగగ్రస్థుడయ్యాడు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలనూగూడ పోగొడతాయి. ఓ కలిపురుషా! కలియుగమారంభమవ వలసియున్నది. గనుక నీవు భూలోకానికి వెళ్ళు. కాని సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా!" అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలి పురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు.
గురువుయొక్క మహిమ యింతటిదని చెప్పడానికి వీలవుతుందా? నామధారకా! ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని, భక్తితో సద్గురునీ భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు. కాబట్టి నీవు పరమ శ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీగురుని సేవించు" అని సిద్ధుడు చెప్పారు.
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయనమః. శ్రీనృసింహ సరస్వత్యైనమః.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావనీ : సద్గురు కృప కలుగుతున్నట్టు గుర్తు నామధారకునికి వలె గురు మహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకూ అధికమవడం. ఇదే నిజమైన భక్తికి చిహ్నము. 3,4 అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి.
సృష్టి వికాసం కోసం అవతరించినవారు అత్రిమహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చ డానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. అందుకు దోహదకారియైన దూర్వాస శాపాన్ని గూడ స్వీకరించాడు. ఆయన త్రిమూర్త్యాత్మకు డైనందువలన గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధ పురుషు లందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట. అందుకే దత్తావ తారాలయిన శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట స్వామి, శిరిడీ సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణాంతర్గతమైన 'గురుగీత' లోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. అట్టి వారినే ముముక్షువులాశ్రయించాలని, తదన్యులను కాదనీ భగవద్గీత, 4:34లో శ్రీ కృష్ణుడు ఆదేశిస్తారు. ముముక్షువు యిటువంటి దత్తావతారాల చరిత్రలను, బోథలనూ శ్రద్ధగా పారాయణ, శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి. అపుడే తగు రీతిన గుర్వనుగ్రహం ప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుశాభావు చేత 'శ్రీ గురుచరిత్ర' 108 సార్లు పారాయణ చేయించారు. ఆ తరువాతనే అతడు పూర్ణదత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు.
నామధారకుడు నమస్కరించి, "ఓ సిద్ధమునీ, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువుయొక్క యదార్ధతత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకూ మీ నివాసమెక్కడ? మీకు భోజనమెలా లభిస్తున్నది?" అని అడిగాడు. సిద్ధయోగి అతనిని కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, "నేను యెప్పుడూ శ్రీగురుని చెంతనే వుంటాను. శ్రీ గురుస్మరణమే నాకు ఆహారం. వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము. ఈ 'శ్రీగురుచరిత్ర' గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి, ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి, సంతానము, ధన ధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము - ఎవరు కోరినది వారికి లభిస్తుంది. నిష్కాము లకు ముక్తినిస్తుంది" అని చెప్పి, తమ వద్దనున్న గ్రంథం చూపారు.
నామధారకుడు యెంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, "మీరీ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడచి దప్పికగొన్న వాడికి సాక్షాత్తూ అమృతమే పోసినట్లున్నది. ఇది వినడం వలన నా అజ్ఞానమింకా తొలగి పోగలదు. దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది. నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు, నన్ననుగ్రహించండి!" అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి, అతనిని చేయి పట్టుకొని వెనుక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ (రావి) వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు. నామధారకుణ్ణి దానిక్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని యిలా చెప్పారు. “నాయనా! అజ్ఞానం వలన నీకు శ్రీ గురునియందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయనను సందేహించడం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలవారికే వారి నిజతత్త్వం అర్థమవుతుంది. అట్టివారికే కష్టాలు తొలిగి అభీష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైనా అపారమైన దయ కురిపిస్తుంటాడు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిలువజాలనట్లు, దాంభికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటియైనదేదీ లేదు. కల్పవృక్షము, చింతామణీ కోరినవి మాత్రమే ప్రసాదించగలవు గాని గురువు మనం కోరనిదానినిగూడ ప్రసాదిస్తారు. ఆయన స్పర్శదీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపజేస్తారు. ఆయననే శంకించే వారికి ఆయనేమి చేయగలడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించేవారి వెంటనంటి కాపాడటమే ఆయన ధర్మం! కాని పామరులు కష్టమొచ్చినప్పుడు, యెవరో చెప్పగా ఆయనను సేవిస్తారు గాని, శ్రద్ధ, విశ్వాసాలతో సరియైన పద్ధతిలో సేవించరు. కనుకనే కొందరి అభీష్టాలు నెరవేరవు. అపుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తారు.
నామధారకుడాయనకు నమస్కరించి, "స్వామీ, నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్ధుని చేయండి. శ్రీ గురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడంటిరి గదా? ఆయన మొదట అలా యెందుకు అవతరించారో సెలవీయండి" అని వేడుకున్నాడు.
సిద్ధముని సంతోషించి, "శ్రీగురునిపట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం యెంతో శుభసూచకం. ఇంతవరకు శ్రీగురుని లీలలు గురించి యింత ప్రీతితో యెవరూ అడుగనే లేదు. ముముక్షువులకు మాత్రమే యిట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. నీవడిగినది చెబుతాను. శ్రద్ధగా విను.
జగత్తుకు మూలకారణమైన భగవంతుడు మొదట అనేకమవాలని సంకల్పించినపుడు, ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం ధరించింది. వాటిలో రజోగుణము ప్రకోపించినపుడు సృష్టికర్తయైన బ్రహ్మరూపంలో ఆ శక్తే సర్వాన్నీ సృష్టించింది. సత్వగుణము బలీయమై, విష్ణురూపంలో సర్వాన్నీ పాలిస్తుంది. తమోగుణం బలీయమైనపుడు, అదే మహేశ్వరుడై సర్వాన్నీ సంహరిస్తుంది. అంతేగాని, నిజానికి ఆ ముగ్గురికీ భేదమేలేదు.
పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరి చింతన, అతిథి సేవలతోపాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశీ వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క ఘడియ మాత్రమే వుందనగా, దూర్వాస మహర్షి, శిష్యప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి, త్వరగా అనుష్టానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్ధించాడు. అపుడా మహర్షి, స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నాగాని రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథిమించి పోతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే, అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని
ద్వాదశి నాడు సూర్యోదయమైన తర్వాత 1-30 గంటల లోపల పూజ ముగించి, ప్రసాదం భుజించాలన్నదే పారణ నియమం.
అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలచి, కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దూర్వాసుడొచ్చి, కోపించి, 'రాజా, నీవు నానాయోనులలో జన్మింతువుగాక!' అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణుపొందాడు. అపుడాయన సాక్షాత్కరించి దూర్వాసునితో, 'మహర్షీ, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక, ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి' అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దూర్వాసుడు, 'విశ్వాత్మా! మీగురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి, జంతుయోనులలో జన్మించిన పాపులనుద్ధరించడానికీ మీరు భూలోకంలో యెప్పుడూ అవతరిస్తూ వుండండి' అన్నారు. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలెత్తాడు. కాని వాటిలో కొన్ని గుప్తంగా వుండి, ఉత్తమ తపస్వులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు."
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయనమః. శ్రీనృసింహ సరస్వత్యైనమః.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః.
దూర్వాసశాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాథకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి యిలా చెప్పసాగారు :
“పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను, మరీచి మొ॥న సప్త ప్రజాపతులను తన మానస పుత్రులుగా అవతరింపజేసాడు. తర్వాత శతరూప మనువులను సృష్టించాడు. వారి కుమారై దేవహూతి కర్దముని భార్యయైంది. ఆమెకు కల్గిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయై, మహా పతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు, శిలలతో గూడి యెంతో కఠినమైన భూమి ఆమె పాదాలక్రింద మృదుత్వాన్ని వహించింది. సర్వాన్ని తపింపజేసే సూర్యుడు, అన్నింటినీ దహింపజేసే అగ్నీగూడ ఆమెకు చల్లదనం యివ్వసాగారు. వాయువు ఆమెచెంత తన ప్రచండ వేగం మాని మందంగా, మలయ మారుతంగా వీచేవాడు. దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం. కలిగినా, లేక యే అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను గూడ జయింపగలడని భయపడుతుండేవారు.
ఒకసారి త్రిలోక సంచారియైన నారద మహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి, అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని యెంతగానో ప్రశంసించాడు. అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమెవలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు గూడ దేవతలం వలెనే భయపడి, అసూయచెంది, ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయాదేవి వారికి యెదురేగి స్వాగతం చెప్పి, అర్ఘ్య - పాద్యాదులు సమర్పించి, అయ్యలారా, మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది. మీకు నేనేమి చేయాలో సెలవీయండి. అత్రి మహర్షి తపస్సుకోసం అరణ్యంలోకి వెళ్ళారు' అని చెప్పింది. అపుడా అతిథులు, 'అమ్మా! మాకెంతో ఆకలిగా వున్నది. నీ భర్త యెప్పుడు వస్తారో చెప్పలేము గదా? మాకు వెంటనే భోజనం పెట్టు' అన్నారు. ఆమె లోపలకు వెళ్ళి విస్తళ్ళు వేసి, అయ్యలారా! భోజనానికి దయచేయండి' అని ప్రార్థించింది. అపుడు వారు, 'సాధ్వీ, నీవు మాకు ఆతిధ్యమిస్తానని మాట యిచ్చావు. కాని మాదొక షరతు వున్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము. లేకుంటే యిలా ఆకలితోనే వెళ్ళిపోతాము' అన్నారు.
వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక, ఆకలితో తిరిగిపోయిన అతిథి, గృహస్థుల పుణ్యాన్నీ, తపస్సునూ తీసుకుపోతాడని శాస్త్రం. కాని పరపురుషుల యెదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది! పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులుగారని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది. 'తపోమూర్తియైన అత్రిమహర్షి సంసర్గంవలన పవిత్రురాలనైన నాకు కామ భయంలేదు. ఆకలిగొని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం “నా బిడ్డలేగాని పరపురుషులుగారు' అనుకొని ఆ సాధ్వి,.. 'అయ్యలారా! అలానే చేస్తాను, భోజనానికి లేవండి!' అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్ళి, అత్రిమహర్షి పాదుకలతో, 'స్వామీ! నేను మీ ఆజ్ఞమేరకు వారు నాబిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను" అని చెప్పుకొన్నది. ఆమెయొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పంవలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురూ పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ననుసరించి ఆమెకు బాలింతరాలికివలె స్తన్యమొచ్చింది. ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది. నిరంతరం సృష్టిచేసి అలసినవాడిలా బ్రహ్మ దేవుడూ, ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిలా శ్రీ మహావిష్ణువు, జగత్సంహార కార్యం వలన సోలిపోయిన వానిలాగా శంకరుడూ అనసూయాదేవి యొక్క పాతివ్రత్య 1 మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు. ఆ మహా పతివ్రత తన దివ్యదృష్టి వలన ఆ ముగ్గురూ త్రిమూర్తులని తెలుసుకొని ఊయలలో పెట్టి, ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది.
ఇంతలో అత్రి మహర్షి వచ్చి, ఆమె నుండి సర్వమూ తెలుసుకుని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి, ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను యిలా స్తుతించాడు: 'ఓ మహావిష్ణూ! నీవు సృష్టి-స్థితి లయకారణుడవు. జగత్సాక్షివి, విశ్వమయుడవు. విశ్వాధారుడవు. ఓ పరమేశ్వరా! నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీ కంటె వేరుగాకపోయినా, మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు, "నేను-నాది' అనే మాయతో గూడిన భావన వలన నీకంటే వేరయినట్లు జీవులకు గోచరిస్తున్నది.
ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తిచెంది, తమ నిజరూపాలతో గూడ ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నారు. అప్పుడాయన సాభిప్రాయంగా భార్యవైపు చూస్తూ, 'సాధ్వీ, వీరు మనస్సు చేతగూడ పొందడానికి వీలుగానివారు. అయినా నీ భక్తి వలన యిలా వచ్చారు. నీ అభీష్టమేమిటో నివేదించుకో! అన్నాడు. అనసూయాదేవి, 'స్వామీ! ఈ సృష్టియొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారుగదా! కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది, మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టము' అన్నది. అత్రిమహర్షి సంతోషించి, 'మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్ధరించండి' అని కోరాడు. అపుడు వారు, 'మహర్షీ! మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము' అన్నారు. ఆ పతివ్రతా ప్రభావం చేత త్రిమూర్తులు అత్రికోరిన వరముననుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు. తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు. సద్గురువైన అత్రిమహర్షికి ఆత్మ సమర్పణ చేసుకొని సేవించిన ఫలితంగా, తనకు వ్రతభంగంచేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి!
తర్వాత అత్రిమహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడనీ, దర్శన మాత్రం చేత అందరి హృదయాలకూ ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడనీ, ప్రళయకర్త అయిన రుద్రుడికి దూర్వాసుడనీ నామకరణం చేసాడు. ఈ ముగ్గురూ అత్రియొక్క సంతానం గనుక వీరిని ఆత్రేయులని, దత్తుణ్ణి 'దత్తాత్రేయు' డనీ వ్యవహరిస్తారు. ఈయనే సాక్షాత్తూ పరమేశ్వరుడు; శృతులకు గూడ అందని సచ్చిదానంద స్వరూపుడు; మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు; స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూంటాడు. దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైనా, ఆయన కోపం గూడ లోకానికి కళ్యాణమే చేకూర్చింది. చంద్రుడు సర్వజీవులనూ పోషిస్తుంటాడు. తర్వాత బ్రహ్మ (చంద్రుడు), శివుడు (దుర్వాసుడు) తమ దివ్యాంశలను దత్తాత్రేయుని యందుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు.
నామధారకా! అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మయైన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులనను గ్రహిస్తుంటాడు. అసలు ఆయన అవతరించినదే అందుకు! స్థూలదృష్టికి అలా కన్పించినా, నిజానికి యితర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు, భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు. శ్రీ రాముడు రావణాది రాక్షస సంహారం కోసము, శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు. ఆ కార్యాలు తీరగానే ఆ యిద్దరూ తమ శరీరాలు వదలివేశారు. కాని సర్వజనోద్ధరణమనే దత్తావతారకార్యం సృష్టివున్నంత వరకూ కొనసాగవలసిందే. కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యమూ భూమిపై సంచరిస్తుంటాడు. శ్రీదత్తాత్రేయుడే ఆది గురువు. పూర్వం భగవంతుడు మత్స్య, కూర్మ రూపాలలో అవతరించాడు. అలాగే ఈ కలియుగంలో గూడ యిప్పటికి రెండుసార్లు అవతరించాడు. కలియుగంలో అజ్ఞానులకు గోచరం గాకపోయినా, ఆ రెండవతారాలూ యిప్పటికి గూడ భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నారు. ఇతర యుగాలలో కర్మచేత దప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమితకాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది. కనుక యిట్టి కలియుగంలో జన్మించి, బుద్ధి పూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి తరించడమెంతో సులభం. అట్టి అవకాశం పూర్వ పుణ్యం చేత నీకు లభించింది. కనుక నేను చెప్పే గురు కధలు శ్రద్ధతో విను" అన్నారు సిద్దయోగి. నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి, "ఆహా! అలనాటి అనసూయాదేవి. పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర, అందువలన మా వంటి అజ్ఞులకు మీ వంటి గురువు యొక్క కృపా లభించాయి" అన్నాడు.
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన: శ్రీ గురుని మహిమ విని, భక్తి కల్గి, ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తపిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము, తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనమూ కల్గుతాయి. ఇది నిర్దుష్టమైన పద్ధతి. రాజు, సుమతి కూడా దత్తమహిమ తెలిసి, ఆయన భక్తులై, అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్షురూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. తపస్వియైన అత్రిమహర్షికి గూడ దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి, అటు తర్వాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు 16 దత్తావతారాల వృత్తాంతంలో “దత్త భాగవతము" లో వున్నది. ఆధునిక యుగంలో గూడ శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి అనుభవమూ అలానే వున్నది. శ్రీ సాయిబాబా, అక్కల్కోట స్వామి చరిత్రలలో కూడ "శ్రీ గురుచరిత్ర", "శ్రీ గురుగీత", పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహ నీయులు స్వప్న దర్శనమిచ్చి, అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడవచ్చు. పారాయణ వలన ముముక్షుత్వము, దైవీ సంపద, సద్గురు దర్శనాభిలాష మొదట తీవ్రతరమై, సేవించుకోగల సంస్కారం గూడ హృదయానికి కల్గుతుంది. ఈ నిర్దుష్టమైన పద్ధతి విడచి, మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే, కలి వైపరిత్యం వలన కపట సద్గురువుల బారినపడడం తధ్యం. ఒక మహనీయుడు చెప్పినట్లు, మనం అజ్ఞులం కనుక మన నిర్ణయం ఆ విషయంలో గూడ లోపభూయిష్టంగా వుండి తీరుతుంది.
దత్తానుగ్రహం నామధారకశర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే గాక, ఆయన నిత్యమూ చదువుకునే "శ్రీ గురుచరిత్ర" గ్రంథం రూపంలోనూ, అందుండి గురు లీలలు శ్రవణం చేసే భాగ్యంగానూ లభించింది. ప్రత్యక్షంగా శ్రీ గురుని సేవించిన సిద్ధుడు వ్రాసినది గనుక ఆ గ్రంథం యదార్ధంగా, దాని రూపంలో, పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లవుతుంది. కనుక తగిన శ్రద్ధతో పారాయణ చేయాలి.)
నామధారకుడు, "మహానుభావా! భగవంతుడు కలియుగంలో గూడ రెండుసార్లు అవతరించారంటిరిగదా, వాటిని వివరించండి" అన్నాడు. అతని శ్రద్ధా భక్తులకు సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు: "మంచిది. ఆ కధలు వినడం వలన నీకెంత ప్రయోజనమో, అవి చెప్పడం వలన నాకూ అలాంటి ప్రయోజనమే కలుగు తుంది. గనుక చెబుతాను. శ్రద్ధగా విను".
ధర్మాన్ని, ధర్మాత్ములనూ రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగ వంతుడు తన లీలచేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు. ఈ కలియుగంలో గూడ అలానే, ఇపుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా, పవిత్ర గోదావరీ సమీపంలో వున్న పిఠాపురమనే అగ్రహారంలో ఆయన అవత రించారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులుండే వారు. వారు బ్రాహ్మణులు, ఆపస్తంభశాఖకు చెందినవారు. దత్తభక్తులు. వారికి యెందరో పిల్లలు పుట్టారుగాని అందరూ చనిపోగా, యిద్దరు మాత్రమే బ్రతికారు. వారిలో ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. తర్వాత గూడ యిద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు.
నిత్యమూ భిక్షకై వచ్చేవారిని శ్రీ దత్తరూపాలుగా భావించి, వారు భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్యనాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ ప్రారంభించారు. అలాటి రోజున బ్రాహ్మణభోక్తలు భోజనం చేయకముందు మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రం. కాని ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండకమండలు ధారియైన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడైవున్న యింటి యజమానికీ సంగతి తెలియదు. ఇల్లాలైన సుమతి, ఆ వచ్చిన సంయమీంద్రుడు శ్రాద్ధ భోక్తయైన పరమేశ్వరుడేననీ, తమ కులదైవమైన శ్రీదత్తాత్రేయుడేననీ విశ్వసించి ఆయనకు భిక్షయిచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యదార్ధమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు.
నామధారకా! అప్పటి ఆ స్వామిని చూడడానికి వేయికనులు చాలవు. వర్ణించడానికి యెన్నివేల నాలుకలైనా సరిపోవు. రెండు చేతులలో శంఖచక్రాలు, రెండు చేతులలో ఢమరు త్రిశూలాలు, మిగిలిన రెండు చేతులలోనూ జపమాల కమండలాలూ ధరించి, ఆరు బాహువులతో, మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు. వెండికొండవలె తెల్లని కాంతితో ఆయన, మూర్తీభవించిన శుద్ధసత్త్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు. ప్రపంచంలోని దీనులనుద్దరించడానికి ఆరుచేతులు చాలక, అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటంనుండి జుట్టు పాయలుగా వ్రేలాడుతున్నది. ఆ తల్లి సుమతీదేవి, తన జన్మ సార్ధకమయ్యేలా ఆ అమృతమూర్తిని ఒడలెల్లా కళ్ళు చేసుకొని, ఆ కన్నులతోనే పానం చేయసాగింది.
అపుడా కరుణాకరుడు, 'తల్లీ, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడ నయ్యాను. శ్రాద్ధబ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడనన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభీష్టమేమిటో చెప్పు. నేను తప్పక నెరవేర్చ గలను' అన్నాడు. స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవులద్వారా శరీరంలోని సర్వధాతువులలోకీ ప్రవహించాయి. జగన్మోహనమైన శ్రీదత్తాత్రేయస్వామి దర్శనంతోఆమె కన్నులు, ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు - బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషిసత్తముల చెవులవలె పరమ పావనమయ్యాయి. ఆమె కృతజ్ఞతతో, 'పరమాత్మా! యోగులను గూడ ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు. అంతేగాక, నా చేతి అన్నం స్వీకరించావు. ఇంతకంటే నాకేమి కావాలి? నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధదేవతలైన మా పితృదేవతలు గూడ ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరికలీడేర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లీ' అని సంబోధించావు. కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరమడుగవలసిన పనిలేదు. నీవిచ్చిన మాటను నిలుపుకోచాలు' అన్నది.
భక్తిశ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయస్వామి 'ఇదివరకు అత్రిమహర్షి అడిగినట్లే. ఈమెగూడ లోకానుగ్రహార్ధ మైన కోరిక కోరుతున్నది' అనుకున్నాడు. ఆయన, 'అమ్మా! నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కాని నీవు పుత్రవ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాలా అమలు జరపాలి' అన్నారు. ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధిశక్తిగలిగిన ఆమె, 'స్వామీ! నేను మానవమాతృరాలిని. నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం. అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా? కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి!' అని ప్రార్ధించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి, ఆశీర్వదించి అంతర్హితులయ్యారు.
సుమతీదేవి ఆనంద పారవశ్యంతో యింటిలోనికి వెళ్ళి, పితృశ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచి, 'స్వామీ! నేనీనాడు ఒక అపరాధం చేసాను. చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది. శ్రాద్ధ బ్రాహ్మణులింత వరకూ భోజనం చేయలేదుగదా? కాని యిపుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగాడు. ఆయనే యజ్ఞపతి, శ్రద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామియని భావించి భిక్ష యిచ్చాను. ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు!" అని చెబుతూంటే ఆమె శరీరం రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనందభాష్పాలతో నిండాయి. ఆ మాటలు విన్న రాజుశర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యానికి ఆశ్చర్యచకితుడై, సంతోషంతో, 'సాధ్వీ, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి, ఆ శ్రాద్ధకర్మను యజ్ఞభోక్తయైన విష్ణువుకే గదా అర్పిస్తాము? అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యం. అది కేవలం నీ విశ్వాసఫలమే! నీవు చేసిన ఈ మంచికార్యం వలన నీవేగాక, అందరమూ కృతార్ధులమయ్యాము. శ్రీ దత్తాత్రేయస్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులనుద్ధరించ దానికై అతిధివలె సంచరిస్తుంటాడని విన్నాము. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తూ ఆ శ్రీ హరే తిరిగిపోయినట్లు, నీవు చేసినపని యెంతో కళ్యాణకరమైనది' అని ప్రశంసించాడు.
అపుడా పరమ సాధ్వి, తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది. రాజుశర్మ ఆనందభరితుడై, 'కళ్యాణీ! నీవు మన వంశానికి, ప్రపంచానికి గూడ మంగళకరమైనదే కోరావు. నేను ధన్యుణ్ణి' అని ఆమెను మనసారా అభినందించి, మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యధావిధిగా పూర్తిచేసాడు.
త్వరలో ఆ సతీమతల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థినాడు ఉదయం శుభ ముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుక లేనివాడూ అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువుయొక్క జన్మలగ్నము, గ్రహస్థితీ గణించి, సాక్షాత్తూ కల్పవృక్షమే వారింట వెలసిందని, సాక్షాత్తూ దత్తాత్రేయుడే అవతరించాడనీ అన్నారు. రాజు శర్మకు కల్గిన అదృష్టాన్ని పూర్వం అత్రిమహర్షికి ప్రాప్తించిన మహాద్భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాలలో దివ్యచిహ్నాలు మొ॥న శుభలక్షణాలతోనూ, అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తూండడం వలన అతనికి 'శ్రీపాదుడు' అని నామకరణం చేసారు. నామధారకా! అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయస్వామి యొక్క మొదటి అవతారం.
పుట్టినది మొదలు శ్రీ పాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ, ఆనందం చిందిస్తూ, ముద్దులు మూటగడుతూ పెరిగి ఎనిమిదేండ్ల వాడయ్యాడు. అతని ముద్దుముచ్చటలు తల్లిదండ్రులే గాక, ఆ ఊరివారందరూ తనివితీరా అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు అతని జననము, బాల్యజీవితాల వలన ఆ పవిత్ర గోదావరీ ప్రాంతమూ యెంత ధన్యత పొందాయో చెప్పతరమా? ఎనిమిదవ యేట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేసారు. సామాన్యంగా అటు తర్వాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు. కాని యీ శ్రీ పాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేదపాఠాలు చెప్పి, వెనుక శ్రీ దత్తాత్రేయస్వామి సుమతీదేవికి యిచ్చిన మాట యదార్థమని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీ పాదుడు పదహారేండ్ల ప్రాయము గలవాడయ్యాడు.
ఇంతలో రాజశర్మ తన కుమారునికి వివాహం చేయాలని న్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసి ఒకనాడు శ్రీ పాదస్వామి తండితో, 'నాయనా! నీవు బి. నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించనవసరం లేదు. సర్వ శుభ లక్షణాలూ కల్గి, నాకు తగిన కన్య సిద్ధంగా వున్నది. ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసినౌతాను. నేను శ్రీవల్లభుడను గనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే' అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కల్గించాయి. కన్నుల నీరు కారుతుంటే రాజు శర్మ గద్గదస్వరంతో, పెల్లుబుకుతున్న పుత్ర వ్యామోహంతో, స్వామితో యిలా వాపోయాడు : ‘అబ్బాయీ! నీవు గనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే, మేము నీటినుండి బయటపడిన చేపపిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తూ పరమేశ్వరుడవే అయినా, మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరంలో ముంచి వెడలిపోవడం ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగోప్తవూ,ధర్మరక్షకుడవూ అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా?'
‘నామధారకా! ఈ దంపతులకు శ్రీ పాదస్వామియే గాక, కుంటివాడు, గ్రుడ్డివాడు అయిన మరి యిద్దరు కొడుకులున్నారు గదా! రాజు శర్మ ఆ యిద్దరినీ శ్రీ పాదస్వామి వద్దకు తెచ్చి, 'నాయనా! నిన్ను స్మరించడం చేతనే సంసారబంధం తొలగిపోతుంది. కాని అవిటివారైన నీ సోదరులిద్దరినీ చూచినపుడు మాత్రం మాకు మరలా ఈ సంసారబంధాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతియేమి?' అని దుఃఖించాడు. సుమతీదేవి గూడ పొరలుకొస్తున్న దుఃఖం అణచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూచింది. వారి బాధను గుర్తించిన శ్రీ పాదస్వామి అన్నలిద్దరినీ తన అమృతహస్తంతో స్పృశించాడు. సంజీవినీ స్పర్శచేత చనిపోయిన వారికి ప్రాణమొచ్చినట్లు, స్వామి స్పర్శచేత తక్షణమే వారిద్దరూ పాద, నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు, సకల జగన్నియామకుడూ అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు.
ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూచిన ఆ తల్లితండ్రులకు శ్రీ పాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది. అతడు లేనిచోటే లేదు గనుక, అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది. ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టిపెట్టుకొనడం అపరాధమని తోచి, సుమతీదేవి స్వామినిలా ప్రార్ధించింది.
‘ప్రభూ! నీ మాయ చేత నీవు నా పుత్రుడవని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువువన్న సంగతి మరచాను. అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే యిమిడియున్నాయి. నా భ్రాంతి తొలగించు!' అపుడు ఆయన తన యదార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేసాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో, చూచేవారి దేహాలలోని ప్రతి అణువునూ అమృతంతో ముంచివేసేలా దర్శనమైంది. అపుడు స్వామి అన్నాడు: 'అమ్మా! నీవిపుడు దర్శించిన రూపాన్ని నిరంతరమూ ధ్యానిస్తూండు. త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి, నా సాయుజ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి, మిమ్ములను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమలు - అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు గూడ లోకవంద్యులవుతారు."
ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తూంటే వారితో ఆయన, 'మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి, సేవించి తరించండి. నేను సన్యసించాలి' అని చెప్పి, తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి, వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి, పాదచారియై ద్వారక, కాశీ, బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్ళి, అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు. అక్కడ మహాబలేశ్వరలింగ రూపంలో సాక్షాత్తూ శంకరుడే నివసిస్తుంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు. అందువలననే ఆ క్షేత్రాన్ని, సజ్జనులనూ ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు' అని సిద్ధుడు చెప్పారు.
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావనీ : సూక్ష్మరూపియైన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు. తర్వాత దానిని కేంద్రంగా తీసుకొని తన జీవనాన్ని సాగిస్తాడు. అలానే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు - ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు. అలా ఏర్పడిన మానవదేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై యున్నట్లే, ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మికశక్తి కేంద్రాలుగా ఏర్పడుతాయి. వాటినే పుణ్యక్షేత్రాలంటాము. ఆయా శరీర కేంద్రా లలో రక్తకణాల ద్వారా శరీర గత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లు, భూమి మీద మానవాళి గూడ ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రు లౌతారు. నిరంతరం ఇట్టి క్రియ జరగడం వలన శరీరగత కేంద్రాలు కాలగతినను సరించి, మిగిలిన శరీరమంతటిలాగే శిథిలమవుతూ, ప్రాణశక్తి చేత మరల మరల పునరుజ్జీవనం చేయబడుతుంటాయి. అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు గూడ కాలగతిలో మలినమవుతాయి. అపుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి, పునరుజ్జీవనం చేస్తారు. "తీర్ధకుర్వంతి తీర్థాని - తీర్ధత్వాన్నిపునః ప్రతిష్ఠిస్తారు", అని శాస్త్రాలు చెబుతాయి. అలానే శ్రీ పాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెబుతుంది. అటువంటి క్షేత్రం దర్శించినపుడు దానిని పునరుద్ధరించిన శ్రీ పాదస్వామి యొక్క లీలను, ఆ క్షేత్రవాసాన్ని స్మరించాలి. అటువంటి అవతార పురుషులీ క్షేత్రంలో కొద్దికాలమున్నా అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారెల్లప్పుడూ అక్కడ వుంటారని గుర్తించుకోవాలి. 6, 7 అధ్యాయాలు ఈ విషయాన్నే వివరించాయి.
నామధారకుడు యిలా అన్నాడు. "కాశీ, బదరీ, కేదారంవంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు. కాని వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను"
దానికి సిద్ధుడిలా చెప్పారు. "పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి, నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది. బలగర్వితుడైన రావణుడు అది చూచి శంకరునితో గూడ కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు. అతడు అక్కడకు వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు. అపుడు, భూమి కంపించిపోయింది. లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి, అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్ధించింది. శివుడు, రావణున్ని కైలాస పర్వతం క్రింద అణగిపోయేట్లు త్రొక్కాడు. అపుడు రావణుడు ప్రాణాపాయంలోబడి, దీనాతిదీనంగా శంకరుని ధ్యానించాడు. కరుణాసముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై, రావణుని లేవనెత్తాడు. అపుడు రావణుడు రాగయుక్తంగా, సుస్వరంగా మధురగానం చేసాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతిచెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు. అపుడా రాక్షసరాజు, 'దేవా! బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది యింకెవరికీ లభించేదిగాదు. సాక్షాత్తూ లక్ష్మీదేవియే నాకు దాసి; చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు. యమధర్మరాజు నా సేవకుడు; సర్వదేవతలూ నా పరిచారకులు. అటువంటి నాకు యెక్కడా యేదీ దుర్లభంగాదు. ఇపుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాసపర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను. శంకరా! నీవు వరమీయదలచుకుంటే నేనీకైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు' అని కోరాడు. అపుడు కైలాసపతి, 'రావణా! ఈ కైలాసపర్వతంతో యేమి సాధిస్తావు? దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను. దీని వలన నీవు నా అంతటివాడవవుతావు. నీ లంకానగరమే కైలాసమంతటి శ్రేష్ఠమవుతుంది' అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు. దానిని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు బయల్దేరాడు.
ఇదంతా చూచిన నారదుడు యీ వృత్తాంతం బ్రహ్మకు, విష్ణువుకూ విన్నవించాడు. ఆ ముగ్గురూ శివుని దగ్గరకు వెళ్ళి, 'ఎంతపని చేసావు! రావణుడికి ఆత్మలింగమెందుకిచ్చావు? సర్వప్రాణికోటికీ కంటక ప్రాయుడు, లోకభయంకరుడూ అయిన రావణుడు నీ అంతటివాడు కావడం తగునా?' అని వాపోయారు. అపుడు శంకరుడు, 'అతని గానానికి పరవశించి ఆత్మలింగమిచ్చాను. వాడిప్పటికింకా లంకకు చేరివుండడు. ఉపాయమాలోచించు' అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి, దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి యెలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి, గణపతిని ప్రేరేపించాడు. అపుడు దేవర్షియైన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, 'రావణా! ఎక్కడనుండి వస్తున్నావు? ఎక్కడకు పోతున్నావు?' అన్నాడు. రావణుడు, 'శివుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను' అని దానిని చూపాడు.
రావణున్ని మాటలతో యేమార్చాలని నారదుడు, "రావణా! పూర్వమొక భయంకరమైన జంతువు అడవిదున్నలనన్నింటినీ చంపుతుండేది. త్రిమూర్తులు దానిని వేటాడి, సంహరించి, దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగము తీసుకొన్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మ లింగాలుగా భావించారు. ఈ లింగం తత్సంబంధమైనదే గాబోలు. ఈ శివలింగం యెంతో పవిత్రమైనది. సాక్షాత్తూ శివ సాయుజ్యం ప్రసాదింపగలదు' అని దాని ప్రభావం వివరించబోయాడు. రావణుడు, 'మహర్షీ, దీని ప్రభావం వినడానికి నాకిపుడు తీరికలేదు. తొందరగా వెళ్ళాలి' అన్నాడు. ఆ దేవర్షి, 'రావణా, సంధ్యా సమయం దాటిపోతున్నదే! నీవెలా వెడతావు?' అని అక్కడే కూర్చున్నాడు.
ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతనిని చూచి రావణుడు, 'నీవెవరు? ఎవరి పిల్లవాడవు? ఎక్కడకు పోతున్నావు?' అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, 'నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయమేస్తోంది' అన్నాడు. అపుడు రావణుడు, 'ఓ బ్రహ్మచారీ! నేను సంధ్యవార్చుకొని వచ్చేవరకూ యీ శివలింగాన్ని పట్టుకో, నాకీ సహాయం చేస్తే నీకు సువర్ణమయమయిన నా లంకా పట్టణం చూపిస్తాను, నీకిష్టమైతే అక్కడే హాయిగా వుండవచ్చు' అన్నాడు. ఆ వటువు, 'అమ్మో, ఇంత బరువైన శివలింగాన్ని నేనంతసేపు మోయగలనా? అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రాను బాబూ!' అన్నాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి, సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయల్దేరాడు. ఆ బ్రహ్మచారి, 'రావణా! దీనినిక మోయలేనపుడు ఎలుగెత్తి మూడుసార్లు పిలుస్తాను. అపుడు నీవు రాకపోతే దీనినిక్కడే స్థాపిస్తాను' అన్నాడు.
రావణుడు ప్రక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతనిని మూడుసార్లు పిలిచి, అతడు రాని కారణంగా, స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి, ఆ లింగాన్ని భూస్థాపితం చేసాడు. తరువాత రావణుడు తిరిగివచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకలింప చూచాడు. భూమి కంపించిందే గాని, ఆ లింగం కొంచెమైనా కదల్లేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగమని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలియుండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణమని పేరు వచ్చింది. నామధారకా! దానిని భూకైలాసమనవచ్చు. అక్కడ శివుడు సపరివారంగా నివశిస్తాడు. అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది. అక్కడ దేవర్షులు గూడ నివశిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్ష్యాదులు గూడ శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు. అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు.”
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, "స్వామీ, ఈ గోకర్ణక్షేత్ర మహిమ యింకొంచెం విపులంగా వివరించండి. మనదేశంలో యెన్నో పుణ్య తీర్థాలు వుండగా శ్రీ పాదస్వామి యీ క్షేత్రాన్నే యెందుకు ఆశ్రయించారో చెప్పండి" అని వేడుకున్నాడు.
అప్పుడు సిద్ధయోగి యిలా చెప్పారు: “పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడను పేరు గల రాజు వేదమార్గతత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవారు. ఒకనాడతడు అడవికి పోయి క్రూరజంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి చూచాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి, రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షసమాయ చేత ఒక సామాన్య మానవరూపంలో రాజువద్దకొచ్చి, ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన యింట పితృశ్రాద్ధానికి వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి, 'రాజా! నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు గనుక నీవు బ్రహ్మరాక్షసుడవవుతావు!' అని శపించాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపమివ్వ బోతుంటే పతివ్రతయైన అతని భార్య దమయంతి అడ్డుపడి, గురువును శపించబూనడం మహాపాపమని హెచ్చరించి, ఆ శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని, శాపకల్మషమైన (అపవిత్రమైన) తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని, వశిష్ట శాపం వలన బ్రహ్మరాక్షసుడై, పై కారణంగా కల్మషపాదుడనే పేరు గ్రహించాడు. అపుడు శాపవిముక్తికై మహారాణి ప్రార్ధించగా, వశిష్ఠ మహర్షి జాలిచెంది 'అమ్మా, నీ భర్తకు 12 సం॥ల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది' అని ఆశీర్వదించి, తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు.
అప్పటినుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అచ్చటి క్రూరజంతువులను, మనుషులను పట్టుకొని తింటుండేవాడు. అతని బ్రహ్మరాక్షసరూపం ఛాయలా అతనినెప్పుడూ వెంటాడుతుండేది. ఒకసారి అతడొక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపితిన్నాడు. అందుకా బ్రాహ్మణుని భార్య శోకంతో, 'నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక, నన్నూ, నా భర్తను యెడబాటు చేసిన పాపానికి భార్యా సంగమం చేస్తే నశిస్తావు' అని శపించింది. కొంతకాలానికి వశిష్ట శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు. అతని రాకకై భార్య యెంతో ఆతృతతో ఎదురుచూస్తున్నది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు క్రొత్తగా సంక్రమించిన బ్రాహ్మణపత్నీ శాపం గురించి చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ ఖిన్నులై, ఆ శాపవిముక్తికై తీర్థయాత్రలు చేసారు. మార్గమధ్యంలో వారు గౌతమమహర్షిని దర్శించి తమ విషాదగాధ విన్నవించుకున్నారు. అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, 'రాజా, భయపడవద్దు, పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణక్షేత్రముండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేమి చేయగలదు: ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్ధమే. అక్కడ శిలలన్నీ శివలింగాలే! ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేమున్నది? ఆ క్షేత్రమహత్మ్యాన్ని తెల్పే విషయమొకటి నేనక్కడ చూచినది చెబుతాను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక ఛండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకరులు వచ్చారు. వారిని అడగ్గా వారిలా చెప్పారు :
"పూర్వము ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణకన్య. ఆమెకు యుక్తవయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో యిష్టంలేని వివాహం బలవంతంగా చేసారు. కొద్దికాలానికే, ఆమెకు పిల్లలు కలుగక ముందే, ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవశం చేత ఒక కోమటివాని నుంచు కున్నది. జారత్వమెన్నటికీ దాగదు గదా! త్వరలో ఆ రహస్యం బంధువులందరకూ తెలిసి, వారామెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటినుండి ఆమె నిర్భ యంగా ఆ వైశ్యునితో జీవించనారంభించింది. అతని దుస్సాంగత్యంతో మద్య పానానికి గూడా అలవాటు పడింది. ఒకనాడామె కల్లు త్రాగిన మైకంలో ఆవుదూడనొకదానిని మేక అనుకొని చంపి, దాని తలను మరునాటికని దాచి, మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి, ఆవుదూడ శిరస్సును చూచి నిజాన్ని కప్పిపుచ్చుతూ, 'అయ్యయ్యో! ఆవుదూడను పులి తినిపోయింది' అని వలవల ఏడ్చింది. ఆమె యిటువంటి పాపాలనేకం చేసి, నరకంలో శిక్షలనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె పుట్టుగ్రుడ్డి, కుష్టురోగియై కొంతకాలం పాటు తన తల్లిదండ్రులచేత పోషించబడింది. వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ, ఒక శివరాత్రినాడు అందరినీ భిక్షకోసం యాచించింది. ఆనాడు అన్నమెవరూ వండరు గనుక, ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రముంచారు. అవి తినడానికి పనికిరావని తలచి, ఆమె వాటినన్నింటినీ జారవిడిచింది. ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివపూజ. ఆ రోజంతా తిండి లభించనందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె ఉపవాసము, జాగరణ గూడ చేసినట్లైంది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్ము రాలైంది. ఇప్పుడీమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్ములను శంకరుడు పంపాడు" అని చెప్పారు. అపుడా శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి, దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళారు. అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే యింతటి ఫలితముంటే, యిక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా? కనుక ఓ రాజా! నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు. బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడవవు తావు' అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని యింకా యిలా వివరించారు:
'గోకర్ణమంతటి పవిత్రక్షేత్రం యింకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు, నక్షత్రాల వంటివనుకుంటే, గోకర్ణం పాపమనే కారుచీకట్లను నశింపజేసే సూర్యునివంటిది. ఆ క్షేత్ర దర్శనము, స్మరణముల వలన గూడ సర్వ పాపాలూ నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహము వలన తమ అభీష్టాలు పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్య చంద్రులు, అష్ట వసువులు తూర్పు ద్వారంలోనూ, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు, పితృ దేవతలు దక్షిణ ద్వారంలోనూ, వరుణుడు మొ॥న దేవతలు పడమటి ద్వారంలోనూ, కుబేరుడు భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోనూ; విశ్వావసువు, చిత్రరధుడు మొ॥న గంధర్వులు నిత్యము నిలిచి ఆయనను ఉపాసిస్తుంటారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కణ్వుడు మొ॥న మునీశ్వరులు; కృతయుగంలో విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొ॥న మహర్షులు, సనకసనందనాది బ్రహ్మ మానసపుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు, నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తు న్నారు. రావణుడు మొ॥గు రాక్షసులు గూడ ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు, లక్షరెట్లు మంచి ఫలితమిస్తాయి." అపుడా రాజు, భార్యా సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాపవిముక్తుడయ్యాడు.
కనుక ఓ నామధారకా! ఎందరో సజ్జనులకాశ్రయమైన *గోకర్ణక్షేత్రం, వారి తపస్సు చేత యిదివరకే పరమపవిత్రమయింది. అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం గూడా జరిగింది. అందుకే సాధుజీవనుడైన శ్రీపాదస్వామి గూడ ఆ క్షేత్రాన్ని దర్శించి, అక్కడ మూడు సంవత్సరాలుండి, ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని పునరుద్ధరించారు. తరువాత ఆయన కృష్ణా తీరంలోని కురుపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూలరూపాన్ని మరుగుపరచారు".
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
గోకర్ణం దర్శించినపుడు భక్తులు ఈ అధ్యాయం చదువుకుని దత్తస్వామిని పూజించుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుంది.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన : శ్రీ పాదస్వామి ఒక కుపుత్రవతియైన బ్రాహ్మణ స్త్రీ చేత శివపూజ యావజ్జీవితమూ చేయించి, మరుజన్మలో ఆమె గర్భాన తామే అవతరించ సంకల్పించాడు. సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితముంటుందని అర్థం. అలాగాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే వుంటుంది. కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది. సత్త్వాదిగుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞదానతపః కర్మల ఫలితముంటుందని "భగవద్గీత" చెబుతుంది. అందుకే తత్త్వదర్శియైన సద్గురువును ముముక్షువులాశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పదగిన "తద్విద్ధి ప్రణిపాతేన....." అన్న శ్లోకం (4:34) చెబుతుంది.
మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీ పాదస్వామి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కల్కోట స్వామి, సాయిబాబా తమ భక్తులను ఆదరించారు. తర్వాత శ్రీ పాదస్వామి హస్తమస్తక సంయోగం చేత తృటిలో ఆ మూఢ బాలుణ్ణి వేద వేదాంగ పారంగతుణ్ణి చేసిన లీల గూడ అతిశయోక్తి గాదు. దత్తాత్రేయ స్వరూపులయిన "శ్రీ స్వామి సమర్ధుల జీవిత చరిత్ర" (1856-1876) లో అట్టి లీల వుండడం గమనార్హం.
శ్రీపాదస్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను 8,9,10 అధ్యాయాలలో చూడవచ్చు.
నామధారకుడు, "స్వామీ! శ్రీపాద శ్రీ వల్లభులు గోకర్ణ క్షేత్రంలో యెంత కాలమున్నారు? అసలు భగవదవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనము చేయవలసిన పనియేమి? నాకీ సందేహనివృత్తి చేసి, అటుపై శ్రీ పాదస్వామి చరిత్ర తెల్పండి' అని కోరాడు. సిద్ధయోగి యిలా చెప్పారు: "శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో 3 సం॥లు నివసించి, తర్వాత శ్రీశైలం వెళ్ళారు. అక్కడ నాల్గు నెలలుండి, భక్తులననుగ్రహించి. అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి, స్నానం చేసి, తర్వాత కురువపురం వెళ్ళారు. అక్కడ కృష్ణవేణి అనే రెండు నదులు కలవడం వలన అది యెంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిరనివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోకవిఖ్యాతమయింది. ఇప్పుడు దానిని "కురుగుడ్డి' అంటారు. అక్కడ శ్రీ పాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలూ సంప్రాప్తమవుతాయి. అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై, మరొక అవతారం ధరించారు. అయినా యిప్పటికీ ఆ కురుపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా వున్నారు.
శ్రీ పాదవల్లభులు సాక్షాత్తూ భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలూ వుంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికీ, ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్దరించడానికీ గూడ ఆయన దేశాటనం చేసారు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులూ తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వలన చివరకు అవే మలినమవుతాయి. అపుడు శ్రీ పాదులవంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తపించిపోతుంటాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి గూడ. ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను. శ్రద్ధగా విను.
కురుపురంలో వేదవిదుడైన ఒక సద్రాహ్మణుని భార్య అంబిక మహా పతివ్రత. కాని పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి గూడ కొద్దికాలంలోనే చని పోతుండేవారు. ఆమె యెన్నో దానాలు, వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకొక కొడుకు పుట్టాడు. కాని దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్థబుడు, బుద్ధిహీనుడు, జడుడూ అయ్యాడు. అయినప్పటికీ, లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు యెంతో గారాబంగా పెంచుతున్నారు. ఎని మిదవ సంవత్సరము రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు గాని, ఆ మందమతి యెంతకాలానికీ ఒక్క వేద మంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు. ఆ మంత్రానుష్టానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనిని కొడుతుండేవాడు. అది చూడలేక అంబిక అడ్డువచ్చి, 'వీడు లేక లేక కలిగిన పిల్లవాడు. మందమతియైన వీనిని దండిస్తే మటుకు యేమి లాభం? వీనికి విద్య రాకున్నా సరే, మీరు వాణ్ణి కొట్టవద్దు. బ్రతికినంతకాలం వీనిని యికనైనా సుఖంగా బ్రతుకనివ్వండి. ఇక మీదట మీరు వానిని శిక్షిస్తే, నేను మీ యెదుటే బావిలో దూకి మరణిస్తాను' అన్నది. ఆ బ్రాహ్మణుడు గూడ ఆలోచించి, ఆ పిల్లవాడు 'అజాగళస్తనం", వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది వూరుకున్నాడు.
కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో గూడ బిచ్చమెత్తుకుని బ్రతుకుతూండేది. ఆ బాలుణ్ణి చూచి గ్రామస్తులు, 'ఓరీ! పండితపుత్రా! నీ బ్రతుకు వ్యర్థం. నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు. నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చుని తింటున్నావు. సిగ్గులేదా? నదినుండి మంచినీరు మోసియైనా బ్రతుకరాదా? నీ వలన నీ పితృదేవతలకు గూడ అధోగతి కలుగుతుంది. నీ బ్రతుకుకేమి ప్రయోజనం? పవిత్రమైన భిక్షా వృత్తి నీవంటి అసమర్థుడికి తగదు. ఇలా బ్రతికేకంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా?" అని పరిహసించేవారు. చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలచి నది వైపుకు పరిగెత్తాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి గూడ నిస్సహాయురాలై, తాను గూడ ఆత్మహత్య చేసుకోదలచి అతని వెంట పరుగెత్తసాగింది. దారిలో శ్రీపాదస్వామి యెదురై అతనిని నిలిపి, 'బ్రాహ్మణుడా! తొందర పడవద్దు. పూర్వకర్మ వల్ల నీకీ దుస్థితి దాపురించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్యా దోషాలు చుట్టుకుంటాయి. అవి నివారింపరానివి. అందువలన నీవు జీవించి, యెంతటి కష్టాలైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మనుండి శాశ్వతంగా విముక్తుడవవడం మంచిది' అన్నారు.
అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి, 'స్వామీ! ఒకవంక భర్తను కోల్పోయి, మరొకవంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన యెటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినదేమున్నది?' అన్నది. ఆమె మాటలు విని, కరుణార్ద్ర హృదయుడైన శ్రీపాదస్వామి, 'అమ్మా! ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం గూడ
మేక మెడకుండే వ్యర్ధమైన చన్నులు
అనుభవించవలసి వస్తుందే గాని వేరే ప్రయోజనమేమున్నది? కనుక నీవు మిగిలిన జీవితమంతా శివపూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు' అన్నారు. ఆమె ఆలోచించి, 'స్వామీ, నేను మీరు చెప్పినట్లే చేస్తాను. కాని దానివలన ప్రయోజనమేమో నాకు తెలియలేదు. దయచేసి వివరించండి' అన్నది.
శ్రీపాదస్వామి, 'అమ్మా! ఉజ్జయినీ పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు, శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణియొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని, దానినెలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు - ఇద్దరూ ఏకాగ్రమనస్కులై ప్రదోష కాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయో దశీ శనివారంనాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణం. లోని గోపబాలకులు గూడ తమ యిండ్ల ముంగిళ్ళలో ఆకులతోనూ, పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం యిండ్లలోకి లాక్కుపోయారు. వారిలో ఒకరివద్దనుండి వాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి, వాడిని బలవంతంగా లేవదీసింది. అప్పుడా బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి, ఆ దోషపరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అపుడు విశ్వసాక్షియైన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్ధించాడు. శివుడు, 'వత్సా! భక్తి చేత నీవు నా సాయుజ్యం పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది. అయినా నీ అర్చనావిధానం చూచింది గనుక మరుజన్మలో విష్ణుజనని అవుతుంది' అని వరమిచ్చి అంతర్థానమయ్యాడు.
అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా యిదిచూచి, సూర్యుడు రాత్రిపూట గూడ ప్రకాశిస్తున్నాడని తలచారు. అంతటి భక్తిశ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి, అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది, వారంతా సగౌరవంగా చంద్రసేన - మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అపుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని, తనను ‘చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి, ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు. ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంత మంతా విన్న చంద్ర సేనుడు, మిగిలిన రాజులూ ఆ పిల్లవాడికి గోపాధిపత్యమూ, ధనమూ యిచ్చి వెళ్ళిపోయారు. తరువాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది. కనుక అమ్మా! శివపూజా మహిమ వలన మరుజన్మలో నీవు గూడ అలాగే అవుతావు' అన్నారు.
- ఈ కథ విని అంబిక యిలా అడిగింది : 'స్వామీ! శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో గదా? ఈ జీవితశేషం నేనెలా గడపాలి? మహానుభావా! అందరి పరిహాసాలకు గురియవుతున్న నా బిడ్డడు యే క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు. నన్ను మాతృత్వంతో రక్షించు' అని వేడుకున్నది. ఆ కరుణాసముద్రుడి హృదయం కరిగి, తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవముచ్చరించాడు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతియంతటి జ్ఞానీ, వక్తా అయ్యాడు. అపుడతనిని మాతృసేవకు నియోగించి, శ్రీపాదస్వామి ఆమెతో, 'అమ్మా! దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు. వచ్చే జన్మలో నాయంతటి కుమారుడు కలుగుతాడు' అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి, జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యు రాలయింది."
శ్రీ దత్తాయ గురవే నమః.
దగ్గర శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
సిద్ధ సరస్వతి, నామధారకునితో, యింకా యిలా చెప్పారు. శ్రీ పాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడు. అయినా గూడ సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజూ మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము, అర్ఘ్యము మొ॥న విధులన్నీ నిర్వర్తించుకుని మఠానికి తిరిగి వస్తుండేవారు. ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నానఫలం కంటె గూడ యెక్కువ పవిత్రత, పుణ్యమూ కలుగుతాయో, అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలుగబోయే పుణ్యమేముంటుంది?
ఆ గ్రామంలో ఒక చాకలి వుండేవాడు. ఒకరోజతడు కృష్ణానదిలో బట్టలు వుతుకుతుండగా శ్రీ పాదస్వామి స్నానానికని అక్కడకు వచ్చారు. ప్రశాంతత, దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తిశ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్సుకెంతో శాంతి, చెప్పలేని ఆనందమూ కలుగుతున్నాయి. నాటినుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసుకుంటూండేవాడు. ఒకరోజతడు నమస్కరించుకున్నపుడు శ్రీపాదస్వామి అతనితో, 'నాయనా, నీవు నిత్యమూ యింత శ్రద్ధాభక్తులతో నమస్క రిస్తున్నావు. నీ సేవ వలన మాకు సంతోషమయింది' అన్నారు. నాటినుండి అతడికి సంసారచింత నశించి, మరింత భక్తిశ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజూ అతడు స్వామియొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్ళు చల్లుతుండేవాడు. అటుతర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు.
ఒక వసంతఋతువులో, వైశాఖ మాసంలో, ఒకరోజున స్వామి నవ్వుతూ అతనితో, 'ఒరే! నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా!' అన్నాడు. అతని మాటలర్ధం కాలేదు. తర్వాత ఒకరోజతడు గుడ్డలుతుక్కోవడానికి నదివద్దకెళ్ళినపుడు అక్కడ, సుందరయువతీ జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును, అతనివెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్నీ చూచాడు. ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై, తాను నిరంతరం చేసుకొనే నామస్మరణ మరచి, తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ వుండిపోయాడు. తర్వాత అతడు, 'మానవజన్మమెత్తాక యిటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము. ఈ రాజు యెంతటి అదృష్టవంతుడో! ఇతనికింత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో! నాకిటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట!" అనుకొన్నాడు. ఇంతలో మధ్యాహ్నమయింది. శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, 'స్వామీ, ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్యర్యము, సంతోషమూ కలుగుతున్నాయి' అని మళ్ళీ, ‘అజ్ఞానం వలన నేనిలా భ్రమించానే గాని, నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యమివ్వగలదని యిప్పుడు తోస్తున్నది' అన్నాడు. శ్రీపాదస్వామి, 'దానికేమున్నది? నీవు పుట్టినది మొదలూ కష్టం చేసుకునే జీవిస్తున్నావు. అందువలన అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. నాయనా! నీవు రాజువుగావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు గదా! నిస్సంకోచంగా చెప్పు' అన్నారు. చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, 'స్వామి! నా అజ్ఞానం మన్నించి నన్ననుగ్రహించు' అని వేడుకున్నాడు. స్వామి, 'నాయనా! మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే. లేకుంటే యిలాంటి వాసనలు మిగిలివున్నంతవరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూండవలసిందే. నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా? లేక మరుజన్మలో కావాలా? సంకోచించకుండా చెప్పు!' అన్నారు. అప్పుడతడు సిగ్గుతో తలవంచుకుని, 'ఇప్పుడు నేను ముసలివాడనయ్యాను. ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను. కనుక నాకవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆజన్మాంతమూ అనుభవించగలుగుతాను' అన్నాడు.
అప్పుడు స్వామి 'నాయనా! ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను, మనస్సును తృప్తిపరచుకోవాలి. లేకుంటే మనసు నిర్మలమక యెన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజ్యకాంక్ష, సుఖలాలస బలీయంగా వున్నాయి. కనుక నీవు మరుజన్మలో 'మృధుర' ' దేశంలో యవనరాజవంశంలో జన్మిస్తావు' అన్నారు. అది విని రజకుడు, 'స్వామీ, మీరిచ్చిన వరం నాకిష్టమైనదే కాని, వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు. మీయందు దృఢభక్తి వుండేలా అనుగ్రహించు. అపుడు నాకు మతద్వేషం వుండకూడదు' అని వేడుకున్నాడు. శ్రీ పాదస్వామి, 'ఇపుడు నీవెట్టి వైభవం చూచావో అట్టిదే మరుజన్మలో పొందుతావు. అపుడు మేమవతరించవలసిన అవసరమొస్తుంది. అపుడు మేము "నృసింహసరస్వతి" అనే సన్యాసిరూపంలో వుంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనమవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయమవుతుంది. భయంలేదు. ఇక నీవు వెళ్ళిరావచ్చు' అని ఆశీర్వదించి, ఒక వింతైన నవ్వుతో అతనివైపు చూచారు. ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు.
శ్రీపాదులు యిలాంటి లీలలెన్నో చేసి భక్తులననుగ్రహిస్తూ యింకొంతకాలం కురుపురంలోనే వున్నారు. ఆయన నివాసం వలన ఆ కురుపురం యెంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడాయన, 'నేనింతకుముందు అంబికకు జీవితాంతమూ శివపూజ చేస్తే, మరుజన్మలో నావంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు గనుక, నేనే ఆమె గర్భవాసాన అవతరించి నామాట నిలబెట్టుకోవాలి' అని తలచారు. అటుతర్వాత ఒక ఆశ్వయుజ మాసం, కృష్ణపక్ష ద్వాదశి, హస్తా నక్షత్రమునాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో (మునిగి) అంతర్హితులై, మరొకచోట వేరొకరూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో యిక్కడే వున్నారని తెల్పే సంఘటనలు యెన్నో వున్నాయి. భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించేవారికి ఆ స్వామి ప్రత్యక్షుడే. అందువల్లనే కురుపురం అంతటి శ్రేష్ఠమయిన క్షేత్రం."
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
మూలంలోని 'మృధుర' అన్నది సంస్కృతంలోని 'వైదుర' యొక్క రూపాంతరం. 'వైదుర' అనీ, 'విదర్భ' అనీ, 'వైఢూర్య నగర' మనీ కొందరంటారు. ఇది 'బిదర్' అని కొందరంటే, 'బీజపూర్' అని ఒక ప్రఖ్యాత చరిత్రకారుడు చెప్పాడు. అయితే ఆ రెండూ ఒక రాజ్యంలోనివే. నిజానికొక రాజభవనం గూడ బీజపూర్ రాజ్యంలోనే వున్నది.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు, "స్వామీ! శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్థానమై, వేరొకచోట మరొక అవతారమెత్తారని చెప్పారు గదా? అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువ పురంలో వున్నారని, యిప్పటికీ అక్కడ తమను ప్రార్ధించిన భక్తులను రక్షిస్తున్నారనీ గూడ చెప్పారే! అదెలా సాధ్యం?" అని అడిగాడు.
"నాయనా! శ్రీపాదస్వామి సాక్షాత్తూ భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన యేమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడుగా వున్న ఆయన తర్వాత త్రిమూర్తులరూపం ధరించి, వేరు వేరు కార్యాలు చేయడం లేదా? శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవము, అసంభవమూ అన్నది లేదు. ఆయన అంతర్థానమయ్యాక గూడ ఆ క్షేత్రంలో తమనాశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీలనొకదానిని చెబుతాను విను.
కాశ్యపస గోత్రీకుడైన వల్లభేశుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురువపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి, తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే వున్నారని విని, అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరమూ నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు. ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభమొస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి, అక్కడ ఆయన ప్రీతికొరకు వేయిమంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మ్రొక్కుకున్నాడు. అప్పటినుండి అతడు స్వామిని స్మరించి యే పట్టణానికి వెళ్ళినా, అక్కడ స్వామి దయ వలన అతడాశించిన కంటే ఎన్నో రెట్లెక్కువగా లాభం రాసాగింది. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి. అతడు తనకొచ్చిన లాభానికెంతో సంతోషించి, తన మ్రొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకొని కురువపురానికి బయల్దేరాడు. నలుగురు దొంగలు అతని వద్ద యెంతో డబ్బున్నదని పసిగట్టి, యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు. తాము గూడ ప్రతి సం॥ము కురువపుర యాత్ర చేస్తుంటామని చెప్పి, అతనితో యెంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు. ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి, వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలతనిపై పడి అతని తల నరికి, అతని వద్దనున్న ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి యెవరికీ తెలియకుండా చేయాలని తలచి, ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేశుడు, మరణించే ముందు చివరిక్షణంలో, 'శ్రీపాద వల్లభా!' అని కేక పెట్టాడు. అందువలన భక్తరక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించిన యతి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై, త్రిశూలంతో వాళ్ళను పొడిచి చంపాడు. అపుడా దొంగలలో ఒకడు ఆయన పాదాలపై బడి, 'ప్రభూ! నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిసాను. నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి యెరుగను. సర్వసాక్షియైన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది. స్వామీ, నన్ను క్షమించి విడిచి పెట్టవలసినది' అని ఆయనను శరణు వేడాడు.
స్వామి అతనికి అభయమిచ్చి, కొంచెం విభూతి ప్రసాదించి, దానిని వల్లభేశుని శరీరంపై చల్లి. తెగిపడియున్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు. అతడలా అతికిస్తుండగా శ్రీ పాదస్వామి వల్లభేశుని శిరస్సుపై తమ అమృతదృష్టిని సారించి, మరుక్షణమే అంతర్థానమయ్యారు! వల్లభేశుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది. అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే వున్నాడు. వల్లభేశునికి అంతకుముందు జరిగినదేమీ గుర్తు లేదు. అందువలన అక్కడ చచ్చిపడియున్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, 'వీళ్ళందరూ యెలా మరణించారు? నీవొక్కడివే యెలా బ్రతికి వచ్చావు? ఇంత జరిగినా నీవొక్కడివే యింకా యిక్కడే వున్నావేమిటి?' అని అడిగాడు. అపుడాతడు, 'అయ్యా! ఇప్పుడొక అద్భుతమైన దైవలీల జరిగింది. మనననుసరించి వచ్చినవారు దొంగలే గాని, యాత్రికులు గారు. వారు నిన్ను చంపి నీ ధనమపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి, నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా వుంచి ఆయన అంతర్థానమయ్యారు. ఆ మునీశ్వరుడెవరో గాని, సాక్షాత్తూ పరమ శివునిలా వున్నారు!' అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తూ శ్రీపాదవల్లభులేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు వల్లభేశుడెంతో పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకొని కురువపురం చేరాడు. అక్కడ శ్రీ పాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాననుకున్నట్లు వేయిమందికి గాక, నాలుగువేలమంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు.
ఈ విధంగా శ్రీ పాదస్వామి కురువపురంలో అదృశ్యంగా వుంటూ, ఇలాంటి లీలలెన్నో చేసారు. నేటికీ సజ్జనులకు అక్కడాయన దర్శనమిస్తారు. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతియనే యతిగా వేరొకచోట అవతారమెత్తి లోకోద్ధరణ చేసారు. భక్తులెక్కడున్నప్పటికీ శ్రీ పాదస్మరణ చేస్తే చాలు. వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు. అట్టి స్మరణకనుగుణమైన నామం తరతరాలుగా యిలా వున్నది" అన్నారు సిద్ధముని -
"దిగంబరా, దిగంబరా, శ్రీ పాదవల్లభ దిగంబరా
దిగంబరా, దిగంబరా - అవధూత చింతన దిగంబరా ॥
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః..
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన : ఈ పదకొండవ, పండ్రెండవ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారి వృత్తాంతము చెప్పబడుతుంది. ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలివి:
`శ్రీ పాదస్వామి గాని, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి గాని, తాము భగవదవతారములని లోకానికి చాటుకోలేదు. శ్రీరాముడు కూడా “ఆత్మానం మానుషం మన్యే”, “నేను మానవుడననే తలుస్తున్నాను" అన్నాడు. శ్రీ కృష్ణుడు తాను భగవదవతారమని అర్జునుడి వంటి అంతరంగికులకు కొద్దిమందికి మాత్రమే చెప్పాడు గాని లోకానికి చాటలేదు. దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్త్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి. వేదవ్యాసుల వంటి సత్యద్రష్టలు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి
తెలియబరచారు.
2. ఈ అవతారమూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు. అలాగాని పౌండరీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపజూచారు.
3. అవతార పురుషులందరూ సద్గురువుల నాశ్రయించి సత్సాంప్రదాయాన్ని పాటించారే గాని, తమకట్టి ఆలంబనలు అనవసరమని, తాము సర్వధర్మా లకూ అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు గాలేదు.
4. అవతార పురుషులందరిలాగే వీరిద్దరూ తాము జన్మతః పరిపూర్ణులైనప్పటికీ వినమృలైన సాధకుల వలెనే ప్రవర్తించారు గాని, సిద్ధులమని విర్రవీగలేదు.
5. వీరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవి గాను, అర్ధార్ధులను పోషించేవి గాను, నిర్దుష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్లోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి. కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాథనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు.
నామధారకుడు అత్యంతాసక్తితో యిలా అన్నాడు "అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము యెక్కడ అవతరించారు? ఏయే లీలలు ప్రదర్శించారు? అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ వుంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే గాని, తరగడం లేదు. ఆ రెండవ అవతార విశేషాలు గూడ వివరించండి". అంతటి శ్రద్ధాళువైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవల్లీలలు తనివితీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు, "నామధారకా! దీనులనుద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగీంద్రులకు గూడ ఊహించ సాధ్యం గానివి. కనుక నేనెంత వర్ణించినా అగాధమైన ఆ గాధలో లవలేశమే అవుతుంది గాని, ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా! ఇక విను" అని యిలా చెప్పారు :
"శ్రీ పాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివపూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రంలోని 'కారంజా' లేక 'లాడకారంజా' అను గ్రామంలో (అకోలా జిల్లా) వాజసనేయ శాఖకు చెందిన ఒక సబ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులామెకు 'అంబ' అని నామకరణం చేసారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో బాటు శివభక్తి గూడ అబ్బింది. ఆమెకు యుక్తవయస్సు రాగానే మాధవశర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేసారు. అతడు మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివ వ్రతం చేసుకునే అలవాటుండేది గనుక, వారిని శివవ్రతులంటారు. పూర్వజన్మ సంస్కా రానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినమూ సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది. విశేషించి అంబ తన భర్తను, సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలూ చేస్తుండేది. ఇలా 16 సం॥లు గడిచాక అంబ గర్భవతియైంది. మాధవశర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు. నెలలు నిండిన తర్వాత మహామహిమాన్వితమైన ఒక శుభ లగ్నంలో ఆమెకొక మగబిడ్డ కల్గాడు.
నామధారకా! ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లలవలె ఏడ్వలేదు. సరిగదా, స్పష్టంగా ప్రణవముచ్ఛరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిశాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూచి, 'మాధవశర్మా! నీ భాగ్యం పండింది. ఈ శిశువు సాక్షాత్తూ భగవంతుడే! ఇతడు మనవలె గృహస్తాశ్రమం స్వీకరించడు. చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు. ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనువవుతాడు. ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు. ఇతనిని కన్నందువలన మీకు కీర్తి, ప్రతిష్టలు, దివ్య సుఖాలూ లభిస్తాయి" అని దైవజ్ఞులు చెప్పారు. మాధవశర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు. వారు శెలవు తీసుకుంటూ, 'మాధవశర్మా! ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి. నవనిధులు పరిచారికులవుతాయి' అని ఆశీర్వదించారు.
ఆ బాలుడు పుట్టినవెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి, అతనిని చూడడానికి జనం యిసుకవేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షా బంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండు మిరపకాయలు, వేపాకులతో దృష్టి తీసేది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి 'శాల గ్రామదేవ' అని పేరు పెట్టారు. కాని యింట్లో అందరూ అతనిని 'నరహరి' అని పిలుచుకునేవారు. నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు; 'హరి'యంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య, తాప, పాపాలను పోగొట్టేవాడని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తియని సూచిస్తున్నట్లున్నది.
బలహీనంగా వుండటం వలన, అంబవద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవానికోసం ఒక దాదిని గాని, పాడి మేకను గాని యేర్పాటు చేయాలని ఆ దంపతులాలోచిస్తుండగా, ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లియొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్థన్యం పెల్లుబికి, 32 ధారలుగా కారి నేలపైబడ్డాయి. ఈ విషయం అందరికీ తెలుస్తే బిడ్డకు దృష్టిదోషం తగులుతుందని వెరచి అంబ యీ లీలను రహస్యంగా వుంచింది. ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు. నేలమీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు.
ఇలా సంవత్సరము గడిచినా, అతనికి ఒక్కమాట గూడా రాలేదు. కులదేవతల నారాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించ మని కొందరూ, రావి ఆకుల విస్తళ్ళలో భోజనం పెట్టించమని మరికొందరూ చెప్పారు. మాటలు చెబుతూ అతనిచేత అన్పించడానికి యత్నిస్తూంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలొచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరూ అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా, 'ఓం' అన్నదే అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు, 'ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు. గనుక ఇతడు చెవిటివాడుగాదని స్పష్టమవుతున్నది' అనేవారు. 'అతడు మూగవాడైతే అంత స్పష్టంగా 'ఓం' అనడం సాధ్యం గాదు. అతడు మాటలొచ్చి గూడ ఎందుకో మాట్లాడడం లేదు' అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవ్వరేది చేయమని చెప్పినా అదల్లా చేసేది. తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది.
ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది. కాని అతడు మాట్లాడనేలేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులెంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది. అదిచూచి నరహరి సైగలతో ఆమెను వారించి, ప్రక్కనేవున్న ఒక యినుప వస్తువును తెప్పించి చేతితో త్రాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని యినుప వస్తువులను అతనిచేత తాకించారు. అవిగూడ బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు గాడని, ఆజన్మసిద్ధుడనీ వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే వుండేవారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్నెలా పాలించగలడన్నదే మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజతనిని అక్కున జేర్చుకొని కన్నీరు కారుస్తూ, 'నా కన్నతండ్రీ, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా?' అన్నది. అదివిని నరహరి నవ్వి, తనకు ఉపనయం చేస్తే మాట్లాడుతానని, మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడుతాననీ సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవశర్మ ఆశ్చర్యపడి, అతని ఉపనయనానికి ఒక శుభ ముహూర్తం నిర్ణయించి, ఊరివారినందరినీ ఆహ్వానించాడు. గ్రామస్థులందరూ అతడి ఆశలు అడియాశలై, నలుగురిలో తలవంపులకు గురియవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, 'అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రీమంత్రం ఉచ్చరించగలిగితే మనకేమి, లేకపోతేనేమి? మనకు మాత్రం మృష్టాన్న భోజనము, ఘనంగా దక్షిణ తాంబూలాలూ లభిస్తాయి. గనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి' అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవశర్మ యింట సమావేశమయ్యారు.
నరహరి ముండనము, మాతృభోజనము అయ్యాక జింక చర్మము, పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రీ మంత్రముపదేశించినపుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత అతడు తల్లికి నమస్కరించి, ఆమెను 'భవతీ భిక్షాం దేహి' అని భిక్ష కోరి, మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటి భిక్ష యిచ్చి, 'ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు' అనగానే నరహరి, 'అగ్నిమీళే పురోహితం" అని ప్రారంభించి, ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండవసారి భిక్ష యిచ్చి, 'యజుర్వేదం పఠించు ఆచారం పాటించు!' అనగానే నరహరి, "ఇషేత్వా" అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష యిచ్చి, 'సామవేదం పఠించు, ఆచారం పాటించు!' అనగానే నరహరి "అగ్ని ఆయాహి" అని ప్రారంభించి, సామవేదంలోని మొదటి మంత్రం గానం చేసాడు! అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్యర్యానికీ అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్ఛారణ, తర్వాత వేదపఠనతో గాని చేయకూడదని నరహరి అంతకాలమూ మాట్లాడలేదని అందరనుకున్నారు. మూడు భిక్షలూ అయ్యాక ఆయన నాల్గవ వేదం గూడ చదివాడు. ఆయన భగవదవతారమని తెలుసుకొని అచటి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వ శాస్త్రాలకూ జన్మస్థానమైన ఆ ప్రభువుకు యిది ఒక లెక్కలోనిది గాదు.
క్రతువు పూర్తిగావచ్చింది. మాధవశర్మ దంపతులు అమితోత్సాహంతో వున్నారు. వామనునివలె భాసిస్తున్న ఆ నూత్న బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, “నాయనా! ఇకనుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా!' అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, 'అమ్మా! నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను. నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి' అని తండ్రివైపు గూడ తిరిగాడు. ఆ మాటలకా తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ, 'నాయనా! ఒక్కగానొక్క మగబిడ్డవు. మేము 16 సం॥లు యెంతగానో ఎదురుచూచి, ఎన్నో వ్రతాలాచరించాక పుట్టావు. తర్వాత 7 సం॥ నీవు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు, వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమి? అప్పుడే నీవు యిల్లు విడిచిపోతే మా గతేమిటి? నీవు గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు గదా!' అని బ్రతిమాలింది.
అపుడు నరహరి తల్లిని కౌగిలించుకొని ఓదార్చి, 'అమ్మా! నా మాట విను. వివేకంతో ఆలోచించి ఈ వ్యర్ధమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకింకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను' అని చెప్పి, ఆమె శిరస్సుపై తన చేతినుంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాదవల్లభుడుగా దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపైబడి యిలా అన్నది. 'స్వామీ! పూర్వ జన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినపుడు రక్షించిన శ్రీ పాదుడవు నీవే! బ్రహ్మాండాలన్నీ నీలోనే వున్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశము, పితృవంశము గూడ పావనమయ్యాయి'.
అతడామెను లేవదీసి, 'అమ్మా! ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు. నీకొక రహస్యం చెబుతాను. గుప్తంగా వుంచు. నేను సంసార మంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము మొ॥న కార్యాలెన్నో వున్నాయి. అవి నేను ప్రకటించ వీలులేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు. కనుక నేనింట్లో వుండవీలుపడదు. కనుక నీవు అనుమతి ప్రసాదించు' అన్నాడు.
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః.
సిద్ధయోగి యింకా యిలా చెప్పారు "అప్పుడా తల్లి పుత్ర వాత్సల్యంతో యిలా అన్నది: 'నాయనా, నీవు లోకానికి ధర్మం చెబుతావు గదా? మరి నీవుగూడ 12 సం॥లు బ్రహ్మచర్యమవలంబించాక గృహస్థువై, బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి గదా! ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి గదా!' అని బ్రతిమాలింది. అపుడు వటువైన నరహరి, అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోప దేశం చేసిన విధంగా, ఆమెకు తత్త్వమిలా బోధించాడు:
'అమ్మా! భౌతికమైన శరీరాలు, వైభవము అశాశ్వతాలే. మరణంలేని వాడంటూ యెవడూ లేడు. మృత్యుదేవత యెప్పుడూ జీవితాన్ని వెంటనంటే వుంటుంది. యువకులకైనా, వృద్ధులకైనా ఈ శరీరమెప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు యెప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటు న్నట్లు, మృత్యుదేవత గూడ మానవుల జీవిత కాలాన్ని లెక్కపెడుతూంటుంది. రాత్రి, పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొనిపోతుంటాయి. ఈ శరీరము, భార్యాబిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరచి, అవే ప్రధానమనుకుని జీవించేవారు పశువులవంటివారు. కనుక ధర్మాచరణ మొక్కటేమానవుల కర్తవ్యం. అలాగాక మృత్యువును జయించినవారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు. కాని మానవులు కొద్ది నీరు మాత్రమే వున్న సరస్సులోని చేపలవంటివారు. ఆ కొంచెము నీరూ యింకిపోయాక వాటి గతేమిటి?
ఈ కలియుగంలో మానవునికి నూరేండ్లు ఆయుర్దాయం. అందులో సగకాలం నిద్రలోనూ, బాల్యము, పరాధీనతల వల్ల కొంతకాలమూ గడిచిపోతుంది. ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలముండీ వాడిపోయేది. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను, బాలురను, యువకులను, విజ్ఞులను, దేవతలను. సర్వజీవులనూ మ్రింగివేస్తుంది. దేనిమీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మ వంచనే, దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తమూ గల ఈ శరీరము నీటి బుడగ వంటిది. శరీరము జడము, నశ్వరము. ఆత్మ చిత్స్వరూపము, శాశ్వతము. దానికి సుఖదుఃఖాలు లేవు. ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే. సద్గురు కటాక్షం వలన మానవుడీ మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మమెత్తి గూడ ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోనివాడే నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడూ గూడా. అమ్మా! ఈ మాట సామాన్యుల విషయంలోనే యింత వాస్తవమైతే, కారణ జన్ముడనైన నాకేది కర్తవ్యం?
విషయసుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడమనే క్రమం తగియున్నది. నాకట్టి విషయావాసనలే లేవు గనుక ధీమంతుడనైన నాకు యెట్టి విఘ్నాలూ రాజాలవు. నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను. నన్ను ధ్యానిస్తూండు. సంసారాన్ని దాటగలవు!' అని, యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు, తన దివ్యరూపాన్ని దర్శింపజేసాడు. ఆయన ప్రసాదించిన యోగదృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి యిలా అన్నది. : 'స్వామీ! నీవు పుట్టుకలేనివాడవు. బ్రహ్మాండాలన్నీ నీలోనే వున్నాయి. బ్రహ్మకు గూడ నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి. మాయామోహితురాలనైన మానవస్త్రీని, నాకెలా తెలుస్తాయి? ఈ జ్ఞానమైనా నీవనుగ్రహించినదే! నీవు సత్యసంకల్పుడవు. నీ సంకల్పానికి నేనడ్డుచెప్పను. లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి యింట కట్టి పెట్టుకొనడం తగదు. అయితే నీయొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలచేటట్లు అనుగ్రహించు. నాకింకా పుత్రులు కలుగుతారన్నావు. మాకింకొక్క బిడ్డ పుట్టేవరకైనా నీవిక్కడేవుండు. అప్పటివరకూ సన్యసించడానికి నేననుమతించను. నీవు నామాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను, నిన్ను విడిచి నేను బ్రతుకలేను' అని ప్రార్ధించింది. అప్పుడు శ్రీహరి, 'అమ్మా! నీకొక సం॥లోగా కవలలు పుడతారు. అంతవరకూ వుంటాను గాని, ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు' అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు.
అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని, ఆ దంపతులు నిత్యమూ అర్చిస్తూండేవారు. చతుర్వేద పారంగతులు, షట్ఛాస్త్రనిపుణులూ గూడ ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు. పామరులకు ఆయన ధర్మసూక్ష్మాలు చెప్పేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు యిద్దరు మగపిల్లలు పుట్టారు. వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లలనాడిస్తుంటే నరహరి వచ్చి, 'అమ్మా! నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు. నీకింకా యిద్దరు కొడుకులు, ఒక కూతురు కలుగుతారు. నీ కోరిక ఫలించింది. నా మాట నిలబెట్టుకున్నాను. కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకనుమతిస్తే నేను తీర్ధయాత్రలకు బయల్దేరుతాను. అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి' అన్నారు. అపుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, 'మేమింతవరకూ మాయలో తగుల్కొని, నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలాడి వుంటే మమ్మల్ని క్షమించు! నీవే మా కులదైవమని యిప్పుడు తెలుసుకున్నాము. నీవు మా వంశాన్నుద్దరించడానికి యిక్కడ జన్మించావు. నీవు మా రక్తమాంసాలు పంచుకొనడం ద్వారా మా దేహాలు గూడ పవిత్రమైనాయి. . ఇక ముందు మా గతేమిటి?' అన్నారు. మీ దర్శనం మాకింకెప్పటికీ లేకుంటే మేమెలా జీవించగలము?' అన్నారు. అపుడు నరహరి, 'మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి. మీకిక జన్మ వుండదు. అమ్మా! నీకు నన్ను చూడాలనివుంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనమవుతుంది. 30 సం॥ల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను" అని చెప్పాడు.
అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన, తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయాంబరము, చేత దండమూ ధరించి చిరునవ్వులొలికిస్తూ మహా సంతోషంగా బయల్దేరాడు. ఆ దృశ్యం చూచిన జనం, 'తొమ్మిది సం॥ల పిల్లవాడు యిల్లు విడిచిపోవడానికి ఆ తల్లి యెలా అనుమతిస్తున్నది?' అని ఆశ్చర్యపోయారు. కొందరు, 'ఈయన అవతారమూర్తి. ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు' అన్నారు. సాధువులు, ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్థులందరూ కొంతదూరం వెళ్ళి, ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక, తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు. అక్కడ నరహరి వారికి కర్పూరము వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము, తర్వాత శ్రీపాదరూపము లను దర్శనమిచ్చారు. అది తమ శని ప్రదోష పూజాఫలితమేనని తలచి, ఆ తల్లి దండ్రులు, 'మా జన్మలు ధన్యమయ్యాయి. మీరు దయతో మాకు మళ్ళీ దర్శన మివ్వాలి' అని వేడుకోగా, ఆయన 'తప్పక మళ్ళీ దర్శనమిస్తాను' అని మాటయిచ్చి వాళ్ళను వెనుకకు పంపాడు. ఆ దివ్యదర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరచి, భక్తిభావంతో వెనుకకు వెళ్ళారు.
నరహరి, బదరీనాథ్ దిక్కుగా బయల్దేరి దారిలో 'ఆనంద కాననము' అనబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి, ఆత్మ స్వరూపమైన విశ్వనాథుని దర్శించారు. తర్వాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని, ప్రాణవాయువు కుంభించి, ఖేచరీ ముద్రలో నాదాను సంధానపరులై కూర్చున్నారు. ఆయన నిత్యమూ మూడు వేళలా మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగాస్నానం చేసి వస్తుండేవారు. ఆ క్షేత్రంలో వున్న తపస్వులు, మునులు, సాధువులు ఆయనను చూచి ఆశ్చర్య చకితులయ్యారు. యవ్వనం గూడ పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము, కఠోరమైన తపస్సు చూచి, ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తుండేవారు. అచ్చటి యతులలో వృద్ధుడు, శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవారు. ఆయన సాక్షాత్తూ అవతార పురుషుడని, సన్యాసమార్గాన్ని పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని, కనుక ఆయన వయస్సులో చిన్నవారయినా, జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయనకు యతులు గూడ నమస్కరించవచ్చుననీ కృష్ణ సరస్వతి చెబుతుండేవారు. చివరకు ఆ కృష్ణసరస్వతీ స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, 'స్వామీ, మీరు పరమేశ్వరులే గాని, మానవమాతృలు గారు. సజ్జనులను, ధర్మాన్నీ ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాసమార్గం దాదాపు లుప్తమైంది. దానిని మరల మీరే నిర్దుష్టం చేసి, విస్తరింపజేయాలి. అధికారులు కాని వారికి ఈ మార్గము భయంకరమైనదైనా, బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందమిచ్చే ఈ సన్యాసమార్గాన్ని మీరే పునురుద్ధరించాలి. సన్యాసులమైన మేము యిపుడు మిమ్ములను సేవిస్తే లోకనింద యేర్పడుతుంది. కనుక మీరు గూడ సన్యసిస్తే మేము గూడ మీ సేవ చేసుకోవచ్చు' అని ప్రార్ధించాడు.
నరహరి వారి ప్రార్ధనను మన్నించి సర్పం ప్రదాయ సముద్ధరణ కొరకు క్రిష్ణ సరస్వతీ పాదులను గురువుగా స్వీకరించి, శాస్త్ర పద్ధతిన వారివద్ద సన్యాసం స్వీక రించారు. అపుడు గురువిచ్చిన దీక్షానామం 'శ్రీ నృసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీ పట్టణంలోనే వుండి మానవులకు నాలుగు పురుషార్థా లనూ ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు”.
“అంతవరకూ గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు, స్వామి, నాక్కొ సందేహం కలుగుతున్నది. విశ్వగురుడైన శ్రీగురునికి యింకొకరు గురువెలా కాగలరు? గురువునాశ్రయించి ఆయన సాధించవలసినదేమున్నది?” అని అ డు. సిద్ధయోగి యిలా చెప్పారు: పూర్వము శ్రీ రామచంద్రుడు వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షినీ గురువులుగా వరించినట్లే, శ్రీగురుడు గూడ శ్రీకృష్ణ సరస్వతీ స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. ఈ గురుసాంప్రదాయం అనాది సిద్ధమైనది. దీనికి మూలపురుషుడు సదాశివుడు. ఆయన శిష్యుడు విష్ణువు. విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు. అటు తర్వాత గురుపరంపర యిలా కొన సాగింది. బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు - శక్తి - పరాశరుడు - వ్యాసుడు - శుకుడు - గౌడపాదుడు - గోవింద భగవత్పాదాచార్యులు - శంకర భగవత్పాదులు - విశ్వ - - రూపుడు - బోధజ్ఞానగిరి - సింహగిరి - ఈశ్వరతీర్థుడు - నృసింహతీర్ధుడు. విద్యారణ్యుడు - మలయానందుడు - దేవతీర్థుడు - యాదవేంద్ర సరస్వతి - కృష్ణ సరస్వతి. ఈ కృష్ణ సరస్వతీ స్వామియే శ్రీ గురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి యొక్క గురువు.
తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ, అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు. తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ, “సర్వక్షేత్రాలూ దర్శిస్తూ, పుణ్య తీర్థాలలో స్నానం చేస్తూ శ్రీ శిష్యులతో కలసి గంగాసాగర సంగమం చేరారు . ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకూ తటాకయాత్ర చేసారు. అదికూడ గంగా ప్రదక్షిణంలో సమానమే. అందుకే ప్రయాగను గూడా గంగాసాగరమంటారు. ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీ గురుడే స్వయంగా తత్త్వముపదేశించి సన్యాసమిచ్చారు”.
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః
అక్కడ కొంతకాలం నిరంతర యోగనిష్ఠలో గడిపి ప్రయాగ చేరారు.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన : ఈ 13, 14, 15 అధ్యాయాలలో శ్రీ గురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు. పరమ పురుషార్ధ ప్రాప్తికి ధర్మం పునాదిలాంటిది. అట్టి ధర్మానికి శృతి, స్మృతి, సదాచారము, ఆత్మ సంతృప్తి అన్నవి నాలుగు ప్రమాణాలు. కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటినీ హృదయగతం చేసుకొని, సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి. ఈ మూడింటికీ సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకొని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ, తృప్తిగాను " ఆచరించగల్గడమే నాల్గవ ప్రమాణం. కాని శృతులకు అర్ధం చెప్పగలవారు, వాటి పరంగా స్మృతులనన్వయించగలవారు ఎవరు? అంత నిర్దుష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థతనొందినవారే సత్పురుషులు కనుక వారి వాక్యాలే, ఆచరణయే ప్రమాణం. కనుక ధర్మాన్ని గూడ వారివద్దనే నేర్వాలి. అది తెల్పడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి స్వయంగా శిష్యులకుపదేశించారు. ఆయనవలె ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయమివ్వగలవాడే సద్గురువు. ఆయనయే నాల్గు పురుషార్ధాలకూ ఉత్తమమైన మార్గం తెల్పగలవాడు, ప్రసాదించగలవాడు. సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటినాచరించడానికి సంసిద్ధులైనవారే తురీయాశ్రమాన్ని స్వీకరించ యోగ్యులని ఈ అధ్యాయం తెల్పుతుంది. అలా సుఖదుఃఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించ గలగాలంటే గూడ సద్గురుని అనుగ్రహమే శరణ్యం.
శ్రీ గురుని కథ శ్రద్ధగా విని, పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, "స్వామీ, ఈ శ్రీ గురుచరిత్ర ఎంత విన్నా తనివితీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను చవిచూచిన ఆకలిగొన్న ఆవువలె వున్నది. నేనెంత అల్పజ్ఞుడనో, నాకిప్పుడు తెలుస్తున్నది. అజ్ఞానం వలన భ్రష్టుడనై నేనే వెనుక కష్టాలు కొనితెచ్చుకున్నానని (శ్రీ గురుని పక్షాన యెట్టి లోపమూ లేదనీ) తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారంలో దారి కన్పించకున్న నాకు జ్ఞానజ్యోతిమైన -మీరే శ్రీ గురుని చూపారు. మీ రూపంలో శ్రీగురుడే నన్ననుగ్రహించారు. షేర్ల - చేసిన మేలుకు నేనెన్నటికీ మీ ఋణం తీర్చుకోలేను. కల్పవృక్షానికీ, చింతామణి, జ్ఞానమిచ్చిన వారికి యేమిచేసి ప్రత్యుపకారం చేయగలము? మీ బోధ నాకు సర్వార్ధసాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది. దయతో అల్లు తర్వాత శ్రీగురుడు ఎక్కడకు వెళ్ళారో, ఏమి చేసారో సెలవీయండి", ప్రార్ధించాడు.
సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సున చేయి పెట్టి, “నీ జన్మ ధన్యమయింది శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటుచేసుకున్నాయి. కనుకనే కోరగల్గుతున్నావు. ఇందువలన నీవు తరించడమే గాక స్తాటివారివి గూడ తరింపజేయగలవు. నీవడుగుతుంటే మాకు గూడ ఆనందం కలుగుతున్నది" అని ఆ వివరాలిలా చెప్పారు:
"శ్రీ గురుడు ప్రయాగలో వుండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి, యెందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు. మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేద్రుడు, జ్ఞానజ్యోతి, “సదానందుడు, కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము. మా అందరి పేర్లకూ చివర 'సరస్వతి' అనే బిరుదుంటుంది. శ్రీ గురుడు మమ్ములను మరికొందరు శిష్యులనూ వెంటబెట్టుకొని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణదేశం తిరిగి వచ్చి, పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన 'కారంజ’ నగరం చేరారు. అపుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. వారిలో _బ్రాహ్మణులందరూ స్వామిని తమ యింటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీ శ్రీ గురుడు అందరి ఆహ్వానాలూ అంగీకరించి, ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి యిళ్ళకూ వెళ్ళి భిక్ష చేసారు. అందరూ ఆ లీలకాశ్యర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవదవతారమని గుర్తించారు.
ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు... వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, 'నాథా! క్రిందటి జన్మలో లోక - పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి, వారి ఆదేశానుసారం శని ప్రదోషపూజ చేసాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్ధకమైంది' ఆ నా చెప్పింది. అపుడా దంపతులు తమను సంసారసాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అపుడు శ్రీగురుడు, “ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి ఆ వంశంలోని 42 తరాలవారు తరిస్తారు. ఆ కులమంతటికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు గూడ బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను గనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై, అప్లైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను, మనుమలను చూడగల్గుతారు. చివరిదశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది, వేదాల చేత కీర్తించబడినదీ అయిన కాశీలో మీరు నివసిస్తారు. మీకు యెట్టి చింతా అవసరము లేదు' అని అభయమిచ్చారు.
అపుడు, పూర్వాశ్రమంలో స్వామివారి సోదరియైన రత్న ఆయనకు నమస్కరించి, 'స్వామి, నాకు గూడ సంసార తాపత్రయం తొలగించి, నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను' అని ప్రార్థించింది. అపుడు శ్రీగురుడు నవ్వి, 'అమ్మా, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది; అభీష్టాలు గూడా నేరవేరుతాయి కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు. గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది' అన్నారు. అప్పుడామె, 'స్వామీ! మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారబ్ధమెలా వున్నదో, నా భవిష్యత్తేమో తెల్పండి' అని కోరింది. శ్రీగురుడు, నీ సంస్కారం తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా వున్న దంపతులకు తగవు పెట్టి, వారిని విడదీశావు. అందువలన యీ జన్మలో నీ ^ - భర్త నిన్ను విడిచి, సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీవొక ఆవును కొట్టి చంపావు. అందువలన నీకీ జన్మలో కుష్టురోగమొస్తుంది' అని చెప్పారు. వెంటనే రత్న, భయంతో ఏడుస్తూ ఆయన పాదాలమీద పడి, 'గురుదేవా, నన్ను రక్షించండి' అని వేడుకున్నది శ్రీ గురుడామెను ఓదార్చి, 'అమ్మా, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్టురోగమొచ్చినపుడు మా దర్శనమవుతుంది. నీకు కుష్టురోగం పొడచూపగానే దక్షిణ దిక్కునవున్న భీమానదీ తీరంలోని పాపవినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా - అమరజా నదీ సంగమం దగ్గరనున్న గంధర్వపురంలో ఆ తీర్థమున్నది' అని చెప్పి, శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయల్దేరారు.
నామధారకా! ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని 'వృద్ధగంగ' అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అదెలా వచ్చిందో చెబుతాను. పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి, తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షియైన గౌతముడు వడ్లు చల్లి, తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై, 'ఈయనకొక సంకటం కల్పిస్తే, ఈయన మనందరికోసమూ గంగను భూలోకానికి తీసుకురాగలడు. జీవులన్నింటికీ ఆ నదీస్నానం వలన సద్గతి లభిస్తుంది' అని నిశ్చయించుకొన్నారు. అందరూ కలసి ఒక ఆవును, దూడను దర్భలతో తయారుచేసి, తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి, గౌతముని పంట చేను పైకి తోలారు. అనుష్ఠానం చేసుకొంటున్న గౌతముడు, ఆవును చూచి, తన చేతిలోని దర్భతో దానిని అదలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి, అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమిమీదకు తెచ్చాడు. అందుకే దీనిని 'గౌతమి' అంటారు. అదియే ఈ గోదావరి. ఇది గూడ గంగయంతటి పవిత్రమైనది గనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తర్వాత ఆయన ఆ నదియొక్క రెండు తీరాలలోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరీ పరిక్రమం చేసారు.
ఆ పర్యటనలో శ్రీ గురుడు మంజరీకరమనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్యస్వామియనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తుండేవారు. ఒకరోజతనికి ధ్యానంలో తన యిష్ట దైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది. తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి, గద్గద కంఠంతో, 'మీరు సాక్షాత్తూ ఈ నదికి ఉత్తర తీరాన వున్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే!' అన్నాడు. 'మా దర్శనం వలన నీ సేవ ఫలించింది. ఇకనుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తూండు' అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. మాధవారణ్యుడు పారవశ్యంతో యిలా స్తుతించాడు: 'ఓ' జగద్గురు సార్వభౌమా! మీకు జయము, జయము. నరునిలా కన్పిస్తున్నా, మీరు త్రిమూర్తి స్వరూపము, లోకాలనుద్ధరించే జగజ్యోతియైన పరమ పురుషులు! మీ పాదదర్శనం వలన కృతార్థుడనయ్యాను'. శ్రీ గురుడు, 'మాధవారణ్యా! నీకు మంత్రసిద్ధియై, నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యమూ మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేసావు గనుకనే మా ప్రత్యక్షదర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది' అని ఆశీర్వదించి, గోదావరీ పరిక్రమం కొనసాగించారు.
తర్వాత శ్రీ గురుడు, వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి, స్నానానికై శిష్యులతో కలసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. అన్నం తింటే చాలు, అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్నవమినాటికి అతడు భోజనం చేసి నెలరోజులయింది. ఆ రోజతడు కడుపునిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. 'అన్ని జీవులకూ ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటె మరణించడమే మేలు' అనుకుంటూ అతడారోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకొక బండ కట్టుకుని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, 'స్వామీ, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో, అతిథులను ధిక్కరించానో, ఈ జన్మలో భూమికి భారమయ్యాను. ఎట్టి పుణ్యమూ గతజన్మలో చేయనందువల్లనే గాబోలు, ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం గూడ అనుభవించలేదు. బ్రాహ్మణుల జీవనమో, పశువుల గ్రాసము అపహరించో, నమ్మినవారికి ద్రోహం చేసానో, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో, తల్లిదండ్రులను విడచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేసానో, లేక వధూవరులను చంపానేమో! లేకుంటే, అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకొస్తుంది? ఈశ్వరుని భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురువును నిందించానేమో! లేకుంటే నన్నే దైవమూ ఎందుకు అనుగ్రహించదూ?" అని పరితపించి నదిని సమీపించాడు.
సరిగా సమాయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలసి స్నానం చేయడానికి నదివద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూచి ఆయన, అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగునపోయి, నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీ గురునివద్దకు తీసుకువచ్చారు. స్వామి అతనితో, 'బ్రాహ్మణుడా! ఆత్మహత్య మహాపాపమని తెలిసి గూడ నీవందుకే పాల్పడుతున్నావేమి?' అనడిగారు. ఆ బ్రాహ్మణుడు, 'స్వామీ! నన్నీ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేమ్నుది? పక్షానికీ, నెలకు ఒక్కసారి భోజనం చేసినా గూడ భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేనెలా బ్రతికేది? నేను జీవించడం వలన భూమికి భారమే గాని, ప్రయోజనమేమున్నది?' అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీగురుడు, 'నాయనా! క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధమిస్తాను, భయంలేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి అన్నారు.
ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసముంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా, ఆ గ్రామాధికారి గూడ వచ్చి నమస్కరించాడు. శ్రీగురుడు, 'నీవెవరు? ఎక్కడుంటావు?' అనడిగారు. ఆ గ్రామాధికారి, 'స్వామీ, మాది ఆపస్తంబశాఖ, కౌండిన్యస గోత్రము. నన్ను సాయం దేవుడంటారు. మా స్వస్థానం (కడకంచి) కాంచీపురం. కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరంనుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో మీ స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కాని ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప, తాప, దైన్యాలను హరించి, ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమయింది' అని స్తుతించాడు.
శ్రీ గురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని, 'సాయందేవా! నేనొక మాట చెబుతాను, విను. ఈ బ్రాహ్మణునికి ఉదరశూలరోగమున్నది. భోజనము లేకుండా యితడెలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవితనిని తీసుకువెళ్లి మంచిభోజనం పెట్టు' అని ఆదేశించారు. సాయందేవుడు ఆశ్చర్యచకితుడై, 'స్వామీ, నెలరోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే యితడా బాధ భరించలేక యిప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యాపాతకం చుట్టు కుంటుందేమో!' అన్నాడు. స్వామి నవ్వి, 'అలా అయితే ఇంకా మంచిమందు చెబుతాను విను! నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము, గారెలతో గూడిన భోజనమే పరమౌషధము. నీవు సంకోచించక యితనిని తీసుకుని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు' అన్నారు. సాయందేవుడు ఆయనకు నమస్కరించి శిష్యసమేతంగా శ్రీ గురుని గూడా భిక్షకు ఆహ్వానించాడు.
అపుడు శ్రీగురునితో పాటు అందరమూ సాయందేవుని యింటికి వెళ్ళాము. ఆ పుణ్యదంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని, మిగిలిన అతిథులను కూర్చోబెట్టి, రుద్ర సూక్తము మొ॥న మంత్రాలు చదువుతూ, శ్రీ గురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, 'నీ సంతతి వృద్ధిపొందుగాక! నీ వంశస్థులందరికీ మాయందు భక్తి కల్గు గాక!' అని సాయందేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు, అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీ గురుని కృప వలన ఉదర రోగియైన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి, అతని రోగబాధ మాయమైంది.
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
నామధారకుడు, "స్వామీ! అటు తర్వాత శ్రీగురుడు యేమేమి చేసారో చెప్పండి" అన్నాడు. సిద్ధయోగి సంతోషించి యిలా చెప్పారు:
"భోజనాలయ్యాక సాయందేవుడు శ్రీ గురుని పాదాలొత్తుతూ, 'సద్గురూ! మీ పాదసేవ వలన నా జన్మ, సత్కర్మలు సార్ధకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు గూడ తరించారు. ధన్యుణ్ణి. మాయచేత మానవునిలా కన్పిస్తు న్నారే గాని, మీరు సాక్షాత్తూ భక్తులనుద్దరించడానికి అవతరించిన భగవత్స్వరూపులే. మీ మహిమ వేదాలకే అంతుబట్టినిది. అట్టి మీకు సేవచేసే అవకాశం నాకను గ్రహించి నా వంశాన్నే పావనం చేసారు. కాని నాదొక విన్నపమున్నది: ప్రస్తుతము నేనొక కష్టంలో వున్నాను. వేరుదారిలేక, నేనొక యవనరాజు సేవలో వున్నాను. అతడు నరరూపరాక్షసుడే. అతడు ప్రతిసంవత్సరమూ ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలివ్వాలని తలచి, యింతకు ముందే నాకు కబురు పంపాడు. నేనిప్పుడతని వద్దకు వెళ్ళాలి. తప్పదు. నన్ను మీరే కాపాడాలి' అన్నాడు. శ్రీగురుడు అతని తలపై చేయిపెట్టి ఆశీర్వదించి, 'నాయనా! భయపడకు. ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికీ యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడే వుంటాము. దీర్ఘాయుష్మాన్ భవ!' అని పంపారు.
సాయందేవుడు శ్రీ గురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయందేవుడు భయంతో శ్రీగురుని -ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము, చనిపోతున్నంత బాధ కలిగి, స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడతనికొక స్వప్నమొచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కన్పించి, విపరీతమైన బాధ కల్గింది. అతనికి స్పృహ వచ్చేసరికి, తాను చేస్తున్న హంస యితరులకెంత బాధాకరమో తెలిసివచ్చింది. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి, సాయం దేవుని పాదాలపై పడి, 'అయ్యా! మిమ్మల్ని నేను పిలిపించలేదే! మీరు యింటికి వెళ్ళవచ్చు' అని, వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు!
సాయందేవుడు శ్రీ గురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరత్వరగా తన గ్రామం చేరి శ్రీ గురునితో జరిగినదంతా చెప్పాడు. ఆయన సంతోషించి, 'నాయనా! మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము' అన్నారు. అతడు నమస్కరించి, 'స్వామీ! నాకు మీరు ప్రసాదించిన ఈ జీవితశేషాన్ని మీ సేవకే అంకితము చేస్తాను. అనుగ్రహించండి. మీ పాదసన్నిధి విడిచి బ్రతుకలేను. నన్ను నెలవదు. నేను విడిచి పెట్టి వెళ్ళవద్దు. నేను కూడా మీ వెంట వస్తాను” అని వేడుకున్నాడు. శ్రీ గురుడు, “నాయనా! నాకు ఆత్మ సమర్పణం చేసుకున్నావు. నీ అభీష్టం నెరవేరుతుంది. మేమొక పనిమీద వెళ్తున్నాము. 16 సం॥లకు మళ్ళీ మేము ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము. నీవప్పుడు నకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకూ యిక్కడే సుఖంగా వుండు' అని ఆశీర్వదించి, . శిష్యులతో కలిసి పాదచారియై అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాధం చేరారు. అక్కడాయన కొంతకాలం గుప్తంగా నివసించారు". అది విని నామధారకుడు, "స్వామీ! అపుడు శ్రీ గురునితో అనేకమంది శిష్యులున్నారు గదా! వాళ్ళెక్కడున్నారు? శ్రీ గురుడు అక్కడ గుప్తంగా వుండి ఏమిచేసారు?” అని అడిగాడు.
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శైలశ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
సిద్ధయోగి యిలా చెప్పారు: “నాయనా! కొద్దికాలంలోనే శ్రీ గురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి, సుదూర ప్రాంతాల నుండి గూడ ఎందరెందరో తమ కోర్కెలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు. వారిలో మంచివాళ్ళతో బాటు భక్తుల వేషాలలో యెందరో దుష్టులు గూడ వుండేవారు. పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రిపర్వతానికి దక్షిణదిక్కునున్న కొంకణదేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు. కాని కొందరు దురాశాపరులు ఆయన వద్దకు వెళ్ళి, తమకు గూడ భూమి యిప్పించమని కోరారు. ఆయన ఆ ప్రదేశం గూడ వాళ్ళకు దానమిచ్చి, వాళ్ళ బెడదనుంచి తప్పించుకోడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు.
అదే కారణంగా శ్రీగురుడు గూడ వైద్యనాధంలో గుప్తంగా కొంతకాలం వుండదలచుకున్నారు. కనుక ఒకరోజున గృహస్థ శిష్యులకిలా సెలవిచ్చారు : 'ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతడికి పగటి నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నం గురువు కర్పించి ఆయన యిచ్చినది భుజిస్తూ, విద్యావంతుడు కావాలి. చివరకు గురువుకు దక్షిణ సమర్పించి, సమావర్తన హోమం చేయాలి. అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్త వయస్కుడయ్యాక, అతనికి సర్వస్వమూ సమర్పించి భార్యతో గూడ అరణ్యానికి వెళ్ళాలి. తర్వాత గ్రామ్య విషయాలను వదలి, భార్యయొక్క అనుమతితో సన్యసించాలి. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినగూడదు. వాహనము లెక్కరాదు. మంచము తాకరాదు. పగలు నిద్రింపరాదు. నిరంతరమూ ఆత్మద్రష్టయై వుండాలి. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి- వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ, దండధారియై, పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ, మూడు పగళ్ళు మించి యే గ్రామంలోనూ నివశించక స్థిరచిత్తుడై వుండాలి. అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే, సదా దైవాన్ని, ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివశించాలి'.
ఇలా చెప్పి, గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి, సన్యాసులైన శిష్యులకు శ్రీ గురుడు యిలా చెప్పారు: 'నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా శ్రీ శైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనమవు తుంది` అన్నారు. అపుడా శిష్యులు, 'స్వామీ! సర్వతీర్థాలూ మీ పాదాలవద్దనే వున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి గదా! మిమ్ములను విడిచి మేమెక్కడికి పోగలము? దానివలన మాకు కలిగే లాభమేమున్నది?' అన్నారు. అప్పుడు స్వామి, 'నాయనలారా! సన్యాసులమైన మనము ఐదురోజులకు మించి యెక్కడా నిలువకూడదు. సర్వ తీర్థాలూ దర్శించడం మన ధర్మం. దానివలన మనస్సు స్థిరమవుతుంది. అటు తర్వాత ఒకచోట స్థిరంగా వుండడం శ్రేయస్కరం' అని చెప్పారు. అప్పుడు శిష్యులు, 'స్వామీ! మీ మాటయే మాకు ప్రమాణం. మేము ఏయే తీర్థాలు దర్శించాలో సెలవీయండి' అని కోరారు. అప్పుడు శ్రీగురుడిలా చెప్పారు: 'నాయనలారా! తీర్థాలన్నింటిలోకీ ఉత్తమమైన కాశికి వెళ్ళి గంగను సేవించి, గంగాతట యాత్ర చేయండి. అటు తర్వాత యమున, సరస్వతి నదులను గూడ అలానే సేవించండి. అందువలన పితృదేవతలకు సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. తర్వాత వరుణ, కుశావర్త, శతధౄ, విపాశా, శరావతి, వితస్థా, అసిక్ని, మరుధృధా, మధుమతి, పయస్విని, ఘృతవతి, రేవా, చంద్రభాగా, రేవతి, సరయు, గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల, మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, అరుణ, బహుదా, వైరోచని, పుష్కర, ఫల్గు, అలకనంద' మొ॥న నదులలోనూ, నదీ సంగమాలలోనూ స్నానం చేసి తట యాత్రలు చేయండి. అలానే శ్రీశైలము, అనంతము, రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగము, పద్మనాభము, నైమిశారణ్యము, పురుషోత్తమము, మహాలయము, కేదారము, కోటిరుద్రము, మాతృకేశము, కుబ్జతీర్ధము, కోకాముఖి, ప్రసాద తీర్ధము, విజయతీర్ధము, చంద్ర తీర్థము, గోకర్ణము, శంఖ కర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి.
అలానే అయోధ్య, మధుర, మాయా, కాంచీ, ద్వారకా, సాలగ్రామము, శబల గ్రామములు దర్శించండి. సవ్య మార్గంలో మూడుసార్లు గోదావరీ తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి, జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వర పంజర కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంపా, భీమా నదులకు తటయాత్ర చేయండి. హరిహరక్షేత్రము, పాండురంగ క్షేత్రము, మాతులింగము దర్శించండి. గంధర్వపురం (గాణాపురము) ఉత్తమమైన క్షేత్రము. అక్కడెన్నో తీర్థాలున్నాయి. అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు. అక్కడ భీమా అమరజానదీ సంగమమున్నది. అచటి అశ్వత్థ వృక్షము సాక్షాత్తూ కల్పవృక్షమే. దానికి యెదురుగా నృసింహ తీర్ధము, దానికి తూర్పున పాపనాశ తీర్థము, దాని ప్రక్కనే రుద్రపాద తీర్ధము, చక్రతీర్ధము, తర్వాత కోటి తీర్ధము, మన్మథ తీర్ధము వున్నాయి. అక్కడనే 'కల్లేశ్వరుడు' వున్నాడు. గంధర్వపురము సాటిలేని సిద్ధభూమి గనుక, అక్కడ అనుష్టానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి. తుంగ-భద్ర నదుల సంగమము, మలాపహా సంగమము, నివృత్తి సంగమము దర్శించండి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినపుడు గోదావరికి, కన్యారాశిలోకి వచ్చినపుడు కృష్ణానదికి, తులారాశిలోకి వచ్చినపుడు తుంగభద్రకు కర్కాటకంలో ప్రవేశించినపుడు మలా సహా నదికి పుష్కరాలు వస్తాయి. అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్స రాలలో ఆయా నదులలో వచ్చి వుంటుంది గనుక, వాటిని సేవించడ మెంతో మంచిది. అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన యెంతో పుణ్యమొస్తుంది.
కుంభకోణము, కన్యాకుమారి, మత్స్యతీర్ధము, పక్షి తీర్థము, ధనుష్కోటి, కొల్హాపురము, కరవీరము, మహాబలేశ్వరము దర్శించండి. భిల్లవటి, వరుణా సంగమము, కృష్ణా తీరంలోనున్న ఋష్యాశ్రమము దర్శించండి. అమరపురం వద్ద నున్న కృష్ణవేణి, పంచనదీ సంగమములో మూడురోజులు స్నానము, ఉపవాసము చేస్తే అన్ని కోరికలూ తీరడమే గాక, పరమార్థము గూడ లభిస్తుంది. యుగాలయము, శూర్పాలయము, కపిలాశ్రమము, కేదారము, పిఠాపురము దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయస్వామి వున్నారు. తర్వాత మణిగిరి, ఋషభాద్రి, కల్యాణనగరము, అహోబిలము దర్శించండి. కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు గనుక, వాటిలో స్నానం చేయ కూడదు. నదీ తీరాలలో నివశించేవారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు. నదులకు క్రొత్తనీరు వచ్చే రోజులే రజస్వల కాలము'. అప్పుడు శిష్యులాయనకు సాష్టాంగ నమస్కారము చేసి, వారి ఆశీస్సులు పొంది, తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే వున్నాను"
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన : అద్వితీయమైన భగవంతుడు సృష్ట్యాదిలో "నేననేకమగుదును గాక" అని సంకల్పించి, తన వినోదార్ధం ఈ అనంత సృష్టిజాలాన్ని రచిస్తాడు. ఐనా సకల కళ్యాణ గుణనిధియైన పరమాత్మయొక్క ఇట్టి సంకల్పం కూడ జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను, కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటినుండి తిరిగి ఆ జీవులు సుఖదుఃఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కాని అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవము పూర్తయ్యేలోపల, ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచు కుంటాయి. వారిపై కృపవలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి, శ్రీ పాదస్వామి, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులనుద్ధరిస్తాడు కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి, చివరిమెట్టూ కూడా.
సద్గురువు త్రిమూర్త్యాత్మకుడూ, పరబ్రహ్మమూ గూడ. ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించినా మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. కాని సామాన్యులకు ఏ వస్తువునైనా, వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం వుండదని, ఈ అధ్యాయంలోని గురుపరాజ్ముఖుడైన విప్రుని వృత్తాంతం తెల్పుతుంది. "సర్వం ఖల్విదం బ్రహ్మా", "ఇదంతా బ్రహ్మ" అని శ్రుతులు చెప్పినా అలాటి భావంతో ప్రాణులు' వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలనగాదు. కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్దరిస్తాడు.
వివేకం లేని భక్తులకు గురువుపట్లకూడ స్థిరమైన భక్తివిశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువమంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. "మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే!" జ్ఞాన సిద్ధికై యత్నించేవాడు వెయ్యికి ఒక్కరుంటారని, అట్టి వారిలో గూడ లక్ష్యాన్ని సాధించేవారే కొద్దిమందో వుంటారనీ భగవద్గీత చెబుతుంది. పూర్ణదత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి. కనుక అవివేకంతో గురువుని విడచిన అజ్ఞానాంధుని చేత పూర్వ గురువుని స్మరింపచేసి, అతనికి దర్శనమిచ్చి ఉద్దరించగలరని యీ అధ్యాయం తెల్పుతుంది. శ్రీ సాయి చరిత్రలో యిలాటి లీలలెన్నో చూడవచ్చు.
పూర్ణుడైనా, నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్ఠను కాపాడుతారు. ధౌమ్యుడు శిష్యునిచేత అశ్వినీ దేవతలను స్తుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు. ప్రాయశ్చిత్తకాండలో శ్రీ గురుడలానే చెప్పడం గమనించాలి. శ్రీ సాయి గూడ "విష్ణు సహస్రనామము", "భాగవతము” మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు. ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురూపదేశం యొక్క విలువగూడ భక్తులకు తెలియగలదు. గురు మహిమను, సేవనూ వివరించే ఈ అధ్యాయం గురుచరిత్రలో ముఖ్యమైనది.
నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, "మహాత్మా, అపుడు శ్రీ గురుని ఆజ్ఞననుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవ్వరు? అటుపై యేమి జరిగింది?" అని అడిగాడు. సిద్ధయోగి యిలా చెప్పారు: “నామధారకా ! నీవు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని యెవరూ కోరనందువలన నా మనస్సు నివురుగప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి యింతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూండడం వలన ఆయన కథలు గుర్తుతెచ్చుకున్నకొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది. ఆనంద పారవశ్యం కలుగుతున్నది. నీవు గూడ నాకెంతో ఉపకారం చేసావు. నీవు వయసులో చిన్నవాడవైనా, శ్రీ గురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడవవుతావు. నీ వంశమంతా పుత్ర, పౌత్ర, ధన, ధాన్యాలతోనూ, సుఖశాంతులతోనూ, విలసిల్లుగాక! శ్రీగురుని చరిత్ర చెబుతాను. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను. శ్రద్ధగా విను: శ్రీ గురువు ఆజ్ఞననుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే వుండిపోయాను. అప్పటినుండి ఒక సంవత్సరము పాటు శ్రీ గురుడు వైద్యనాధంలోనే గుప్తంగా వుండిపోయారు. ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, 'స్వామీ, నేను ఆత్మసిద్ధికై ఎంతోకాలం తపస్సు చేసినా గాని, నా మనస్సు యే మాత్రమూ ప్రశాంతమవలేదు. కాని మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనస్సు స్థిరమవకపోవడానికి కారణ మేమిటి? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు. నన్నను గ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి. మిమ్ములను శరణు వేడుతున్నాను' అన్నాడు.
శ్రీ గురుడు నవ్వి, 'నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సెలా చేసావు?' అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, 'స్వామీ! మొదట నేనొక గురువునాశ్రయించి చాలాకాలం సేవించాను. కాని ఆయన నాచేత అన్నిసేవలూ చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతుండేవారు గాని, నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు, “నీకింకా బుద్ధి స్థిరంకాలేదు" అని చెప్పి, నాకు వేదముగాని, శాస్త్రంగాని, భాష్యంగాని చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడాయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేనాయనను విడిచి వచ్చేసాను' అని చెప్పాడు. శ్రీ గురుడు ముక్కుమీద వేలువేసుకొని, 'అయ్యో బ్రాహ్మణుడా! ఎంత పని చేసావు? నీవుచేసిన పని ఆత్మహత్యంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక, గురువును నిందిస్తున్నావు. నీకింక మనస్సు నిశ్చలమెలా అవుతుంది? దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవెక్కడికి పరుగెడితే మాత్రం నీకు జ్ఞానమెలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోను, పరంలోనూ సుఖముండదు. అతడికి జ్ఞానమెన్నటికీ కలుగదు; అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే. గురువునెలా సేవించాలో తెలిసినవాడికే వేదవేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులూ అతనికి అధీనమవుతాయి. నీవంటి గురుద్రోహి ముఖం చూడడం గూడ అపశకునమవుతుంది. దేవాలయంలో మలవిసర్జన చేసి, అందుకు తిట్టినవాణ్ణి తప్పుపట్టినట్లుంది నీ పని!' అన్నారు. అప్పుడా విప్రుడు భయపడి, దుఃఖంతో స్వామి పాదాలపైబడి, 'పరమగురూ! జ్ఞానసాగరా! బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేసాను. గురువునెలా తెలుసుకోవాలో, సేవించాలో తెలిపి నన్నుద్దరించండి' అని దీనాతిదీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీ గురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో యిలా చెప్పారు:
“నాయనా! గురువే తల్లి,తండ్రి. ఆయనయే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రత్యక్షరూపం. నిజమైన మేలుచేయగలవారు ఆయనొక్కరే. ఇందుకు సందేహంలేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో, పట్టుదలతో గురువును సేవించాలి. అది తెల్పేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను.
ద్వాపరయుగంలో ధౌమ్యుడనే బ్రహ్మర్షి వుండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు. ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదమభ్యసిస్తూ, ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు. అహంకారము మొ॥న దోషాలు తొలగి, మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యులచేత సేవలు చేయిస్తుండేవారు. అతని సేవనుబట్టి అతని గురుభక్తిని, మనశ్శుద్దినీ నిరూపించి అనుగ్రహించేవారు.
ఒకనాడు ధౌమ్యుడు, అరుణిని పిలిచి, 'నీవు మన పొలానికి వెళ్ళి, చెరువునుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరిపైరు ఎండిపోతుంది' అని చెప్పారు. అరుణి వెంటనే వెళ్ళి చెరువునుండి కాలువద్వారా నీరు పెట్టాడు. కాని కాలువకు ఒకచోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి, రాళ్ళు ఎంతవేసినా కట్ట నిలువలేదు. అప్పుడతడు, ప్రాణం పోయినా సరే, గురువు చెప్పినది చేసితీరాలన్న తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడా నీరు అతనిమీదుగా పొలానికి ప్రవహించింది. చీకటిపడినా గూడ అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి, పొలం నిండుగా నీరుండడం గమనించారు. కాని శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి, ఆయన శిష్యునికోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధాన మీయలేక కొంచెంగా శబ్దం చేసాడు. దానినిబట్టి ధౌమ్యులవారు వచ్చి శిష్యుని లేవనెత్తి, కౌగలించుకొని, సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు ధౌమ్యమహర్షి, 'నాయాన! నీవింటికి వెళ్ళి, తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు. కృతార్థుడవవుతావు' అని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి యింటికి వెళ్ళి, లోకపూజ్యుడయ్యాడు.
ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, 'నాయనా! పైరు పంటకొచ్చింది. నీవు రోజూ కావలి కాచి పైరు కోసి, ధాన్యం యింటికి చేర్చు' అని చెప్పారు. బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి, పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి,పంట పక్వానికొచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి, ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికొక బండి, ఒక దున్న పోతునూ యిచ్చి, ధాన్యం యింటికి చేర్చమని చెప్పారు. అతడా బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి, మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం యింటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి, తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి, ఆ శ్రమకోర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి, అతని గురుసేవా దీక్షకు మెచ్చి, అతని మెడనుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగలించుకుని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి యింటికి పంపారు. కొద్దికాలం లోనే అతడు గూడ అరణి వలె లోకప్రసిద్ధుడయ్యాడు.
ఇంక ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది గాదు. ధౌమ్యుడు ఆలోచించి, ఒకరోజు అతనిని పిలిచి, 'నాయనా! నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూండు' అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్ళాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. ధౌమ్యుడది. చూచి, 'నీవు ప్రతిరోజూ సూర్యాస్తమయం వరకూ గోవులను మేపాలి' అన్నారు. మరునాటి నుండి, ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి, సంధ్య వార్చుకుని, దగ్గరలోనున్న బ్రాహ్మణుల యిండ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు. అందువలన కొద్దికాలానికి అతని శరీరానికి మంచి పుష్ఠి కల్గింది. అది గమనించిన ధౌమ్యుడు, ఒకరోజున అతనినడిగి కారణం తెలుసుకొని, 'నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా? నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి, మరల అడవికి పోయి ఆవులను మేపుకొనిరావాలి' అని ఆజ్ఞాపించారు. ఉప మన్యువు అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని యెంతగానో బాధించేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి, రెండవసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా వుండడం చూచి ధౌమ్యుడు కారణమడిగి తెలుసుకుని, ఆ రెండవ భిక్షను గూడ తమకే యివ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి, ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్దికాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు ధౌమ్యులవారు అందుకు కారణము అడిగి తెలుసుకుని 'ఒరే! పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు గూడ బుద్ధిహీనుడవవుతావు. కనుక త్రాగవద్దు' అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి, వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది, అతని కళ్ళు రెండూ కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెదుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు.
సూర్యాస్తమయమైనా శిష్యుడింటికి రాకపోయేసరికి, అతనిని వెదుకుతూ ధౌమ్యులవారు అడవికి వెళ్ళారు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలోనుండే సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని, అశ్వనీ దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టివచ్చింది. వెంటనే అతడు బావినుండి బయటకువచ్చి గురువుకు నమస్క రించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయిపెట్టి,'నాయనా! నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు గూడ నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తిచేత నాగలోకాన్ని జయించి, నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వత మొనర్చగలడు' అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై, యింటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యులవారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది.
కనుక, 'నాయనా, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీలేదు. గురుద్రోహం వలన యిహపరాలలో సుఖమే వుండదు. సరిగదా, నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి, ఆయనను ప్రసన్నం చేసుకో! ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది'.
శ్రీ గురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, 'స్వామీ! నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు గూడా ఎన్నో! విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యంగాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను' అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి, 'నాయనా! తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు' అని చెప్పి అతనిని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై, శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే, వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీ గురుడు, 'నాయనా! నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో!' అన్నారు. అతడలానే చేసి తర్వాత ముక్తి పొందాడు.
ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాధంలో నివసించి, తర్వాత శ్రీనృసింహ సరస్వతి దేశసంచారం చేస్తూ, కృష్ణా తీరంలో వున్న భిల్లవటీ గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధి చేరి, అచ్చట కృష్ణ-వేణి సంగమంలో పడమట తీరానవున్న ఉదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివశించారు.”
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః
ప్రస్తావన: ఈ 17, 18, 19 అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురము (నరసోబావాడీ) క్షేత్ర మహాత్మ్యాన్ని, అక్కడ శ్రీ గురుడు చేసిన లీలలనూ వర్ణిస్తుంది. ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తమ చేయి పెట్టి సకల విద్యాపారంగతుడుగా చేశాడు. ఇలాటి లీల శ్రీ స్వామి సమర్థులు (1856-78) జీవిత చరిత్రలో చూడవచ్చు. పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తి, ముక్తులను ప్రసాదించాడు. ఇలాటి లీలలు గూడ శ్రీ స్వామి సమర్ధ, శ్రీ శిరిడీ సాయిబాబా జీవిత చరిత్రలలో చూడవచ్చు. గంగానుజుడనే భక్తుడిచేత క్షణకాలంలో త్రిస్థలి, కాశీ, ప్రయాగ, గయ క్షేత్రాల యాత్ర చేయించాడు. ఇలాటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవితచరిత్రలో చూడవచ్చు. శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికీ ఎలాటి సద్గురు రూపాలలో మానవులనుద్ధరిస్తున్నారో వీరి చరిత్రలలో చూడవచ్చు. అది గుర్తుంచుకొని మనమీ పారాయణ చేయాలి. శ్రద్ధాయుతమైన యీ అధ్యాయం పారాయణ ఆయా క్షేత్రదర్శనంతో సమానం.
దేవి తననాశ్రయించిన విద్యాహీనుడితో శ్రీ గురువునాశ్రయించమని చెప్పిన లీల సప్తశృంగిదేవి కాకాజీ అనే భక్తుడితోను, చిన్న కిస్నా అనే భక్తునితో స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది. దేవతల కంటే సద్గురువు అధికుడని యీ లీలలకర్ధం. శ్రీ రామకృష్ణ పరమహంసతో కాళీమాత గూడ అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురియనే గురువును ఆశ్రయించమనడం గమనార్హం. ఇష్టదేవతోపాసన విక్షేపదోష నివృత్తి కోసమేనని, ఆత్మజ్ఞానానికై శ్రోత్రియుడూ, బ్రహ్మనిష్ఠుడూ అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దానినే ఈ లీలలు బలపరుస్తాయి. ముముక్షువుకు సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని యీ అధ్యాయం తెల్పుతున్నది. మానవ మాత్రుడైన గురువునాశ్రయించిన వారిని గూడ ఆ రూపంలో అనుగ్రహించి తరింపజేయవలసినది సద్గురువేనని క్రిందటి అధ్యాయంలోని చివరి లీల తెల్పు తున్నది. శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపినని భక్తులకనుభవమిచ్చిన లీలనెంతగానో యిది పోలియున్నది. కనుకనే శ్రీ గురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవా వృత్తాంతాలను క్రిందటి అధ్యాయంలో చెప్పాడు.
సిద్ధముని యింకా యిలా చెప్పారు, "నాయనా, మబ్బువేసేముందు చల్లనిగాలి వీచినట్లు, గురుకథ వినడంలో నీకు అది విన్పించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని భక్తులపాలిట కామధేనువు, కల్పవృక్షము అయిన యీ శ్రీ గురుచరిత్ర చెబుతాను విను:
శ్రీ గురుడు కృష్ణాతీరంలో భిల్లవటి వద్దనున్న మేడిచెట్టు' దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాస్యం చేసారు”. అది వినగానే నామధారకుడు నమస్కరించి. "స్వామీ, భగవంతుడైన శ్రీగురుడు తపస్సు, అనుష్టానము యెందుకు చేసారు? అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకొనడమెందుకు?" అని అడిగాడు.
సిద్ధయోగి, “నాయనా! భగవంతుడైన శివుడు, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడూ భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్ధయాత్ర చేయడము, తపస్సు చేయడముగాని, భిక్షమెత్తడం గానీ భక్తులనుద్ధరించడానికి, సాధకులకు సన్మార్గము తెలియజెప్పడానికీ మాత్రమే చేస్తారు. అలానే శ్రీగురుడు గూడ భిక్షావృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమతీర్థాల నెన్నింటినో తిరిగి ప్రకటం చేయడానికే తీర్ధయాత్రలు చేసారు. కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించేమూర్ఖులు, స్వార్థపరులు తమనాశ్రయించకుండా చూచుకోడానికి ఆయన కొంతకాలం గుప్తంగా వున్నారు. కాని సూర్యుని తేజస్సు, కస్తూరి వాసన ఎలా దాగివుండలేవో అలాగే శ్రీగురుని మహిమగూడ ఒకనాడీ విధంగా వెల్లడయింది;
కరవీరపురంలో వేదశాస్త్రపురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు కణ్వశాఖీయుడు, మహా పండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కాని అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి గావడంతో చదువు ఏ మాత్రమూ రాలేదు, మేనమామ, గ్రామస్థులతో గలిసి అతనికి 7వసం॥లో ఉపనయనం చేసాడు. కాని మతిమరుపువల్ల అతడు గాయత్రీ మంత్రానుష్టానం గూడ చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసిన ఒక సంవత్స
అదే నేడు 'ఔదుంబర్'గా ప్రఖ్యాతమైన దత్తక్షేత్రము.
రానికే మేనమామ గూడ మరణించడంతో అతడు అనాధుడై భిక్షకెళ్ళేవాడు. ఊళ్ళోని జనం అతనిని, 'ఒరే మందమతీ! అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకిచావరాదా? నీ జన్మం వ్యర్ధం, విద్యావంతుడు. వయస్సులో చిన్నవాడైనా, అతనెక్కడికి వెళ్ళినా సోదరునివలె విద్య అతని వెంటనుండి అతనికి కీర్తి, గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివశిస్తారు. గనుక, అతడు వయోవృద్ధులకు గూడ పూజ నీయుడే. విద్యలేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతనినెవరూ ఆదరించరు. విద్యలేని నీవు పశువు కంటే హీనం', అని హేళన చేసేవారు.
అతడందుకు బాధపడి, 'అయ్యా మీరు చెప్పినది నిజమేగాని, నేనేమి చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు గాబోలు, నాకీదుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి' అని ప్రాధేయపడేవాడు. అతనికి విద్య చెప్పిచెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, 'నీకిక జన్మలో విద్యరాదు. నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి గూడ పనికిరావు. నీవలన నీ వంశమే భ్రష్టమైంది', అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది, యిల్లు విడిచి భిల్లవటి చేరి, కృష్ణానదికి తూర్పదిక్కున వున్న భువనేశ్వరీ దేవిని దర్శించి, అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా మూడురోజులు గడిచినా ఆ తల్లి దర్శనమీయకపోయేసరికి. అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాలవద్ద పెట్టి, 'అమ్మా! నీవు గూడ నన్ననుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి, నీ యెదుటనే ప్రాణాలు విడుస్తాను' అని చెప్పు కున్నాడు. నాటి రాత్రి, దేవి అతడికి కలలో కనిపించి, 'నాయనా! నాపై అలుగవద్దు. కృష్ణానదికి పడమటి తీరాన వున్న మేడి చెట్టుక్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము. అపారశక్తిమంతుడు. నీ కోరిక తీర్చగలడు'. అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయల్దేరి, శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమ స్కారము చేసాడు. శ్రీ గురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయినుంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే నాలుక రావడమేగాక, సకల విద్యలూ సిద్ధిం చాయి. కాకి మానససరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరశువేది స్పర్శతో యినుము బంగారమైనట్లు, శ్రీ గురుని హస్త స్పర్శవలన ఆ విప్ర కుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమ గల దయింది".
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీ పాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః
నామధారకుడు, "స్వామీ! శ్రీ గురుని లీలలు యింకా వినిపించ వలసింది" అని ప్రార్ధించాడు.
సిద్దయోగి యిలా చెప్పారు. "నాయనా! అంతవరకూ గుప్తంగా వున్న శ్రీగురుని మహిమ ఈ లీలవలన లోకానికి వెల్లడయింది. ఇక శ్రీ గురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై, అచ్చటినుండి వరుణా సంగమం చేరి, అక్కడినుండి కృష్ణాతీరంలో నున్న తీర్థాలలో స్నానం చేస్తూ, కృష్ణ-పంచనదీ సంగమానికి వెళ్ళి, అక్కడ 12 సం॥లు నివశించారు. 1.అక్కడ శివ, భద్ర, భోగవతీ కుంభీ, సరస్వతీ అను మహాపవిత్రమైన అయిదు నదులూ ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో గూడా మనోహర తీర్ధమని ఎంతగానో కీర్తించబడింది. అక్కడెన్నో తీర్ధాలు వున్నాయి. అక్కడినుండి తూర్పున అమరపురమనే గ్రామంలో అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తున్నారు. అచ్చటి అమరేశ్వర లింగం సాక్షాత్తూ కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణీ నదితో కలిసిన కృష్ణ, దక్షిణ దిక్కుగా ప్రవహిస్తూన్నది. అక్కడకు ఉత్తర దిక్కున శుక్ల తీర్ధము, ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశతీర్థము, కామ్య తీర్ధము, వరద తీర్ధము వున్నాయి. సంగమంలో శక్తి తీర్ధము, చామర తీర్ధము, కోటి తీర్ధము వున్నాయి. అవన్నీ అపారమైన మహిమ గలవే. అచ్చటి కృష్ణా పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్ధక్షేత్రము. దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి. అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తూ కల్పవృక్షము. ఆ క్షేత్రమహిమను వెల్లడి చేయడానికే శ్రీగురుడక్కడ అంతకాలం నివసించారు.
ఇదే నేడు 'నర్సోబావాడి' లేక 'నృసింహవాడి' అనే క్షేత్రం.
శ్రీ నృసింహ సరస్వతీస్వామి ప్రతిరోజూ భిక్షకు అమరపురానికి వెళుతుండే వారు. ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడుండేవాడు. అతడు పరమ సాత్వికుడు. కేవలం యాయవార వృత్తితో జీవిస్తూండేవాడు. అతనికొక కుమారుడు, ఒక కుమార్తె వున్నారు. అతడి యింటిముందు తమ్మపాదు ఒకటి వుండేది. అతనికి గ్రామంలో గింజలు లభించనప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకుని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచ యజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ, అతిథు లను తమ శక్తిననుసరించి సేవిస్తూండేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతని యింటికి భిక్షకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆరోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ యింటిముందున్న తమ్మ కాయలు కోసి వండి, స్వామికి దానినే సమర్పించారు. తర్వాత స్వామి, వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, 'మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము. నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది' అని చెప్పి, నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి, దాని కొమ్మలను త్రుంచివేస్తూ త్వరత్వరగా వెళ్ళిపోయారు.
అది చూచి ఆ యిల్లాలు ఎంతో దుఃఖించి, 'అయ్యో! స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి? మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే! మనం జీవించేదెలా?' అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు, 'సర్వమూ ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్దాన్ననుసరించి జరుగుతుంది. చీమల దగ్గరనుండి సర్వజీవులకు ఆయువు, ఆహారము ప్రసాదిస్తాడేగాని, ఆయన మనకెందుకు కీడు చేస్తారు? - ఏదైనా మన కర్మననుసరించే జరుగుతుంది. నీవు బాధపడవద్దు' అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు. గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దమొచ్చింది. అక్కడ త్రవ్వి చూడగా, ఒక రాగిబిందె నిండుగా బంగారు నాణాలున్నాయి. అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి, 'చూచావా? స్వామి ఈ లతను పీకివేయడంవల్లనే ఈ నిధి మనకు దొరికింది. ఆయన సాక్షాత్తూ పరమేశ్వరుడే' అని చెప్పాడు. వెంటనే ఆ దంపతులు శ్రీ గురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు. అప్పుడు శ్రీగురుడు, 'నాయనా! నీవీ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. చెబితే సంపద నశిస్తుంది. స్వధర్మాన్ననుసరిస్తూ, భోగభాగ్యాలనుభవించి, తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు' అని దీవించి పంపారు".
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యోనమః
నామధారకుడు, "స్వామీ! అశ్వత్థవృక్షం (రావిచెట్టు) వంటి పవిత్రమైన వృక్షాలెన్నో వుండగా, శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం (మేడిచెట్టు) మూలంలోనే నివశించడానికి కారణమేమి?" అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్దమునీంద్రుడు యిలా చెప్పారు: "పూర్వము నరసింహస్వామి అవతరించి, హిరణ్యకశిపుణ్ణి చంపినపుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతిగోళ్ళకంటుకుని, ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ, ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని, 'నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలగుగాక! నిన్ను పూజించినవారి పాపాలు నశించి, అభీష్టాలు నెరవేరుతాయి. నీ నీడన చేసిన జపధ్యానాదులకు ఆపారమైన ఫలితముంటుంది. మేమిద్దరమూ నీ యందు నివశిస్తాము' అని వరమిచ్చాడు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీ గురుడు ఆ చెట్టుక్రింద నివశించారు. నేటికీ ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివశిస్తుంటారు.
శ్రీ గురుడక్కడ నివశిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో వున్న నలభైమంది యోగినులు మధ్యాహ్నసమయంలో ఉదుంబర వృక్షం క్రిందనున్న శ్రీ గురుని దర్శించి, తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి యథావిధిగా పూజించి, ఆయనకు భిక్ష యివ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి, మరలా వచ్చి ఆ వృక్షమూలంలో కూర్చుంటుండేవారు. అమరపురంలోని విప్రులకు-స్వామి నిత్యమూ భిక్షకోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది. ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్ధంగాలేదు. వారా రహస్యాన్ని తెలుసుకో దలచి, ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగియుండి, మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు. కాని ఆ సమయ మయ్యేసరికి అతనికి, ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబూనడం మహాపాప మని తోచి, విపరీతమైన భయమేస్తుండేది. దానిని తట్టుకోలేక ఒకరోజతడు యింటికి పారిపోయాడు.
అక్కడకు దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటుండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటబడింది. -అకస్మాత్తుగా నదీజలం అడ్డంగా, రెండుగా చీలిపోయింది. అందులోనుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా, యోగినులు కొందరు నది నుండి బయటకి వచ్చి, అచటి మేడిచెట్టుక్రింద కూర్చొనివున్న శ్రీ గురుని వద్దకు వెళ్ళారు. వారు ఆయనను పూజించి, ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని, తర్వాత స్వామిని తీసుకుని, వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు. మర్నాడు గూడ అదే సమయానికి సరిగా అలానే జరగడం చూచి అతడాశ్చర్యపోయి, కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్యమందిరం చూచాడు. వారుదేవకన్యలని,వారిచేత పూజింపబడుచున్న యతి సామాన్య మానవుడు గాడనీ అతడు గుర్తించాడు. మూడవరోజు అదే సమయానికి అచటికి వెళ్ళి, అతడు ఆ యోగినుల వెనుకనే నదీగర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచటి మందిర ద్వారం దగ్గర నిలచి, అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చో బెట్టి, పూజచేసి, నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు. తర్వాత శ్రీగురుడు, మందిరం నుండి తిరిగివస్తూ గంగానుజుణ్ణి చూచి, 'నీవెవరవు? ఇక్కడికెందుకు వచ్చావు?' అని అడిగారు. అతడు భయపడి ఆపాదమస్తకమూ వణికిపోతూ, 'స్వామీ! నా పేరు గంగానుజుడు. నేను కుతూహలమాపుకోలేక మీ వెనుక యిచటికి చూడవచ్చాను. నా అపరాధం క్షమించండి!' అని ఆయనకు నమస్కరించి, 'మీరు సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానులైన మానవులు మీనిజరూపం తెలుసుకోలేకున్నారు. నన్నుద్ధరించండి' అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, 'నాయనా! నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కాని నీవిప్పుడు · చూచినది మేమీ ప్రాంతంలో వున్నంతకాలం యెవ్వరికీ చెప్పవద్దు. చెబితే తక్షణమే 'నీవు మరణిస్తావు' అన్నారు. గంగానుజుడు అలాగేనని చెప్పి, గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికక్కడ ఒక నిధి దొరికింది. నాటినుండి అతడు ప్రతిరోజూ భార్యాసమేతంగా వచ్చి శ్రీ గురుణ్ణి సేవిస్తుండేవాడు.
ఒక మాఘపూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీ గురుణ్ణి దర్శించి, 'స్వామీ, మాఘమాసంలోప్రయాగ, కాశీ, గయలలో స్నానం చేయడం యెంతో పుణ్యమని చెబుతారు.కాని వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహాత్మ్యము వినినా గూడ పుణ్యమొస్తుందంటారు. కనుక దయతో వాటిని వివరించి చెప్పండి' అని కోరాడు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి, 'ఈ కృష్ణా - పంచనదీ సంగమం సాక్షాత్తూ ప్రయాగయే. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశి, గయ ఎంతో మహత్తరమైనవి. అలాగే యిక్కడి సంగమము, యుగాలయము, కరవీరము అనే మూడూ గూడ త్రిస్థలి అని తెలుసుకో. ఈ మూడింటినీ నీకిప్పుడే చూపిస్తాను' అని చెప్పి, స్వామి పులిచర్మంపై కూర్చుని, గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి, మధ్యాహ్నం కాశిలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రమయ్యేసరికి గయ దర్శనం గూడ చేయించి, సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకు వచ్చారు. తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ వున్న మూడు క్షేత్రాలను గూడ చూపించారు.
ఈరీతిన ఆ క్షేత్ర మహాత్మ్యం వెల్లడిచేసాక, శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలచారు. ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి, 'ప్రభూ! మీ సేవకులమైన మమ్మల్ని వదలిపెట్టి ఎక్కడకుపోతారు?' అని విలపించారు. శ్రీ గురుడు వారిని వూరడించి, 'లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా, మేము నిజానికి అదృశ్యంగా యీ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ వుంటాము. మీరు గూడ మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివశించండి. అమరపురానికి తూర్పుదిశన మా నివాసమైన యీ క్షేత్రం లోకప్రసిద్ధమవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని గూడ మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని, ఈ ఉదుంబర వృక్షాన్నీ, మా పాదుకలను, ద్విజులనూ పూజించి, యిచ్చట తీర్థాలలో స్నానం చేసినవారికి సర్వపాపాలూ నశించి, అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం క్రింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన నత్క ర్మలకు కోటిరెట్లు ఫలముంటుంది. ఇచ్చటి పాదుకలను పూజించి, నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి, ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వ రోగాలూ నశిస్తాయి' అని చెప్పి, శ్రీ గురుడు, ఆశ్వయుజ బహుళ ద్వాదశినాడు గంధర్వ నగరంలోని భీమ-అమరజా సంగమానికి వెళ్ళారు.
శ్రీ నరసింహ సరస్వతీస్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ, ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్యనివాసము చేస్తూనే వున్నారు."
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీ పాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన : మీరు చదవబోవు 20, 21 అధ్యాయాలు తెల్పే అంశాలివి: (1) శ్రీ గురుడు ఒకచోట వుంటూ అంతకముందు తామున్నచోట గూడ సూక్ష్మ రూపంలో అచటి భక్తులను రక్షించాడు. మహనీయులు సర్వగతులై భక్తులేక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర గూడా తెల్పుతుంది. (2) బ్రహ్మజ్ఞాని కొద్దికాలమున్న చోట తీర్థ క్షేత్రమవుతుందని, అక్కడ చేసిన జపము, పూజ ఎన్నో రెట్లు ఫలమిస్తాయని శాస్త్రం. (3) శ్రీ గురుడు, అక్కల్కోట స్వామి, సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వ కర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులలో సులభంగా తొలగించి మృతులను గూడ బ్రతికించగలరు. (4) సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు గావు. కాని సద్గురువిచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చరిత్రలూ నిరూపిస్తాయి. (5) సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులెప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు - నామధారకుడికి శ్రీ గురుని అనుగ్రహం లభించినట్లే. కనుక శ్రద్ధతో ఈ గ్రంధం పఠించేవారి యెదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై వుంటాడని గుర్తుంచు కోవాలి.
నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, "స్వామీ! శ్రీ గురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత గూడ అమరపురంలోని ఉదుంబర వృక్షం క్రింద నివశిస్తూ భక్తుల కోరికలను నెరవేస్తున్నారని చెప్పారు గదా! అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా?" అని అడిగాడు. సిద్ధముని సంతోషించి యిలా చెప్పసాగారు:
“నాయనా, అటువంటి నిదర్శనాలు ఎన్నో వున్నాయి. అవన్నీ చెప్పడం ఎవ్వరితరమూగాదు. అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను. 'శిరోల' అనే గ్రామంలో వేదశాస్త్రపరాయణుడు, ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారుగాని, ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె యెందరో దేవతలను పూజించింది. ఎన్నో వ్రతాలు, ఉపవాసాలు చేసింది. అయినా ఆమెకర్మ తీరలేదు. చివరకామె తన శోకానికి కారణము, నివారణోపాయము తెల్పమని ఒక దైవజ్ఞుని కోరింది. అతడు, 'అమ్మా! నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే. గర్భపాతం చేసినా, యితరుల ధనం అపహరించినా, తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణునివద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని, అతడెంత బ్రతిమాలినా తిరిగి యివ్వలేదు. అతడా దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై యీ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవీకర్మ అనుభవించక తీరదు' అని చెప్పాడు. ఆమె పశ్చాత్తా పంతో అతని పాదాలపైబడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, 'అమ్మా! ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందు వలన అతనికి శ్రాద్ధకర్మలు యెవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడమూ-ఇవన్నీ నీవలననే జరిగాయి. గనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు ఒక నెలరోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యమూ ఏడుసార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము, పూజచేసి, శ్రీగురుని పాదుకలకు పూజ, అభిషేకము చేస్తూ, ఉపవాసము చేయి. అటు తర్వాత నీవతనికి అంత్యక్రియలు చేసి, అతని సగోత్రీకుడైన ఒక బ్రాహ్మణునికి నీవపహరించిన వందరూపాయలు దానమివ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలిగి, శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్దాయం గల కొడుకులు కలుగుతారు'.
ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, 'అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను గాని, ఆ బ్రాహ్మణుని సగోత్రునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకము లేదు. మరినేనేమి చేయాలి?' అని వాపోయింది. ఆ దైవజ్ఞుడు, 'అమ్మా, అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకలను అర్చించి నీ శక్తిమేరకు దానమివ్వు. ఆ ఉదుంబర వృక్షంలో నిత్యనివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి గనుక నీ భక్తికి మెచ్చి నీ పాపపరిహారం చేస్తారు' అని చెప్పాడు.
అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతమాచ రించనారంభించింది. మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నమొచ్చింది. కలలో ఆ పిశాచం కనిపించి, ఆమెను భయపెట్టి, తన సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడామె మేడిచెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీ గురుడున్నాడు! ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీ గురుడామెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తూన్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడాపిశాచం ఆయనతో, తనకు ఆమెచేసిన అన్యాయం గురించి చెప్పి, 'స్వామీ, తపస్వులు, యతీశ్వరులు అయిన మీకు ఆమెపట్ల పక్షపాతం తగదు' అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు కోపంతో, 'నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను. ఈమెనిలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టు కుంటాయే గాని, లాభమేమిటి? ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో గదా! ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువలన ఈమెచేత ఊర్ధ్వదైహిక కర్మలు చేయించి యథా శక్తి దానమిప్పిస్తాము. నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేము చెప్పినది నీకు నచ్చితే సరే. లేకపోతే నీకీ దుస్ధితి తప్పదు. మేము మాత్రం ఈమెను 'రక్షించి తీరుతాము' అన్నారు. ఆ పిశాచం, 'స్వామీ! మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది. మీరెలా చేసినా సంతోషమే' అన్నాడు. శ్రీ గురుడు శాంతాదేవితో, 'అమ్మా! నీవు యథాశక్తి పైకం వెచ్చించి, అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం తొలగి, పూర్ణాయువు గల కొడుకులూ, కూతుళ్ళూ కలుగుతారు' అని చెప్పి, వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకాయన విధించారు. ఆమెనిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి, 16వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలిగిపోయాయి.
తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి, రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, 'అమ్మా! నీ వ్రతము పూర్తి అయిందికదా? పారణకు యీ కాయలు వాడుకో! నీకు నిస్సందేహంగా వేదవిదులు పుడతారు' అని చెప్పారు. ఆమె నిద్రలేచి చూచేసరికి, నిజంగానే ఆ రెండు ఫలాలూ ఆమె ప్రక్కన వున్నాయి! ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది. ఆ దంప తులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి, వాటిని పారణకు ఉపయోగించారు. తర్వాత కొద్దికాలానికి ఆమెకు యిద్దరు మగపిల్లలు కలిగారు. పెద్ద పిల్లవాడికి 7వ సంవత్సరము, రెండవ వానికి 3వ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము, రెండవ వానికి చౌల సంస్కారము (పుట్టు వెంట్రుకలు తీయించుట) చేయాలని ముహూర్తం నిర్ణయించి, ఆ దంపతులు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. కాని ఆ ముహూర్తానికి ముందురోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి, మరుసటిరోజు సాయంత్రం సుర్యాస్తమయాని కల్లా అతడు చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది; గుండెలు బాదుకున్నది; చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పిపడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలచుకొని, తలచుకొని అతని శవంపైబడి యిలా శోకించింది: 'నాయనా, మా ప్రాణరక్షకుడవు, వంశోద్ధారకుడవు అయిన నీవు మమ్మల్ని విడిచి పోవడానికి నీ మనస్సెలా అంగీకరించింది? ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూచాక ఆ శోకం మరచాను. శ్రీ గురుడు వరమిచ్చినందు వల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను.
అప్పుడక్కడి జనులిలా ఆమెను ఓదార్చారు: 'అమ్మా, నువ్విలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతారపురుషులను గూడ వదలిపెట్టదు. మానవులమైన మనకెలా తప్పుతుంది? నువ్వాలోచించు. ఇలా దుఃఖించవద్దు.' అది విని ఆమె, 'నాకు దాపురించిన పిశాచభయాన్ని పోగొట్టి, సాక్షాత్తూ శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకవాలి? నేను గూడ యీ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను' అని యెంతో పట్టుదలగా బదులు చెప్పింది. ఆమె శ్రీ గురుని స్మరించి, 'స్వామీ, త్రిమూర్తిస్వరూపులైన మీరు సత్యసంకల్పులని నమ్ముకున్న -నాకు యిదేమి గతి? నేను మీరు చెప్పినట్లు యీ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితమిదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు. పిశాచబాధ తొలగించనుని మిమ్మల్ని శరణుపొందిన నాకు యిదేమి ఫలితము? - పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వానిని శరణుపొందినట్లున్నది. తన కష్టాలు నివారించుకోడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగి నట్టైంది. నాకయింతగా ఆశ చూపిన మీరు నాబిడ్డను యెందుకు రక్షించరు?' అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే వున్నది.
మరుసటిరోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, 'అమ్మా, నీవిలా శోకించినందువలన లాభమేమి? జరుగవలసినది జరుగకుండా తప్పుతుందా? నీవీ మూర్ఖత్వం విడిచి, శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము' అని చెప్పారు. కాని ఆమె మాత్రం తన పట్టు విడువక, 'ఈ శవంతో బాటు నాకు కూడ అంత్యక్రియలు చేస్తేయిస్తాను గాని, లేకుంటే యివ్వను' అని చెప్పి, ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి, ‘బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడమన్నది మేము కనీ వినీ ఎరుగము. ఇదెక్కడి ధర్మము?' అనుకున్నారు. ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా శవాన్ని వారికప్పగించలేదు. చివరికామె శ్రీ గురుని మీద నిష్ఠూరమాడుతూ, తానూ ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది. జనులంతా ఆమెననుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్త్వముపదేశించాడు. అతడెవరో కాదు - త్రిమూర్తి స్వరూపము, భక్తవత్సలుడూ అయిన శ్రీ గురుడే!
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
శ్రీగణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః.
సిద్ధమునీంద్రుడు యింకా యిలా చెప్పసాగారు: "పుత్రశోకంతో ఖిన్నురాలై నదీతీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి, ఆ బ్రహ్మచారి యిలా అన్నాడు: 'అమ్మా! నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన-మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగ పుట్టి నశిస్తుండడం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరమేర్పడి, కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది. మాయకు వశులైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది, బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు. వారు సత్వ గుణము వలన దేవత్వాన్నీ, రజోగుణము వలన మానవత్వాన్నీ, తమోగుణం వలన అధోగతిని పొంది, కర్మఫలమనుభవిస్తారు. ఈ సృష్టిలో యిది యెవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని, మరణం వలన దుఃఖం గాని పొందరు. వారి వారి కర్మలననుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికీ శరీరం రక్తము, మాంసము మొ॥న ధాతువులతో నిండి మలినమైనది. బుద్ధిమంతులు యిట్టి శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మలలో యెవరెవరికి తల్లులో, బిడ్డలో, భర్తలో యెవరికెరుక? ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి, శాస్త్ర విధిననుసరించి అంత్యక్రియలకై వారికీ శవాన్ని అప్పగించు'.
ఆ మాటలు విని శాంతాదేవి, 'అయ్యా, మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే గాని, అది నా మనస్సులో కొంచెం గూడ నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే, భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలెలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు. ఇపుడు మరి నన్నెందుకిలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు; పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు. అలానే శ్రీగురుని సేవించి, ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకొనడమే నా మూర్ఖత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని ఆయన వరమిచ్చాడు. నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తూ ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందు కవాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని గూడా ఆయనకే సమర్పిస్తాను' అన్నది. అప్పుడా బ్రహ్మచారి, 'అమ్మా! అలా అయితే యిక్కడ దుఃఖించి యేమి ప్రయోజనం? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే యీ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు!' అని ఉపాయం చెప్పాడు. ఆ తల్లి అందుకంగీకరించి, శవాన్ని తన కడుపుకు కట్టుకుని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్ద కెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచటి పాదుకలకు తన తలను కొట్టుకుంటూంటే, రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రమయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, “నీవు దుఃఖం అణచుకుని కర్తవ్యమాలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తిచేయాలి. శవం యింక వాసనగూడ వస్తుంది. కనుక దానిని మాకప్పగించు. అంతేగాక, ఈ స్థలం ఊరికెంతో దూరం. ఏకాంతము, భయంకరము అయిన యీ ప్రదేశంలో మీరిక వుండవద్దు" అని తొందర పెట్టారు. కాని ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని, పాదుకలకు తన తల కొట్టుకుంటూనే వున్నది. ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక, 'ఇక చీకటిపడుతున్నది. ఇక్కడ దొంగల భయమున్నది. మనమిండ్లకు వెళ్ళి, రాత్రి ఉపవాసముండి, తెల్లవారాక శవసంస్కారం చేద్దాం. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది' అనుకుని యిళ్ళకు వెళ్ళిపోయారు.
గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీ గురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే వుండిపోయారు. పిల్లవాడు చనిపోక ముందు మూడురోజులు, తర్వాత రెండురోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి యేడ్చి సోలిపోయిన ఆమెకు, నాటి తెల్లవారుఝామున కునుకు పట్టింది. అప్పుడామెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించివున్నారు. ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలము ధరించి వున్నారు. ఆయన బయటనుండి వీరున్న ఉదుంబర వృక్షం క్రిందకు వచ్చి, ఆమెతో, 'అమ్మా! నాపై నిష్ఠూరాలాడతావెందుకు? నీ బిడ్డకేమయింది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను' అని ఆ శవానికి విభూతి పూసి, పిల్లవాని ముక్కులోకి గాలివూది, 'అమ్మా! నేను నీకేమపకారం చేసాను? ఇంకా ఉపకారమే చేసాను. నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాయవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను. నా మీద కష్టపెట్టుకోవద్దు. ఇక దుఃఖించకు' అని చెప్పి అదృశ్యులయ్యారు. శాంతాదేవి తృళ్ళిపడి నిద్రలేచింది. గాని, 'ఇది నా పుత్రవ్యామోహం వలన వచ్చిన కలే గాని, చనిపోయినవాడింక బ్రతుకుతాడా? నా ప్రారబ్దమిలా వుంటే శ్రీగురుడేమి చేస్తాడు? అనుకున్నది. ఇంతలో ప్రక్కనున్న శవం కదలసాగింది. ఆమె తాకి చూస్తే వెచ్చగా వున్నది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతమావేశించిందేమోననిపించి, భయమేసి దూరంగా వెళ్ళింది. కాని పిల్లవాడు లేచి కూర్చుని, 'అమ్మా! ఆకలేస్తున్నది. అన్నం పెట్టు!' అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యమొచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి, భర్తను నిద్రలేపి, జరిగినదంతా వివరించింది. అప్పుడా దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారము చేసి శ్రీ గురునిలా స్తుతించారు.
ఓ శ్రీ గురుమూర్తీ! జయము జయము. సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవరూపం ధరించారు. వారి హితం కోరి, నిరంతరమూ వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించే మీ మహాత్మ్యాన్ని వర్ణించడం ఎవరితరము గాదు. తల్లివలె మీరు మా తప్పులు క్షమించి కృప చూప మిమ్ములను శరణ వేడుతున్నాము.' తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి, ఆ నీటితో గురు పాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని, పాదుకలనూ అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయమయింది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు, ఆ బాలుడు బ్రతికి వుండడం చూచి అశ్చర్యపడి శ్రీ గురు మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడూ అయ్యాడు.
కనుక నామధారకా! ఈ క్షేత్రమహిమను వర్ణించడం ఎవరితరము గాదు. అచ్చటి మేడిచెట్టు మూలంలో శ్రీ గురుడు నిశ్చయంగా నిత్యనివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి. సందేహం లేదు. అందుకే అచ్చటి మేడిచెట్టు సాక్షాత్తూ కల్పవృక్షమే!".
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన : 22, 23, 24 అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విశద పరుస్తాయి : త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువు సర్వ సమర్ధుడు. ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే. శ్రీ అక్కల్కోట స్వామి లాగ శ్రీ గురుడు గూడ మాటమాత్రం చేత ఒక గొడ్డు బట్టెను పాడి గేదెగా మార్చాడు. ఇష్ట దేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో గాని సఫలం గాదని, సద్గురువు సకల దేవ స్వరూపమని, విశ్వరూపుడని "శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర" లాగ, ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెల్పుతుంది. అంతేగాక ఇంకా యీ క్రింది అంశాలు గూడ గమనించదగినవి. (1) అతనివంటి సన్న్యాసులకు, పండితులకు గూడ ధర్మసూక్ష్మం తెల్పవలసినవాడు శ్రీ గురునివంటి సద్గురుడే. (2) కుమశీ గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు. సద్గురు భక్తులైన సంసారులు గూడ అంతరంగంలో నిష్కాములైన సన్న్యాసులే. సద్గురువు నాశ్రయించని సన్న్యాసులు గూడ ద్వంద్వాలను విడువని సంసారులు గానే వుండిపోతారు.
నామధారకుడు, “సిద్ధమునీ, మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి, జ్ఞానోదయమైంది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీగురుచరిత్ర నాకు వినిపించి నాలో గురు భక్తిని వికసింపజేస్తున్నారు. శ్రీ గురుకథ నా మనసును హరిస్తున్నది. అటుపైన ఏమి జరిగిందో సెలవీయండి" అని ప్రార్ధించాడు. సిద్ధయోగి, “నాయనా, నీకు గురుకృప లభించింది. నీకు యీ కథ వినిపించడం వల్ల నా జన్మ గూడ ధన్యమయింది.
అటు తర్వాత శ్రీ గురుడు ఈ గంధర్వపురం చేరి, భీమ-అమరజా సంగమంలో నివసించడం వలన యీ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవు తున్నది. ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తరదిక్కుగా ప్రవహిస్తాయి. కనుక యిది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి. ఇక్కడ గూడ శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్యనివాసం చేస్తున్నారు. ఆయన దివ్యపాదాలలోనే సమస్త తీర్థాలున్నప్పటికీ, మరుగుపడిన యీ క్షేత్ర మహాత్మ్యం లోకానికి తెల్పడానికే ఆయన యిక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట యిక్కడ గూడ తమ మహిమ ప్రకటమవనీయక, గుప్తంగా సాధుజీవితం గడిపే వారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ, దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు. ఆ గ్రామంలో సుమారు వంధ బ్రాహ్మణ కుటుంబాలుండేవి. వారంతా వేదవిదులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణు డుండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బట్టె వుండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొ||నవి మోయించుకోడానికై అద్దెకు తీసుకెళ్తుండేవారు. అతడు యాయవారం (భిక్షాటనతోనూ, గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తుండేవాడు.
శ్రీనృసింహసరస్వతీ స్వామి తరచు వీరింటికి భిక్షకు వెళ్ళేవారు. అదిచూచి కొందరు, 'గ్రామంలో శ్రోత్రీయులము, శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము యింతమందిమి వుండగా, యీ సన్యాసి మన యిండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని యింటికే వెళ్ళాలా? అక్కడ ఆయనకేమి దొరుకుతుంది?' అని విమర్శిస్తుండేవారు. కాని శ్రీకృష్ణుడు గూడ దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక, పేదవాడైన విదురుని యింటికే వెళ్ళాడు. భగవంతునికి సత్త్వగుణమందే ప్రీతిగాని, ధనమదంలో చిక్కినవారితో ఆయనకేమి పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి గూడ సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి గూడ మారవలసిందే!
ఒక వైశాఖమాసంలో మధ్యాహ్నపుటెండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీగురుడు వాకిట్లో నిలచి, 'భవతీ భిక్షాం దేహి' అన్నారు. ఆ యిల్లాలు నమస్కరించి, 'స్వామీ, యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు. వారొచ్చే సమయమైంది. కోపగించక దయతో కొద్దిసేపు మీరీ ఆసనం మీద కూర్చోండి' అని పీట వేసింది.
శ్రీ గురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో, 'నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకు భిక్షే యివ్వనవసరం లేదు. మీ ముంగిట వున్న బడ్జె పాలు కొంచెమిచ్చినా చాలు!' అన్నారు. అప్పుడామె, 'స్వామీ! ఇది గొడ్డుబట్టె. ఒక్కసారైనా కట్టనూలేదు, ఈననూలేదు. ఇప్పుడిదెంతో ముసలిది. పళ్ళుగూడ వూడిపోతున్నాయి. దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము' అన్నది. శ్రీ గురుడు అదేమీ పట్టించుకోక, 'ఎందుకు యీ వట్టి మాటలు? అయినా పాలు పితుకు చూస్తాము!' అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం! ఆ గొడ్డుబల్లై రెండు పాత్రలు నిండుగా పాలు యిచ్చింది. ఆ యిల్లాలు ఆశ్చర్యపడి, ఆ యతీశ్వరుడు సాక్షాత్తూ పరమేశ్వరుడేనని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలుత్రాగి సంతోషించి, 'అమ్మా, మీరు అఖండైశ్వర్యంతోనూ, పుత్రపౌత్రులతోనూ సుఖించగలరు' అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు యింటికి వచ్చి, జరిగిన వింత తెలుసుకుని, భార్యతో గూడ సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది" అన్నారు. సిద్ధయోగి
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః.
సిద్ధముని యింకా యిలా చెప్పారు "నామధారకా! శ్రీ గురుడు గొడ్డు బట్టె నుండి పాలుపితికించడంతో అంతవరకూ గుప్తంగా వున్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్థులు మట్టి తోలుకోడానికి బట్టెను బాడుగకు యిమ్మని అడగటానికి వచ్చారు. అప్పుడా బ్రాహ్మణుడు, 'అయ్యా! మా గేదె పాలిస్తున్నది. కనుక యికనుండి దానిని మట్టి తోలడానికి పంపలేము' అని చెప్పి, నాడు ఆ గేదె యిచ్చిన పాలు చూపించాడు. ఆ గ్రామస్థులు, 'అరెరే! యింతవరకూ ఒక్కసారైనా కట్టని యీ ముసలిబట్టె పాలు ఎలా యిచ్చింది?' అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది. అతడాశ్చర్యపడి, కుతూహలంతో బ్రాహ్మణుని యింటికి వచ్చి చూచి, అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకొన్నాడు. వెంటనే అతడు సకుటుంబంగా, పరివారంతో గూడ సంగమానికి వెళ్ళి శ్రీగురునికి పొర్లుదండాలు పెట్టి, సాష్టాంగ నమస్కారం చేసి యిలా స్తుతించాడు: 'జగద్గురూ! మీకు జయము. మాయామోహితుడైన నాకు త్రిమూర్తిస్వరూపులైన మీ అపారమహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూపా! నన్ను మీరే యీ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలాగా కన్పించే మీరు విశ్వకర్తలు'
శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, 'రాజా! మేము తపస్వులము. అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి?' అన్నారు. రాజు సవినయంగా నమస్కరించి, ‘ప్రభూ! మీరు భక్తులనుద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము. అట్టి మీరు యీ అడవిలో నివశించడమెందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివశించండి, మీరు అనుష్ఠానం చేసుకోడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడ వుండి మమ్మల్ని ఉద్ధరించండి. మా పట్టణాన్ని పావనం చేయండి' అని స్వామి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామి, 'ఇది భగవదేచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయమాసన్నమైనది. కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును, భక్తులనూ రక్షించాలి' అనుకొని అనుమతించారు. రాజెంతో సంతోషించి, శ్రీగురుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి వాద్య, నృత్య, గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్లాడు. పల్లకీకి ముందు ఏనుగులు, గుఱ్ఱాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వందిమాగధులు నడచివచ్చారు. రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేద మంత్రాలు చదువుతుంటే, వంది మాగధులు శ్రీగురుని స్తుతిస్తున్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయజయధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు.
ఊరేగింపు పడమటి దిక్కునుండి గంధర్వనగరంలో ప్రవేశిస్తున్నది. అక్కడొక పెద్ద రావిచెట్టు వున్నది. దాని సమీపంలోని యిళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా వున్నాయి. అందుకు కారణం, ఆ చెట్టుమీద ఒక బ్రహ్మరాక్షసుడుండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకొచ్చిన మానవులను, జంతువులను మ్రింగివేస్తుండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ యిండ్లు విడిచిపోయి, ఆ పట్టణంలోనే వేరొక చోట నివశిస్తున్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే, స్వామి తమ పల్లకీ నుండే ఆ చెట్టుపైకి చూచారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించక పోయినా, ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టుదిగి వచ్చి స్వామికి నమస్కరించి తననుద్ధ రించమని ప్రార్థించాడు. పరాత్పరుడు, కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు. తక్షణమే అతనికి మానవాకారమొచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, 'నాయనా! నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి. నీ పాపం నశించి ముక్తి పొందుతావు' అని ఆదేశించారు. అతడు స్వామికి నమస్కరించి, వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచి పెట్టి ముక్తిపొందాడు.
ఈ సన్నివేశం చూచిన పట్టణవాసులు, శ్రీగురుడు సాక్షాత్తూ పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అపుడు శ్రీగురుడు, 'నాకు మఠమిక్కడే నిర్మించాలి' అన్నారు. అప్పటికప్పుడే ఆ సమీపంలోవున్న ఒక పాడుబెట్టిన యిల్లు శుభ్రం చేసారు. దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. స్వామి అందులో వుంటూ రోజూ స్నానానికి, అనుష్టానానికీ, సంగమానికి వెళ్ళి వచ్చేవారు. నిత్యమూ రాజు ఆయనను దర్శించి పూజించేవాడు. శ్రీ గురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడూ ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజ మర్యాదలతో తీసుకువెళ్ళేవాడు. నిత్యమూ ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తూండేవారు. ఆ పట్టణంలో ప్రతినిత్యమూ బ్రాహ్మణ సంతర్పణలు జరుగు తూండేవి. అలా శ్రీగురుని కీర్తి గ్రామగ్రామాలకూ ప్రాకిపోయింది.
గంధర్వనగరానికి కొద్దిదూరంలోని 'కుమసి' అనే గ్రామంలో త్రివిక్రమ భారతీయనే సన్యాసి వుండేవాడు. వేదవిదుడైన ఆ యతి, నిత్యమూ నృసింహావ తారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు. ఇతడు శ్రీగురుని గురించి విని, 'ఆ యతి దాంభికుడు; సన్యాసాశ్రమధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తు న్నాడు' అని ఆక్షేపిస్తూండేవాడు. విశ్వవ్యాపి, సర్వసాక్షియైన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు. అప్పుడొక అద్భుతం జరిగింది.”
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
సిద్దయోగి యింకా యిలా చెప్పారు: "త్రివిక్రమభారతి శ్రీగురుని నిందిస్తు న్నాడని విని, రాజు ఒకరోజు స్వామితో, 'స్వామి! అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరూరకుంటారేమిటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదా?' అని వేడుకున్నాడు. శ్రీగురుడు అంగీకరించి బయల్దేరారు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి, పల్లకీలో కూర్చోబెట్టి, రాజలాంఛనాలతో కుమసీ గ్రామానికి తీసుకు వెళ్ళాడు.
ఆ ఊరేగింపు మహా వైభవంగా కుమసీ గ్రామం సమీపించే సమయానికి, . త్రివిక్రమభారతి పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజూ నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు. కాని ఆరోజు అతడెంత ప్రయత్నించినా ఇష్ట దేవతామూర్తి దర్శనమీయలేదు. త్రివిక్రముడు 'స్వామీ! నృసింహా! యీ రోజు మీరు నన్నెందుకు కరుణించలేదు? ఎంతోకాలంగా చేస్తున్న నా తపస్సంతా యీరోజు భంగమయింది. ఇక నేనేమి చేయగలను?' అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్ధించాడు. వెంటనే అతని మనస్సులో, సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీ గురుని దర్శనమై, 'ఇప్పుడు నేను నదీ తీరంలో వున్నాను. అక్కడికి వచ్చి దర్శించుకో!" అని దివ్యవాణి విన్పించింది. త్రివిక్రమభారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు. కాని అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి, శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేసాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు, పరివారము గూడ యతులలాగ కన్పించారు. త్రివిక్రమభారతి నివ్వెరబోయి, అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక, 'స్వామీ! త్రిమూర్తిస్వరూపా! వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను. నా పై కృపతో మీ నిజరూపం దర్శింపజేయండి. ఇంత కాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీరూపంలో నేడు ప్రత్యక్ష దర్శన మనుగ్రహించారు. ఈ రోజు నా తపస్సు ఫలించింది. అందువలననే మీ దర్శనం లభించింది.' అన్నాడు. శ్రీగురుడు సంతోషించి తమ నిజరూపంతో కన్పించారు. అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై, వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు, పరివారము కనిపించారు. స్వయంగా రాజుచేత వింజామరలతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూచాడు. అపుడు శ్రీగురుడు, 'త్రివిక్రమా! ఎవరిని దాంభికుడనీ, భ్రష్టుడనీ నిందించావో, ఆ సన్యాసియే మేము. మేమిపుడే నిన్ను పరీక్షించాము. నృసింహభక్తుడవైన నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు? దంభిలక్షణా లేమిటో తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేమిటో వివరించు!' అన్నారు.
శ్రీ గురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే గాక, ఆయన ప్రసాదించిన దివ్యదర్శనంతో పరవశించిన త్రివిక్రమభారతి శ్రీగురునికి నమస్క రించి, 'సద్గురూత్తమా! మీరు మానవరూపంలో అవతరించడం వలన నేను తెలి యక మూఢునివలె ప్రవర్తించాను. నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకూ అనుగ్రహించ వచ్చిన శ్రీకృష్ణునివలె, నన్ననుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తు త్రిమూర్తిరూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగును చూడలేని గుడ్లగూబ వలె, అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానమనే నావలో యెక్కించి, మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి, ఆత్మయనే ఒడ్డు చేర్చండి. భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను. గాని, యిప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్ధుడనయ్యాను. భేదబుద్దిని సులభంగా తొలగించగల చింతామణివలె మీరు నాకు యీనాడు. లభించారు. మీరే నా ఉపాస్యదైవమైన నృసింహస్వరూపులు. శరణు, శరణు!' అని స్తుతించాడు. శ్రీగురుడతనిని అనుగ్రహించి, 'త్రివిక్రమా! నీ భక్తికి సంతో షించాము. నీవు నృసింహస్వామికి చేసే అనుష్టానం మాకే చెందుతుంది. అదే చేస్తూండు. నీకు పునర్జన్మ లేదు. నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవగలవు!' అని ఆశీర్వదించి, త్రివిక్రమభారతిని ఆ గ్రామంలోనే వుండమని ఆదేశించారు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ, పరివారంతోనూ, 'మాకు అనుష్ఠాన సమయమైంది. మేము ముందుగా వెళ్తాము. మీరు వెనుక రండి!' అని చెప్పి, మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు. తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు.
కనుక నామధారకా! శ్రీగురుడు భగవంతుడుకాడని, మానవ మాత్రుడేననీ తలచేవాడు ఏడు జన్మలు నరకమనుభవిస్తాడు. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసముంచి, లోకులు శ్రీగురుపాదాలను ఆశ్రయింతురు గాక! అందరికీ అందుబాటులో యీ గురుకథ అనబడు చలివేంద్రమును స్థాపించాము. దీనినుండి ప్రజలు గురుకథామృతమును సేవింతురు గాక!" అన్నారు సిద్ధయోగి.
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః,
ప్రసావన : శ్రీ గురుడు - అక్కల్కోట స్వామిలాగ విద్యాగర్వాంధులైన పండితులకు గర్వభంగం చేయడానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు. ఈ కుపండితులు వేద విప్రనిందలో యవనరాజు చేతిలో కీలుబొమ్మలయ్యారు. వీరిని నిగ్రహించడానికి సన్యాసధర్మాన్నతిక్రమించి శాస్త్రవాదంలో వారినోడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీ గురుడు తమ ఆశ్రమ ధర్మమతిక్రమించ కుండానే వారిని నిగ్రహించడం వారి ధర్మ దక్షతకూ, సర్వ సమర్థతకు నిదర్శనం. అట్టి ధర్మ సందేహం కలిగిన సచ్ఛిష్యుడు సద్గురువును శరణు పొందాలని సూచన. ఎంత శ్రోత్రియత, పాండిత్యము గూడ ధనకీర్తి కాంక్ష వలన వ్యర్ధమే గాక అరిష్ట ప్రదమని తెలియాలి. సమర్థ సద్గురు సమాగమం వలన గాని శ్రోత్రియత, పాండి త్యమూ సార్ధకంగావన్నమాట. అంతేగాదు! నిజమైన సద్గురు భక్తుడు, సద్గురువు గూడా దుష్టులెంత రెచ్చగొట్టినా గూడ తామే ప్రమాణమని పల్కి ఋషి ప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానినే సామాన్య సాధకులవలె శ్రద్ధతో పాటిస్తారు.
సద్గురువు చెప్పిన వేదస్తుతి రూపమైన యీ 25, 26, 27 అధ్యాయాలు పాఠకులకు పవిత్రతనూ, నిరహంకారాన్నీ, సద్గురువుపై భక్తినీ పెంపొందిస్తుంది.
అటుపైన శ్రీగురుడు చేసిన దివ్య లీలలను వినిపించమని ప్రార్ధించిన నామధారకునితో సిద్ధముని యిలా చెప్పారు 'ఒకప్పుడు వైఢూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు. అతడు హిందూమత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలోగల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని, తన యెదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు. అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచారపరులు అలా చేయడం తమవల్ల గాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి, వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని యెదుట వేదార్ధము చెబుతుండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారినుండి విని, ఆ దుష్టుడు, యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు, యితరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్ధం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు యిస్తుండేవాడు. ఆ సంగతి విని, ధనాశపరు లెందరో అతని మెప్పును కోరి అతనివద్దకు తమకై తామే వచ్చి వేదార్ధం చెప్పసాగారు.
ఒకనాడు ఉత్తరాదినుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, 'రాజా! సకల విద్యలలోనూ మాకు సాటియైనవారు యెక్కడాలేరు. మేము దేశంలోని పండితులను శాస్త్ర వాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు యెవరైనా వుంటే పిలిపించండి. మా ప్రతిభ నిరూపించగలము' అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి, ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి, నాటి మధ్యాహ్నం సభ యేర్పాటు చేయించి, ఆ పండితులను వాదంలో ఓడించినవారికి గొప్ప బహుమానాలు యివ్వగలనని, ఓడినవారిని దండించగలననీ ప్రకటించాడు. అటువంటి బహు మానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టులయెదుట వల్లించడం యిష్టపడని శిష్టాచారులు కొందరు, తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పు కున్నారు. మరికొందరు, నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలిచ్చివేయక తప్పలేదు. అప్పుడా రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు, ఆభరణాలు, భారీ యెత్తున కానుకలూ బహుమానమిచ్చి ఏనుగునెక్కించి, మేళతాళాలతో ఊరే గించాడు. వారికొక అగ్రహారంగూడ యిచ్చాడు. వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది.
అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి, ఆ నగరంలోని విద్వాంసు లందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, 'అయ్యా! మా పాండిత్యము, మా ప్రతిభ యిక్కడంతా తెలిసి పోవడం వలన యిక్కడ మాతో వాదానికి యెవరూ ముందుకు రావడంలేదు. కాని వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి? కనుక మీరు సెలవిస్తే మేమీ రాజ్య మంతటా సంచారం చేసి, పండితులందరితో వాదించ దలచాము. మీరు అను మతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము' అని చెప్పారు. రాజు అందుకంగీకరించి, వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగులనెక్కి దక్షిణదిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయజయధ్వానాలతో, పర్యటిస్తూ, ఒకరోజు కుమసీ గ్రామానికి వచ్చారు. అచటి త్రివిక్రమభారతి వేదవేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, 'ఏమయ్యా! నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు. లేకుంటే, ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా యివ్వు!' అన్నారు.
అందుకు త్రివిక్రమభారతి, 'అయ్యా! నాకు వేదం రాదు. వచ్చి వుంటే నేను గూడ మీలాగే రాజ సన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినేగదా? నేను ఈ అరణ్యంలో ముక్కుమూసుకుని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది యేమీ లేదు. మీరు నాతో వాదించడం, కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది' అని చెప్పాడు. ఆ పండితులు, 'అయ్యా! మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు. కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి. అలాగే నీవు గూడ ఒకటి వ్రాసివ్వు, లేదా మాతో వాదించు' అని పట్టుబట్టారు. అప్పుడా సన్యాసి, 'వీరికి గర్వం తలకెక్కింది. ఒళ్ళూపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధిజెప్పడానికి నా గురుదేవులే సమర్థులు. వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను' అని ఆలోచించుకుని, వాళ్ళతో యిలా అన్నాడు: 'పండితోత్తము లారా! నేను స్వతంత్రుడనుగాను; గంధర్వపురంలో మాగురుదేవులున్నారు. వారి ఆజ్ఞతీసుకుని మీరు కోరినట్లే ఆ రెంటిలో యేదో ఒకటి చేయగలను. మీరు గూడా నా వెంట గంధర్వపురానికి రండి'.
అందుకా మదాంధులంగీకరించి గంధర్వపురానికి బయల్దేరారు. త్రివిక్రమభారతి, వినయంతో కాలినడకన వెళుతుంటే, ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు. సాధుసత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయుః క్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని గూడ వాళ్ళు లెక్క పెట్టలేదు. గంధర్వపురములో మఠం చేరుకున్నాక త్రివిక్రమభారతి శ్రీగురునికి నమస్కరించి, ఆనందభాష్పాలు కారుస్తూ, గద్గదస్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి, 'పరాత్పరా! గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే, అజ్ఞానాంథులు మిమ్మెరుగలేరు. మీచేత వారికి హితం చెప్పించడానికై వారినిక్కడకు తీసుకువచ్చాను. ఈ మదాంధుల బారినుండి నన్ను, వేదధర్మాన్ని కాపాడండి!! మీ ఆజ్ఞకోసం వచ్చాను. మీరేది చేయమంటే అది 'చేస్తాను' అని ప్రార్ధించాడు. వాళ్ళు, 'మా కాలం వ్యర్థమైంది. ఇతడు జయపత్ర మివ్వడు, వాదభిక్ష యివ్వడు. మమ్మల్ని యిక్కడకు తీసుకువచ్చాడు గనుక, మీ గురుశిష్యులలో ఎవరైనా ఆ రెంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి' అన్నారు. శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో యిలా అన్నారు: 'అయ్యా! మీవంటి వేదవిదులకు, వాదించడం వలన కల్గి ప్రయోజనమేమున్నది? వాదంలో సాటి విప్రులను యిలా పరాభవించినందువలన మీకు కలిగే లాభమేమిటి? యతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము, ఓడినందువలన చిన్నతనమూ యేమీ కల్గవు. అటువంటి మావలన మీకేమి ప్రయోజనము?' అన్నారు. అందుకు వారిద్దరూ, ‘అలా అయితే, యింతకు ముందటి పండితులందరూ యిచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రమివ్వక, మమ్మల్ని యిక్కడకు ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీయిద్దరిలో ఎవరైనా సరే, మాతో వాదానికి రండి; లేకుంటే జయపత్రమైనా యివ్వండి' అని పట్టుబట్టారు.
అప్పుడు శ్రీగురుడు నవ్వి, 'అయ్యా! వేదం సంపూర్ణంగా తెలిసికోవడం బ్రహ్మాదులకే సాధ్యంగాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేదవిదులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది. ఈ జయపత్రికల వల్ల ప్రయోజనమేమున్నది? మా మాట విని యికనైనా యిలాంటి ప్రగల్భాలు మానండి' అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, 'అయ్యా! మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని మించినవారు ఎవరూ లేరు" అన్నారు".
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యైనమః.
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో, "స్వామీ! శ్రీగురుడు విద్యా వంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరచారు?" అనడిగాడు. అందుకు సిద్దముని యిలా చెప్పారు:
"శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూఢులకిలా బోధించారు: 'నాయనలారా! మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేదవిదులమనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్ధమే గాని -- ధనము, కీర్తి, అహంకారము గావు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్నవారెవరూలేరు. వేదము ఆద్యంత రహితము, అపారము. దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు.
పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి, బ్రహ్మచర్యమవలంబించి, బ్రహ్మదేవుని వరంతో మూడుసార్లు దీర్ఘాయువు పొందాడు. నాల్గు యుగాలూ 5వేల సార్లు పునరావృత్తమైతే బ్రహ్మకొక పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువువద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే, బ్రహ్మ సాక్షాత్కరించి, 'వేదం పూర్తిగా నాకే తెలియదు. నీకు వేదరాశిని చూపుతాను. చూడు!' అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భరద్వాజుడది చూచి భయపడి, 'అయ్యో! నేనింతకాలం పఠించిన వేదమంతా కలసి యిందులో ఒక్క పిడికిడైనా లేదే! వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా?' అని తలచి, “నాకవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి" అన్నాడు. అపుడు బ్రహ్మ, అనంతమైన ఆ వేదరాశినుండి మూడు పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి, "ఇదంతా అధ్యయనం చేసేంతవరకూ నీవు జీవింతువు గాక!" అని వరమిచ్చాడు. కాని ఆ మూడు పిడికిళ్ళ వేదమూ అధ్యయనం చేయడమే అతనికి యింతవరకూ పూర్తిగాలేదు. కనుక సాక్షాత్తూ నారాయణుడే బాదరాయణుగా అవతరించి, వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి, వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్కవేదం చొ॥న తెలిపాడు. వారు కల్పాంతం వరకూ అభ్యసించిగూడ వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలనూ సంపూర్ణంగా అధ్యయనం చేసామనుకోవడం ఎంత తెలివి తక్కువ!
వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికీ సాధ్యంగాదు గనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి, దానిని ధ్యానించడానికై దానిని గురించి యిలా చెప్పాడు: ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదము. ఆత్రేయసగోత్రం. గాయత్రీ ఛందము. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ, ఎర్రని వర్ణము, తామరరేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరజాలజుట్టు, వంకమీసము కలిగి, రెండుమూరల పొడవైన దేహం గలిగి వుంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయపారము, క్రమపారము, జట, రధక్రమము, దండక్రమము అనే భాగాలున్నాయి. ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి. ఈ వేదానికి అశ్వలాయని, సాంఖ్యాయని, శాకలా, భాష్కలా, మాండుకేయులనే అయిదు శాఖలున్నాయి." వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు గాని, ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివినవారెవరు?
తర్వాత వ్యాసమహర్షి తన రెండవ శిష్యుడైన వైశంపాయునికి యజుర్వేదం చెప్పి, దాని లక్షణాలు యిలా చెప్పారు: “యజుర్వేదానికి ఉపవేదము ధను ర్వేదము. భారద్వాజసగోత్రము. త్రిష్టుప్ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగావుండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరలు పొడవున్న తామ్రవర్ణ శరీరం గలిగి వుంటాడు. దీనికి గల 85 శాఖలలో యిప్పుడు 18 మాత్రమే మిగిలి వున్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే ఎనిమిదీ దీనికి ఉపాం గాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అనే ఆరు అంగాలు దీనికున్నాయి” ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశం పాయనునికి వివరించి చెప్పి, వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని యిలా వివరించాడు :
"దీనికి ఉపవేదము గంధర్వము. విష్ణువు అధిదేవత, జగతీచ్ఛందస్సు. కాస్యపసగోత్రము. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి ఆరుమూరల పొడవు గలిగి వుంటాడు. ఆయన శరీరచ్ఛాయ తెలుపు; శమము, దమము మొదలైన దైవీసంపదగలవాడు. సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి. ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు”.
వ్యాసమహర్షి సుమంతుడనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి, “దీనికి అస్త్రరూపం ఉపవేదము. గోత్రము బైజానకము. ఇంద్రుడు అధిదేవత. త్రిష్టుప్ఛందస్సు. అధర్వణ వేదపురుషుడు తీక్ష్యమైన ఆకారము, నల్లని వర్ణమూగల కామరూపుడు. ఏకపత్నీవ్రతుడు. ఏడుమూరల పొడవు. ఈ వేదానికి తొమ్మిది శాఖలు, ఐదు కల్పాలూ వున్నాయి.
పూర్వం అన్ని వేదాలనూ సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత వర్ణాశ్రమాచారనిరతులెందరో భరత భూమిలో వుండేవారు. కనుకనే వేదాలన్నీ నిలువగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్ఠులవుతున్నారు ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము, మహత్తూ వుండేవి. అందుకే వారిని భూసురులు అనేవారు. రాజు గూడ వారిని సేవించేవాడు. నవారు ఎంత ధనమిస్తానన్నా లెక్కజేయక, భోగాలపట్ల నిర్లిప్తులుగా వుండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు గూడ వారికి ఆధీనులై వుండేవారు. " ఇంద్రాది దేవతలు గూడ వారిని సేవిస్తుండేవారు. మాటమాత్రం చేత గడిపరకను మేరుపర్వతంగాను, మేరుపర్వతాన్ని గడ్డిపరకగానూ మార్చి వేయగలిగి వుండేవారు. దేవతలకు అధీనము: దేవతలందరూ మంత్రాధీనులు; మంత్రాలన్నీ - బ్రాహ్మణుల అధీనంలో వుండేవి. వారిని విష్ణువు గూడ పూజించేవాడు. కాని ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి, మ్లేచ్చుల యెదుట గూడ వేదo చదువుతున్నారు. అట్టివారి ముఖమైనా చూడకూడదు. అటువంట ప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవీగుతూ, ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి? మీకు యిట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినదెవరు? మిమ్మల్ని మీరు పొగుడుకొని, జయపత్రాలు పోగుచేసు కొనడమే గాక, త్రివిక్రముని గూడ జయపత్రికను యివ్వమంటున్నారే! ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొనితెచ్చుకోవద్దు. ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి' అన్నారు. కాని ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని, లేక జయ పత్రికనైనా యివ్వమనీ కోరారు”.
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యైనమః.
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
నామధారకుడు పట్టరాని ఆసక్తితో, "అటు తర్వాత ఏమి జరిగింది. స్వామీ?" అన్నాడు. సిద్ధుడిలా చెప్పారు: "శ్రీ గురుడు ఎంతచెప్పినా వారు వినలేదు. అపుడు శ్రీ గురుడు వారితో, 'అలా అయితే మీకోరిక యిప్పుడే తీరుస్తాము' అని అటు ప్రక్కగా పోతున్న ఒకనిని పిలిచి, 'నీవెవరు? నీ కులమేది? నీదేవూరు? ఎక్కడికి పోతున్నావు?' అని అడిగారు. అతడు, 'అయ్యా, నేను కడజాతివాణ్ణి. నన్ను మాతంగుడంటారు. నేనీ వూరిబయట వుంటాను. ఈనాటికి నాపై మీకు దయకలిగింది' అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి, శిష్యునికి తమ దండమిచ్చి, దానితో నేలమీద ఏడు గీతలు గీయించారు. అప్పుడా చండాలునిమీద విభూతి చల్లి, వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే ఆయన, 'నీవెవరు?' అని అడిగారు. 'నేను వనరక్షకుడైన భిల్లుడను' అన్నాడతడు. అతడు రెండవ గీత దాటి, 'నేను రావణుడనే కిరాతకుణ్ణి' అన్నాడు. మూడవ గీత దాటి, 'నేను గాంగేయుడనే జాలరిని' అని, నాల్గవగీత దాటి, 'శూద్రుడనైన రైతును' అని, అయిదవ గీతను దాటి, 'నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి' అని, ఆరవగీత దాటి, 'గోవర్ధనకర్మయనే క్షత్రియుణ్ణి ' అని, ఏడవ గీత దాటి, 'నేను వేద విదుడను, అధ్యాపకుడను అయిన బ్రాహ్మణు డను' అనీ వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, 'నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు' అన్నారు. అతడు వెంటనే వేద గానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు.
అది చూచి ఆ కుపండితులకు భయంతో నోరెండింది. కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపైబడి, 'స్వామీ! సాక్షాత్తూ పరమేశ్వరు లైన మిమ్ము ధిక్కరించాము. బ్రాహ్మణులను దూషించాము. మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి, మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి, అతని సత్కారానికైన ఆశపడ్డాము. మీరు సర్వ సమర్థులు. మీ మహిమను తెలుసుకొనడం మా తరం గాదు. మమ్మల్ని ఉద్ధరించండి!' అని వేడుకున్నారు. అప్పుడు స్వామి, 'మీరు బ్రాహ్మణ దూషణ, ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనుక, ముందు జన్మలో బ్రహ్మరాక్షసులవుతారు. చేసిన కర్మ అనుభవించక తప్పదు గదా?' అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపైబడి, తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్ధించారు. అప్పుడు స్వామి, 'విప్రులారా! మీకు పశ్చాత్తాపం కలిగింది గనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మ రాక్షసులుగా 12 సం||లు జీవించాక, ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వము తొలగి, ద్విజులై సద్గతి పొందుతారు". ' అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకుని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికీ గుండెనొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి, రాక్షసులై 12 సం॥లు అక్కడే నివసించారు. తర్వాత అక్కడొక బ్రాహ్మణుడు, మంత్రం గుర్తురాక యిబ్బంది పడుతుంటే వారతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు. తర్వాత ఆ సబ్రాహ్మణుడు అది పఠిస్తుండగా ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు.
ఏడు జన్మల క్రిందట తాను వేదవిదుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, 'సద్గురోత్తమా! మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు. పూర్వజన్మలో వేదవిదుడనైన నేను ఈ జన్మలో కడజాతివాణ్ణి ఎలా అయ్యాను? త్రికాలజ్ఞులైన మీరు నాకీ జన్మ ఏకారణంవల్ల వచ్చిందో తెలుపవలసింది' అని వేడుకున్నాడు.
శ్రీ దత్తాయ గురవే నమః,
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః,
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన: వివేకం వలన వైరాగ్యము, తీవ్రముముక్షుత్వమూ కల్గి, పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కల్గు తుంది. అపుడే ప్రాయశ్చిత్తం సార్ధకమవుతుంది. శాస్త్రోక్తమైన పాప కర్మఫలముల వివరం వినడం వలన ఆత్మ నిగ్రహం దృఢతరమవుతుంది. శ్రీ గురుడందుకే కర్మ విపాకముపదేశించాడు. అని మానసిక 'భస్మము' (పాపాలను భయపెట్టునది). ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపచేసే 'విభూతి ధారణ గురించి గూడ చెబు తారు. "స్వయం ప్రకాశమానుడై, మహాదేవుడే మహా భస్మమని ఎవరు చింతన చేస్తారో వారే భస్మధారులలో మహాభాగ్యులు, ముఖ్యులు” అని శాస్త్రం. ‘సఏష భస్మ జ్యోతిః, “ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి" యని భస్మజాబాలి శృతి. బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహకారియని గుర్తించాలి. 28, 29 అధ్యాయాలలో ఈ అంశాలను గూర్చిన వివరణ వున్నది.
అటుపై జరిగిన వృత్తాంతం సిద్దయోగి యిలా చెప్పారు: "శ్రీ గురుడు ఆ చండాలునితో, 'నాయనా! ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాము విను: ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచినవారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను-బిడ్డలను; ఆవులను దూడలనూ విడదీసినవారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించనివారు, సద్రాహ్మ ణులను దూషించి, అయోగ్యులను గౌరవించేవారు, యితరుల భూమిని అపహ రించినవారు, తమ గురువులను, యజమానులనూ ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసినవారు, గంగాది తీర్థాలను నిందించేవారు. శ్రాద్ధాదికర్మలు చేయనివారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు. శుద్ధమైన వేదమార్గం విడచి మంత్ర ప్రయోగం చేసేవారు, గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు, గురునిందవిని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేబట్టేవారు, అర్హతలేని వారినుండి మంత్రోపదేశం పొందినవారు వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్నీ విడిచిన వారికి ఘోరమైన వ్యాధులొస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటినవారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది. లేకుంటే, ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు. ధర్మశాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్టురోగము, నమ్మకద్రోహం వలన అన్న ద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులను విరచి, వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది.
పుణ్యకర్మలను నిరసించేవారు; వారి మాటలు నమ్మినవారు: ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలనూ ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొ॥న వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, యిచ్చిన మాట తప్పేవారు, పర ధర్మముననుష్ఠించే వారు, తమ పుణ్యాలు, యితరుల పాపాలూ ఏకరువు పెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్రమంత్రాలతో యితరులను చంపేవారు, కర్మభ్రష్టులు, యితరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలనుభవించి, తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు.
నామధారకుడు, "స్వామీ, నాకొక సందేహమున్నది. కాని కథకంతరాయ మని అడుగడానికి సందేహిస్తున్నాను." అన్నాడు. సిద్ధుడు, "నీవు అడగడం వలన కలిగే అంతరాయంకంటే, మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమా దమే ఎక్కువ. కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం" అన్నారు. అప్పుడు నామధారకుడు, “స్వామీ, మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక, మరుజన్మలో చండాలయోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా?" అన్నాడు. అందుకు సిద్ధుడిలా వివరించాడు : "భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్టసుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దానిని 'మరణావధి శరీరము' లేక 'పతనావధి శరీరము' అంటారు. దీనితో అనుభవించ వీలులేని అపారమైన కర్మ ఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు".
నామధారకుడు, "ఏ పాపాలవలన ఏ జన్మలొస్తాయో ఉదహరించండి". అంటే సిద్ధుడిలా చెప్పారు "ఏమి చేస్తే చండాలజన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేగాక - క్రోధము, శూద్రస్త్రీల పట్ల కామాసక్తి, ఎద్దునెక్కుట, అల్లము, ఆకులు మొ॥న రస వస్తువులను, వేదాలనూ అమ్ముట, భగవదర్పితం గాని ఆవు పాలు త్రాగుట, నిషిద్ధాన్నము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము, యితరుల జీవనాధారమపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము, బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాలజన్మ కలిగిస్తాయి.
యమలోకంలో అనుభవించే శిక్షలు 8 కోట్ల 40 లక్షలు. వీటిలో ప్రధాన మైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి, అడుగుబెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకలిదప్పుల వలన నడవలేక నడుస్తుంటే, యమ భటులు వాణ్ణి భయ పెడతారు. వాడు మూర్ఛబోతే, వాణ్ణి లేపి, చీమూ నెత్తురూ ప్రవహించే వైతరణీ నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలననుభవించాక, వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసనాబలం వలన భూతంగానో, ప్రేతంగానో వుండి శిక్షననుభవిస్తాడు.
గురుద్రోహి, విప్రులను పరాభవించినవాడూ బ్రహ్మరాక్షసులవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యావహారి ఒంటెగాను, ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసమపహరిస్తే గ్రద్దగాను, అన్నమపహరిస్తే మిడతగాను, జలమపహరిస్తే చాతక పక్షిగాను, ధాన్యమపహరిస్తే మిడతగాను, విషమపహరిస్తే తేలుగానూ జన్మిస్తారు. స్వర్ణాపహారి క్రిమికీటకాదులుగానో, పక్షిగానో పుడతాడు. గడ్డి దొంగిలిస్తే పశువు గాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగానూ జన్మిస్తారు. బ్రహ్మహంతకుడు క్షయ రోగిగాను, గ్రంధచోరుడు గ్రుడ్డిగాను, గణార్ధచోరుడు గండరోగిగానూ, పరద్రవ్యావహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగానూ అవుతారు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగిలించేవాడు గుల్మరోగులవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధనమపహరిస్తే పాండురోగమూ వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వలన నూరుజన్మలు కుక్కగా పుడతాడు. పరస్త్రీ భగదర్శనం వలన గ్రుడ్డితనము, బంధుభార్యాగమనం వలన గాడిద పాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి".
నామధారకుడు శ్రద్ధగా విని, "స్వామీ! ఇదివరకు తెలిసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకొనే ఉపాయమే లేదా?" అన్నాడు. అందుకు సిద్ధుడు, "త్రివిక్రమభారతికి గూడ ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీ గురుడిలా చెప్పారు: 'నాయనా! నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత, వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని, తప్పును సభలో వప్పుకొని, సభ విధించిన శిక్షననుభవించాలి. తగిన కృచ్ఛాది వ్రతాలాచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలనగాని, లేక గోవు యొక్క వెలనుదానం చేయడంవలన గాని పాపం పోతుంది. దశ స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణదానాలు వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవవలన మాత్రం మహా పాపాలుగూడ మటుమాయమవుతాయి. అంతటి సాధనము యింకొకటి లేదు.
ప్రాజాపత్య కృచ్ఛమంటే- మొదటి మూడు పగళ్ళు, తర్వాత మూడు రాత్రులయందూ మాత్రమే భుజించాలి. తర్వాత మూడు రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ప్రసాదంగా తింటూ వుపవసించాలి. మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. పదివేల గాయత్రీ జపము, అందులో పదవవంతు గాయత్రీ హోమమూ చేసి, పన్నెండుమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి, గోదానంగాని, లేక గురిగింజ యెత్తు బంగారంగాని దానమివ్వాలి.
శుక్లపాడ్యమినాడు ఒక ముద్దతో మొదలు పెట్టి పూర్ణిమ వరకూ రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమినాడు 15 ముద్దలు భుజించాక, మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి, అమావాస్యనాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళలననుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతం.
అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకొనడమే ఆరోగ్యానికి మంచిది. స్వల్పభోజనమో, లేక పాలు మాత్రమో మాసం సేవిస్తే పాప శుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొ॥నవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగాస్నానము, రామేశ్వరంలో సముద్రస్నానము, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానమూ వలన గూడ పాపాలు నశిస్తాయి. లక్షగాయత్రీజపం వలన మద్యపాన దోషము, కోటి గాయత్రి వలన బ్రహ్మహత్యా పాపము, ఏడు లక్షల జపంవలన స్వర్ణం దొంగిలించిన పాపమూ పోతాయి. సర్వపాపనాశానికి పావమానసూక్తం 610, 'ఇంద్రమిత్రము' అను రెండు సూక్తాలతోనూ, 'కస్యసూన' మనే శునశ్శేఫసూక్తాలతోనూ, 'శంనఇంద్రాగ్ని' అనే శాంతి సూక్తాలతోనూ, ‘త్రిసుపర్ణం', 'పౌరుషం', 'నాచికేతం', 'అఘమర్షణం' అనే సూక్తాలతోనూ, ఒక ఆరునెలలు వేదపారాయణ చేస్తే మహా పాపాలు గూడ తొలుగుతాయి. సర్వపాప | శాంతికోసం దర్భసహితమైన తీర్థాన్నీ పంచగవ్యాన్నీ (ఆవుయొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి) స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే యిద్దరూ ప్రాయశ్చితం చేసుకోవాలి. స్వయంగా పాపం చెయ్యకపోయినా, పాపుల సహవాసంచేసినా గూడ ప్రాయశ్చిత్తమనుభవించాలి. నామధారకా! నిండు కల్లుముంతను యెంతకాలం గంగానదిలో పెట్టినా, ముంతలోని కల్లు బయటకు, నీళ్ళు ముంతలోకీ ఒక్క చుక్కైనా యెక్కవు. అలానే భగవంతునిపై భక్తిలేకుండా యెన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కల్గదు.
తర్వాత శ్రీ గురుడు ఆ చండాలునితో, 'నీవు తల్లిదండ్రులను విడిచి పెట్టడం వలన గురువులను దూషించి వారిని విడచి వేరే వున్నందు వలన నీకీ చండాలజన్మ లభించింది. నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై, వచ్చే జన్మలో సబ్రాహ్మణుడుగా జన్మిస్తావు' అని చెప్పారు. అపుడా చండాలుడు, 'స్వామీ! మీ కటాక్షమనే గంగా ప్రవాహం వల్ల నేను పాపవిముక్తుడ నయ్యాను. మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరశువేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు, మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు యివన్నీ యెందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి, నన్ను విప్రులలో చేర్చండి' అని వేడుకున్నాడు. శ్రీగురుడు, 'పూర్వ పాపకర్మ ఫలితంగా యిలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యము? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిననిపించుకోవాలని కొన్ని వందల కొద్దీ సం॥లు మహాతపస్సు చేసి, తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠమహర్షి వలన కావలసిందేగాని తమ వల్లగాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడతడు వశిష్టమహర్షిని ఆశ్రయించగా, ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్టుని నూరుగురు కొడుకులనూ చంపాడు. వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు గాని, అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోథంతో ఒక పెద్దబండనెత్తి వశిష్ఠ మహర్షిపైన వేయాలనుకున్నాడు. కాని తిరిగి ఆలోచించుకొని, "వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షినని అంగీకరించ గలవారెవరు? దేవర్షులందరూ ఆయనను అనుసరించే వారేగదా! ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్యాపాతకం గూడ చుట్టుకుంటుంది" అని తలచి, పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడా బ్రహ్మర్షి, "నాయనా, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తపింపజేసికొని, కొత్త శరీరం చూపు" అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి, సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి, కొత్త దేహం వచ్చేవరకూ తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండానే నీకదెలా సాధ్యము? పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది, నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సబ్రాహ్మణుడవవుతావు, వెళ్ళు!' అన్నారు.
కాని పేదవానికి పెన్నిధి దొరికినా, మృత్యుముఖంలో వున్నవాడికి అమృతం దొరికినా, ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడువలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక, మాలపల్లెకు వెళ్ళకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి, అతనిని యింటికి రమ్మని పిలిచారు. అతడు, 'నేనిప్పుడు సద్ర్బాహ్మణుడను. నన్ను తాకవద్దు, దూరంగా పొండి!' అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, 'ఏమయ్యా! నీకేమన్నా పిచ్చి పట్టిందా?' అనగానే అతడామెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ, శ్రీగురునికి నమస్కరించి, 'బాబూ! ఇతడు నాపై యెప్పుడూ యెంతో ప్రీతిగా వుండేవాడు. ఇతడికి మతి చలించింది. నన్నిప్పుడు యెక్కడకు వెళ్ళమంటాడో చెప్పమనండి, నేనింక యీబిడ్డలను ఎలా పోషించేది? స్వామీ! మీరే ఈయనకు బుద్ధి మార్చాలి. లేకుంటే నేనిక్కడే ఉరివేసుకొంటాను' అని గోల పెట్టింది. శ్రీ గురుడు నవ్వుతూ అతనికేసి చూస్తూ, 'నాయనా! ఇకనైనా నామాట విని యింటికెళ్ళు. భార్యా పిల్లలను ఏడిపిస్తే నీకింక సద్గతి లభిస్తుందా? సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపరనుండి బయట పడగలవు. లేకుంటే ముందే పెళ్ళి చేసుకోకుండా వుండవలసింది. సూర్య చంద్రుల సాక్షిగా పెళ్ళి చేసుకున్న దానిని విడిచి పెడితే నీకు మహా పాపం వస్తుంది అన్నారు.
అతడు చేతులు కట్టుకొని, 'స్వామీ! నేను సద్రాహ్మణుడనన్న జ్ఞానం కలిగాక, అలా చేయడం నాకెలా సాధ్యం?' అన్నాడు. శ్రీగురుడు నవ్వుకుని, 'ఈతని వంటిమీద నున్న విభూతి తొలగిస్తేగాని ప్రయోజనం లేదు' అని తలచారు. ఆయన ఒక శిష్యుణ్ణి పిలచి, ఒక శ్రీమంతుడూ, పిసినారీ ఆయన బ్రాహ్మణుని తీసుకుని రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్ళి, ధనాశతో వాణిజ్యం చేసుకొంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. అతడితో స్వామి, 'నాయనా! నీవితనికి స్నానం చేయించు, అప్పుడితనికి తిరిగి తనకుటుంబంపై మమకారం మేల్కొంటుంది' అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్ళు తెచ్చి, పూర్వజన్మస్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడు. అతని వంటిపై నున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మరచిపోయి, భార్యా బిడ్డలతో, 'ఇంతకుముందు కొద్దిసేపు నాకు మతిపోయి నట్లయింది. ఇంతకూ మీరందరూ యిక్కడకు ఎందుకొచ్చారు? నేనొంటరినన్న భయం మీకెందుకు? ఇది పగలేగదా!' అన్నాడు. వారు జరిగినదంతా చెప్పారు. అతడు వారితో కలిసియింటికెళ్ళాడు. ఆ సన్నివేశమంతా చూచినవారు ఆశ్చర్య పోయారు. అదంతా చూచి విస్తుబోయిన త్రివిక్రమభారతి, 'స్వామీ! మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది?' అని అడిగాడు. శ్రీ గురుడు నవ్వి, అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది. అది కడిగి వేయగానే తొలగి పోయింది. భస్మమహిమ అలాంటిది. కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు. దానికితోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శవుంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని గూడ ప్రసాదించగలదు' అన్నారు. అప్పుడు త్రివిక్రమభారతి భస్మమహిమ గురించి వివరించవలసిందిగా శ్రీ గురుణ్ణి ప్రార్ధించాడు."
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
నామధారకుడు సంతోషించి "శ్రీగురుడు స్వయంగా భస్మమహాత్మ్యాన్ని యేమి వివరించారో సెలవీయండి" అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి యిలా చెప్పారు: "త్రివిక్రమభారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి యిలా వివరించారు: 'పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు. ఆ ముని జడలు, నారబట్టలు ధరించి, వంటినిండా విభూతి పూసుకుని అక్కడక్కడా సంచరించి, చివరకు నిర్మానుష్యము గా వున్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కన్పించిన ప్రాణినల్లా చంపి తింటూండేవాడు. వాడు ఈ మునిని చూచి, ఆయనను మ్రింగదలచి, అయనమీదకొచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడు. అతడు చంపడానికై ఆయనను తాకగానే, ఆయన శరీరం మీది భస్మమతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమోగాని, సత్పురుషుల దర్శనం లభించడమెంతో కష్టం. అన్ని ఘోరపాపాలు చేసిన ఆ రాక్షసునికి గూడ ఆ ముని యొక్క స్పర్శ తగులగానే అతడి హృదయం శాంతించి, విశేషమైన జ్ఞానము ఉదయించింది. అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపైబడి, “గురూత్తమా! నీవు సాక్షాత్తూ భగవంతుడవు. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి. నా పాపపు తలంపులన్నీ ఆగి పోయాయి. నన్ను రక్షించు!" అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవమహర్షి, "నీవెవడవు? నీవీ అడవిలో యెందుకున్నావు?" అనడిగారు. ఆ రాక్షసుడు నమస్క రించి యిలా చెప్పాడు:
"స్వామీ! మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అను పేరు గల యవనరాజును. అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. మదోన్మత్తుడనై పరస్త్రీలనెందరినో చేజిక్కించుకుని, మరెందరినో బలాత్కారం చేసాను. తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి గాదు. వారి గతేమీ పట్టించుకునేవాణ్ణిగాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు. అయినా నేను లెక్కచేయక తప్పత్రాగి, యింకెందరినో భ్రష్టులను చేసాను. చివరకు నాకు క్షయరోగమొచ్చింది. అప్పుడు నన్ను శత్రు రాజులు జయించి, నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత పదివేల సం॥లు నరకంలో ఘోరమైన బాధలననుభవించి తర్వాత 100 సం॥లు పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండ చిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటు, అడవికోడి, గ్రుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అనే 24 జన్మలెత్తి, 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడనయ్యాను. ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్ము మ్రింగాలన్న గర్భాత్రంలో మీమీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకీజ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్క సారిగా తుడిచి పెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మ రాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యమో కించిత్తుండడం వలన మీరు నాకు లభించారు. స్పృశించినంతమాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే! కాని నావంటి నికృష్ణుడికి యింతటి జ్ఞానం యెలా కలిగిందో తెలుపండి" అని ప్రార్ధించాడు.
అప్పుడు వామదేవుడు, "ఇది నా మహిమ కాదు, నావంటిపైనున్న భస్మం యొక్క మహిమే! దాని మహాత్మ్యం పూర్తిగా తెలుసుకొన్న వాడేలేడు. సాక్షాత్తూ పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా? అందుకొక నిదర్శనం చెబుతాను. పూర్వము కర్మభ్రష్టుడు, దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడుండేవాడు. అతడొక శూద్రస్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేసారు. చివరికతని తల్లిదండ్రులు గూడ అతనిని చేరనివ్వలేదు. క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై, అందుకు డబ్బులేక దొంగతనం చేస్తుండేవాడు. ఒకనాడతడు తప్పతాగి ఆ శూద్రస్త్రీ వద్దకెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడెదురై అతనిని చితకబాది ఊరిబయట ఒక గోతిలో పారవేశాడు. అతడు కొన ఊపిరితో పడివుండగా చూచి, శవమనుకుని ప్రక్కనే బూడిదలో పడుకొని వున్న ఒక కుక్క పీక్కు తింటానికి వచ్చి అతనిని నఖశిఖ పర్యంతమూ వాసన చూసింది. అప్పుడు దాని వంటిమీదనున్న బూడిద కొంచెం అతడి తలపైన పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసానదశరాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో యెక్కడనుండి వచ్చారోగాని శివ దూతలొచ్చి వాళ్ళను తరిమివేసారు. అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి వారిని కారణమడిగాడు. అప్పుడా శివకింకరులు ఆ శవంపైనున్న విభూతి చూపి, 'విభూతి పూసుకొన్న వారందరినీ కైలాసానికి తీసుకొని రమ్మని మా పరమ శివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి' అని చెప్పారు.
కనుకనే ఓ రాక్షసుడా! నేను భక్తితో విభూతి ధరిస్తాను" అని వామదేవుడు చెప్పాడు. అప్పుడా రాక్షసుడు, "స్వామీ! సాక్షాత్తూ మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వపుణ్యలేశం వలన మీ దర్శనము, ఈ జ్ఞానమూ లభించాయి. ఇకనైనా నన్నుద్ధరించు. అంతటి మాహాత్మ్యం గల ఆ భస్మాన్ని యే విధంగా ధరించాలో వివరించు" అని వేడుకున్నాడు.
వామదేవుడిలా చెప్పాడు: "ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మంధర పర్వతానికి వచ్చాడు. అచ్చటికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మొ॥న వారందరూ చేరారు. అప్పుడు వారిమధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. కర్పూరకాంతి గల దేహంతో జడలు, నాగాభరణాలు, చంద్రవంక, సకలాయుధాలు ధరించిన ఆయన, ఎర్రని వస్త్రాలు ధరించి యున్నాడు. అపుడా సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి, 'స్వామీ! లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయమేదైనా చెప్పవలసింది' అని ప్రార్ధించాడు. అప్పుడు ఆ పరమశివుడు యిలా బోధించాడు. 'సులభంగా నాలుగు పురుషార్ధాలను ప్రసాదించగలది- భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం. భస్మం కోసమని సంకల్పించి గోమయం (ఆవు పేడ) సేకరించి, దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని 'సద్యోజాతం' అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని, 'అగ్నిరిత్యా' అనే మంత్రంతో అభిమంత్రించి, 'మానసోక్త' అనే మంత్రం చదువుతూ, దానిని బొటన వ్రేలితో నలిపి, 'త్రయంబకం' అని చెబుతూ శిరస్సున ధరించాలి. తర్వాత 'త్రయాయుషం జమదగ్నే' అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. ఆ మూడింటిలో ఏ రేఖాగూడ కనుబొమ్మల కొనలు దాటగూడదు. ఆ రేఖలలో మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వేళ్ళతో అద్దుకున్నాక, అప్పుడు బొటనవ్రేలితో కుడివైపునుండి ఎడమ ప్రక్కకు మధ్య రేఖ దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము, గార్హపత్యాగ్ని, భూతత్త్వం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతః సదనము, బ్రహ్మదేవత. రెండవరేఖకు ఉకారము వర్ణము; దక్షిణాగ్ని, ఆకాశ తత్త్వం, యజుర్వేదం, చిహ్నం. మూడవ మాధ్యందిన సవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి. విష్ణు దేవతకు రేఖకు మకారము, ఆహవనీయాగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి, తృతీయ సవనము, శివునికి సంకేతము. ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి. ఈరీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది. మిగిలినవారికి వారు కోరిన పురుషా ర్ధాలు లభిస్తాయి. కనుక నాలుగు ఆశ్రమాలకు చెందినవారూ భస్మం ధరించాలి. దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియక పోయినా, సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము, మంత్రాలన్నీ అనుష్టానం చేసిన ఫలితము లభించడమేగాక, యితరులకు గూడ ఉత్తమగతి లభిస్తుంది. వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి' అని శివుడు చెప్పాడు.
కనుక, 'ఓ రాక్షసుడా! ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది' అని చెప్పి, కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము, నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వామదేవుడు త్రిమూర్త్యవతారము; జీవులనుద్ద రించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు. ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు సూతమహాముని గూడ చెప్పాడు.
శ్రీ గురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమభారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు".
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన : 1. ఈ అధ్యాయాలలో (30,31,32) గోపీనాథునికి దత్తాను గ్రహంతో జన్మించిన కుమారుడు యవ్వనంలో క్షయవ్యాధితో మరణించి తిరిగి శ్రీగురుని అనుగ్రహంతో బతకడం చెబుతుంది. 2. సద్గురువు బ్రహ్మలిపి మార్చి ఈ జన్మలోని వ్రాతను మరుజన్మకు మరుజన్మలోని వ్రాతను ఈ జన్మకు మార్చగలడని ఉదహరిస్తుంది. ఇట్టి లీలలు శ్రీ అక్కల్కోట స్వామి చరిత్ర, శ్రీ శిరిడీ సాయిబాబా వంటి నేటి దత్తావతార చరిత్రలలో గూడ చూడవచ్చు. 3. క్రిందటి అధ్యాయాలు సన్న్యాస, కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే, ఈ అధ్యాయాలు స్త్రీ ధర్మాన్ని సోదాహరణంగా వివరిస్తాయి. 4. ఈ అధ్యాయాలలో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ గూడా తెలుపుతుందని గమ నించాలి. 5. ధర్మవర్తనులు ధర్మం వలన పొందలేని ఫలితాలను గూడ సర్వధర్మ పరుడైన సద్గురు వును ఆశ్రయించుట వలన పొందగలరనీ, ధర్మ పరాకాష్ట కూడా సద్గురువు దర్శ నాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతము నిరూపిస్తుంది. ఆమెకు సహగమనం వలె ధర్మ నిరతి కూడ సద్గురు సమాగమ ఫలితమే.
నామధారకుడు, "స్వామీ! నాకెన్నో శ్రీగురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ ఋణం ఎన్నటికైనా తీర్చుకోగలనా? అటుతర్వాత "ఏమి జరిగిందో సెలవీయండి" అని ప్రార్ధించాడు. అంతట సిద్దమునీంద్రుడు యిలా చెప్పసాగారు:
"నామధారకా! శ్రీగురులీలలన్నీ చెప్పడం. ఎవరి తరమూగాదు. నాకు చేతనైనంత వరకూ చెబుతాను, విను. శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్త్యవతారమన్న కీర్తి నలు దిక్కులా వ్యాపించింది, భక్తులు ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చి, వారి అను గ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానము లేని వారు సంతానము, రోగులు ఆరోగ్యమూ పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకడి వృత్తాంతము చెబుతాను, విను.
మాహురపురంలో గోడేనాధుడనే (ఉరఫ్ గోపీనాథుడు) సబ్రాహ్మణుడు వుండేవాడు. అతడికెందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయస్వామిని నిష్ఠగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికొక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు. అల్లారుముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ యేటనే ఉపనయనం చేసారు. పన్నెండవ సం॥లో రూపవతి, సుగుణాలరాశియైన సావిత్రి (ఉరఫ్ సుందరి) యనే కన్యతో వివాహం చేసారు. ఆ దంపతులు సుగుణాల లోనూ, సౌందర్యంలోనూ సమానులై రతీ మన్మధులవలె సుఖిస్తూ, ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు. ఇలా వుండగా విధివశాత్తు దత్తునికి 16వ సం॥లోనే తీవ్రంగా జబ్బుచేసి, ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటినుండి ద్రవాహారమే తీసుకుంటూండడం వలన, నిత్యోపవాసిగా వుండేవాడు. ఇలా మూడు సం॥లు గడచేసరికీ అది క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్యగూడ అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ, నిరంతరమూ అతని సేవలో గడిపేది. అతడు కృశించిన కొద్దీ ఆ పతివ్రతగూడ శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమెగూడ అతనివలె అలంకారమే చేసికొనక, పాతచీరె ధరించేది. జుట్టు దువ్వుకొనక పోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైన ఆమెను అత్త మామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్షదైవమని నమ్మి సేవిస్తుండేది. తనకు గల సిరి సంపదలు వెచ్చించి, ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు, శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులొచ్చి యిచ్చిన మందులెన్నో వాడింది. ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి. కాని దత్తుని పరిస్థితి కించినా మెరుగవకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతడి తల్లిదండ్రులెంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి యిలా మొర పెట్టుకునేవారు: స్వామీ! దత్తాత్రేయా! నిన్ను సేవించి యీ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరచాము. ఇప్పుడితనిని గూడ నీవు మాకు దక్కించకుంటే మేము ఏమి చూచుకొని బ్రతకాలి?' వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని వూరడిస్తూ, 'మనకెంత ఋణానుబంధముంటుందో అంతవరకే ప్రాప్తముంటుంది గాని, అంతకుమించి ఆశపెట్టుకుంటే దక్కేదేమున్నది? కనుక మీరు నాకోసం దుఃఖించవద్దు' అని చెబుతుండేవాడు. ఆమాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చేది. అతడు గూడ దుఃఖిస్తూ తన తల్లితో, 'అమ్మా' అంతా ఈశ్వరాధీనముగాని, మన చేతిలో యేమున్నది? నీవు నాకొక్క ఘడియసేపు పాలిచ్చిన ఋణమైనా యింతవరకూ తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చి పెట్టాను. మిమ్మల్ని కొంచెమైనా సుఖ పెట్టలేకపోయాను' అంటూండేవాడు.
దత్తుడు తన భార్యతో, 'ప్రేయసీ, నాకింక కాలం తీరిపోతున్నది. నీవు నాకు చేసిన సేవకు, నాకోసం పడ్డ కష్టాలకు అంతేలేదు. గతజన్మలో నీకు పరమ శత్రువును కాబోలు, నిన్నిలా బాధిస్తున్నాను! ఇకముందు గూడ నీకు అండలేదని భయంలేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిలా చూచుకుంటారు. అయినా నీకిది యిష్టంలేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తయినా లేదు. దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంటకలిసింది' అని బాధపడుతుండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ, 'స్వామీ! మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి యేమున్నది? భార్యకు భర్తయే దిక్కుగాని తల్లిదండ్రులుగారు. నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా! నా ప్రాణమైన మిమ్ములను వదలి పోతే నా శరీరంలో ప్రాణముండదు. మీరెక్కడ వుంటే నేనక్కడే వుంటాను' అంటూండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి, 'అయ్యో! మీరే యిలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా వుండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు. అందరమూ కలిసి భగవంతుణ్ణి ప్రార్ధిద్దాము' అని ధైర్యం చెబుతూండేది. ఆమె ఒకసారి, గాలిమార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలని అనుకున్నది. అప్పుడొక గ్రామస్థుడు, మీరు దత్త భక్తులు గదా! దత్తావతారమైన శ్రీగురుని వద్దకెళ్ళండి. అక్కడెందరికో మంచి జరుగుతున్నది' అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, 'గంధర్వపురంలో శ్రీనృసింహ సరస్వతి యనే మహనీయులున్నారట. వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది. మీరనుజ్ఞ యిస్తే మేమిద్దరమూ అక్కడకు పోతాము. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను. మేమక్కడకు వెళ్ళడానికి అనుజ్ఞ యివ్వవలసినది' అని వారి కాళ్ళమీద పడి వేడుకున్నది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకనుమతించి, తగిన ఏర్పాట్లు చేసారు. ఆమె తన అత్తమామలతో, 'మీరు ధైర్యంగా వుండండి. ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు' అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధదంపతులు అబ్బురపడి, 'అమ్మాయీ! శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక! సౌభాగ్యవతీ భవ!' అని హృదయ పూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు.
సావిత్రి తన భర్తకు శ్రమ కలుగకుండా పల్లకిలో మెత్తని పడక యేర్పాటు చేసి, బోయీలను మెల్లగా నడవమన్నది. ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణంచేసి, గంధర్వనగరం సమీపించారు. సావిత్రి అక్కడక్కడా పల్లకీ దింపి శ్రీగురుని గూర్చి విచారిస్తున్నది. అంతదూరం ప్రయాణం చేసి డస్సినందు వలన దత్తునికి రోగభాధలెంతో తీవ్రమయ్యాయి. అవసానదశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు. ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడొకచోట దింపి, సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడెక్కడ వుంటారని ఆ ఊరివారిని విచారించింది. వాళ్ళు, స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్ళారని చెప్పారు. అతనిని అక్కడకు తీసుకువెళ్లామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం! ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే, అక్కడివారందరూ అడ్డువచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, 'అయ్యో' స్వామీ! నాకిదేమిగతి? ఓ శ్రీగురుమూర్తీ! మీరు ప్రాణ రక్షకులని తలచి గంపెడాశతో యింతదూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను. కాని నాపని-దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగి పడ్డట్లు, నీడను చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగిపడినట్లు, మంచినీటికని పోయిన వాడు మొసలి నోటబడ్డట్లు, నా భర్తను బ్రతికించుకోడానికి యిక్కడకు వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను. నాగతి పులి బారినుండి తప్పించుకున్న ఆవు, గోమాంసం తినే యవనుడి పాలిట పడినట్లయింది. నాకు తెలియకనే నేను నాభర్తను చంపినదానినయ్యాను. వృద్ధులైన అత్తమామాలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరంచేసి, దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేసాను'. అని హృదయవిదారకంగా ఏడుస్తున్నది. అప్పుడక్కడ చేరిన వారిలో కొందరు, 'అమ్మాయీ! నీవిలా ఏడ్చినందువలన లాభమేమి? విధిలిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా?' అని తెలియజెప్పాలని చూచారు. కాని వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలచివేస్తున్నాయి. ఆమె దీనాతిదీనంగా వారందరితో, 'అయ్యలారా! ఇప్పుడు నేనెక్కడ, ఎవరి అండన వుండాలి? నాప్రాణనాధుడు మరణించాక నేనెలా బ్రతికేది? నాభర్త వంటి సుగుణ సంపన్నుడు యీ లోకంలో మరెవ్వరూలేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం, వివాహమయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్యవ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేసాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగల్య రక్షణకోసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకీ పసుపుతాడైనా దక్కకపోవడమేనా?' అని దుఃఖిస్తూ ఆ శవంమీద పడి, 'స్వామీ! నన్ను విడిచి ఎక్కడకు పోయారు? మీరు లేకుండా నేనెలా బ్రతుకగలను? అయ్యో! ఈ వార్త విన్నవెంటనే మీ తల్లిదండ్రులు మర ణిస్తారు. వారిబిడ్డ నెలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని క్కడకు తీసుకొచ్చాను. నేనీపని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను తీసిన దోషినయ్యాను. నేనిప్పుడు వారికి ముఖమెలా చూపేది? నేనూ మీతోనే వస్తాను' అంటూ హృదయవిదారకంగా శోకిస్తున్నది.
ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి యిలా వివేకము ఉపదే శించాడు: 'పిచ్చిదానా! నీవిలా ఏడ్చి యేమి ప్రయోజనం? నొసటి వ్రాత మారదు గదా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా యెవరు నిలుస్తారు? అయినా. ఇతడెక్కడికి పోయాడనుకుంటున్నావు? ఆలోచించు
అసలు నీవెవరు? ఎక్కడనుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడ నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగ భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరు కున్నట్లు, జీవులు మళ్ళీ ఎక్కడనుండి వచ్చినవి అక్కడకు చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగలవలె ఈ శరీరాలు వచ్చి, కొంతసేపుండి మరల మరలా నశించి పోయేవే గదా! పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో యెక్కడున్నాడు? అతడెవడు? మాయావశులై, అలాంటి జీవులను "నావి, నావాళ్ళు" అనుకోవడం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండ ఈ శరీరమే నీ భర్త అని అను కుంటున్నావు. జీవుడు కర్మవలన శరీరం ధరిస్తాడు. కర్మ, త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఃఖాలు కల్గిస్తుంది. గుణాలన్నవి మాయవలన వున్నట్లు కనిపిస్తాయే గాని, నిజానికి లేనేలేవు. త్రిగుణాత్మకమైనది మాయేగాని, ఆత్మగాదు. పుట్టుక, చావు మొ॥న వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో యెట్టి సంబంధమూలేదు. ఆ జీవుడు అవిద్యవలన కర్మ బంధంలో చిక్కి, యీ సంసారంలోబడి యీదులాడు తున్నంతవరకే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. మృత్యువంటావా-సుదీర్ఘమైన ఆయువుగల దేవతలు గూడ కల్పాంతంలో నశించవలసిందే! ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలంవలన పుట్టి, దాని కధీనమైవున్న యీ శరీరం స్థిరంగా వుండటం ఎలా సాధ్యం? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడియున్న యీ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషంగాని, మరణించి నందుకు దుఃఖంగాని పొందదగినదేమీలేదు. గర్భంలో పడినది మొదలు ముసలి వాడయ్యేవరకూ వెనుక చేసుకొన్న కర్మననుసరించి యెప్పుడో ఒక్కప్పుడు మరణించక యెవరికీ తప్పదు. ఆ మధ్యకాలంలో యెవరైనా వారి విధి వ్రాతల ననుసరించి యెక్కడ యేసమయంలో ఎలాంటి సుఖదుఃఖాలు అనుభవించాలో అట్టివి యెవరైనా అనుభవించవలసిందే గాని, వాటిని నివారించడం ఎవరితరం? ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు. కాని కాలగతిని నియమించడం యెవరితరముగాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమైతే, గత జన్మలో నీకెవరితో యెట్టి సంబంధమున్నదో చెప్పగలవా? లేక, వచ్చేజన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్ధంగా బాధపడతా వెందుకు? రక్తము, మాంసము, శ్లేష్మము మొ॥న ధాతువులతో చేయబడిన యీ పాంచభౌతిక శరీరం "నేను, నాది" అనుకోవడం సరియేనా? ఇంతకూ నీవు శోకించేది యిటువంటి తోలుబొమ్మ కోసమే గదా? ఇకనైనా యీ శోకాన్ని నిగ్ర హించుకొని, యీ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో!' అన్నాడు.
ఆ బోధవిని సావిత్రి కొంచెం తమాయించుకొని, ఆ ముని పాదాలకు నమస్కరించి 'స్వామీ, నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగరా! నాకు నీవే తల్లివి, తండ్రివి. నేనీ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి' అని వేడుకున్నది".
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో యిలా చెప్పారు: "ఆ యోగీశ్వరుడు సావిత్రితో యిలా చెప్పాడు: 'సాధ్వీ, స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్యమహర్షి, ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండే వారు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి వుండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారియైన నారదుడు వింధ్యునితో, "ఓ పర్వతరాజా! నీకు సాటియైన పర్వతమింకొకటి లేదు. అయితే నేమి, నీవు మేరువుతో మాత్రం సమానం కాలేదు" అన్నాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరుపర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా వున్న ప్రాంతమంతా చీకటి మయమైంది. సూర్య దర్శనమవనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్యకర్మాచరణ తారుమార యింది. అప్పుడు ఋషులా విషయమై మొరబెట్టుకోగా, అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు, 'కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్తయైన సద్గురువును ప్రార్ధించి, వారు దక్షిణదేశానికి వెళ్ళేలా చేయి' అని ఉపాయం చెప్పాడు. అపుడు ఇంద్రుడు దేవతలందరితో కలసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అపుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ, ఆమె మహిమకు కారణమైన పతివ్రతా ధర్మాలను దేవగురుడైన బృహస్పతి యిలా చెప్పాడు :
"స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిధులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానమూ చేయకూడదు. సాధ్యమైనంతవరకు పొరుగిళ్ళకు పోకుండా, తప్పనిసరియైనపుడు తలవంచుకొని వెళ్ళాలి. దుశ్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని, యాత్రలకనీ ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త యింట్లో లేనపుడు స్త్రీ అలంకరించుకోగూడదు. గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగిరాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళుకడిగి, తుడిచి, విసనకర్రతో వీచి సేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసట తీరేవరకు కాళ్ళు పిసికి, తర్వాత స్నానం చేయించి, ఆయన పాదతీర్ధం తీసుకుని నమస్కరించాలి. అటు తర్వాత అతని చిత్తముననుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి, అతని ఉచ్ఛిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి. అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్ర పోవాలి. మరలా అతనికంటే ముందు నిద్ర మేల్కొని యింటి పనులు చేసుకొని, అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు వలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. భర్త సంతోషంగా వున్నప్పుడు తాను విచారంగానూ, భర్త విచారంతో వున్నపుడు తాను సంతోషం గానూ, వుండగూడదు. భర్త కోపించినపుడు క్షమించమని ప్రార్ధించాలి. భర్తతో తగవులాడకూడదు. అతడు కోపంతో అన్న మాటలను మనసులో వుంచుకోకూడదు. భర్త ఆజ్ఞననుసరించే భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు, ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికిగాను పసుపు, కుంకుమ, మంగళసూత్రము మొ॥లైనవి భక్తితో ధరించాలి. భర్తకు యిష్టమైన ఆభరణాలు, వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్త మామలను, బావమరదులను, ఆడుబిడ్డలను విడచి వేరుగా వుండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి, భర్త అసమర్థుడని నిందించగూడదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను గూడ పోవాలనుకో గూడదు. పతి సేవయే యాత్రగా, పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోభియైనా, రోగియైనా, వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడుగా భావించి అతనినే పూజించాలి. అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు గూడ సంతోషిస్తారు.
ఇలాచేయక యధేచ్ఛగా సంచరిస్తే, ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పాదధూళితో గాని అట్టివారి పాపం నశించదు. పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలుగూడ ధన్యత పొందుతారు. అలాగాకుంటే, రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరులేరు? అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది. ఏడు జన్మల పుణ్యంవల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలూ సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమైనా అడవితో సమానమే. ఆమె వల్లనే సత్సంతానము, ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజ మైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది. ఆమె సాహచర్యం వలన ఏడు జన్మల పాపం గూడ నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం గూడ పతివ్రతను దర్శించడంవల్ల కలుగుతుంది.”
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః
బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి యింకా యిలా వివరించారు: "బృహస్పతి యింకా యిలా చెప్పాడు: 'దేవతలారా, సతులకు భర్త మరణించినపుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం. కాని భర్త దూర దేశంలో వున్నా, ఆమె గర్భవతియైనా, లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డవున్నా అప్పుడు మాత్రం సహగమనం చేయగూడదు. అటువంటి స్త్రీ యావజ్జీవితమూ విధవాధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాటి ఫలితమే వస్తుంది. విధవా ధర్మాలు గూడ ఎంతో పుణ్యప్రదమైనవే. ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం. లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది. గతించిన భర్తగూడ పతితుడు అవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యమూ తల స్నానం, ఒక్క పూట భోజనమూ చేస్తుండాలి. అది గూడ స్వల్పంగా తింటే మరింత శ్రేష్ఠం. ప్రాణాలు నిలుపుకోడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. మూడురోజులకో, వారానికో, లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవ శించటం గాని, లేకుంటే చాంద్రాయణవ్రతం ఆచరించడం గాని ఎంతో శ్రేయ స్కరం. పాడ్యమినాడు ఒక ముద్దతో ప్రారంభించి, శుక్లపక్షంలో తిథికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి, పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినడం, అటు తర్వాత చంద్రకళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణ వ్రతమంటారు. ముసలితనం వల్లగాని, రోగంవల్లగాని యిలా చేయలేనివారు రెండవపూట పాలో, పండ్లో యావజ్జీవితమూ సేవించవచ్చు. మంచంమీద నిద్రించిన విధవ పతితో కలసి నరకానికి పోతుంది. కనుక క్రిందనే పడుకొనడం ఆమె ధర్మం. తనకున్న మంచము, పరుపూ పేదలకు దానమిచ్చేయాలి. చీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్రాహ్మణులకు దానమియ్యాలి. అభ్యంగనము (తలంటి), సుగంధము, పూలు, అలంకారాలు, తాంబూలములను ఆమె పరిత్యజించాలి, పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి, అతని ప్రీతికొరకు తర్పణం చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా వున్నాడని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు వున్నప్పుడు అతని అనుమతి తీసుకొని మాత్రమే యివన్నీ చేయాలి.
ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖమాసంలో జలదానం, కార్తీకమాసంలో దీప దానం, మాఘంలో నెయ్యి, నువ్వులు దానం చేయడటం ఆమె ధర్మం.' అలాగే వేసవి కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి. కార్తీకమాసమంతా యవాన్నమే తింటూ నక్తావ్రతములాచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడగూడదు. మోదుగాకుల విస్తట్లో భోజనం చేయడమే ఉత్తమంగాని, అరటి ఆకుల్లోను, లోహ పాత్రలలోనూ తినగూడదు. ఆ నెలాఖరుకు ఉద్యాపన చేయాలి. ఆ సమయంలోనేతితో నింపిన కంచుపాత్ర, బాగా పాలిచ్చే కపిలగోవు, యథాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది.
వీటన్నింటిలో దీపదానం శ్రేష్ఠమైనది. శివునికి ఏకాదశ రుద్రాభిషేకము, షోడశోపచారపూజ చేసి, తనభర్తయే నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వ పాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి, శివ పూజ, అతిథి సత్కారము ఏమార కుండా చేయాలి. అదెలా చేయాలో చెబుతాను వేదవిదులకు పాద్యమిచ్చి (అంటే కాళ్ళు కడుగుకొనేందుకు నీళ్ళిచ్చి), విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో గూడ నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటిపళ్ళు, ఒక పాత్రలో పానకము దానమిచ్చి, తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి, వారికి సాత్వికాహారం తృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగేవారికి గొడుగు, పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితముంటుంది. ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో శ్రీ సమానమవుతుంది. ఆమె భర్తకు కూడ పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పతివ్రతయైన స్త్రీ భాగీరధితో సమానము. ఆమె భర్త శంకరునితో సమానమే. కాబట్టి యిట్టి దంపతులే లోక పూజ్యులు'.
బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కన్పిస్తున్నాయి. ధైర్యం గలవారు సహగమనం చేయవచ్చు. కనుక అమ్మాయి! నీవు శోకం విడిచి, నీకేది శ్రేయస్కరమనిపిస్తే అలానే చేయి' అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తలమీద హస్తముంచి ఆశీర్వదించాడు. ఆపుడు ఆమె, యోగీశ్వరా, మీరే నాకు తల్లి, తండ్రీ, బంధువులు; వేరెవరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరి నైనప్పుడు మీరు తారసిల్లారు. యుక్తవయస్కురాలనైన నాకు వైధవ్యధర్మ మాచరించడం కత్తిమీద నడకవంటిది. యౌవనము, సౌందర్యమూ కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే నచ్చింది. అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి' అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లీ, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు యింత దూరం గురు దర్శనంకోసం వచ్చావు. కాని విధివశాన జరుగరానిది జరిగిపోయింది. కనుక యిప్పుడు సంగమానికి వెళ్ళి, శ్రీ గురుని దర్శించి వచ్చి, అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు' అని చెప్పి, ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మముంచి, ఆమెకు నాలుగు రుద్రాక్షలిచ్చి, 'వీటిలో రెండు అతని మెడలోను, చెవులకొక్కటీ కట్టి,రుద్ర సూక్తాలతో గురు పాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసినులకు, వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి, తర్వాత సహగమనం చేయవచ్చు' అని చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పుడు సావిత్రి, అచటి వేదపండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి, స్నానం చేసి, పసుపు పారాణి, కుంకుమలతో అలంకరించుకొని, శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకొని, శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. మహా సౌందర్యవతియైన ఆమె అంత చిన్న వయస్సులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోడానికి వెల్తోందని తెలిసి, గ్రామంలోని స్త్రీలు, పురుషులు ఆమెను చూడ్డానికి కొన్ని వేలమంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూచి, 'అయ్యో, ఏ సుఖమూ ఎరుగని చిన్న వయస్సులో ఒక బిడ్డెనా కలుగకముందే, చావంటే కించిత్తుగూడ భయంలేకుండా ఎంత ధైర్యంగా వెళుతోంది!' అని ముక్కున వేలేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి, 'ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా?' అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢనిశ్చయంతో ముందుకు సాగిపోతోంది. మరి కొంతమంది, 'ఆహా! ఈమె ధర్మవేత్తయైన మహా పతివ్రత కనుకనే, ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది. స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు' అని కీర్తించారు.
చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినులందరికీ వాయనాలు, సబ్రాహ్మణు లకు దండిగా దక్షిణలూ సమర్పించి, వారందరికీ నమస్కరించి, ఉత్సాహంతో అందరితో యిలా చెప్పింది: 'తల్లులారా! విప్రోత్తములారా! ఇదే మీ అందరి వద్దా శెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్నతల్లియైన గౌరీదేవి వద్దకు వెడుతున్నాను. అక్కడ మావాళ్లందరితో కలసి పార్వతీ పరమేశ్వరులనిద్దరినీ పూజిస్తుంటాను' అని చెప్పింది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో యిలా చెప్పింది: 'మీరు బాధపడతా రెందుకు? మీరు యింటికి వెళ్ళవచ్చు. కాని మా అత్తమామలకు మాత్రం వెంటనే యీ దుర్వార్త చెప్పగూడదు సుమా! చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరమూ శ్రీగురు సన్నిధిలో సుఖంగా వున్నామని అచ్చటివారందరికీ చెప్పండి.' అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి, అచ్చటి విప్రులతో, 'అయ్యలారా! నేను శ్రీగురుదర్శనం కోసం వచ్చాను. కనుక వారిని దర్శించి వచ్చి, సహగమనం చేయటం నా ధర్మమని తోస్తున్నది. నేనువెళ్ళిరానా?' అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, 'అమ్మా, సరేగాని, సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో!' అన్నారు. ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది. అచ్చటివారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు.
సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీ గురునిలా స్తుతించుకున్నది; 'స్వామీ! మీరు సర్వేశ్వరులు. శరణు కోరిన వారికందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించ గలవారని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైనా, త్రిగుణాలను ధరించి సృష్టి, స్థితి, లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిదేమున్నది? కర్మ సూత్రాన్ని అమలు పరచి, దండించ దగిన వారిని దండించే కర్మ ఫలప్రదాతలు మీరే! మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని, నాభర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని, యింత దూరం నడిచి మీవద్దకు వచ్చాను. నేనెంత పాపం చేశానో కాని, అందరికీ అబ్బిన సౌభాగ్యము, సంతానము మాత్రం నాకు కరువవడమే గాక, యింతటి దుస్థితి కల్గింది. మీమీద యింత ఆశ పెట్టుకొని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి! మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించే దేమిటో బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి గూడ తీసుకు పోదలచి నా భర్తతోకలసి వెళ్ళబోతున్నాను.
ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెల్లుబికి, అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీగురుడు ఆమెను, 'నిత్య సౌభాగ్యవతీ భవ!' అని ఆశీర్వదించారు!! వెంటనే అచటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, 'స్వామీ, ఈమె భర్తయింతకు ముందే యిక్కడ మరణించాడు. అతని శవం యింకా స్మశానంలోనే వున్నది. మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయ బోతున్నది. ఇంక ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది?' అన్నాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, 'అలాగా! ఎప్పుడు ప్రాణంపోయింది? ఏమైనాసరే, ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము! అగ్ని సంస్కారం నిలిపివేసి, ఆ శవాన్ని యిటు తీసుకురండి, మావాక్కు ఎన్నటికీ వ్యర్థంగాదు' అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్ళారు.
ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురు పాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు. ఇంతలోఆ శవాన్ని అక్కడకు తీసుకువచ్చారు. వెంటనే శ్రీ గురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింప చేశారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి, తమ అమృతదృష్టితో తదేకంగా శవంకేసి చూచారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై, మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు! అతడు సావిత్రితో, 'ప్రేయసీ!నీవు నన్ను ఎక్కడకు తీసుకువచ్చావు? ఈ యతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్ర పట్టితే నన్ను లేపనన్నా లేపలేదేమి?' అన్నాడు. సావిత్రి ఆనంద భాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పి, 'మన పాలిటి పరమేశ్వరులు, ప్రాణదాత ఈ శ్రీగురుడే!' అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి, తమ ఆనంద భాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. 'పరాత్పరా! జగద్గురూ! కృపాసాగరా! శరణ్యమూర్తీ! ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమా! శ్రీహరీ! సచ్చిదానంద స్వరూపులైన మీ లీలే యీ జగమంతా! మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. స్వామీ, ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి, దుఃఖాలలో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరచాము. మీరేమాకు దిక్కు. మమ్మల్ని ఉద్ధరించండి!' అని స్వామిని స్తుతించారు. శ్రీగురుడు వారి నాశీర్వదించి, 'సిరిసంపదలు, దీర్ఘాయువు కల్గి, అష్ఠ పుత్రులను కనండి! మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి. మీ దేహాలు పవిత్ర మయ్యాయి.మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలూ సిద్ధించి, చివరకు ముక్తిగూడ కల్గుతుంది. మీరు యింటికి వెళ్ళండి' అన్నారు. అది విన్న జనమంతా జయజయ ధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు యిచ్చారు.
కాని అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి, 'అయ్యా! నాకొక సందేహమున్నది. నొసటి వ్రాత తప్పించటం ఎవరి తరమూ కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మవ్రాత నిజమే అయితే, యీ చనిపోయినవాడు తిరిగి ఎలా బ్రతికాడు?' అన్నాడు. స్వామి నవ్వి, 'బ్రహ్మ అనుమతితో మేము, వచ్చే జన్మలోని అతని జీవిత కాలంనుండి 30 సం॥లు ఈ జన్మకు మార్చాము. అంతేగాని, విధివ్రాత 'అన్నది వాస్తవమే' అని చెప్పి, అతనికి దివ్యదృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపజేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ యిళ్ళకు వెళ్ళిపోయారు. నాటినుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దశదిశలా వ్యాపించింది. సావిత్రి - దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి, వేద విప్రులకు భారీయెత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడస్త మిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు".
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః
ప్రస్తావన : 33, 34, 35 అధ్యాయాలు వివరించే అంశాలివి. శ్రీ గురుడు పుంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తాడు. ఇలా ఒకే సమయంలో వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్ర హించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చు. ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత. అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు, మాహురపురంలో నిద్ర, కొల్హాపురంలో భిక్ష ప్రతిదినమూ చేస్తాడని శిరిడీ ఆరతులు స్తుతిస్తాయి.
ఒక వేశ్య ఆమె వద్దనున్న ఒక కోడి, ఒక కోతి గూడ రుద్రాక్ష మహిమ వలన, ఒక రాజకుమార్తె సోమవార వ్రతం వలన శుభము పొందినట్లు శ్రీ గురుడు చెబుతాడు. వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణం. ధర్మనిష్టకు భగ వంతునిపై విశ్వాసమే మూలం. భగవంతునిపై అనన్యమైన ప్రేమ వుంటే, ఆయన శాసనమైన ధర్మం మీద ప్రీతి ఎందుకుండదు? ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము, వేదాధ్యయనమూ వ్యర్థమని, మిధ్యాచారమని శ్రీ గురుని సూచన, ప్రారబ్ధవశాన బాహ్య దృష్టికి వేశ్యయైనా ధర్మనిరతి గల అంతరంగము, భక్తీ ఆమెకు ఉత్తమగతిని ప్రసాదించాయి.
సద్గురు సమాగమం చేత విభూతి, రుద్రాక్ష గూడ అతీత ఫలమిస్తాయని, సద్గురు సమాగమం రాక్షసులకు సైతం పరివర్తన కల్గించి ఉద్భవించగలదనడానికీ రాజు పరాశర మహర్షిని, బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షినీ ఆశ్రయించిన కథలు తెల్పుతాయి. సద్గురుని ఆశ్రయించని బాహ్యచార పాటవం అహంకారానికి, అజ్ఞానానికి చిహ్నం. కారణం ధర్మాన్ని, సదాచారాన్ని నిశితంగా సూక్ష్మంగా విప్పీ చెప్పగలవారు వాటిలో పరిపూర్ణతనందిన వారే గదా!
రుద్రాక్ష, భస్మము దేహంపైన ధరించడం అంటే వాటిచేత సంకేతించ బడిన పరమాత్మ తత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడమన్నమాట. అందు కవసరమైన సాధనాన్నన్వేషించుకుంటూ, ముముక్షువు తప్పక సద్గురువునాశ్ర యించి, కర్తవ్యాన్ని తెలుసుకొని ఆచరిస్తాడు. అటువంటి శ్రద్ధాభక్తులు కలవాడు సద్గురు కృపను పొంది తీరుతాడు. అందుకే శ్రీ రామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితునిగా సద్గురుని వర్ణించారు.
నామధారకునితో సిద్ధయోగి యింకా యిలా చెప్పారు: "దత్తుడు, సావిత్రి ఆరోజక్కడే నిద్రచేసి, మరుసటిరోజు తెల్లవారుఝామునే స్నానం చేసుకొని శ్రీగురుని దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో యిలా అన్నది: 'స్వామీ, నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము ఉపదేశించి రుద్రాక్షలు, విభూతి ప్రసాదించారు. ఆయనెవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహాద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనము మాకెక్కడ లభిస్తుంది?' అన్నది. శ్రీ గురుడు చిరునవ్వులు చిందిస్తూ, 'అమ్మాయీ, నీ పతిభక్తిని చూడదలచి మేమే మారురూపంలో నీవద్దకొచ్చాము. మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికే అవి ప్రసాదించాము. వాటి మహాత్మ్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు గనుక వాటి మాహాత్మ్యం వివరిస్తాము:
ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలుండవు. ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి, స్మృతి పురాణాలు చెబుతున్నాయి. వేయి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తూ రుద్రుడే. అన్ని దొరకనప్పుడు బాహవులకు పదహారేసి, శిఖలో ఒకటి, చేతులకు ఇరవైనాల్గేసి, మెడలో ముప్ఫైరెండు, శిరస్సున నలభై రెండు, చెవులకు పన్నెండేసి, కన్నులకు ఒక్కొక్కటి, వక్షస్థలంలో 108 ధరించిన వాడు సాక్షాత్తూ కుమార స్వామితో సమానుడు. వాటికి పగడాలు, స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలమొస్తుంది. భస్మము, రుద్రాక్ష ధరించని వాని జన్మయే వ్యర్థం. అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలముంటుంది. ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్నర్చించినంత ఫలితముంటుంది. రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించినా నాల్గు పురుషార్ధాలూ సిద్ధిస్థాయి.
పూర్వం కాశ్మీరదేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు, మంత్రి -సుధర్ముడికి సద్గుణుడనే కొడుకూ వుండేవారు. వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్కచేయక, రుద్రాక్షలు ధరించి శివారాధన చేసిగాని భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశరమహర్షి రాగా, భధ్రసేనుడాయనను పూజించి, ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణ మేమో చెప్పమని ప్రార్థించాడు. ఆ ముని, "రాజా! వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి, శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేశ్యవుండేది. ఆమె గుణవంతురాలు. స్వేచ్ఛాచారిణిగా జీవించక, పెద్దలవలన సకల ధర్మాలూ తెలుసుకొని, దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది. ఆమె నిత్యమూ అలంకరించుకొని తన యింటనున్న మంటపంలో నృత్యం చేసేది. ఆ మంటపంలో ఒక కోడిని, ఒక కోతినీ పెంచుతూ వుండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది.
ఒకనాడు మహాధనికుడు, శివవ్రతదీక్షితుడూ అయిన ఒక వైశ్యుడు ఆమె యింటికి వచ్చాడు. అతని వంటి మీద విభూతి, చేతులకు రత్నకంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగి పోతున్న రత్నలింగమూ వున్నాయి. దానిని చూచి ఆ వేశ్య ఆశపడి, తన సఖిచేత కబురు పంపింది. అతడు, ఆ మంటపంలో కూర్చొని, మహా సౌందర్యవతియైన ఆ వేశ్య తనను సంతోష పెట్టగల్గితే ఆ లింగము యిస్తానన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి, మూడురోజులు పతివ్రతాధర్మమను సరించి అతనిని సేవించగలనని తన సఖిచేత చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాటవిని నవ్వి, 'కులస్త్రీకివలె వేశ్యకు అదెలా సాధ్యం?' అని విమర్శించాడు. అప్పుడా వేశ్య, 'నా విషయంలో మీకెట్టి సందేహమూ అక్కరలేదు. నేను త్రికరణ 'శుద్ధిగా ఆ మూడు రోజులూ పాతివ్రత్యమవలంబించగలను' అని చెప్పి, ఆ లింగంపై చేయివేసి, సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి, 'ప్రేయసీ, ఇది నాకు ప్రాణంతో సమానం. దీనికేమైనా అయితే నేను వురిపోసుకుంటాను' అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది.
ఆ యిద్దరూ కలసి ఆరాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక, అదేమి చిత్రమోగాని, నాట్య మంటపం క్షణంలో భస్మమై పోయింది. ఆ కోతి, కోడి గూడ బుగ్గయిపోయాయి. ఇరుగుపొరుగువారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లావారాక అది తెలిసి వైశ్యుడు, 'అయ్యో, నాప్రాణలింగమే పోయింది! నేనింక బ్రతుకను' అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా ఆ లింగం దొరక లేదు. అతడు ఒక చితి వెలిగించి, ఆ మంటలలో దూకాడు. అతని వెంటనే ఆ వేశ్య, 'నాథా!' అని కేకలు పెడుతూవచ్చి తనధర్మాన్ననుసరించి సహగమనం చేయటానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి, 'వేశ్యవైన నీకు యిదేమి వెర్రి?' అని ఎన్నో రీతులు చెప్పి వారించారు. కాని ఆమె వారి మాటలేవీ పట్టించుకొనక, 'సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్య మవలంబించిన నాకు ఇదే ధర్మము. నేనిప్పుడు సహగమనం చేయకుంటే, నాతో పాటు నా 21 తరాలవారు నరకంలోపడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణమన్నది ఎప్పటికైనా తప్పదు గదా! ఇలా హీనంగా బ్రతికే కంటే నాధర్మ మాచరించి తరించడమెంతోశ్రేష్ఠం!' అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి, 'సుందరీ, నీ ధర్మగుణాన్ని పరీక్షించదలచి, నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను. నీకిచ్చినది నా ఆత్మ లింగమే! ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి, నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో!' అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, 'స్వామి, నాకీ ముల్లోకాలలో ఎట్టి భోగమూ అక్కర్లేదు. నాకీ సంసారబంధం తొలగించి, శాశ్వతమైన శివసాయు జ్యము ప్రసాదించు' అని ప్రార్ధించింది. శివుడు సంతోషించి, ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు నాట్యమంటపంలో అగ్నిలో పడి మర ణించిన ఆ కోడి, కోతి యీ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము, రుద్రాక్షలూ యింత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యము చెప్పనలవిగానిది.' కనుక ఓ సాధ్వీ, రుద్రాక్ష యింత మహిమ గలది'అని శ్రీగురుడు చెప్పారు".
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యోనమః.
సిద్ధయోగి, అటుపై శ్రీ గురుడు చెప్పిన కథ యిలా కొనసాగించారు: 'ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, "స్వామీ, ఈ బిడ్డలు పూర్వ జన్మలో రుద్రాక్షమహిమ తెలియకుండానే వాటిని ధరించినా యిలా రాజ పుత్రులుగా జన్మించారు గదా, ఇప్పుడు వాటిని యింత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా,వుండబోతుంది?" అని అడిగాడు. పరాశరమహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, "రాజా! వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నామనస్సు అంగీకరించడంలేదు" అన్నాడు. రాజు ఆందోళనతో అదేమిటో తెల్పమని మరీమరీ కోరగా, ఆ మహర్షి, "నాయనా! ఇప్పటినుండి 8వ రోజున వారు మరణించవలసి వున్నది" అన్నాడు. అది విని రాజు, అతని పరివారమూ ఎంతో దుఃఖించి, దానికి నివారణోపాయం తెల్పమని కోరారు. ఆ మహర్షి యిలా చెప్పారు: "భయం లేదు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి, అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రం. అది 4 పురుషార్దాలు ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్ష స్థలంనుండి ధర్మాన్ని, పృష్ఠ భాగంనుండి అధర్మాన్నీ సృష్టించాడు. ధర్మాన్ననుసరించినవారికి ఇహ పరాలలో సుఖము, అధర్మమనుసరించిన వారికి దుఃఖమూ కల్గుతాయి. కామము, మొ॥న వికారాలు అధర్మం నుండి పుట్టినవే. వాటిననుసరించి మరెన్నో పాపాలున్నాయి.
కాని ఏ గ్రామంలో రుద్ర జపం జరుగుతుందో అక్కడ యీ పాపాలు ప్రవేశించలేవు. అది సర్వ పాపహరం. పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు గూడ పరిశుద్ధులపడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, "యమధర్మ రాజా! మదాంధులు, తామ సులు, భక్తిలేనివారినీ మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రం జపించేవారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనే కూడదు. అల్పాయువు గలవారుగూడ దానివలన దీర్ఘాయువు పొందగలరు. రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసినవారిని చూచి నీవు గూడా భయపడవలసివున్నది అని చెప్పాడు. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువలన వారు ధర్మాత్ములై, సర్వసంపదలతోను కలకాలం జీవించ గలరు' అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు.
ఆ రాజు, ఆ ప్రకారమే 100 మంది సద్రాహ్మణులచేత పదివేల రుద్రమంత్ర గానంతో ఏడు రోజులు రాత్రింబవళ్ళూ సంతతధారగా శివునికి అభిషేకం చేయిం చారు. నిత్యమూ అభిషేకజలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు. చివరిరోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహతప్పిపడిపోయారు. అప్పుడు పరాశర మహర్షి రుద్ర మంత్ర జలం వారిమీద చల్లాడు. వెంటనే వారు లేచి కూర్చున్నారు. అప్పుడా మహర్షి, "బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చితరిమివేసి, ఆ రాజకుమారులను బ్రతికించారు" అని చెప్పాడు. రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవంచేసి, అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు. ఇంతలో నారదుడు అక్కడకు వచ్చి, ఆ రాజకుమారులకు 12వ ఏట అపమృత్యు భయమున్నదని, అది తప్పితే పూర్ణాయుర్దాయ మున్నదనీ చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెల్పాడు'. అందుకే శ్రీ గురునికి రుద్రాధ్యాయమంటే అంత ప్రీతి. కనుక నామధారకా, నీవు నిత్యమూ రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి పూజించు!" అని సిద్ధుడు చెప్పాడు.
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః
సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతమిలా చెప్పారు: "సావిత్రి శ్రీగురుని పాదాలకు మ్రొక్కి 'స్వామీ! నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రముపదేశించి అనుగ్రహించండి' అని వేడుకొన్నది. శ్రీ గురుడు, ‘అమ్మా, స్త్రీలకు భర్తను సేవించడంకంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయగూడదు. పూర్వం దేవాసుర యుద్ధంలో, చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృతసంజీవినీ మంత్రంతో బ్రతికించి, యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి, నందిని పంపి, ధ్యాననిమగ్నుడైయున్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని మ్రింగి తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతోపాటు బయటకొచ్చి, మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు. ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశమిస్తే నిర్వీర్య మౌతుందని, అందులో మృతసంజీవనీ మంత్రం మూడవవాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు, బృహస్పతిని పిలిచి అతనికొక ఉపాయం చెప్పాడు.
బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి, 'అయ్యా, నేనొక విప్ర కుమారు డను. అపారమైన మీ యశస్సు విని, విద్యార్థినై మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి' అన్నాడు. శుక్రుని కుమార్తె, దేవయాని అతనిని చూచి మోహించి, తన తండ్రిని అందుకు ఒప్పించింది. కాని రాక్షసులు కొద్దికాలానికి, కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకొన్నారు గాని, శుక్రాచార్యునికి చెప్ప సాహసించ లేదు. ఒకనాడు కచుడు సమిధలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులతనిని రహస్యంగా అక్కడే చంపేసారు. దేవయాని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్యదృష్టితో తెలుసుకొని, మృతసంజీవని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొక్కసారి అతనిని చంపి దహనం చేసి, ఆ బూడిద నలుదిక్కులకూ విరజిమ్మేశారు. కాని శుక్రుడు మరల అతనిని బ్రతికించాడు. రాక్షసులు అతనిని మళ్ళీ చంపి భస్మం చేసి, నీటిలో కలిపి శుక్రునిచేత త్రాగించారు. ఈసారి దేవయాని మొరపెట్టుకొన్నప్పుడు, శుక్రాచార్యుడు తన యోగదృష్టితో జరిగినది తెలుసుకొని ఆమెతో అన్నాడు, "అమ్మా, యీ రాక్షసులు అతనిని నాకడుపులోకి పంపేశారు. ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే, నేనే చనిపోవలసి వస్తుంది." అప్పుడామె, "తండ్రీ! నేనతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను. అతడు లేక నేను బ్రతుకలేను" అన్నది. ఆ రాక్షసగురువు, "ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు, ఇతరు లకు చెప్పకూడదు" అన్నాడు. ఆమె, "తండ్రీ, నీ కుమార్తెనైన నాకు ఆమంత్రం ఉపదేశించు. కచుడు బ్రతికి బయటకు రాగానే మరల నిన్ను గూడ బ్రతికిస్తాను" అన్నది. “అమ్మా, స్త్రీలకు మంత్రజపం తగదు. వారికి భర్త సేవయే విధించబడింది. స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమౌతుంది" అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి, "అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా వుండండి. కచుణ్ణి విడిచి జీవించలేని నేనే మరణిస్తాను" అని చెప్పి మూర్ఛబోయింది. వేరు దారిలేక, ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొలిపి, మంత్రం ఉపదేశించి, తర్వాత ఆ మంత్రంతో కచుణ్ణి బ్రతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే, దేవయాని మూడుసార్లు ఆ మంత్రం ఉచ్ఛరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు, కచుడు గూడ ఆ మంత్రం విన్నాడు.
స్త్రీకి ఉపదేశించడం వలన, మూడవవాడుగా కచుడు వినిన కారణంగానూ ఆ మంత్రం నష్టమైంది. అలా నిర్ధారణ చేసుకొని కచుడు, శుక్రాచార్యుడికి నమస్క రించి, “అయ్యా, మీ కృపవలన విద్యలన్నీ నేర్చుకున్నాను. నా అభీష్టం నెరవేరింది. ఇక్కడుంటే నన్నీరాక్షసులు బ్రతుకనివ్వరు. కనుక నాకు సెలవిప్పించండి" అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తూ, "నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేసాను. మూడుసార్లు నీకు ప్రాణమిప్పించాను. కనుక నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు" అని పట్టుబట్టింది. కచుడు, "నీవు గురుపుత్రివి గనుక నాకు సోదరివి. ప్రాణదానం చేసావు గనుక తల్లివి. నిన్ను వివాహమాడదలచడం మహాపాపం. కనుక నన్ను వెళ్ళనివ్వు" అని ప్రార్థించాడు. కాని ఆమె కామవశయై, "కృతఘ్నుడా, నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువు గాక!" అని శపించింది. కచుడు ఆమెను అసహ్యించుకొని, తనను అనవసరంగా శపించినం దుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. నాటినుండీ యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు. ఇది తెలిసిన వారెవరూ స్త్రీకి మంత్రోపదేశం చేయరు. కనుక సావిత్రీ, నీకేదైనా వ్రతం చెబుతాను, చేసుకో!" అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి, 'స్వామి ! మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది? అయినప్పటికీ, మీ ఆదేశమే నాకు వేదవాక్కు, మీకు నచ్చిన వ్రతం సెలవియ్యండి' అన్నది. శ్రీ గురుడు యిలా చెప్పారు: 'అందరూ ఆచరించుకోడానికి అనువైనది ఉత్తమమైన సోమవారవ్రతం. దానిని వెనుక సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించాడు. సోమవారంనాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్ర హంతో వుండాలి. ఈ వ్రత మహిమ తెల్పే ఐతిహ్యము ఒకటి చెబుతాను:
ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలనెంతో ధర్మంగా పాలిస్తుండే వాడు. అతడు సంతానం కోసం శివుని పూజించగా, ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకం చూచి, ఆమె చిరకాలం సుమంగళిగా, సుఖంగా జీవించగలదని చెప్పారు. కాని కొంత కాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూచి, 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి, సీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క్య మహర్షి భార్య, మహాపతివ్రతయైన మైత్రేయిని దర్శించి నమస్కరించి, తన దురదృష్టానికి నివారణ తెల్పమని ప్రార్ధించింది. అప్పుడు మైత్రేయి, "అమ్మాయీ, ప్రతి సోమవారమూ భక్తితో శివపార్వతులను పూజించు. అభిషేకం వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము, గంధ పుష్పాక్షతలు సమర్పించినందు వల్ల సౌభాగ్యము, ధూపమర్పించడం వలన సౌగంధ్యము, దీప దానం వలన కాంతిమత్వము, నైవేద్యం వలన సకల భోగాలు, తాంబూల సమర్పణ వలన నాల్గు పురుషార్థాలూ చేకూరుతాయి. జపం వలన అప్లైశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరిసంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వ దేవతా సంతృప్తి కల్గుతాయి. కనుక ఆ రీతిన యీ వ్రతమాచరించు" అని చెప్పింది.
సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి, ఎంతో శ్రద్ధతో ఆ వ్రతమాచ రించింది. ఆమెకు యుక్తవయస్సు రాగానే, ఇద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికిచ్చి వివాహం చేసారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా, జీవిస్తుండగా ఒక రోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్ళి, ప్రమాదవశాన కాళింది నదిలో మునిగిపోయాడు. ఎందరు యీతగాళ్ళు వెదికినా దొరకలేదు. అది తెలిసి 14సం॥లు నిండిన సీమంతిని ప్రాణాత్యాగానికి సిద్ధమైనది, కాని రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకు చేరి, దుఃఖించారు. సీమంతిని తాను వ్రతమాచరించినా గూడ తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు మొరపెట్టుకొని, సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు, "శవము కన్పించకుంటే సహగమనం చేయకూడదు. ఇంతకూ అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము? కనుక నీవు వేచి వుండాలి". అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యమపహరించి, ఆరాజ దంపతులను చెరసాలలో పెట్టారు. చిత్రవర్మ, శాస్త్రానుసారం ఒక సం॥ము వేచిచూచిన తర్వాత తన కుమార్తెకు వైధవ్యమిప్పిం చాలని నిశ్చయించుకొన్నాడు. సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతమాచరిస్తూనే వున్నది.
నీట మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి, పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగి పోతున్న పడగలుగల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్ళారు. అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతమెరిగి, సంతోషించి, సకల భోగాలూ అనుభవిస్తూ, తమ లోకంలోనే వుండిపొమ్మని అతనినాహ్వానించాడు. చంద్రాంగ దుడు వారి ప్రేమకు సంతోషించి, తన తల్లి దండ్రులు, తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని, కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలనీ చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం త్రాగించి, అతని భార్యకోసం ఒక పాత్రలో అమృతమిచ్చి అతనిని సత్కరించి, తననెప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వంమీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతం త్రాగడం వలన దివ్యవర్చస్సుతో వెళ్లిపోతూ, దివ్యాశ్వంపై నీటినుండి పైకి వచ్చిన చంద్రాంగదుని జూచి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆరోజు సోమవారం. సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయటానికి నదికి వచ్చింది. కాని ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రము, నొసట కుంకుమ కన్పించక పోయేసరికి, ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక, చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారు రూపం ధరించి రాజకుమార్తెను విచారించి, 'నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు' అని ఆమెతో చెప్పి, మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు. వారి రాజ్యమపహరించిన దాయాదులకు, తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెల్పుతూ, రాజ్యం తిరిగి వప్పగించ మని, లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలననీ హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేసాడు. నదిలోపడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియ గానే ఆ దాయాదులు భయపడి, రాజ్యం అతనికి తిరిగి అప్పగించి, క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ, తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తనవారు యెంత దుఃఖించారో, యెన్ని కష్టాలనుభవించారో తెలుసుకొని, తల్లి దండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు. తిరిగి తమ కొడుకును, రాజ్యాన్నీ పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి, ఎంతో వైభవంగా చంద్రాం గదుడికి పట్టాభిషేకం చేసారు. '
శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, 'స్వామీ, పరమ పవిత్రము, శ్రేయోదాయకమూ అయిన మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపు లైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా? వేరొక వ్రతమెందుకు?' అన్నాడు. శ్రీగురుడు, 'ఇది మా ఆజ్ఞ! ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకందదు. కనుక యీ వ్రతం చేసుకోండి!' అని చెప్పి వారినాశీర్వ దించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురుసన్నిధిలో వున్నాడని తెలిసిన గోడేనాథుడు, అతని భార్య వాళ్ళను చూడడానికి అక్కడకు చేరుకున్నారు. వారు శ్రీగురుని దర్శించి, జరిగినదంతా తెలుసుకొని, వేయిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసి, కొడుకు-కోడళ్ళనూ తీసుకొని స్వస్థానం చేరుకున్నారు. సావిత్రీ-దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతమాచరించి, కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి, శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకూ ప్రాకిపోయింది.".
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన: 1. క్రిందటి అధ్యాయాలలో సూచించినట్టు సద్గురువు భక్తులనుతన మహిమ చేత రక్షించడమే గాక అందులో భాగంగా బోధను గూడ అనుగ్రహించి ధర్మ, మోక్షోన్ముఖులను చేస్తాడు. ఈ అధ్యాయాలలో బోధ ప్రధానమైన లీలలను సిద్ధుడు వివరిస్తాడు. 2. ఒకొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు. ఈ(36,37) అధ్యాయాలలో విప్రుడు పరాన్నo స్వీకరించకపోవడమనే ధర్మానికి, భర్త భార్యను తన రూపంగా తలచి సంతోష పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు. అపుడు వివేకి సమస్యనెలా పరిష్కరించాలో శ్రీ గురుడు సూచించాడు. 3. అంతేగాక 'ఆహార శుద్ధే, సత్త్వశుద్ధి:' ఆహారశుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం. సత్త్వ శుద్ధి లోపిస్తే యజ్ఞదాన తపః కర్మలు వ్యర్ధమవుతాయని భగవద్గీతా వాక్యం. సాత్వికమైన ఆహారమేమో శ్రీ గురుడు స్థూలంగా యీ అధ్యాయాలలో బోధించాడు. దీని వివరణ పూర్ణ దత్తావతారమైన శిరిడీ సాయినాథుడు బోధించినది "శ్రీ సాయి ప్రబోధామృతం' లో చూడవచ్చు. ఆ వివరణ అర్హమని, సదాచారమని ధృవపరిచే అంశాలను శ్రీ స్వామి సమర్థ మాణిక్య ప్రభువు మొ॥న సద్గురువుల చరిత్రలలో చూడవచ్చు.
నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, "స్వామీ, అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగివున్న నాకు యీ గురుచరిత్ర విన్పించి మేల్కొలిపారు. దయతో అటుపై వృత్తాంతం తెల్పి, ఈ జ్ఞానాన్ని ధృడం చేయండి" అని ప్రార్ధించాడు. సిద్ధయోగి సంతోషించి, యిలా చెప్పసాగారు: “నాయనా, శ్రీ గురులీలలు ఎన్నని చెప్పగలను? కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను, శ్రద్ధగా విను.
గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు గాని, ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు గాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ, తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూండేవాడు. ఆ కాలంలో శ్రీగురుని మహిమ వలన అచటికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళే వాడు గాదు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్థులం దరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మ ణుడు మాత్రం వెళ్ళడానికొప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము, దక్షిణలు, క్రొత్త వస్త్రాలు, దానము తీసుకొని సుఖంగా జీవించాలని వుండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటివలే ఈసారి గూడ వప్పుకోలేదు. అతనితో తననొక్కదాన్నన్నా పంపమని, లేకపోతే అతనిని గూడ రమ్మనీ పట్టు బట్టింది! అతడు, 'నేను రాను, నీకంత ఆశవుంటే నీవు వెళ్ళవచ్చు' అన్నాడు. అప్పుడామె ఆ శ్రీమంతునితో, 'నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా?' అనడిగింది. అతడు, దంపతులే రావాలన్నాడు. నిరాశ చెంది, తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకుని, తన భర్తగూడా ఆరోజు సమారాధనకు వెళ్ళేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీనృసింహసరస్వతి నవ్వి, ఆమె భర్తను పిలిపించి, 'ద్విజోత్తమా, నామాటవిని ఈ రోజుకు నీవుసమారాధనకు వెళ్ళు, భార్య యొక్క కోర్కె తీర్చడం భర్తయొక్క ధర్మం' అని హితం చెప్పారు. ఆ విప్రుడు, 'స్వామీ, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళతాను. గురువు ఆజ్ఞను ఉల్లంఘించగూడదు కదా?' అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు.
ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రంవద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్ళలోనూ, మరికొందరి విస్తళ్ళలోనూ వున్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా, నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరివచ్చి, అన్నపురాశిని ముట్టుకున్నది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొన సాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూచి, వెంటనే కోపంతో విస్తరిముందు నుండి లేచి, అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తల బాదుకుని, 'బుద్ధిలేనిదానా! నీవలన యీరోజు నా ఖర్మ యిలా కాలింది!' అని చెప్పి, విస్తరిముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమెకేసి చూస్తూ, 'ఏమమ్మా! పరాన్నసుఖం అనుభవించావా? నీకోర్కె నెరవేరిందా?' అని అడిగి, నవ్వారు. ఆమె సిగ్గుతో తలవంచుకొని, 'స్వామీ! నాబుద్ధిహీనత వలన మావారిని గూడ యీ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను. నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి' అని వేడుకొన్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీ గురుడు అతనిని ఊరడించి యిలా చెప్పారు: 'పోనీలే, ఏమైతేనేమి? నేటితో నీభార్య మనసు కుదుటపడ్డది గదా? ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు. ఇంతమాత్రానికే నీకెట్టి దోషమూ రాదు. నీకు నియమభంగమూ కాదు. ఎప్పుడైనా దేవ, పితృ కార్యాలలో భోక్తలభించక ఎవరికైనా కర్మానుష్టానికి ఆటంక మేర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషమూ వుండదు' అని చెప్పారు. అప్పుడా విప్రుడు, 'స్వామీ, ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి' అని కోరాడు. శ్రీగురుడు యిలా చెప్పారు:
'గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేదవిదులు, అత్తమామలు, తోబుట్టువులూ పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రులచేత సేవ చేయించు కునేవాడు, భార్యా బిడ్డలను ఏడిపించి, పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరు బోతు, తగాదాలకోరు, వైశ్వదేవం చేయనివాడు, డబ్బుకాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పిసినారి, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్నామస్మరణపట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందన మైనా చేయనివాడు, డబ్బు తీసుకొని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాస ఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవారు, స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు, బ్రాహ్మణులను, గురువును, సాధువులను, తన ఇంటి భోజనాన్నీ నిందించేవారు, తన ఇంటి కులదేవతను విడిచినవారు, దురాశాపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాటి వారి భోజనం తిన్నవారూ పతితులౌతారు.
కూతురును, అల్లుణ్ణి బాధించేవారికి మరు జన్మలో బిడ్డలు కల్గరు. కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయనివాడు, పొట్ట కూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు. పెట్టిన భోజనం వలన మరుజన్మలో గ్రుడ్డితనము, అల్పాయుష్షు, లేక చెవుడూ కల్గుతాయి. నిత్యమూ యితరుల యింట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ, అమావాస్యలలో పరులయింట భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటి వారికి కర్మాను స్థానంలో లోపం తీర్చడానికి తప్ప యితరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషం గాయత్రీ జపంతో తొలగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి యింటికి గూడ వెళ్ళకూడదు. మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో గూడా భుజించకూడదు. గోవు, భూమి, బంగారం మొ॥నవి దానం తీసికోవడం గూడా అంత చెడ్డవి గాదు గాని, గ్రహణ సమయంలోనూ, సూతకమప్పుడు, పుణ్య తీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషమొస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మమాచరించేవారికి దైన్యమెన్నటికిరాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువూ గూడ వారిని సేవిస్తుంటాయి'.
అప్పుడా విప్రుడు నమస్కరించి, 'స్వామీ, స్వధర్మమంటే ఎలాటిదో కొంచెం వివరించండి' అని ప్రార్ధించాడు. స్వామి యిలా చెప్పారు. 'నాయనా, పూర్వ మొకప్పుడు నైమిశారణ్యంలో పరాశరమహర్షిని మునులిలా కోరారు: "మునీంద్రా, స్వధర్మానుష్ఠానంలోమాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోగూడదంటారు. కనుక దయతో మాకవి వివరించండి". అప్పుడా మహర్షి యిలా చెప్పారు: "ఋషులారా, సదాచారం వలన సర్వమూ సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలు, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలు,చతుర్దశ భువనాలు, సప్తద్వీపాలు, సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు మ్రొక్కి, ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు, తర్వాత గూడ కూర్చొని ఆచమనం చేయాలి. చూడగూడనివి చూచినప్పుడు, మాట్లాడగూడనివి మాట్లాడినప్పుడు, వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధికల్గుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి. కారణం, అందులో అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొ॥గా గల సకల దేవతలూ వుంటారు. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకూ గాయత్రీ దప్ప మిగిలిన వేద భాగంలో ఏప్రార్ధనా శ్లోకాలైనా చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరుబయట-దేవా లయాలు, పవిత్రమైన చెట్లు లేనిచోట, బాటకు, నీరుకూ దూరంగాను, ఆకులూ -గడ్డీ లేని చోట మలవిసర్జనం చేయాలి. ఆ సమయంలో జందెము వేరుగా వేసు కొని, అంగవస్త్రం తలకు చుట్టుకొని వుండాలి. దిక్కులకేసి, ఆకాశంకేసి చూడ గూడదు. పగటివేళ ఉత్తర దిక్కుకు, రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కుల దేవతను స్మరించాలి'.
ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి యింకెన్నో అంశాలు బోధించారు.”
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః, శ్రీగురుభ్యోనమః.
సిద్ధయోగి యిలా చెప్పారు: "నామధారకా! శ్రీ గురుడు ఆ సబ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు యిలా చెప్పారు: 'మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజూ తప్పకుండా భగవంతుని పూజించాలి. అందుకవకాశం లేకపోతే ఉదయం షోడశోపచారపూజ, మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనమూ అయినా సమర్పించాలి. అందుకోసం ప్రతివారూ తమ యింట మంచిగంధము, నెయ్యి, జింక చర్మమూ వుంచుకోవాలి. మానవ జన్మ లభించిగూడా భగవంతుని పూజించనివారికి నరకము ప్రాప్తిస్తుంది. అటు తర్వాత గూడ మానవ జన్మ రావడం కష్టం. అన్నింటిలోకి గురుపూజ శ్రేష్టమైనది. అందువలన త్రిమూర్తులూ సంతోషిస్తారు. కాని కలియుగంలో మానవులకు గురువుయందు ఆయన భగవంతడనే భావం కల్గడం కష్టం. అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించడంవలన సర్వ పాపాలు నశిస్తాయి. అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సబ్రాహ్మణుడు- వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు. అన్నింటికంటే మానసిక పూజ శ్రేష్ఠం. మధ్యములకు మండలంలో పూజ, అధములకు విగ్రహారాధనము అవసరం. భక్తితో పూజించగల్గితే రాయి, చెక్క గూడ దేవుడై అభీష్టాలు ప్రసాదించగలవు.
పీటమీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామము చేసి పూజాద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి. తర్వాత, ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహముంచి, దానికి కుడివైపున శంఖము, ఎడమ వైపున గంట వుంచి, దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి, దీపం వెలిగించాలి. మొదట గణపతిని పూజంచి, గురువును స్మరించి, తర్వాత పీఠాన్ని, ద్వారపాలకు లనూ పూజించాలి. తర్వాత యిష్టదేవతను మన హృదయంలో భావించి, దానినే మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి. సాక్షాత్తూ భగవంతుడే మన ఎదుట వుండి మన పూజను గ్రహిస్తారని ధృడంగా గుర్తుంచుకోవాలి. ఆయనకు 16 ఉపచారాలతో పూజచేయాలి. పూజకు తెల్లనిపూలు శ్రేష్టం, పసుపు, ఎరుపు రంగుగల పూవులు మధ్యమం. నల్లనివి, ఇతర రంగు రంగుల పూలు అధమం.
ఉదయమే "అపవిత్రః పవిత్రోవా" అనే శ్లోకం చదువుకొని గురువును, కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి, ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారమూ చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సబ్రాహ్మణులకు గూడ అలాగే నమస్కరించాలి.
తల్లిదండ్రులు, పూజ్యులు, పెద్దలనూ చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి, వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క కుడిపాదాన్ని మన కుడి చేతితోను, వారియొక్క ఎడమపాదాన్ని ఎడమచేతితోనూ స్పృశించి, సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదము వరకూ స్పృశించాలి. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవతితల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞానవృద్ధులు- వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అజ్ఞానులు, తనకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమిధలు మొ॥న పూజాద్రవ్యాలు తెస్తున్నవారు. హోమం చేస్తున్నవారు, ధనగర్వులు, కోపించినవారు, మూర్ఖులు, శవము-వీరికి నమస్క రించగూడదు. ఒక చేత్తో ఎవరికి, ఎప్పుడూ నమస్కరించగూడదు.
గృహస్థుల యిండ్లలో కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు- వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోడానికి వండుకున్న పదార్ధాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించి, మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి. దీనిని వైశ్వదేవమంటారు. అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి. కారణం వారు సాక్షాత్తూ సద్గురు రూపాలే. అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి, భీక్షకోసమొచ్చిన బ్రహ్మచారికీ - వైశ్వదేవము, నైవేద్యము అవకున్నా తప్పకుండా భీక్ష యివ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గుపెట్టి, దేవతలను ఆహ్వానించి ఆకువేసి వడ్డించాలి. పతితుల పంక్తిన భోజనం చేయగూడదు. మొదట కుడిప్రక్కన నేలమీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నముంచిన తర్వాత భోజనం చేయాలి. తనద్వారా భోజనం చేస్తున్న చైతన్యము, తాను తినే అన్నమూ గూడ భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి. కుక్కను, రజస్వలను, యెట్టి ధర్మమూ పాటించనివాడిని చూస్తూ భోజనం చేయగూడదు. భోజనమయ్యాక అగస్త్యమహర్షిని, కుంభకర్ణుణ్ణి, బడబాగ్నినీ స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. సాయంకాలం పురాణాలు, సద్గ్రంధాలు పెద్దలవలన వినాలి.
సూర్యాస్తమయమప్పుడు సంధ్యావందనము, హోమముచేసి, గురువుకు నమస్కరించాలి. రాత్రి తేలికగా భోజనం చేసి, కొంతసేపు సద్గ్రంధాలు చదువుకొని, తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతికోసం అని సమర్పించి, నమస్కరించాలి. ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించ గూడదు. ఇక నుండి నీవిటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ, యితరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో! అందువలన ఇహంలోను, పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కల్గుతుంది' అని శ్రీగురుడు ఆ సద్రాహ్మణునితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు."
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన: 1. జ్ఞానము, కర్మ, భక్తి, వేరుగావని, వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమనీ యీ 38,39,40 అధ్యాయాలు తెలుపుతాయి. 2. దేవతలు తమనుపాసించిన వారి అభీష్టాలు నెరవేరుస్తారే గాని భస్మాసురునికి లాగ వారిని సంస్కరించరు. సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీలచేత వారిని మోక్షార్హులను చేస్తాడు. 3. సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన, భక్తి, కర్మలు సిద్ధిస్తాయి. శ్రీ గురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినపుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేదశిష్యుడు, ఒక గొడ్రాలు, ఒక కుష్టిరోగి యొక్క అనుభవాలు తెల్పుతాయి. ఆ యత్నాలే. వారాజ్ఞాపించక ముందు నిష్పలమవడం గమనార్హం. సద్గుర్వనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించు కొన్నదిగాని, వ్రతాల వలన గాదు.
నామధారకుడు, "స్వామీ, శ్రీ గురుడుపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీనుండి విని ధన్యుడనయ్యాను. ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీ గురుని వృత్తాంతం తెల్పండి" అని వేడుకొన్నాడు. సిద్ధయోగి యిలా చెప్పసాగారు: “నాయనా, నీ వంటి గురుభక్తుడు, శ్రోత లభించినందువల్లనే శ్రీ గురుచరిత్ర తనివితీరా స్మరించుకొనే భాగ్యం నాకు కూడా కలిగింది.
శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులెందరో గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతికోసం బ్రాహ్మణ సంతర్పణలూ చేస్తుండేవారు. ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కరశర్మయనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొ॥నవి మూటగట్టుకొని తెచ్చి, శ్రీ గురునికి నమస్కరించాడు. కాని ఆ రోజు అందరితోపాటు అతనిని గూడ ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు. అతడు తాను తెచ్చుకొన్న మూట మఠంలో ఒక మూలవుంచి, భోజనానికి వెళ్ళాడు. రోజూ యిలానే జరుగుతూండడం వలన మూడుమాసాలిలాగే గడిచింది. అతనిని చూచిన బ్రాహ్మణులందరూ, 'ఏమయ్యా బ్రాహ్మణుడా! నీవు వచ్చిందెందుకు? చేస్తున్నదేమిటి? నీవు భిక్ష యివ్వడానికి ముహూర్తమింకా కుదరలేదా? పోనీలే, యిక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు. నీకు ఇక్కడే బాగున్నట్లున్నది. నీకు సిగ్గువేయడం లేదా?" అని ఎగతాళి చేయసాగారు. పాపమాభాస్కరశర్మ కొంత కాలం తనను కానట్లు యిదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు. అతనిపై యిట్టి విమర్శలు, నిష్ఠూరాలూ పెరిగిపోయి, ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది. ఆయన అది సహించలేక, అతనిని పిలిచి, 'నాయనా, నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు' అని ఆదేశించారు. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుఝామునే నిద్రలేచి నెయ్యి, పెరుగు సమకూర్చుకుని, స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకుని, తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు.
ఆ సమయంలో వేరొక భక్తుడొచ్చి, తానారోజు శ్రీ గురునికి భిక్ష చేయడానికి అన్నము, మొ॥న పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామివద్ద కొచ్చాడు. కాని శ్రీగురుడు, తామారోజున భాస్కరశర్మ యిచ్చే భిక్ష తీసుకుంటామని, అతడు మరుసటిరోజు భిక్ష చేయవచ్చుననీ చెప్పారు. అతడు నిరుత్సాహపడి, 'అయ్యో! ఇప్పుడీ దరిద్రుడు వండినదాంట్లో ఒక్కొక్కరికీ ఒక్కొక్క మెతుకైనా వస్తుందా? ఈ రోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోంచేయవలసిందే!' అనుకొంటూ వెనుకకు మరలాడు. శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి, అక్కడున్న వారందరికీ యిలా చెప్పారు: 'నాయనలారా! ఈరోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికీ వెళ్ళవద్దు. మీరందరూ భార్యాబిడ్డలతోనూ, స్నేహితులతోనూ కలిసి యీ మఠంలోనే భోజనం చేయాలి. కనుక అందరూ స్నానాలు చేసిరండి' అని చెప్పారు. అందరూ ముఖముఖాలు చూచుకుని నవ్వుకొంటూ, 'ఈ దరిద్రుడు తెచ్చుకొన్నది సోలెడు బియ్యమేకదా! ఎవరికి తెలియదు? మఠంలో యిందరికీ భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది?' అనుకుంటూ స్నానానికి వెళ్ళారు. ఇంతలో శ్రీగురుడు భాస్కరశర్మతో, 'నాయనా, కొద్దిసేపట్లో అందరూ వస్తారు. త్వరగా సిద్ధంచేయి!' అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యికూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధంచేసి, అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు. అపుడు స్వామి నది ఒడ్డునున్న యితర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కరశర్మను ఆదేశించారు. అతడలాగే వెళ్ళి చెప్పగానే, వాళ్ళు పకపక నవ్వి, "ఏమయ్యా! నీవు పెట్టినట్లే, మేము తిన్నట్లే! ఈ రోజున మాఇళ్ళల్లో వున్నదేదో మేము భోంచేస్తాము. కాని నీవు కనీసం శ్రీగురునికైనా కడుపునిండా పెట్టగలిగితే అంతేచాలు, పో, పో!' అన్నారు. భాస్కరశర్మ తిరిగి వచ్చి, వారందరూ తనను ఎగతాళిచేసి భోజనానికి రామన్నారని చెప్పాడు. శ్రీగురుడు, 'నాయనా, మాకు బ్రాహ్మణులతో కలసి భోజనం చేయడమే సమ్మతముగాని, మేమొక్కరమే భిక్ష చేయము' అన్నారు. స్వామి నోటిమాట తప్పక జరిగితీరుతుందన్న ధృఢ విశ్వాసం గల భాస్కరశర్మ అది నిరూపించుకోదలచి దీనంగా, 'స్వామీ, నేనేం చేసేది? నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడంలేదు. సరిగదా, నన్ను ఆక్షేపిస్తున్నారు' అన్నాడు. అప్పుడాయన వెంటనే మరో శిష్యుని పంపి నదివద్దనున్న బ్రాహ్మణులంద రినీ వెంట తీసుకు రమ్మని ఆజ్ఞాపించారు. అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి, అందరినీ ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు. శ్రీగురుడు వారందరితో, 'బ్రాహ్మణోత్తములారా! మీరందరూ మీ భార్యాబిడ్డలను తీసుకుని మఠానికి రావాలి. ఈ రోజు యిక్కడే నాలుగు వేలమందికి సమారాధన చేయాలి. అందరూ విస్తళ్ళలో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి' అని భాస్కరశర్మతో, 'ఏమయ్యా, చూస్తావేమిటి? లేచి నమస్కరించి అందర్నీ ఆహ్వానించు' అన్నారు. అతడు వెంటనే లేచి నమస్కరించి, వారందరూ సకుటుంబ బంధుమిత్రులతోకలసి తానుచేయనున్న సమారాధనకు విచ్చేసి, తనను కృతార్థుడను చేయమని వేడుకొన్నాడు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి. 'ఓరి వెర్రి బ్రాహ్మణుడా! సిగ్గులేకుండా తగుదుననుకొని, నీవుపిలిస్తే వచ్చామటయ్యా? నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా?' అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, 'తప్పు, అతనిని నిందించవద్దు. ఇందులో అతని దోషమేమీ లేదు. గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు' అని మందలించారు. భాస్కరుడు శ్రీగురుపాదాలను పూజించి, ఆయనకు ఆరతిచ్చి విస్తళ్ళు వేశాడు. అపుడు శ్రీ గురుని ఆజ్ఞ కోరాడు. అంతట శ్రీ గురుడు అతనికొక వస్త్రమిచ్చి, దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు. అతడలా చేయగానే, శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి, వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు. వెంటనే భాస్కరశర్మ, మరికొంతమందీ ఆ వస్త్రం క్రిందనుండి పళ్ళాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు. నెయ్యిగూడ ధారలుగా వడ్డిస్తూనేవున్నారు. అది చూచి భక్తులందరూ ఆశ్చర్యచకితు లయ్యారు. అపుడు మొదట శ్రీగురుడు, తర్వాత మిగిలినవారూ ఆపోసనం తీసుకుని భోజనం చేయడం మొదలుపెట్టారు. భాస్కరశర్మ ఒక్కొక్కరి వద్దకూ వెళ్ళి, నెమ్మదిగా కూర్చుని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు. భోజనాలయ్యాక, అందరికీ తాంబూలాలిచ్చి స్త్రీలకు, పిల్లలకు, అన్ని వర్ణాలవారికీ బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు. చివరకు ఊరిలో విచారించి, భోజనం చేయనివారెవరూ లేరని నిర్థారణ చేసుకొన్నాక, శ్రీగురుని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు గురు ప్రసాదం స్వీకరించాడు. అపుడతడు వెళ్ళిచూచి అతడు వండిన వంటకమంతా అలానే వున్నదని స్వామికి మనవి చేశాడు. దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాదిమందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది. శ్రీ గురుడు సాక్షాత్తూ అన్నపూర్ణేశ్వరుడని, వారి అనుగ్రహానికి పాత్రులైనవారికి ఎట్టి కొరత వుండదనీ అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీ గురుడు భాస్కరశర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. శ్రీ గురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమ్రోగింది."
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః
సిద్ధయోగి యింకా యిలా చెప్పారు: 'గంధర్వపురంలో సోమనాధుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడుండేవాడు. అతనిది ఆపస్తంబశాఖ, శౌనక గోత్రం. అతని భార్య గంగాంబకు 60 యేళ్ళునిండినా సంతతి కల్గలేదు. ఆమె నిత్యమూ శ్రీగురుని దర్శించి, వారి పాదాలను పూజించి, ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది. ఇలా ఆమె కొన్ని సం॥లు తదేక దీక్షతో చేస్తుండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా యిల్లాలితో, 'అమ్మా! ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు. నీ అభీష్టమేమిటో యెన్నడూ చెప్పలేదే? ఇప్పటికైనా చెబితే గౌరీనాధుని కృపవలన నీకోరిక నెరవేరుతుంది' అన్నారు. ఆమె యెంతో సంతోషించి దోసిలి యొగ్గి కన్నీరు కారుస్తూ యిలా చెప్పుకొన్నది: 'స్వామీ! కొడుకులు లేని వారికి వుత్తమగతులుండవుగదా. అందువలన గొడ్రాలుగా వుండడమే మహాదోషమైంది. నేను మహ పాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కల్గలేదని అందరూ నన్ను ఏవగించుకొంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలుగదు కదా! పితృదేవతలు గూడ, తమ కులంలో ఒక మగ బిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని యెంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. బిడ్డలు లేని యిల్లు యిల్లేగాదు. అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకొనే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 యేళ్ళు నిండిపోయాయి. మాకు, మా పితృదేవతలకు తిలోదకాలిచ్చే వాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయె! స్వామీ, అయిందేదో అయిపోయింది. మరుజన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి, చాలు' అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీగురుడు నవ్వుతూ, 'ఓసి పిచ్చితల్లీ, ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మసంగతి యిప్పుడెందుకు? అపుడు బిడ్డలు గలిగినా, వాళ్లు మేమిచ్చిన వరంవలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది? నీవునిత్యమూ మమ్మల్నింత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది. కనుక నీవు కోరినది యీజన్మలోనే లభించేలా వరమిస్తున్నాము. కొద్దికాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకూ కలుగుతారు' అని ఆమెను దీవించారు.
అపుడు గంగాంబ తన కొంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి, 'స్వామీ, ఒక మనవి చేసుకుంటాను. నాపై కోపగించవద్దు, నేను బిడ్డలకోసం యెన్నో తీర్ధయాత్రలు చేశాను. పుణ్యతీర్థాలలో స్నానం చేశాను. రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి, కనిపించిన రావిచెట్టుకల్లా యింతవరకూ ప్రదక్షిణలు, నమస్కారాలు చేసి చేసి అలసి పోయాను. అలానే నా వయస్సంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరమెలా ఫలించగలదా అని ఆలోచనగా వున్నది. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు యెన్నటికీ వ్యర్ధం గాదన్న ధైర్యం లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే యిలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకూ నాకు కల్గిన సందేహమిది నేను వచ్చే జన్మలో నైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే, మీరు యిప్పుడే ప్రసాదిస్తా మన్నారు. అయినప్పటికీ యిన్నాళ్ళుగా నేను కాళ్ళునొప్పులు పుట్టేలాగా రావిచెట్లకు ప్రదక్షిణం చేసినందువల్ల కలిగిన ప్రయోజమేమిటి?' అని విన్నవించింది. ఆమె ఆవేదన చూచి నవ్వి, శ్రీగురుడు యిలా చెప్పారు: 'అమ్మాయీ! నీవు చేసిన అశ్వత్థపూజ వలన నీకెంతో పుణ్యం లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి, ఆ పుణ్యం కాస్తా పోగొట్టుకోకు. నా మాటవిని, యిక నుండి యీ సంగమంలో వున్నయీ రావిచెట్టుకు, మాకూ కలిపి నిత్యమూ ప్రదక్షిణ, పూజ చేస్తుండు. మేమెప్పుడూ అశ్వత్థ వృక్షంలో వుంటాము. అందువల్లనే పురాణాలన్నీ దానిని 'అశ్వత్థనారాయణుడని' కీర్తించాయి.
గంగాంబ, 'స్వామీ అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థవృక్షం యొక్క ప్రాశస్త్యం వివరించండి. అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగల్గుతాను" అన్నది శ్రీగురుడిలా చెప్పసాగారు. 'అశ్వత్థవృక్షంలో సర్వదేవతలూ వుంటారు. దాని మాహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్థమే నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ: దాని మధ్య భాగమే విష్ణువు: దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అలానే, త్రిమూర్తులూ దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలోని కొమ్మలు. తూర్పు దిక్కుకున్న కొమ్మలలో యింద్రాది దేవతలుంటారు. దాని వ్రేళ్ళలో మహర్షులు, గోబ్రాహ్మణులు, నాలుగు వేదాలు వుంటాయి. సప్త సముద్రాలు, పుణ్యనదులు తూర్పుకొమ్మలలో వుంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో 'అ'కారము, మానులో 'ఉ' కారము. దాని పండ్లు 'మ' కారము - ఆ వృక్షమంతా కలసి ప్రణవస్వరూపమే. ఇక ఆ చెట్టుయొక్క మహిమ యెవరు వర్ణించగలరు? అది సాక్షాత్తూ కల్పవృక్షమే, ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారదమహర్షి యిలా చెప్పాడు: "అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర, ఆషాఢ, పుష్యమాసాలలోనూ, గురు, శుక్రమౌఢ్యాలలోనూ, కృష్ణపక్షంలోనూ ప్రారంభించ గూడదు. శుభ సుముహూర్తంలో స్నానాదులు చేసుకొని శుచియై వుపవశించి మరీ ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్రవారాలలోనూ, సంక్రమణ సమయాలు మొ॥న నిషిద్ధసమయాలలోను, రాత్రి భోజనమయ్యాక యీ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్తుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానంచేసి, వుతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థవృక్షానికి భక్తితో ఏడుసార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానంచేసి, దేవతామయమైన ఆ వృక్షానికి పురుషసూక్త విధానంగా షోడశోపచారపూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు గలవానిగా ధ్యానిం చాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని, మౌనంగా గాని, యెంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట, చివరా నమస్కారం చేయాలి. ఇలా రెండు లక్షలు ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలూ నశించి, నాల్గు పురుషార్థాలూ సిద్ధిస్తాయి. త్రికరణశుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి, బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కల్గుతారు. శనివారంనాడు యీ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలగుతుంది. అశ్వత్థాన్ని పూజించాక-
శ్లో॥ కోణస్థః పింగలో బభ్రుః
కృష్ణారౌద్రాంతకో యమః
శౌరిశ్ళనైశ్వరో మందః
పిప్పలాదేవ సంస్తుతః ॥
అనే మంత్రం ధృఢవిశ్వాసంతో జపిస్తే శనిదోషం గూడ తొలగి, అభిష్టసిద్ధి కల్గుతుంది. గురువారము, అమావాస్య కలిసిన రోజున రావిచెట్టు నీడన స్నానంచేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేదవిప్రునికి మృష్టాన్నం పెడితే కోటిముంది. బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది. అక్కడ చేసిన వేదాలూ చదివిన ఫలితముంటుంది. రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెల్సిన రీతిన ప్రదక్షిణలు చేశాక, ఆ సంఖ్యలో పదవ వంతు హోమము, అందులో పదవవంతు బ్రాహ్మణ సమారాధనమూ చేయాలి. ఈ వ్రత కాలంలో బ్రహ్మచర్య మవలంబించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును, అలంకరించిన ఆవు-దూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని, ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులూ, కుటుంబీకులూ అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది.
అమ్మా! అశ్వత్థ మాహాతు తెలిసింది గనుక యింక దానిని నిందించక, యెట్టి సంశయమూ పెట్టుకోకుండా అలా చేయి. నీ అభీష్టం నెరవేరుతుంది'. -అప్పుడు గంగాంబ, 'స్వామీ! అరవై సంవత్సరాలు నిండిన నేను పుట్టుకనుండీ వంధ్యను. బిడ్డలెలా కలుగుతారు? అయినా నాకేమి? ప్రత్యక్షంగా మీ
బాలుండిగా మరలా యీ రావిచెట్టును సేవించడమెందుకు?' అనిపిస్తున్నది. ఏమైనప్పటికీ, గురువు మాట కామధేనువని వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక నమ్మి త్రికరణశుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటినుండి మూడు రోజులూ వుపవసించి, మూడుపూటలా షట్కుల తీర్థంలో స్నానంచేసి, గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి, దానికి ఏడు బిందెలు నీళ్ళుపోసి, శ్రీగురుసహితంగా దానిని పూజించింది. ఆ మూడు రాత్రులూ ఆ దంపతులు సంగమంలోనే వున్నారు. మూడవనాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కన్పించి, 'అమ్మాయీ, "నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీగురుని పూజించి, ఆయనిచ్చిన ప్రసాదం "అక్కడికక్కడే తిను' అన్నాడు. అలాగే నాలుగవరోజు ఉదయం సంగమంలో అశ్వన్ని సేవించి, ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి, రెండు పండ్లు ఆమెకిచ్చి, 'మీ లక్ష్యం · నెరవేరింది. పారణ అయ్యాక నివి పండ్లు తిను. నీకొక కూతురునూ, కొడుకునూ యిస్తున్నాము. ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రహ్మణులకు దానమివ్వు అని చెప్పారు. ఆమె అలానే చేసింది. ఆరోజే సూర్యాస్తమయ సమయానికి ముందే అయింది. నాలుగవ రోజున స్నానం తర్వాత వరుసల శ్రీగురుని వద్దకు వచ్చి గురుపూజ చేసింది. శ్రీగురుడు, 'నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కల్గుతారు; నీకు ముక్తి లభిస్తుంది' అన్నారు. అయిదవ రోజున భర్తృసమాగమం వలన ఆమె గర్భం ధరించింది. ఆమెభర్త ఎంతో సంతోషించి పుంసవనము, ఎనిమిదవనెలలో సీమంతము మొ॥న సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు. ఆమె 7వ మాసంలో మళ్ళీ శ్రీగురుని దర్శించి ఆశీస్సులు పొందింది. అపుడు శ్రీగురుని ఆజ్ఞమేరకు ఆ పండుముత్తైదువ వాయనదాన మిచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరిసి, పళ్ళన్నీ పట్టు తప్పిన తర్వాత గూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున . వేలేసుకున్నారు. శ్రీగురుని మహిమ యెంతటిదో అందరికీ అర్థమైంది. ఆమెకు నవమాసాలు నిండాక, ఒక శుభ ముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీ గురుని పేరిట 'సరస్వతి' అని పేరు పెట్టుకున్నారు. పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుముకట్టు వేసుకుని, బిడ్డనెత్తుకొని, భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది. బిడ్డను ఆయనముందుంచి, ‘వంధ్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది. అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు. వ్యర్థఫలానికంటే వంధ్యాత్వమే మేలు!' అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో, 'పుత్రవతీ! లేవవమ్మా!' అని బిడ్డను చూచి, 'ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడు గాడే!' అంటూ ఆమెను చూచి నవ్వి, ‘ఇంక సందేహించనక్కరలేదు, నీకు కొడుకుగూడా పుడతాడు' అని చెప్పారు. అప్పుడా పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకుని నిమురుతూ, 'ఈ బిడ్డ దీర్ఘాయువు, సౌభాగ్యము, సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది. ఆమెకు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఈమె సౌశీల్యం గురించి విని యీమె దర్శనానికి - దక్షిణదేశం నుండి ఒక రాజు గూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారంగతుడు, - మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు. కాని మీకెలాటి కొడుకు కావాలి? - వంద సం॥లు జీవించే మూర్ఖుడు కావాలా?, లేక 30సం॥ల ఆయుస్సు · గల విద్వాంసుడు కావాలా?' అన్నారు. గంగాంబ, 'విద్యావంతుడు, సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి. అతనికి అయిదుగురు పిల్లలు కలిగేలా దీవించండి' అని చెప్పి స్వామికి నమస్కరించింది. స్వామి, 'తథాస్తు' అని ఆమెను దీవించి పంపివేశారు. ఒక సం॥లో ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి గూడ 'నృసింహ' అని శ్రీగురుని పేరే పెట్టారు. వాడు కొంత కాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలను కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతికి గూడ గొప్ప యజ్ఞదీక్షితునితో వివాహమైంది. అతని చేత యజ్ఞాలు చేయించు కోడానికి కాశీ నుండి శ్రీమంతులు, పండితులు వచ్చి, అతనిని తీసుకు వెళ్తుండేవారు. శ్రీ గురుకృప యెంతటిదో చూచావా? నామధారకా! వారి అను గ్రహంతో అసాధ్యమైనది గూడ సాధ్యమౌతుంది. వారిని ధృడ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం".
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః,
సిద్ధయోగి శ్రీ గురులీలలు యింకా యిలా వివరించారు: "గంధర్వ పురానికి ఒకనాడు నరహరిశర్మయనే కుష్టురోగి వచ్చాడు. అతనిది యజుశ్శాఖ, గార్గ్య గోత్రము. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని యిలా మనవి చేసుకున్నాడు: 'స్వామీ, మీరు సాక్షాత్తూ పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో యిలా భూమి మీద అవతరించారని విని, మిమ్మల్ని ఆశ్రయించ డానికి వచ్చాను. నా జన్మ యీ కాలిక్రింద మట్టివలె వ్యర్థమైపోయింది. నాకీ కుష్ఠువ్యాధి రావడం వలన యెవరూ నా ముఖంకూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ యీ వ్యాధి వలన యెవరూ నన్ను భోజనానికి గూడా పిలవడం లేదు. అందరికీ జుగుప్స గొలుపుతూ యిలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తున్నది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకొని, నన్ను యిప్పుడిలా కట్టికుడుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్టురోగం తొలగించుకోడానికి యెన్నో వ్రతాలు ఆచరించాను, యెన్ని తీర్థాలో సేవించాను. దేవతలెందరికో మ్రొక్కాను. కాని దేనివలనా యీ వ్యాధి కించితైనా తగ్గలేదు. చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు గూడా దయగల్గకుంటే నా ప్రాణాలిక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్నెలాగైనా వుద్ధరించండి స్వామీ!' అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేసాడు. శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, 'విప్రుడా! ఇదివరకు ఎన్నో పాపాలు చేసావు గనుకనే నీకీ కుష్టువ్యాధి వచ్చింది. అది తొలగిపోవడానికి నీకొక ఉపాయం చెబుతాము, దాని వలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు' అన్నారు.
ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టెపుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలుగూడా వున్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే 4 సం॥లు క్రిందట ఎండి మోడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను చూపి నరహరితో, 'నాయనా, నీకీ మేడికట్టె యిప్పిస్తాము. నీవు దానిని తీసుకొనిపోయి, మా మాటయందు దృఢవిశ్వాసముంచి మేము చెప్పినట్లే చేయి. దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు. నిత్యమూ స్నానంచేసి యీ రావిచెట్టుకు ప్రదక్షిణంచేసి, రెండు చేతులలో రెండు నిండుగా నీరు తెచ్చి మూడుపూటలా ఆ ఎండు కట్టెకు పోస్తూండు. అది యెప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి, నీ శరీరం స్వచ్ఛమవుతుంది, వెళ్ళు!' అని చెప్పారు. నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసముంచి, ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొనిపోయి, ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యమూ దీక్షగా దానికి నీరు పోయడం చూచిన వారంతా నవ్వి, 'ఓరి వెర్రి బ్రాహ్మణుడా! నీకేమైనా మతి పోయిందా? నీవు యెన్ని రోజులు యిలా నీరుపోస్తే మాత్రం ఆ ఎండు కట్టె మళ్ళీ చిగురిస్తుందా? నిజంగా నీమీద శ్రీగురుడికి దయగల్గితే యిదంతా యెందుకు? అనుకొన్నది వెంటనే జరిగిపోదా? నీకీ జన్మలోయీ రోగం కుదిరే యోగ్యతలేదని సూచించడానికే శ్రీగురుడు నీకిలా చెప్పారు. అటువంటప్పుడు యీ జబ్బుకు తోడు యింత ప్రయాస యెందుకు? అని నిరుత్సాహపరుస్తుండేవారు. ఇలా ఒక వారంరోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం గూడా విడవక, 'ఈ భూమిమీద మహాత్ములు పల్కిన మాటలు యెంత అమోఘమైనవి! వారు సత్యసంకల్పులు గదా! గురు దేవుల వాక్కు అసత్యమెలా అవుతుంది? వారి కృపవలన చచ్చిన వారెందరో బ్రతకగాలేనిది, ఈ ఎండు కట్టె చిగిర్చడంలో ఆశ్చర్యమేమున్నది?' అని చెప్పి, తానుమాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు. వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో, 'స్వామీ! మీరు ఆ రోజున ఆ కుష్టురోగికి యెందుకు అలా చెప్పారో గాని, ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని, యీ వారంరోజులనుండీ నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. ఎవరేమి చెప్పినా వినడంలేదు. అతని పిచ్చి అతనికి ఆనంద మయినట్లు వున్నది. "ఈ వృధా ప్రయాస ఎందుకు?" అని చెప్పిన వారందరితో అతడు, "గురువు చెప్పినట్లు చేయడమే నాపని. వారు అన్నమాట నిలబెట్టుకొనడం వారిపని!" అని చెప్పి, ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి! లేకుంటే అతడలాగే చేస్తుంటాడు' అని చెప్పారు. శ్రీగురుడు. 'ఈ భూలోకంలో గురు వాక్యమొక్కటే తరింప చేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం యెలా వుంటే వారికి ఫలితం గూడ అలానే వుంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతమున్నది. విను. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్ధము, గురువు- వీటిపట్ల యెవరికి యెలాంటి భావముంటుందో, వారి ప్రాప్తము గూడ అలానే వుంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువును సేవించడమే అన్నింటికంటె సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగలవారికి ఫలితం వెంటనే లభిస్తుంది.
పూర్వము పాంచాలదేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండే వాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడొక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకు పోయాడు. ధనుంజయుడు దాహము తీర్చుకొని, ఆ ప్రక్కనే వున్న ఒక దేవాలయానికి వెళ్ళి, అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడివున్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని, దానిని తదేకంగా చూస్తూ యెంతోసేపు వుండిపోయాడు. రాజకుమారుడు అది చూచి, 'నీకు యీ లింగం ఎందుకు?' అని అడిగాడు. బోయవాడు, 'అయ్యా! నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక వున్నది. శివలింగం అన్నింటి కంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను' అన్నాడు. ధనుంజయుడు సంతోషించి, 'ఇది అన్నింటికంటే ప్రశస్తమన్నమాట నిజమే. కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో!' అన్నాడు. అప్పుడా బోయవాడు, 'అయ్యా! నేను అడవిలో పెరిగినవాడిని. దీనిని యెలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి. మీరే నాగురుదేవులు!' అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు యిలా చెప్పాడు: 'అయితే చెబుతాను విను. దీనిని తీసుకొని పోయి, నీ యింట్లో ఒక చోట శుభ్రం చేసి, స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తూ శివుడే నీ యింట్లో వుంటాడు. కనుక నీవు నీ భార్యతో కలసి శ్రద్ధగా నిత్యము పూజచేయి. ప్రతిరోజూ స్మశానం నుండి చితాభస్మము (శ్మశానంలోని బూడిద) తెచ్చి, అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడేమి తిన్నాసరే, ముందుగ దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ వుండు' అని చెప్పాడు.
ఆ బోయవాడు యింటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు యెంత వెదకినా అతనికి చితాభస్మం దొరకనే లేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, 'అయ్యో! ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు. గురువు ఉపదేశించి నట్లే పూజ చేయాలి గాని, మరోరకంగా చేస్తే ప్రయోజనముండదు. సరిగదా, గురువుమాట జవదాటితే నరకము, దరిద్రమూ వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండాపోతుంది. అందుకోసం నేనెంత వెదికినా బూడిద దొరకనేలేదు. ఈ ఒక్కరోజూ ఆయన చెప్పినట్లు చేయలేకపోతే, యిన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్ధమై పోతుంది. పూజ సమయం గూడా దాటిపోతుది. ఇంక నేనేమి చేయాలి? అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను!' అనిదుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, 'దానికోసం అంత బాధపడతా వేమి? మనింట్లో ఎన్నో కట్టెలున్నాయి. వాటితో నన్ను దహనంచేసి, ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు, నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసినదే గదా! అట్టి దానిని శివపూజకర్పించడం కంటే కావలసినదేమున్నది'. అని ధైర్యం చెప్పింది.
అప్పుడతడు, 'నీవు పడుచుదానివి. సంసార సుఖం గూడా నీవు పూర్తిగా అనుభవించలేదు. ఒక బిడ్డనైనా కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? అలాచేస్తే నాకెంతో పాపమొస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపంచేస్తే శివుడు గూడా నన్ను క్షమించడు. నీతల్లిదండ్రులకు గూడ అన్యాయం చేసినవాడనవుతాను?' అంటూ వలవలా ఏడ్చాడు. ఆమె, 'నీకెంత వెర్రి? నాపై నీ కంత మోహమెందుకు? నీటి బుడగలాగా యీనాడువున్న శరీరం రేపు లేకుండా పోతుందే. పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసినదేగా? నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదానినే గదా? నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా? శివునికోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది. నీ ప్రాణాన్నైన నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? అది నా అదృష్టమే గదా? అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు' అని పట్టుబట్టి. చివరకు అతనినెలాగో ఒప్పించింది.
అప్పుడామె యింట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని యింటికి నిప్పుపెట్ట మన్నది. అతడలానే చేసి, సర్వమూ భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి, కృతార్థుడనవగలిగానని యెంతో ఆనందించాడు. తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి, అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోడానికి రమ్మని తన భార్యను కేకవేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి, శరీరంతో నడచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి యిల్లు వెనుకటి వలెనే చెక్కుచెదరకుండా నిలచి వున్నది. శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, 'స్వామీ, నాలుగు ప్రక్కలా యిల్లంటుకుని మండుతున్నాగాని నాకదేమో యెక్కడలేని చలీ పుట్టింది. నేను ముడుచుకుని పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది. తర్వాత యేమైందో నాకు తెలియలేదు. మీరు పిలవగానే 'మెలకువవచ్చి లేచి వచ్చాను. ఆహా! ఏమి యీ ఈశ్వరుని లీల!' అనగానే, శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే, జీవితాంతంలో వారు కోటి సం॥లు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేనియందైనా పూర్ణ విశ్వాసముండాలేగాని, ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠురోగియైన నరహరి చేస్తున్న సేవకు ఫలితముండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది' అన్నారు శ్రీ గురుడు.
కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్ఠురోగి వద్దకు వెళ్ళారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతోభక్తి శ్రద్ధలతో చేస్తూండటం చూచి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరుపోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు. ఆయన తమ కమండలంలోని నీరు తీసి, ఆ ఎండిన మేడి కర్రమీద చల్లారు. మరుక్షణమే అది చిగిర్చింది! అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ వుండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టైంది. నివ్వెరబోయి దానిని చూస్తున్న నరహరికి గూడా కుష్టురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. అతడానంద భాష్పాలు రాలుస్తూ, శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరమంతటా రోమాంచితమవుతుంటే, పారవశ్యంతో శ్రీగురుని యిలా స్తుతించాడు:
'కోటి సూర్యుల తేజస్సు (జ్ఞానము), కోటిచంద్రుల చల్లదనం (ఆనందము) గలిగి, దేవతలందరిచేతా పూజించబడే విశ్వాశ్రయుడు, భక్తప్రియుడు, శ్రేష్ఠుడుయైన అత్రి పుత్రుడవైన ఓ నృసింహ సరస్వతీ స్వామీ! నీకు నమస్కారము, నన్ను రక్షించు. మోహాపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞాన సూర్యుడవు; విశాలమైన నేత్రములు గలవాడవు; భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతి అయిన ఓ నృసింహ సరస్వతీ! నీకు నమస్కారము. నన్ను రక్షించు (2). మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటివారు మీరు; సత్యము, సర్వానికీ సారభూతమయైన పరమాత్మతత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్తయైన పరమాత్మయొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడవైన శ్రీ వల్లభా! ఓ నృసింహ సరస్వతీ! నీకు నమస్కారము (3) ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవై యుండి, సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా, నీవు భక్తులపాలిటి కామధేనువవు. ఓ శ్రీగురూ! నృసింహ సరస్వతీ! నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు (4).తామర రేకులవంటి కన్నులు గల్గి, పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురూ! ప్రచండమైన (మా) పాపాలను పారద్రోలడానికి దండము ధరించి, యతివేషధారులైన నరసింహ సరస్వతీ! నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు (5) మీపాద కమలాలను వేదాలు, శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నాదబిందు కళా స్వరూపా! నీవు వాటికి గూడ అతీతుడవై యుండి, మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా! ఓ నృసింహ సరస్వతీ! నీకు నమస్కారము. నన్ను రక్షించు (6). అష్టాంగయోగ తత్త్వనిష్ఠతో ఆత్మ సంతుష్టుడవై యున్న జ్ఞానసాగరా! కృష్ణావేణీ పంచనది సంగమ తీర నివాసా! కష్టాలను, దైన్యాన్ని దూరంచేసి, భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తి నిచ్చు నరసింహ సరస్వతీ, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు (7). నిత్యము ఈ నరసింహ సరస్వతీశుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము, దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వసంపదలు, నాలుగు పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము.
1. ఈ శ్లోకంలో శ్రీ గురుని విష్ణువుగా స్తుతించినపుడు 'శ్రియవల్లభా' అనడంలో శ్రీపాదవల్లభుని అవతారము అన్న శ్లేష వున్నది.
(8). నరహరిశర్మ కన్నీటితో స్వామి పాదాలభిషేకించి, వాటిని విడవక అలానే పడివున్నాడు. శ్రీగురుడతనికి అభయమిచ్చి, “జ్ఞానరాశివవుదువుగాక!" అని అతనిని ఆశీర్వదించి చేయిపట్టి లేవదీశారు. అక్కడ చేరినవారందరూ ఆ గురుమాహాత్మ్యంచూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అపుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని, భక్తితో శ్రీ గురుని దర్శించి ఆయనకు ఆరతులిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీ గురుడతనిని దగ్గరకు పిలిచి, 'నాయనా, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీవు గోవులు, సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు ముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగియై మా సేవ చేస్తాడు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు గూడ లభిస్తుంది.' అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగయోగముపదేశించి, విద్యాసరస్వతీ మంత్రాన్ని గూడ ఉపదేశించి, 'నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. నీ భార్యాబిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే వుండు' అని చెప్పారు.
నామధారకా! శ్రీగురుని ప్రసాదం వలన నరహరిశర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి, గురుభక్తి వలన యెంతో వృద్ధిలోకొచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన యెంతగా అనుగ్రహిస్తారో చూచాము గదా! అంతేగాదు, భక్తితో అతడు చేసిన స్తోత్రమంటే శ్రీ గురునికెంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందో దోషాలు వున్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే, శ్రీగురుడు అంగీ కరించక, ఆ స్తోత్రమలానే చదవాలని చెప్పేవారు!"
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్వై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన : పరమాత్మ వాక్కు, మనస్సులకందనివాడు. ఆయన ఒక్కడే అయినా విప్రులాయనను బహువిధాల నిర్వచించారన్న వేదమే ఆయననే రుద్రు డనీ, విష్ణువనీ గూడ స్తుతించినది. కాని కలి ప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది. ద్వేషము, స్పర్ధ వంటి అసురీ స్వభావం గలవారి యజ్ఞదాన తపః కర్మలు నిష్ఫలమని భగవద్గీత. ఆ భేదాన్ని రూపుమాపి, సత్త్వ ప్రధానమైన సామరస్యాన్ని తెల్పడానికి త్రిమూర్తి రూపియైన దత్తస్వామి యీ యుగంలో శ్రీ పాద శ్రీ వల్లభులు, శ్రీ నృసింహ సరస్వతీ స్వాములుగా అవతరించాడు. అందుకే శివపరమైన రుద్రాక్ష, భస్మము, కాశీ విశ్వనాధుల -మహాత్మ్యం తెల్పిన శ్రీ గురుడు విష్ణుపరమైన అశ్వత్థపూజ, అనంత పద్మనాభ వ్రతాల మహాత్మ్యం గూడ తెల్పాడు. అయితే యిట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెల్పాడుగాని, తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొ॥న ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్పాడు. ఆ వ్రతాలు ఆయన వాక్కువల్ల శక్తి వంతము లయ్యాయి గాని, భక్తులు తమకై తామె చేసినపుడు గాలేదు. ఈ విషయాలన్నింటినీ 41,42, 43 అధ్యాయాలలో చూడవచ్చు.
నామధారకుడు,“స్వామీ! సర్వధర్మాలతో కూడిన శ్రీ గురుచరిత్ర వింటూంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కల్గుతున్నది. శ్రీగురునియంత అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కల్గింది. మా పూర్వీకులు శ్రీగురుభక్తులు యెలా అయ్యారో తెలుసుకోవాలని వుంది, చెప్పండి' అన్నాడు. సిద్ధయోగి యిలా చెప్పసాగారు:
"నాయనా! పూర్వం శ్రీ గురుడు తీర్థాటనం చేస్తూ, గోదావరీ తీరాన వున్న వాసరక్షేత్రానికి వేంచేసినపుడు ఆయనను భక్తితో పూజించి, ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు. అటుతర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి, ఈ గంధర్వనగరం చేరారుగదా! అటు తర్వాత వారి కీర్తి దశదిశలా వ్యాపించి, సుదూర ప్రాంతాలనుండి గూడ యెoదరెందరో వచ్చి వారిని సేవించి, అభీష్టసిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాందేవునికి తెలిసింది. అతడందుకెంతో ఆనందించి, ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కoటవడగానే, అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగురుని దర్శించగానే, అతనికి రోమాంచితమై, ఆనంద భాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, తన జుట్టుతో వారి పాదాలు తుడిచి, గద్గద స్వరంతో ఆయననిలా స్తుతించాడు:
ఓపరమాత్మా! పరంజ్యోతీ! నృసింహసరస్వతీ! మీరు త్రిమూర్త్యాత్మకులే గాని, మానవమాత్రులుగారు. సర్వ తీర్థాలకూ ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంతమాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులు గూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపకా! సద్గురూ! భక్తవత్సలా! జయము. జీవుల పట్ల కరుణయనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి, చనిపోయిన వారిని మరల బ్రతికిస్తున్నారు. స్వామీ! దండమును ధరించిన మీరు సాక్షాత్తూ దుష్టులను దండించి, భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే, యిప్పుడిలా సన్యాసి వేషంలోఅవతరించారు. భస్మము, రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను, భవరోగాన్నీ నశింపజేయగల సమర్థులు, సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో, గొడ్డుబజ్జె పాలిచ్చిందో, మేడికట్టె వృక్షమైందో, హీనుడుధ్ధరింపబడ్డాడో అట్టి మిమ్మెవరెరుగగలరు?
శ్రీగురుడు సంతోషించి సాయందేవుడి తలపై చేయిపెట్టి, 'నాయనా! నీవు మాకు పరమ భక్తుడవు. నీ సోత్రం వలన మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లుదురుగాక!' అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన, 'మీరంతా సంగమంలో స్నానం చేసి, అశ్వత్థవృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి' అని చెప్పి, సాయం దేవునితో, 'నీవు గూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకొందువు' అన్నారు. అందరూ సంగమానికి వెళ్ళివచ్చాక, అతడు శ్రీ గురునికి పూజచేసి, భిక్ష యిచ్చాడు. అపుడు స్వామి అతనిని తమ ప్రక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించారు. తర్వాత అతనిని దగ్గరకు పిలిచి, 'నాయనా, నీవెక్కడుంటున్నావు? నీ భార్యాబిడ్డలు క్షేమమా? చాలా కాలానికి కన్పించావు' అన్నారు. అతడు, 'స్వామీ, మీరు సర్వజ్ఞులు. మీకు తెలియనిది యేమున్నది? మీ దయ వలన అందరమూ క్షేమమే. నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలోవున్నారు. నా కుటుంబ భారమంతా కొడుకులు చూచుకుంటు న్నారు. కనుక నేను మీ పాదాల చెంత వుండి సేవించుకోవాలని వచ్చాను. మీరనుగ్రహించాలి' అని వేడుకున్నాడు. శ్రీగురుడు నవ్వి, 'నాయనా! మమ్మల్ని సేవించడం అంత సులభంగాదు. మేమొకచోట వుండేవారముకాము. ఎక్కడ బడితే అక్కడే వుంటాము. ఒకప్పుడు వూరిలో వుంటే, మరొకప్పుడు అడవిలో వుంటాము. మాతో కలసి వుండడము, మా సేవ చేయడమూ కష్టం. కనుక బాగా ఆలోచించుకో!' అన్నారు.
సాయందేవుడు, 'స్వామీ, మిమ్ము శరణు బొందిన నన్ను దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయమేమిటి. గురుసన్నిధికి చేర్చే పాదాలే పాదాలు; గురుపూజ చేసే చేతులే చేతులు. గురు పాదాలనంటే శిరస్సే శిరస్సు, సర్వ అభిమానాలను నివారించి, పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప వుండగా నాకు భయమేమి? నేను మీ చెంతనే వుండి, మీ పాదసేవ చేసుకుంటాను. అనుజ్ఞ యివ్వండి' అని పట్టుబట్టాడు. అప్పుడు శ్రీగురుడు, 'నీకంత దృఢభావముంటే అలానే చేయి' అని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలున్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీ గురుడు శిష్యులనెవ్వరినీ రావద్దని చెప్పి సాయందేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకొని సంగమానికి వెళ్ళారు. ఇంతలో మరి కొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేసారు. సాయం సంధ్యోపాసన అయ్యాక, శ్రీ గురుడు అశ్వత్థవృక్షం క్రింద కూర్చొని, కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గాణాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు, సాయ౦దేవుడు మాత్రమే అక్కడ వున్నారు. అప్పుడతనిని పరీక్షించదలచి, శ్రీగురుడు ఒకలీల చేసారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు వూగిపోయి, విరిగి పడుతున్నాయి. ఆకాశ మంతా కారుమేఘాలు అలుముకుని భయంకరంగా వురుములు, కన్నులు మీరు మిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షమారంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని, తన వంటిపై నున్న ఉత్తరీయం తీసి శ్రీ గురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిలుచున్నాడు. ఇలా గాలి, వాన అర్ధరాత్రి రెండవ ఝాము వరకూ కొనసాగాయి. గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది. అపుడు శ్రీగురుడు, 'నాయనా! మమ్మల్ని చలి బాధిస్తున్నది. గ్రామానికి వెళ్ళి మఠంనుండి అగ్ని తీసుకురా' అన్నారు. అతడు బయలు దేరుతుంటే, అతనిని బాట కటూయిటూ చూడకుండాత్వరగా వెళ్ళిరమ్మని చెప్పారు.
వెంటనే సాయందేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో యెక్కడ అడుగుపెట్టినా మోకాలు లోతున బుదరలో కాళ్ళు కూరుకు పోతున్నాయి. ఆ పైన నీరు, రొమ్ములోతున ప్రవహిస్తోంది. కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతనినొక ప్రక్క నెట్టివేస్తోంది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకొంటూ, మెరుపుల వెలుగులో దారి చూచుకుంటూ, బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు. చివరకు యెలాగో అతడు మఠంచేరి, అక్కడి సేవకులను నిద్రలేపి వారివద్దనుండి కుండలో నిప్పులు తీసుకొని తిరిగి బయల్దేరాడు. శ్రీ గురుడు తనను ప్రక్కలకు చూడకుండా ఎందుకు సాగిపొమ్మన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై, నెమ్మదిగా కుడి ప్రక్కకు చూచాడు. అటుప్రక్కన ఐదు పడగలుగల భయంకరమైన త్రాచుపాము కన్పించింది. అతడు కొంచెం ప్రక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ, నెమ్మదిగా ఎడమ ప్రక్కకు చూచాడు. అటు ప్రక్కన గూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి, బాటలోని ఎత్తుపల్లాలు గూడా పట్టించుకోకుండా పరుగెత్తసాగాడు. అతడెటుపోతే అటు, అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడ పుట్టి దిక్కుతోచక, పొదల మధ్యకు పోయాడు. ఎటుపోవాలో తెలియక భయంతో తననా పాముల బారినుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురుని ప్రార్థించు కోసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి, ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంటపోగా, కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కన్పించింది. ఆ ప్రాంతమంతా వేలకొద్దీ దీపాలతో వెలిగి పోతున్నట్లు కనిపించింది. అక్కడ నుండి వేద ఘోష అతనికి చక్కగా విన్పిస్తున్నది. అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురుని సమీపించేసరికి, అక్కడ ఆయన ఒక్కరే వున్నారు. అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని గూడ తెలియలేదు. ఆకాశంలో మబ్బులు యెప్పుడు తొలగిపోయాయోగాని, పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర క్రింద పెట్టి, నిప్పును ప్రజ్వలింపజేశాడు. భయం తగ్గిపోయి, అతడు గురువుకేసి చూచేసరికి ఆ రెండు పాములూ ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది. శ్రీగురుడు నవ్వి, 'భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా? కనుక ముందుగా ఆలోచించుకొని, తగిన భక్తి విశ్వాసాలు వుంటేనే అందుకు పూనుకోవాలి. కలిప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొ॥న అవరోధాలెన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవచేస్తే, గురుకృప వలన సర్వమూ సిద్ధిస్తుంది. యజ్ఞ యాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలొచ్చి, అవి తేలికగా నిష్పలమవవచ్చు. గురువుదగ్గరే వుంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు, తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్ధుడవుతాడు. ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు, సచ్చిష్యుడు తన గురువును విడువక నీడవలె సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వమూ గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్ధమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై వుంటాడు. గురువు యెంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే, దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని యెంత కష్టపడియైనా పూర్తిచేస్తాడు. అలా చేస్తే, వాడిని చూచి యమధర్మరాజు గూడ భయ పడి తొలగిపోతాడు'. అపుడు సాయందేవుడు నమస్కరించి, 'స్వామీ, నేనేమీ తెలియనివాణ్ణి కృపతో గురుభక్తి యెలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీచెంతనే వుండి సేవిస్తాను' అన్నాడు. అప్పుడు శ్రీగురుడిలా బోధించారు:
'నాయనా, చెబుతాము విను. నీవు యిక రాత్రి అయిందో, బ్రాహ్మీ ముహూర్తం అయిందోనన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాము. శివుడిలా చెప్పాడు: "దేవీ, గురువే ఈశ్వరుడన్న ధృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులూ కల్గుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదులు వలన చాలా కాలానికిగాని సిద్ధించదు. యథావిధిగా గురుని సేవించేవారికి యజ్ఞాది కర్మలు చేయని లోటుకల్గదు. పూర్వం త్వష్టయనే బ్రాహ్మణ బాలునికి ఎనిమిదవ సం॥లో ఉపనయనం చేసి, వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిధిలమై, వర్షపునీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, 'నాయనా, యీ కుటీరం ప్రతిసారీ వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి, వాన, అగ్నుల వలన నశించకుండా అన్ని వనతులూ కల్గివుండే కుటీరం నాకు కావాలి' అని చెప్పాడు. అప్పుడు గురు పత్ని, 'నాయనా, ఎవ్వరూ నేయనిదీ, కుట్టనిదీ, రంగురంగులదీ, సరిపోయేదీ అయిన రవిక నాకు తెచ్చి పెట్టాలి' అన్నది. ఇంతలో గురు పుత్రుడు వచ్చి, 'అన్నా, నాకు మట్టి అంటనివీ, నీటి మీద నడిపించగలవీ, ఎప్పుడూ సరిపోయేవీ అయిన పాదరక్షలు కావాలి' అని చెప్పాడు. అప్పుడే చిన్న పాపయైన గురుపుత్రిక గూడ వచ్చి, 'అన్నా! నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒకబొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభం కల్గి, దంతంతో చేసినదై, పగలనిదిగా వుండాలి. అది నా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా వుండాలి. అందులో అన్ని వసతులూ వుండాలి. దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు వుండాలి. దానిని మళ్ళీ ముడిచి వేయడానికి వీలుండాలి. అందులో పీట, కుర్చీ వుండాలి. ఆడుకోడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి. వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారగూడదు. ఇతర వంట పరికరాలు గూడ కావాలి" అని చెప్పింది.
త్వష్ట అంగీకరించి, అడవికి వెళ్తూ, అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక, తన గురువునే ధ్యానించి, తన మనస్సులోనే ఆయనను శరణుపొందాడు. అలా పోతుండగా అతనికి ఒకచోట ఒక అవధూత కన్పించి, “నాయనా, నీవెవరు? ఇంత చిన్నవాడవు! ఈ ఘోరమైన అరణ్యంలో చింతా క్రాంతుడవై తిరుగుతున్నావేమి?" అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, "స్వామీ, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తూ ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది" అని, తాను సాధించ వలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకొన్నాడు. అవధూత అతనిని ఆశీర్వదించి, "నాయనా! అభీష్ట ప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో వుండగా దుర్లభ మేమున్నది? నీవు కాశీ వెళ్ళి విశ్వనాధుని పూజించు. ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు గూడా యెంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తూ ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయా ళువు" అని చెప్పాడు. గురుసేవ దప్ప వేరేమీ యెరుగని త్వష్ట, "స్వామీ! కాశీ క్షేత్రం యెక్కడ వున్నది?" అని అడిగాడు. అప్పుడు ఆ ముని శ్రేష్టుడు, "కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీవలన నాకు గూడ విశ్వనాథుని దర్శన మవుతుంది" అని చెప్పి, తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకు వెళ్ళాడు.”
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః
వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్రా విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి యింకా యిలా చెప్పారు: "విశ్వేశ్వరుని దర్శనము, అంతర్ గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచక్రోశయాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ విశ్వేశ్వర బిందుమాధవ డుండి వినాయక దండపాణి కాలభైరవ గుహ గుహకాశి -మణికర్ణిక - మొ॥నవి దర్శించి, పూజ చేసి, నీపేరు మీదుగ ఒక లింగ ప్రతిష్ట చేసుకో, ఇలాచేస్తే నీగురు భక్తి దృఢమై, ఈశ్వర సాక్షాత్కార మవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనస్సులో గురు చరణాలను స్థిరంగా నిలుపుకో', అని చెప్పి, రెప్ప పాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యచకితుడై, 'ఆహా, ఈ మహాత్ముడు నా గురు కృపవలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహము లేదు. తనను నేను ఆరాధించకున్నా, ఆయన ప్రసన్నుడవటము గురుకృప వల్లనే గదా! లేకపోతే యెన్నో సం॥లు తపస్సు చేసినా ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు?'అనుకొని యథావిధిగా కాశీ యాత్ర, లింగ ప్రతిష్ట చేసాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగములో శంకరుడు దర్శనమిచ్చి, వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు, గురుభార్య మొ॥న వారు అడిగినవి. విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, 'నాయనా, నీ గురుభక్తికి మెచ్చాను. నీవు 'విశ్వకర్మ' అనే సృష్టికర్తవు అవుతావు.' అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు.
త్వష్ట సంతోషించి తన గురువు, గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి. సమర్పించుకొన్నాడు. గురువు సంతోషించి, అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సూ కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము
ఇది భావగర్భితమైన కథ. వివేకంతో గూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరం. చిత్రవిచిత్రము, నామరూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపమన్న దృఢభావనయే గురుపత్ని కోరిన రవిక. యమ నియమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షలు. ఇలా బాహ్యాభ్యంతరాలలో పరిశుద్ధమొనర్చబడిన అవయవ - ధాతుమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు. ఇవన్నీ ఈశ్వరానుగ్రహం వలన, ఈశ్వరానుగ్రహం సద్గురు సేవ వలనా కలుగుతాయి. దృఢనిష్టతో గురు సేవ చేయడం వలన తాను కోరుకున్నా త్వష్టకు బ్రహ్మపదం లభించింది. గానిది ఏదీలేదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులూ వశులవుతారు. గురువు లేక మోక్షము సిద్ధించదు.”
శ్రీగురుడు గురుసేవా ప్రాశస్త్యం చెప్పడమయ్యేసరికి సూర్యోదయమైంది. సాయందేవుడు, శ్రీ గురునికి నమస్కరించి ఆనంద పారవశ్యంతో, 'ఓ కృపామూర్తీ! నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరీ కథలో భాగంగా కాశీ యాత్ర వివరిస్తుంటే నేను మీతోకలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్థా, లేక స్వప్నమో తెలియటం లేదు. జగద్గురూ! మీ నిజతత్త్వము తెలియని మూఢులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కన్పిస్తున్నారు. మీరు ఎక్కడ వుంటే అదే కాశి' అంటూంటే అతని శరీరమంతా రోమాంచితమై, కంఠం గద్గదమైంది. అతడిలా శ్రీగురుని స్తుత్తించాడు:
‘(1). మొదట అద్వయులుగావుండి, సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి, మరల దానిని పాలించడానికి అవతరించిన, ఓ నృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు వందనములు (2). కలి ప్రభావం వలన ధర్మం నశించి, యజ్ఞ యాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్ధనననుసరించి, భూమిపై అవతరించి, ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓనృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు నమస్కారములు (3). సంసార సాగరంలో మునిగియున్న భక్తులను తరింప చేయడానికి అవతరించి, చతుర్ధాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు నమస్కారములు (4). స్వామీ, మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గ్రుడ్డివారికి దృష్టి, గొడ్రాలికి సంతానం, ఎండు కట్టెకు ప్రాణం, విధవరాలికి సౌభాగ్యము, భక్తులకు సిరిసంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు నమస్కారములు (5) పాపాన్ని, దారిద్ర్యాన్నీ పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ, కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ, ముముక్షువులకు ముక్తిని గూడ మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకుగూడ అతీతమైన స్వరూపంగల ఓ నృసింహ సరస్వతీ! మీ పాద పద్మములకు నమస్కారములు. (6) ఓ గురుమూర్తీ! మీ పాదపద్మములను నిత్యమూ స్మరించేవారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాదియాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు నమస్కారములు. (7). వేదాలకుగూడ మీనామ మాహాత్మ్యం అంతుపట్టనిది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిల్పుకొని మనసారా మరల మరల నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురూ! నన్ను రక్షించు, వేదాలకు గూడా అంతు పట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకారస్వరూపులు. పంచభూతాలు, సూర్య చంద్రులు, జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరీ విశ్వరూపం ధరించారు. ఓనృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు నమస్కారములు. (8). ఈ కలియుగంలో భక్తులనుద్ధరించడానికి దండకమండలుధారియైన యతీశ్వరుని రూపంలో అవతరించి, భీమ-అమరజా సంగమంలో శ్రీనృసింహ సరస్వతీయను పేర నివసించిన శ్రీగురూ! మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపచేయడానికి, యోగులకు దీక్షనను గ్రహించడానికీ గాణాపురక్షేత్రంలో వెలసి, నాల్గు పురుషార్థాలూ ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతీ! మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటిని జయించి, మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను (9). శ్రీగురుస్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యమూ పఠించినవారికి బలము, సంపద, సద్భుద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు, అటు తర్వాత ముక్తి గూడ లభించగలదు' శ్రీగురుడు సంతోషించి, 'నాయనా! నీకు కాశీ దర్శనమైంది గదా! ఇందువలన నీ వంశంలో ఇరవైఒక్క తరాలవారికి కాశీయాత్రాఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో! కాని అలా చేయాలంటే ఆ మ్లేఛ్ఛరాజు సేవలో వుండ గూడదు. గనుక నీభార్యాబిడ్డలను తీసుకొనివచ్చి గంధర్వనగరంలో వుండు అని చెప్పి, అతనిని వెంటబెట్టుకుని గ్రామంలోని తమ మఠానికి తిరిగివచ్చారు.
సాయందేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి, భార్యాబిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురుని దర్శించి, 'త్రిమూర్తీ! మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజవాంస అయినట్లు, మీ దర్శనమాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్నీ పోగొట్టగలదు. కాని పాప, తాప, దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలనూ వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది' అని మైమరచి గంతులేస్తూ, తన మాతృభాషయైన కన్నడంలో -యిలా స్తుతించాడు:
(1). భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధియై అవతరించిన శ్రీనృసింహ సరస్వతిని చూడగలిగాను (2) భక్తితో ధ్యానించేవారికి సుఖమిచ్చే జగత్పతియైన మీ చరణ కమలాలు దర్శించగలిగాను. (3) సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి, యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీనరసింహ సరస్వతి దర్శనభాగ్యం నేడు కలిగింది (4). మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్త్వమే సగుణమై సత్పురుషుల నుద్ధరించడానికి దండకమండలములు ధరించి, యతి సార్వభౌముడుగా అవతరించిన ఓ నరసింహ సరస్వతీ! నేడు నాకు మీ దర్శనమైంది. (5). భక్తపాలుడు, దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది. అట్టి మీ పాదదర్శనం నేడు నాకు లభించింది (6). యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రునివలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కల్గింది. మీ యతిరూపంలో భక్తజనులు మహాభాగ్యమే సాకారమై వెలిసింది. (7). వేదాంతతత్త్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించ గలిగాను. భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాఘనా! నీకు జయము (8). ఆనంద సముద్రుడు, గంథపరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడూ అయిన శ్రీకృష్ణుని, మీ రూపంలో దర్శిస్తున్నాను. (9). ప్రకృతి పురుషుల అభేదాన్ని 'నరసింహ + సరస్వతి' అను పేర సార్థకమొనర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను.
శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని, అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకొని, వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయందేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేసాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయివుంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయం దేవుని పెద్దకుమారుడైన నాగనాధుని చూపిస్తూ ఆయన, 'సాయందేవా! ఇతడు సిరిసంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి యెంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతియైన నీ భార్య పతివ్రత. మీకింకా నల్గురు కొడుకులు కల్గుతారు. మేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది గనుక నీనది విడిచి పెట్టి మావద్దనే వుండు' అని, అతని భార్యాపిల్లలను గూడ అందుకు ంచారు. తర్వాత సాయం దేవునితో స్వామి, 'మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానము చేసి, అశ్వత్థాన్ని పూజించుకొనిరా' అని చెప్పారు.
ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి. కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతము చేసుకొని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వనగరము వస్తున్నారు. శ్రీగురుడు సాయం దేవునిగూడ అనంతవ్రతము చేసుకోమని చెప్పారు. అతడు, 'మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంతవ్రతము. నాకింక వేరొక వ్రతమెందుకు?' అన్నాడు. స్వామి, 'నాయనా, నీవు మామాట విని వ్రతం చేసుకో! పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతము చేసుకొని అభీష్టాలన్నీ పొందాడు. నీవుగూడ కౌండిన్యస గోత్రుడవే గనుక ఈ వ్రతమాచరించు' అన్నారు. అపుడు సాయందేవుడు, 'స్వామీ! అలా అయితే ఆ వ్రతవిధానమేమో, మా గోత్రఋషి దానివలన యెలా కృతార్థులయ్యారో వివరించండి' అని కోరాడు. శ్రీగురుడు వివరించారు”.
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః.
శ్రీగురుడు సాయం దేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి యిలా తెల్పారు: "ఈ అనంతవ్రతము ఆచరించడంవలన యెందరికో అభీష్టాలు సిద్ధించాయి. దీనివలన ధర్మరాజు, తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి, తన తమ్ములను, ద్రౌపదినీ తీసుకొని, ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి, యెన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతియని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైనవారు వాళ్ళ రాజ్యమపహరించి, పరాభవించి, అడవులకు పంపడమే గాకుండా వారిని యింకెన్నోరీతుల కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే, వారి పుణ్యం గూడా నశింపజేయమని దూర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారివద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి, 'స్వామీ, నీవు భూభారం తొలగించడానికే అవతరించావు. మేము మీకు ప్రాణసమానులమైనప్పటికీ యీ అడవిలో దాగియుండవలసి వచ్చినదేమిటి? నీవే ఉపేక్షిస్తే, మాకింక దిక్కెవరు?' అని బాధపడ్డారు. ద్రౌపదిగూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి యిలా చెప్పాడు: 'నేనే అనంతుడను, సర్వవ్యాపిని, త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు ఆకాశంవలె అనంతుడనైన నాయందు వున్నాయి. అట్టి సర్వాంతర్యామిగ అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకొంటే మీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి. మీ కష్టాలు తీరుతాయి.
ఈ అనంత వ్రతం, భాద్రపద శుద్ధ చతుర్ధశినాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి వుండేవాడు. అతనికి సుశీలయనే కూతురు వుండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చని పోయింది. సుశీల తండ్రివద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది. సుమంతుడు తన కర్మానుష్టానానికి భంగమురాకుండా వుండేందుకు రెండవ వివాహము చేసుకున్నాడు. కాని, ఆమె గయ్యాళి. ఎప్పుడూ భర్తతోనూ, సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి యిచ్చి వివాహం చేశాడు. కాని అతని భార్యపెట్టే బాధలకు ఓర్వలేక, కౌండిన్యుడు వేరొకచోట కుటీరంలో కాపురం వుండదలచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్ళేరోజు కూడా దోవ బత్తేనికి కించిత్తు పేలపిండి అయినా యివ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమపిండి మాత్రం ఒక ఆకులోకట్టి యిచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నము ఒక యేటివద్ద ఆగి, కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకొన్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని, కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా, తాము అనంత వ్రతం చేస్తున్నట్లు చెప్పారు. ఆమెకోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానము యిలా చెప్పింది:
'ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశినాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకొని, ప్రవహించే నీటిలో స్నానం చేసి, ఎర్రని చీర కట్టుకొని, ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక క్రొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మము గీచి, దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతినుంచి, శేషశాయియైన చతుర్భుజుని ద్వాదశాక్షరీ మంత్రంతో గాని, పురుష సూక్త విధానంతోగాని, యథాశక్తి పూజించాలి. తరువాత ఆ తోరము కుడిచేతికి కట్టుకొని, పాతతోరం విసర్జించాలి. తరువాత గోధుమపిండివంట నివేదించి, దక్షిణతో సహా ఒకవేదవిప్రునికి దానమియ్యాలి. తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సం॥లు చేసాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి, ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత గూడా అనంత వ్రతం చేయించింది. తరువాత ఆమె తన భర్తతో కలసి బయలుదేరింది. ఆ వ్రతమహిమా అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి, వారినక్కడే వుండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు.
ఒకరోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, 'ఇదేమిటి? నన్ను వశం చేసుకోడానికి ఈ ఎర్రని తోరం ధరించావా యేమి?' అని అడిగాడు. అది అనంతరమని, దాని మహిమ వల్లనే తమకు సిరిసంపదలు వచ్చాయనీ ఆమె చెప్పినా నమ్మక, అతడు దానిని తెంచి నిప్పులో పడేసాడు. కొద్దికాలంలో వారింట దొంగలు పడి సర్వమూ దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తనతప్పిదము గుర్తించి, ఎలాగైనా అనంతుని దర్శించి, ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథము చేసి, "అనంతా! అనంతా!" అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెదకసాగాడు. దారిలో ఒక చోట పూత, కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని, దాని మీద ఒక్క పకైనా వాలలేదు. కౌండిన్యుడు, 'అనంతుడు ఎక్కడ?' అని అడుగగా, ఆ చెట్టు, నాకే ఆయన దర్శనం లభించలేదు!' అని చెప్పి. 'నీకు కన్పిస్తే, నాదుస్థితి గురించి ఆయనకు నివేదించు' అని చెప్పింది. ఆ ముని మరొకచోట ఒక గడ్డి పరకైనా కొరకని ఆవును, దూడను చూచి, వాటిని అడిగాడు. అవి గూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కన్పించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్లాక కౌండిన్యునికి రెండు కొలనులు కన్పించాయి. ఒకదానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర యెక్కడా ఒక్క కొంగైనా వాలడంలేదు. అవి గూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి. తర్వాత ఒక గాడిద, ఒక ఏనుగు కన్పించి, అనంతుడు తమకెక్కడా కన్పించలేదన్నాయి.
చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒకచోట కూలబడ్డాడు. అప్పుడొక ముసలివాడు అతనిని చేయిపట్టి లేవదీసి, 'అనంతుని చూపిస్తాను రమ్మని', ఒక అందమైన పట్టణంలోని రాజ భవనంలో సింహసనం పైనున్న ఒక సుందర విగ్రహుని చూపించాడు. కౌండిన్యుడు, అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించి, నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి నాల్గు పురుషార్థాలు, శాశ్వత వైకుంఠ నివాసమూ వరంగా ప్రసాదించాడు.
అప్పుడు కౌండిన్యుడు, తాను అడవిలో చూచిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడిలా చెప్పాడు: 'పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై గూడా ఎవరికీ విద్య నేర్పకుండా, తన కాలమంతా శాస్త్ర వాదాలతోనే గడిపాడు. అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్ధమైన మామిడి చెట్టె అడవిపాలయ్యాడు చవిటినేలను దానమిచ్చినవాడు మరు జన్మలో మేతమేయని పశువయ్యాడు. శ్రీమంతులై గూడ కొంచెమైనా దానము చేయనివాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కచెల్లెళ్ళే నీవు చూచిన ఆ రెండు చెరువులు. క్రోధము వహించినవాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించినవాడు ఏనుగుగానూ జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్దు డయ్యావు గనుకే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చా త్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెల్పమని నిన్ను కోరినాయి గనుకనే, వాటన్నింటికీ ముక్తి కల్గింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు' అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటినుంచి సుశీలాదేవి, కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు".
శ్రీకృష్ణుడు చెప్పిన యీ కథ విని, పాండవులు అనంత వ్రతం ఆచరించి, అనంతుని కృపవలన యుద్ధంలో శత్రువులను ఓడించి, మరలా రాజ్యం సంపా దించుకోగల్గారు. నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితము పొందనివారే లేరు. కనుక సాయందేవా! నీవుగూడా నీ గోత్ర ఋషియైన కౌండిన్యునివలె ఆ వ్రతం ఆచరించు. ముందు ముందు నాగనాథుడు, అతని సంతతివారు నిష్ఠతో వ్రతం ఆచరించి, శ్రీగురుని పూజించి, అచ్చటి బ్రాహ్మణులకు, సన్యాసులకూ సంతర్పణ చేసారు. తర్వాత అతడు తన భార్యాబిడ్డలను యింటివద్ద దించివచ్చి. తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు. అందువల్లనే నీకీనాడు కల్పవృక్షం వంటి 'శ్రీగురుచరిత్ర' లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు".
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన: 1. సత్కథాశ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్ఠతమ ములు. అట్టిది వినిన నామధారకుడు 'ధన్యోస్మి' అంటాడు. 2. తంతుకుడు, శ్రీ గురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదుకలు ధరించి వారితో కలసి యోగ గమనంతో శ్రీశైలం చేరి దర్శిస్తాడు, త్వష్ఠను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితియనే పాదుకలు పొందమనే! శ్రీ గురుడు - శ్రీశైల మల్లిఖార్జునుడు, కల్లేశ్వరుడూ గూడ తామేనని దర్శనమిచ్చాడు. 3. మహనీయుల సంచారం వల్లనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్దించిందని శ్రీ గురుడు చెబుతాడు. కాని సద్గురువు తాను గురువునని చాటుకోడు. అందుకే శ్రీ గురుడు తన నివాసం వలన గంధర్వపురము, సంగ మమూ పవిత్రమైనాయని చెప్పక, అచటి తీర్థాల, దేవతల సాన్నిథ్యం వల్ల అవి పవిత్రమని చెబుతారు: ఆ దేవతలనే సేవించమని చెబుతారు. భక్తుడే అనుభవంతో సద్గురువు పరమేశ్వరుడేనని గుర్తించి ఆశ్రయించాలి. అందుకే శ్రీ రమణ మహర్షి 'తాను గురువుననీ, యితరులు శిష్యులనీ తలచేవాడు ఆ పేరుకే అర్హుడు కాడు' అంటారు. 4. నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు. కల్లేశ్వరుడు నరకేసరిని, చండలేశుడు నందిశర్మనూ తమనుగాక శ్రీ గురుని సేవించమని ఆదేశించారు. ఈ లీల శిరిడీ సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు. శ్రీ కృష్ణుని విశ్వరూపంలో లాగ సకల దేవతలూ విశ్వరూపుడైన సద్గురుని యందుంటారు. 5. ముక్తికి సద్గురు కృపే ముఖ్యం. విమర్షుడనే రాజు మరి యేడు ఏడు జన్మల తరువాత అగస్త్యుని అను గ్రహంతో ముక్తుడనౌతానని చెబుతాడు. 6. సద్గురువును మానవుడని శంకించడం పావమే. ఇతర పాపాల వలె అదిగూడ సద్గురు సేవ వలన క్షాళనమవుతుందని శ్రీ గురుడు నందిశర్మకు చెబుతాడు. భావయుక్తమైన సద్గురు స్తోత్రము గూడ అంతటి మహిమాన్వితమే. శ్రీ గురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నందిశర్మ చేసిన గురుస్తుతి అతని కుష్టువ్యాధిని నివారించి, అతడికి తత్వజ్ఞానము, భుక్తి ప్రసాదించింది. 7. సద్గురు కథాశ్రవణము, రచనమూ, పఠనమూ గూడ ప్రధానమైన ముక్తి సాధనాలేనని నందిశర్మ, నరకేసరుల వృత్తాంతాలు నిరూపిస్తాయి. అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యమెంతటిదో గుర్తించి పారాయణ చేయాలి. ఇట్టి దృఢమైన స్మృతిమనలో కలిగేందుకు మిగిలిన దత్తావతారులైన సద్గురువుల చరిత్రలు గూడ ఇంత శ్రద్ధగానూ పారాయణ చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మన భక్తి దృఢమౌతుంది. ఈ విషయాలనే 44, 45, 46 అధ్యాయాలు వివరిస్తాయి.)
నామధారకుడు నమస్కరించి, "స్వామీ! మీ గురుని లీలనింకొకటి వివరించండి!" అని కోరితే, సిద్ధయోగి యిలా చెప్పసాగారు: “శ్రీ గురుని సేవకులలో తంతుకుడు అనే సాలెవాడొకడుండేవాడు. అతడు నిత్యము యింటి పనులు చూచుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి, నీళ్ళు చల్లి, ముగ్గులు పెట్టేవాడు. అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరంనుండే సాష్టాంగ నమస్కార చేసుకొని వెళుతుండేవాడు. ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని గూడ రమ్మన్నారు. అతడు, 'ఓరి వెర్రివాళ్ళల్లారా! శ్రీశైలం యెక్కడో వున్నదనుకొని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవటమెందుకు? శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే యెక్కడైనా వున్నదా? శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు వున్నాడా యేమి? నేను ఆయనను, ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికీ రాను' అన్నాడు. అతనిని యేమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి, గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతనిని పలకరించి, 'నాయనా, మీవాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీవొక్కడివే వెళ్ళకుండా వుండిపోయా వేమి?' అని అడిగారు. తంతుకుడు చేతులు కట్టుకొని, 'మహాత్మా! మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో వున్న ఒక రాయిని చూడ్డానికి వెళ్ళారు గాని, మీ పాదాలలోలేని క్షేత్రమేమున్నది?' అని చెప్పి నమస్కరించి, తన నిత్య సేవకు ఉపక్రమించాడు.
తర్వాత శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఆనాడు వుపవాసం వుండదలచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి, స్నానం చేశాడు. తర్వాత అక్కడ అనుష్టానానికి వచ్చి వున్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయగల్గి, 'ఏమిరా! మీ యింట్లో అందరూ మల్లికార్జునస్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన యింట్లో పాపం నీవొక్కడివే వున్నావు కాబోలు! నీవిదివరకు యెప్పుడైనా శ్రీశైలం దర్శించావా, లేదా?' అన్నారు. తంతుకుడు, 'స్వామీ! ఏలినవారి పాదాలు తప్ప నేనింకేమీ ఎరుగను. తీర్ధయాత్రలన్నీ నాకు మీ పాద సేవలోనే వున్నాయి' అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. 'ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది. నీవెప్పుడూ చూడలేదు గదా, నీవు గూడ వెళ్తే బాగుండేది' అన్నారు శ్రీగురుడు. అతడు, 'స్వామీ! నాకు దానిమీద అంత ప్రీతిలేదు. అయినా మీరు అంతగా చెబుతున్నారు గనుక, యెప్పుడైనా మీరుచూపిస్తే చూడాలని వున్నది' అన్నాడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి, 'నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది. నీవు యీ మా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో!' అని ఆదేశించారు. అతడు, 'చిత్త'మని అలానే చేసాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణ కాలంలో శ్రీశైలంలోని పాతాళగంగ ఒడ్డుకు చేర్చి, అతనిని కళ్ళు తెరవమని చెప్పారు. అతడికి ఆ క్షణకాలం నిద్రతూగినట్లయింది. అతడు కళ్ళు తెరచి చుట్టూచూచి మొదట భయపడ్డాడు. శ్రీ గురుడు నవ్వుతూ, 'భయపడతావెందుకు? ఇదే శ్రీశైలం. నీవు వెంటనే క్షౌరము, స్నానము మొ॥నవి పూర్తిచేసుకొని శ్రీమల్లికార్జున స్వామిని దర్శించుకొనిరా !' అని హెచ్చరించారు.
తంతుకుడు శ్రీగురునకు నమస్కరించి, ఆయన చెప్పినవన్నీ పూర్తిచేసుకుని, మల్లికార్జునుడి దర్శనానికి వెళుతూండగా, దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతనిని చూచి ఆశ్చర్యపడి, 'ఏమయ్యా! నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలూ అక్కర్లేదన్నవాడివి మళ్ళీ మా వెనకనే యీ క్షేత్రానికి వచ్చావేమి?' అని ఎగతాళి చేసారు. వారితో తంతుకుడు, 'నేను నిజం చెబుతున్నాను. ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేసాను. కాని శ్రీగురుడు యింతలో నన్నిక్కడకు తీసుకు వచ్చారు. అంతేగాని, నాకేమీ తెలియదు' అన్నాడు. కాని అతని మాటలు యెవరూ నమ్మలేదు. 'వీడు మనకు కన్పించకుండా మన వెనుకనే వచ్చియుండాలి' అనుకున్నారు. తంతుకుడు అదేమీ పట్టించుకోక గంధము, పువ్వులు, అక్షింతలు, బిల్వదళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు. కాని అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు, ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. అచటి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమయింది.అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు గాని, మరలా అంతలో తెలివితెచ్చుకొని, "శ్రీగురుడు సాక్షాత్తూ శంకరుడే గదా!" అని సమాధానపడ్డాడు.
తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకొని, పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళగంగవద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ యథాపూర్వమేకన్పించి, 'నీవింకా కొంతసేపు యిక్కడ వుండి మీ వాళ్ళతో కలసి వస్తావా, లేక మాతోవస్తావా?' అని అడిగారు. తంతుకుడు, 'మహాత్మా, నేడొక గొప్ప విచిత్రం చూచి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకక్కడి శివలింగంలో మీరే వుండి, అందరు చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమయింది. తలక్రింద కొండను వుంచుకొని గులకరాళ్ళకోసం చుట్టూ గాలించే వారిలా, దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా యింత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియటంలేదు. మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురుగప్పిన నిప్పులా మీ మహిమ అందరకూ గోచరించటంలేదు. అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది యేమున్నది? మీ పాదాలవద్ద పడియున్న నన్ను యిక్కడకు యెందుకు తీసుకు వచ్చారో నాకర్థం కావటంలేదు' అన్నాడు. స్వామి, 'నాయనా, అలాగాదు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే వున్నప్పటికీ, ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది' అన్నారు. అప్పుడా భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు యిలా చెప్పారు:
"నాయనా! మహాశివరాత్రినాడు యీక్షేత్రంలో ఎంతోమహిమ వుంటుంది. పూర్వం కిరాత దేశం 1 లో పరాక్రమశాలి, బుద్ధిమంతుడూ అయిన విమర్షణుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే గాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ, పరస్త్రీ లంపటుడుగా వుండేవాడు. 1. ఈ నాటి 'టిప్రా' ప్రాంతంలో వున్నది.
కాని మరొక వంక నిత్యమూ శ్రద్ధగా లింగార్చన చేసి, నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు. అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు. ఆమె ఒకరోజున అతనితో, 'ప్రాణనాథా! మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఆహార విహారాదులలో యెట్టి నియమమూ పాటించని మీకు యింత నిశ్చలమైన ఈశ్వర భక్తి యెలా సాధ్యమయింది?' అని అడిగింది. రాజు నవ్వి, యిలా చెప్పాడు:
"ప్రేయసీ! నా పూర్వజన్మ వృత్తాంతం చెబితేగాని నీకీ సందేహం తీరదు. వెనుకటి జన్మలో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడొక మాఘమాసంలో మహా శివరాత్రినాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్ళారు. ఆనాడు అందరూ ఉపవసించాలి గనుక నా యజమాని గూడ అన్నం వండుకోలేదు; నాకు పెట్టనూలేదు. అందువలన అందరితోపాటు నేనుగూడ ఉపవాసముండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ యింటివారందరూ శివాలయానికి వెళుతుంటే, నేనుగూడ తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తరాకులకోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను. గ్రామస్థు లందరూ తలొక దివిటీ చేతపట్టుకొని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి యేమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను. నేను లోపలికి చూచేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూచి, 'కుక్కను కొట్టండి!' అని కేకలు వేసారు. నేను పారిపోవాలని చూచాను గాని, సింహద్వారం దగ్గర సందులేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్క లేదు. కొందరు కర్రలు చేతపట్టుకొని తరుముతుంటే నేను వారి బారినుండి తప్పించుకోవాలని మూడుసార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాదటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసముండి, శివపూజ దర్శించి, ప్రదక్షిణలు చేసిన పుణ్యము ఆర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిల్చిన వారిచేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువలననే నాకిప్పుడు యింత మాత్రమైనా జ్ఞానము, రాజ్యము లభించాయి. అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్నింకా వదలలేదు. అందుకే నేను యిప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను."
కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి, అతని పాదాలకు నమస్కరించి "ప్రాణనాథా! శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు. దయతో నా వెనుకటి జన్మల గురించి తెల్పండి" అని వేడుకున్నది. విమర్షణుడు నవ్వి, "ప్రేయసీ! పూర్వం శ్రీశైలంలో నీవొక పావురంగా వున్నావు. నీవొక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కున కరుచుకొని పోతుండగా, ఒక డేగ దానిని లాక్కోదలచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరికది నిన్ను చంపి, మాంసం ముక్కను ఎత్తుకు పోయింది. ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడంవల్ల, నీవీనాడు రాణిగా జన్మించావు" అని చెప్పాడు. నాటినుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి, “నాథా! ముందు జన్మలలో మనకేమి జరుగనున్నదోగూడ సెలవీయండి" అని కోరింది. అప్పుడు రాజు యిలా చెప్పాడు: "సఖీ! నేను సింధుదేశంలో రాజ కుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయదేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్యవవుతావు. ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను; నీవు కళింగ రాజకుమార్తెవై, నా రాణివవుతావు. అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను; నీవు మగధదేశ రాజపుత్రికగా జన్మించి, నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించి నప్పుడు, నీవు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషి వవుతావు. అటుతర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించి, నా రాణివవుతావు. ఆ పైన నేను పాండ్యదేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను; అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతియనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు. అప్పుడు నేను సర్వ శాస్త్రాలు నేర్చి దేవతలను, బ్రాహ్మణులను పూజిస్తూ దానధర్మాలు చేసి, చివరకు వృద్ధాప్యంలో అగస్త్యమహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక, నీతో కలసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే. కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము" అని చెప్పి, కుముద్వతితో కలసి యాత్రచేసి వచ్చాడు.
కనుక, తంతుకా! తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి, తర్వాత మోక్షమూ కల్గాయి. నీకిప్పుడు యీ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరమూ ఈశ్వరుణ్ణి ఆరాధించు. గంధర్వనగరంలో ఈమల్లికార్జునునితో సమానమైన మహిమ గల కల్లేశ్వరు డున్నాడు. నీవు నిత్యమూ ఆయనను ఆరాధించు' అని చెప్పారు. తంతుకుడు, 'స్వామీ! మీరెందుకిలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు. మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే గదా? సర్వవ్యాసకులు, పరంజ్యోతి స్వరూపులూ అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరు గాక వేరొక దైవమున్నాడా యేమి?' అని గురు పాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకొమ్మని చెప్పి, రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో గూడ చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలో నున్న సమయంలో పురవాసులెందరో శ్రీనృసింహ సరస్వతీ స్వామి దర్శనం కోసం మఠానికి, సంగమానికి వచ్చి, పవిత్రమైన మహా శివరాత్రినాడు వారి దర్శనం యెక్కడా లభించక నిరాశతో తిరిగి పోయారు. తర్వాత ఆ సంగతి చినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతుకుణ్ణి గ్రామానికి పంపారు. అందరూ అతనిని చూచి ఆశ్చర్యంతో, 'నీవు మహా శివరాత్రినాడు తల గొరిగించుకున్నావేమి?' అని ఎగతాళి చేసారు. అతడు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పి, అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము, పువ్వులూ చూపాడు. వాళ్ళు అది నమ్మలేక, 'ఈరోజు మధ్యాహ్నం గూడ నిన్ను మీ యింటి దగ్గర చూచాము. నీవు చెప్పేది నిజంగాదు. ఈ పువ్వులు యింకెక్కడనించో తెచ్చావులే ఫో!' అన్నారు. అప్పుడతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి, 'ఇప్పుడు స్వామి సంగమ తీరంలో వున్నారు. మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు. కావాలంటే వారిని అడగండి' అని చెప్పాడు. శ్రీగురుని మాహాత్మ్యం యెరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి, ఆ రూపంలో తమకుగూడ మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు.
తర్వాత 15 రోజులకు శ్రీశైలయాత్రకు వెళ్ళిన పురవాసులు తిరిగివచ్చి, ఆ క్షేత్రంలో తాము తంతుకుణ్ణి చూచామని చెప్పారు. అంతవరకూ అతని మాటలు నమ్మనివారుగూడ, తంతుకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావజ్జీవమూ స్వామిని సేవించి, చివరకు ముక్తి పొందాడు. శ్రీగురుని మాహాత్మ్యం యెంతని చెప్పగలము?"
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్వై నమః శ్రీ గురుభ్యో నమః.
నామధారకుడు భక్తి పారవశ్యంతో, "మహాత్మా, బ్రహ్మసాక్షాత్కారం గూడ ప్రసాదించగల యింత దుర్లభమైన శ్రీగురుకథామృతం సేవించగల్గిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి, మనస్సు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి" అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో యిలా చెప్పారు:
"నామధారకా! ఇంతకుముందు నరహరిశర్మవలెనే శ్రీగురుణ్ణి సేవించి, మరి యిద్దరు కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారినెలా అనుగ్రహించారో చెబుతాను, విను. నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టువ్యాధి వచ్చింది; అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్ళి, అహర్నిశలూ తదేక దీక్షతో భవానీదేవిని మూడు సం॥లు ఉపాసించాడు. ఫలితం కన్పించకపోయేసరికి అతడొకసారి మూడు రోజులు ఉపవాసం చేసాడు. మూడవనాటిరాత్రి జగన్మాత అతనికి స్వప్నదర్శనమిచ్చి, చన్దలాపరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్థాన మైంది. ఆ ప్రకారమే అతడు వెళ్ళి, ఏడు మాసాలపాటు ఒంటిపూట భోజనంతో, ఆ పరమేశ్వరిని పూజించాడు. అప్పడు ఒకనాటిరాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి, గంధర్వపురంలో విజయంచేస్తున్న త్రిమూర్త్యవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామియనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్థానమయింది. నందిశర్మ నిద్రలేచి, 'అయ్యో, నేను యింతకాలం యింతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది. యిదేనా? దేవీ! ఈమాట మొదటే చెబితే నేనిక్కడకు వచ్చేవాడినేగాదు. మూడు సం॥లు తులజాభవానిని, ఏడు నెలలు నిన్నూ సేవిస్తే, నీవు చివరకు నన్నాక మానవ మాత్రుణ్ణి ఆశ్రయించమంటావే, నీ దేవత్వం ఏమయింది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గువేయడం లేదా? ఏడు నెలలు తపస్సుచేసి నేను తెలుసుకున్నది, నీకు శక్తిలేదనేనా? నీవల్లగాదని మొదటనే చెబితే, నాకింత కష్టమైనా తప్పేదిగదా?' అని వాపోయాడు. చివరకు, 'ఈ కఠిన తపస్సు వలన బలహీనుడనైన నేను యింకెక్కడికి పోగలను? నేను ఎక్కడకూ వెళ్ళను, ఇక్కడేమరి కొంతకాలం పురశ్చరణ చేస్తాను. దేవీ! నీవు నా రోగం పోగొట్టకుంటే నీ పాదాలవద్దే ప్రాణత్యాగం చేస్తాను' అని దేవికి చెప్పుకుని, యీసారి ప్రాయోపవేశం చేయ సాగాడు. ఆ దేవి అతనికి మరల ఆ మరుసటి రోజు రాత్రే స్వప్నదర్శనమిచ్చి, అతనిని అచ్చటినుండి లేచిపొమ్మని ఆదేశించింది. దానికి తోడు అచ్చట పూజారికి గూడ ఆమె దర్శనమిచ్చి, నందిశర్మను అక్కడనుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది! మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, 'నందయ్యగారు! అమ్మవారి సెలవయింది. గనుక మీరు తక్షణమే యిక్కడనుండి వెళ్ళిపోవాలి. లేకుంటే మేమే యిక్కడనుండి నెట్టివేయవలసి వస్తుంది!' అని బెదిరించారు. వేరుదారిలేక, అతడు అందుకంగీకరించి, దేవిని పూజించి పారణ (ఉపవాసం ముగించి) చేసి, ఆ వూరు విడచి బయల్దేరాడు. తనకు వ్రతభంగమైనందుకు ఉపవశిస్తూ ఒక శివరాత్రి నాటికి గాణాపురం చేరుకొన్నాడు. అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు యెక్కడ వున్నారని ఆ నగరవాసులను విచారించాడు. వారు, 'శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి, స్నానానికని సంగమానికి వెళ్ళారు. కొద్ది సేపట్లో తిరిగి వస్తారు' అని చెబుతున్నారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూచి, వారు ఆ కుష్టురోగిని దూరాన్నే వుండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే, వారి దర్శనానికై ఒక కుష్టురోగి వచ్చారని అచ్చటివారు మనవి చేసారు. అది వినగానే శ్రీగురుడు, 'వాడు సంశయాత్మకుడు! అయినప్పటికీ మా యెదుటకు రమ్మనండి' అని చెప్పారు. అది విని నందిశర్మ అడుగడుగుకూ సాష్టాంగపడుతూ వారి యెదుటకు వచ్చాడు. శ్రీనృసింహ సరస్వతి అతనిని చూచి, "ఏమయ్యా! "మొదటి దేవిని ఆశ్రయించాక, మరలా యీ మానవమాత్రుణ్ణి దర్శించేదేమిటి?" అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుంటే, దేవి ఆదేశిస్తే మాత్రం రావడమెందుకు?' అన్నారు. ' వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకొనిన నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి యిలా అన్నాడు: 'స్వామీ! నేను మూఢుడను. శుద్ధసత్త్వ స్వరూపులైన మీ దృష్టి
దేవి మాటను గూడ విశ్వసించలేనివాడు ఆమెను పూజించడమెందుకు? ఆమెపై సంపూర్ణ విశ్వాసంతోనే ఆమెను సేవించివుంటే, తిరిగి ఆమె ఆదేశాన్ని శంకించడ మెందుకు? అని శ్రీ గురుని భావం.
నాపై ప్రసరింపచేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది. పాపాత్ముడ నైన నేను మీరు మాయాతీతులని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులనీ తెలుసుకోలేక పోయాను. నేడు తమ దర్శనంవలన నా పాపాలన్నీ నశించాయి. మీరు భూమిని ఉద్దరించడానికి దిగివచ్చిన గంగవలె, నావంటి వారిని రక్షించడానికి మానవ రూపoలో అవతరించారు. మీ పాదసేవ దొరికాక నా అభీష్టం యెందుకు నెర వేరదు? జారత్వ దోషంవలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాద స్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను యెన్ని పాపాలు చేసినవాడనైనా మీ పాదస్పర్శవలన పవిత్రుడనవుతాను. స్వామీ! నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను.
నాకు వివాహమయినప్పటినుండి ఆపాదమస్తకమూ కుష్టురోగం వచ్చింది. అందువలన నాభార్య నన్ను విడిచి, పుట్టింటికి వెళ్ళింది. నా తల్లి తండ్రులు గూడా నన్ను వెళ్ళగొట్టారు. నేను దిక్కులేనివాడనై ఆ జగదాంబ నాశ్రయించి ఉపవసించినా, నాపాపం నశించలేదు. అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చన్దలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడాశతో అచ్చటికి వెళ్ళి, కఠోరమైన పురశ్చరణ చేసాను. ఆ తల్లి గూడ నన్ను చీదరించుకొని వెళ్ళగొట్టిందేగాని, అనుగ్రహించనే లేదు. నాముఖం చూచే వారెవరూ లేరు. నేను యిలా బ్రతకడంకంటే మరణించడమే మేలు. చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందడానికి వచ్చాను. దయచేసి ఈ నా వ్యాధికి నివారణమున్నదో లేదో వెంటనే చెప్పండి! ఈ దుస్థితిలో నేనింక బ్రతుకలేను. నివారణోపాయం లేకుంటే మీ పాదాలవద్దనే నా ప్రాణాలు విడవాలనే వచ్చాను. మీరే నాకు దిక్కు. ఆ పైన మీ దయ' అని దీనాతిదీనంగా నందిశర్మ వేడుకున్నాడు.
శ్రీగురుడు అతనిపట్ల కృపచెంది. సోమనాథుడనే ప్రియశిష్యుణ్ణి పిలచి, 'నాయనా! నీవితనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి, అచటి షట్కల తీర్థంలో స్నానం చేయించు. తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. అపుడు యితడు కట్టుకున్న బట్టలు తగులబెట్టించి, క్రొత్త వస్త్రాలు కట్టించి, యిక్కడకు తీసుకొనిరా!' అని ఆదేశించారు. ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే, అతని శరీరంలో ఆ రోగమెక్కడా లేకుండాపోయింది! తర్వాత అచ్చటి అశ్వత్థవృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారుఛాయతో వెలిగిపోయింది. తర్వాత అతడు క్రొత్తవస్త్రాలు ధరించాక అతని పాతవస్త్రాలు మూట కట్టించి, ఒకచోట తగుల పెట్టించారు. అప్పుడు ఆ తగుల పెట్టిన ప్రదేశమంతా చవుడు బారిపోయింది. అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగివచ్చారు. ఒక ఘడియ క్రిందట దేహమంతటా కుష్టు రోగమున్న అతడు యింతలోనే శుద్ధుడై, సోమనాథునితో గూడ శ్రీగురుని పాదాలకు మ్రొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చటి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు.
శ్రీగురుడు అతనిని చూచి, 'ఏమి నందిశర్మా ! నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూచుకొని చెప్పు!' అన్నారు. అతడు చూచుకొని, తన పిక్కమీద ఒకచోట కొద్దిమాత్రం కుష్టు మిగిలివుండటం చూచి బాధపడి, 'అయ్యో, మీ కృపవల్లగూడా యీ వ్యాధి పూర్తిగా నశించలేదే! నన్ను దయచూడండి' అని వేడుకున్నాడు. శ్రీగురుడు, 'నాయనా! నీవు, "దేవతల వల్లగానిది ఒక మానవ మాత్రుని వలన ఎలా సాధ్యమవుతుంది?" అని సంశయించినంతమేరకు యీ వ్యాధి మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో, లేదో చెప్పి స్తోత్రంచేయి. ఆ కాస్తా తొలగిపోతుంది అన్నారు. నందిశర్మ నమస్కరించి, 'స్వామీ! మీపట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కాని నేను చదువుకోలేదు. మంద బుద్ధియైన నాకు మిమ్మల్ని స్తుతించడమెలా సాధ్యం?' అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడాయన, 'నాయనా! ఏనుగు నోటినుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటినుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు. మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్మం తీసుకొని, అతనిని నోరు తెరవమనిచెప్పి, అతని నాలుక చివర వుంచారు. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచుని చేతులు కట్టుకొని స్వామిని భక్తిపారవశ్యంతో యిలా స్తుతించాడు:
ఓ పరమేశ్వరా! శ్రీ గురూ! నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము. నీవు సర్వకర్తవు, సర్వభర్తవు. అవ్యయుడవు. ఆత్మ స్వరూపివి, నీవే ప్రకృతి యొక్క త్రిగుణాలనుండి భూతాలను పుట్టించి, మాయావశమైన, యింతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలాంటి మానవుడు గూడ దాటనలవిగాని నీ మాయచేత భ్రాంతి చెంది, సంకల్పవంతుడై పాపపుణ్యాలవలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు. వీడు యెన్ని కల్పాలకైనా ఈ మాయనుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా, ఆ పుణ్యం వ్యయమవగానే క్రిందకు వచ్చి చంద్ర మండలంలో పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు. అప్పుడు జీవులచేత భక్షింపబడి రేతస్వరూపుడై తల్లిగర్భములో పడతాడు. క్రమంగా నెలలు గడిచినకొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ, తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన యెన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానం లోపించడంచేత పరమాత్మయైన మిమ్మల్ని స్మరించనేలేడు. ఆ గర్భ చెరనుండి తప్పించుకుని బయటపడ్డాక గూడ తన బాధలు, భయాలు, యెవరికీ చెప్పుకోలేక, యెన్నో బాధలు పడతాడు గాని మీ గురించిన జ్ఞానమే వుండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నోపాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు, సాంసారికమైన చింతలు, అతనిని తలమునకలు చేస్తాయి. వాటివలన అంతిమ క్షణంలోగూడ మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు. నేను గూడ యిలానే మాయలోబడి, యెంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు యిప్పుడు మీ దర్శనం లభించింది. మీరు నరరూపం ధరించి, ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు. అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు. స్వామీ! నన్నీ సంసారసాగరం నుండి తరింపజేయి' అని స్తుతించాడు. అపుడతడు ఆ పారవశ్యంలోనే ప్రజలవైపు తిరిగి, 'ఓ జనులారా! ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తూ పరమేశ్వరుడే గాని మానవమాత్రుడుగాడు. వీరి దర్శనంవలన నా పాపాలన్నీ - దావానలంవలన ఎండుటాకులు భస్మమైనట్లు- నశించి పోయాయి. వీరి పాదస్పర్శవలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటివ్రాత గూడ మారిపోగలదు. పెన్నిధివలె నేడు మనకీయన లభించారు. అయినా మనమీయ నను గుర్తించలేకున్నాము. ఆత్మ శ్రేయస్సు కోరుకున్నవారందరూ ఈయనను భజించి, ధన్యులుకండి. ఈయన మాహాత్మ్యాన్ని నేనెంతని వర్ణించను? వాక్కుకు, మనస్సుకూ అతీతమైన యీయన మహిమను వర్ణించబోయి వేదమే మూగ 'వోయింది!' అని యిక నోట మాటరాక, ఆనంద భాష్పాలు కారుస్తూ నిల్చుండి పోయాడు. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అచటివారితో, 'ఈబ్రాహ్మణునికి "కవీశ్వరుడు" అని బిరుదిస్తున్నాము. నేటినుండి అందరూ యితనిని కవీశ్వరుడనే పిలవండి' అని చెప్పారు. ఇంతలోతన పారవశ్యంనుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. అంతకుముందు మిగిలిన కొద్ది పాటి కుష్టుగూడా మటుమాయమవడం గమనించి, సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటినుండి నందిశర్మ శ్రీగురుని సేవిస్తూ, ఆయన మాహాత్మ్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే వుండి పోయాడు.' ఇటువంటి కవీశ్వరుడే మరొకడు గూడ శ్రీగురుని సేవించి తరించాడు".
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
ఇతడు వ్రాసిన కవితలలో 'శ్రీగురుకథ' ఒకటి.
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః.
నామధారకుడు, "స్వామీ, శ్రీ గురునివద్ద మరొక కవి శేఖరుడుండే వాడంటిరి గదా? అతడెవరు? అతడు శ్రీగురునికి భక్తుడు యెలా అయ్యాడో, ఆయననెలా సేవించాడో దయచేసి వివరించండి" అన్నాడు. సిద్ధయోగి యిలా చెప్పనారంభించారు: "శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితా శక్తిని పొందిన సందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు వ్రాసిన కవితలు యెన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకొంటుండేవారు. ఆ రీతిన శ్రీ గురుని మహాత్మ్యం మరింతగా వెల్లడై యెందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు.
గాణాపురం సమీపంలోనే 'హిప్పరిగి' యనే గ్రామమున్నది. ఒకసారి ఆ గ్రామంనుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలచి ఆయనను ప్రార్ధించి, ఆయన నెలాగో వప్పించి, మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకు వెళ్ళారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరూ యెంతో భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకొన్నారు. ఆ ఊరిలో ఒక శివాలయమున్నది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేసరియని ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడున్నూ. అతడు నిత్యమూ కల్లేశ్వరుని స్తుతిస్తూ, పంచపద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించు కొనేవాడు. అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు, మరే దేవతనూ స్తుతించేవాడు గాదు. అతడొకరోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని, 'ఇతని కవిత్వం ఉత్తమంగా వున్నది. అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే గనుక పనికిరాదు' అని తలచాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో 'భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి, 'కవిచంద్రా! మీ పద్యాలెంతో మనోహరంగా వుంటాయి. శ్రీ నృసింహ సరస్వతీ యతివరేణ్యులకు కవిత్వమంటే యెంతో ప్రీతి. కనుక వారిని స్తుతిస్తూ మాకు నాల్గుపద్యాలు వ్రాసిస్తే, అవి వారిచెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము' అని కోరారు. నరకేసరి, ‘అయ్యా! అది నావల్లగాదు. కల్లేశ్వరుని దప్ప మరే దేవతనూ స్తుతించను. ఆయన సేవకే నా కవితనంకితం చేసుకున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవమాత్రుడైన సన్యాసిని నా కవితతో యెలా స్తుతించేది?' అని చెప్పాడు. తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోడానికి ఆలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమోగాని, ఆరోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గరనుండి అతనికి బాగా నిద్రతూగసాగింది. అతడు యెంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక, చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది. ఆ కునుకులోనే ఒక చిత్రమైన కలగూడ వచ్చింది. కలలోగూడ అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని యెదుట మాత్రం యెప్పుడూ కన్పించే కల్లేశ్వరలింగం అప్పుడు కన్పించలేదు. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొనివున్నాడు. ఆయన నవ్వుతూ, 'నీవు కల్లేశ్వరుని దప్ప మరెవ్వరినీ నీ కవితతో స్తుతించవు గదా! మానవమాత్రులమైన మమ్ము యీనాడు పూజిస్తున్నా వేమి?' అన్నారు. నరకేసరి త్రుళ్ళిపడి, వెంటనే నిద్రమేలుకొన్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్ది సేపట్లో కునుకుపట్టింది. శ్రీ గురుడు మళ్ళీ స్వప్నదర్శనమిచ్చి, `మేము-కల్లేశ్వరుడూ వేరుగాదు!' అన్నారు. ఆ కలలోనే అతడు పూజ పూర్తిచేసి అయిదు పద్యాలతో స్తుతించాడు. ఈసారి నరకేసరి మేల్కొని, తనకొచ్చిన కలను స్మరించుకొని, 'అయ్యో! నేనింతవరకూ పొరబడ్డానే! ఈ నరసింహ సరస్వతీ యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని, ఇంతవరకూ నేను తలచినట్లు మానవమాత్రులుగారు. కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు యిలా అవతరించాడు. ఈ శ్రీ గురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే, కాకుంటే యీనాడు. పూజలో నాకు దర్శనమిచ్చి, నా సందేహానికి సమాధానమెలా యివ్వగలరు?' అని నిశ్చయించుకొన్నాడు.
వెంటనే బయల్దేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని, స్వామిని తన కవితతో యిలా స్తుతించాడు: 'అనంతా! సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తూ ఆ కల్లేశ్వరులే. అది తెలియక నేనింతవరకూ మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు గూడ మీ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుని కృప వలన నాకీనాడు మీరు దర్శనమను గ్రహించారు. ఈ దుఃఖసాగరంలో మునిగి, దారీ తెన్నూ కన్పించక బాధపడుతున్న భక్తులనురక్షించడానికే మీరిలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక, యితర మార్గాలకోసం వెతుకులాడటం వ్యర్ధమే!' అని స్తుతించాడు. స్వామి నవ్వి, 'ఏమయ్యా! ఇంతవరకూ నీవు, మేము కేవలం మానవమాత్రుల మని, మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదనీ ఆక్షేపిస్తుంటివే, యింతలో నీ మనస్సు యిలా యెందుకు మారింది?' అని అడిగారు. నరకేసరి నమస్కరించి, 'స్వామీ! నేను అజ్ఞానమనే చీకటిలో పడివున్నప్పటికీ మీరు నాపాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కల్గించారు. ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి, యీనాడు నాకు మీపాదసేవ లభించింది' అని, తనకు కల్గిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు. ఆయనను పూజించి, స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి, అనుగ్రహించమని వేడుకున్నాడు. 'నీ అభీష్టాలన్నీ నెరవేరుగాక!' అని శ్రీగురుడు ఆశీర్వదించారు. నరకేసరి యెల్లప్పుడూ వారి చెంతనే వుండదలచానని కోరాడు. శ్రీగురుడు, 'ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు. ఆయనంటే మాకెంతో ప్రీతి గనుక మేమెప్పుడూ ఆ రూపంలో హిప్పరిగిలో వుంటాము. కనుక నీవు యెప్పటివలే నీవక్కడనే ఆ రూపంలో వున్న మమ్మల్ని పూజిస్తూ వుండు' అని ఆదేశించారు. కాని అతడు త్రిమూర్తిస్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్నే సేవించుకోవాలని వున్నదని మరీమరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. అప్పటినుండి నరకేసరి, నిత్యమూ తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని గూడ పూజిస్తూ, ఆయనను పంచరత్నాలతో స్తుతిస్తూ వుండేవాడు. నామధారకా! శ్రీగురుని అనుగ్రహం వల్ల యిలా మారినవారెందరో
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, గురుభ్యో నమః
ప్రస్తావన: 1. తనివి తీరని సద్గురు కథారసపానాసక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరలా ఈ (47,48,49) అధ్యాయాలలో గూడ హెచ్చ- రిస్తున్నాడు. సిద్ధుడు పూర్ణమైన నిష్ఠ-ఓరిమిలతో సద్గురువును సేవించి జీవన్ముక్తు డయ్యాడు గనుక ఆయన వాక్కు ప్రమాణమేనని గుర్తుంచుకొని ఈ గ్రంథపారా యణ చేయాలి. 2. ఒకే పరమాత్మ విశ్వమంతా అయిగూడ త్రిమూర్తుల రూపాలలో వారి లోకాలలో ఉన్నాడని సిద్ధుడు చెబుతాడు. అంటే శ్రీ దత్తావతార కార్యమైన బ్రహ్మ-శైవ-వైష్ణవ సామరస్యాన్నే సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు. ఆ రూపాలలో ఆయా లోకాలలోఆవిర్భవించిన పరమాత్మే భక్తులనుద్ధరించడానికి భూమిమీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులో త్రిమూర్తుల ఐక్యమున్నదని గుర్తుచేస్తున్నాడు. 3. భగవంతుడు ప్రతియుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన, ముందటి అధ్యాయాలలో చెప్పినట్లు సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువలన, మనము అట్టి సద్గురువుని సేవిస్తే ఈ కలి మలానికి వెరవనవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు. 4. శ్రీ గురుడు ఒకే సమయంలో యెనిమిది గ్రామాలలోని భక్తుల యిండ్లకు వెళ్ళాడు. ఇట్టి లీలలెన్నో శిరిడీ సాయినాధుని చరిత్రలో చూడవచ్చు. 5. శ్రీ గురుడు తనను భక్తితో సేవిస్తున్న కృషీవలునికి లక్ష్మి, భక్తి కూడ స్థిరంగా వుండేలా వరమిచ్చాడు. లక్ష్మి చంచలమని లోక ప్రసిద్ధి. మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మీయని, మహర్షి వాక్యం. అంటే లౌకిక సుఖాలే కోరే అజ్ఞులకు గూడ సద్గురుడు, అతడు కోరిన అభీష్టానికి తోడు మోక్షార్హతను గూడ ప్రసాదిస్తాడన్నమాట. అదే ఒక వంక దేవతలకు, సామాన్య సిద్ధ పురుషులకు మరోవంక శ్రీ దత్తావతారులైన సద్గురువులకు భేదం గురువనే క్షేత్రం సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలిస్తుంది. 6. శ్రీ గురుడు గంధర్వపురంలోనూ, అమరపురంలోనూ నివసించడానికి అక్కడెన్నో తీర్థాలు, దేవతలూ వుండడమే కారణమని చెబుతాడు గాని తాను కారణమనడు. కానీ తీర్ధాలన్నీ మహనీయుల తపో ప్రభావం వల్ల యేర్పడుతాయని ముందు చెప్పాడు. పూర్వమొక జీవన్ముక్తుడయిన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెబుతాడు. మహాత్ముల సన్నిధిలో సర్వతీర్థ క్షేత్రాలుంటాయనీ, దేవతలుంటారనీ గురుగీత చెబుతుంది. వాటిని అజ్ఞులు గుర్తించలేరు. ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్ధించి ఆ తీర్థాలను వారికి చూపాడు. సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి సేవించలేరు గనుక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి గదా! వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యం గోచరమవుతుంది. 7. ఆ జీవన్ముక్తుడు దైవం తన కన్యమైనట్లు ప్రార్థించడం శ్రీ గురుడు, శిరిడీ సాయిబాబాల వలె సాధులోకానికి మార్గదర్శకము మాత్రమే. 8. శ్రీ గురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మఫలాన్ని పోగొట్టాడు. సద్గురువు కర్మను కూడ నశింపజేయగలరని, కాని అందుకు భక్తులకెంతో భక్తిశ్రద్ధలుండాలనీ మనం తెలుసుకోవాలి.)
నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి యింకా యిలా చెప్పసాగాడు: “నీవెంతో అదృష్టవంతుడివి గనుకనే యీ కథపట్ల యింత శ్రద్ధాసక్తులు కల్గాయి. ఈ కథ వినడం వలన పతితులు గూడ పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు, స్వామిని దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి పర్వదినాన తమ తమ యిండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాణా (గంధర్వ) పురం వచ్చారు. ఆ ఏడుగురూ ఆ చుట్టు ప్రక్కలున్న ఏడు గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్ధన విని స్వామి, 'ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదేరోజు అందరి యిళ్ళకు రావడం ఎలా సాధ్యము? అలా అని మీలో యెవరి కోరికనూ మేము కాదనలేము. కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి, ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలము' అన్నారు. అప్పుడు ఆ ఏడుగురూ, 'స్వామి తమ యింటికి రావాలంటే, తమ యింటికి రావాలని వాదించుకోసాగారు. వారు యెంతకూ ఒకనిశ్చయానికి రాలేక పోయేసరికి స్వామి నవ్వుతూ, 'మీరు వాదించుకోవడం యెందుకు? మీ అందరికీ మాపై విశ్వాసమున్నది గనుక, ఆ విషయం మా యిష్టానికే విడిచి పెట్టండి. ఆ రోజు మాకు తోచినచోటికి మేమే వస్తాము' అన్నారు. అప్పుడా భక్తులు నమస్కరించి, 'స్వామీ! మాశక్తి సామర్థ్యాలు, స్థితిగతులూ ఎంచక, మా అందరినీ సమానంగా మన్నించండి' అన్నారు! కాని, స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేసారు. వారిలో పేదవారు, 'అయ్యా! మేము పేదవాళ్ళమని మమ్ము ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీ కృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా, అతని పదవినెంచక, తమనే నమ్ముకున్న నిరుపేదయైన విదురుని యింటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు గదా! అలానే మీరు గూడ మా ప్రార్ధనను త్రోసిపుచ్చవద్దు!' అని యెవరికివారే వేడుకున్నారు. అప్పుడు స్వామి, 'మీరు మీ యిళ్ళకెళ్ళండి. ఆనాడు మాకై మేమే రాగలం, సందేహించవద్దు!' అని వాగ్దానం చేశారు.
ఆయన యెవరి ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహంతో ఆ ఏడుగురూ అలాగే నిలబడిపోయారు. అప్పుడాయన ఒక్కొక్కరినే ప్రక్కకు పిలిచి, 'మేము మీ గ్రామానికే వస్తాము. కాని యీ మాట యింకెవరికీ చెప్పవద్దు!' అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు యెవరికి వారే-స్వామి తన యింటికే రాగలరని తలచి, యితరులకు యేమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. కాని స్వామి ఆ పండుగనాడు యే ఊరో వెళతారని అచ్చటి వారందరికీ తెలిసి పోయింది. గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి, ఆ పర్వదినాన తమను విడిచి యెక్కడికీ వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. వారితో స్వామి, 'మేమానాడు యిక్కడనే వుంటాము, యెక్కడకు వెళ్ళము' అని మాటయిచ్చి అందరినీ ఊరడించారు.
చివరకు ధనత్రయోదశి రానేవచ్చింది. ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలూ, శ్రీగురుడు తప్పక తమ యింటికే రాగలరని తలచి ఎవరికివారు యెంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకొన్నారు. ఆయా గ్రామస్తులు గూడ స్వామికి ఘనస్వాగతము, పూజలకు సిద్ధమయ్యారు. కాని గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి యెక్కడకూ వెళ్ళక మఠంలోనే వుండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో, శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకూ వెళ్ళారు! అయినప్పటికీ ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే వుండి, అచ్చటి వారి పూజలందుకున్నారు. కొద్దిరోజులు, ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా వుండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీకమాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీకపూర్ణిమ రణాలు సమర్పించుకోడానికి అన్ని గ్రామాలనుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు పదిహేను రోజులముందు తమతమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పకుంటుండగా, ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికివారు, శ్రీగురుడు తమయింటనే భిక్ష చేసారని చెప్పుకొంటూ, ఒకరి మాటను ఒకరు ఖండించు కుంటున్నారు. ఎవరికివారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు, కాన్కలూ నిదర్శనంగా చూపించి, తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వ పురవాసులు నవ్వి, 'మీ అందరికీ పిచ్చిపట్టిందా ఏమి? దీపావళినాడు స్వామి యెక్కడకూ వెళ్ళనేలేదు. స్వామిని మేమేగదా యిక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము?' అని మందలించారు. అప్పుడు స్వామి, ‘మీరు వాదులాడుకోవద్దు. మీలో ఎవరూ అబద్ధం చెప్పడంలేదు. మేము అంతటా వున్నాము గదా!' అన్నారు. స్వామి ఆ నాడు అన్ని రూపాలు ధరించి, అందరి పూజలూ అందుకున్నారన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులై, అటువంటి లీల తామెన్నడూ కనీవినీ ఎరుగమని చెప్పి స్వామిని స్తుతించుకొన్నారు. ఎంతటి కవులకూ వర్ణించ సాధ్యంకాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారకా! శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది ? శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము. ఆయనకు మించిన దైవమే లేడు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీగురు పాద సేవకు మించిన నావయే లేదు. గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా!" అన్నారు సిద్ధయోగి.
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
"స్వామీ! ఈ గంధర్వ పురంలో శ్రీగురుడు యింకేమి చేసారో చెప్పండి!" అని కోరిన నామధారకునితో సిద్ధుడు యిలా చెప్పారు: “నాయనా! ఆ భగవంతుడు ప్రతిరోజూ స్నానానుష్టానాలకు మఠంనుండి బయల్దేరి సంగమానికి వెళ్ళి వస్తుండే వారని చెప్పాను గదా? అప్పుడు గంధర్వ పురంలో పర్వతేశుడనే ఒక వ్యవసాయ దారుడు వుండేవాడు. అతడు గుత్తకు సాగుచేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో వుండేది. అతడు నిత్యమూ మొదట మఠంలో శ్రీగురుణ్ణి దర్శించుకొని పాలానికి వెళుతుండేవాడు. శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు, తర్వాతమఠానికి తిరిగివచ్చేప్పుడు, కనిపెట్టి పరుగునపోయి యెంతో శ్రద్ధాభక్తులతో కొద్దిదూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు. కొంతకాలం శ్రీగురుడు అతనినేమీ పల్కరించ కుండా అతడి భక్తిశ్రద్దలను గమనిస్తుండేవారు. ఎంత కాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒక రోజతడు నమస్కరించగానే, “నాయనా! నిత్యమూ నీవింత శ్రద్ధా భక్తులతో మాకు నమస్కరిస్తున్నావే, మానుండి నీకేమి కావాలో చెప్పు!' అన్నారు. ఇంతకాలానికి తనకట్టి అవకాశమొచ్చినందుకు పర్వతేశుడెంతో సంతోషించి, చేతులు జోడించి, 'బాబూ, నా పొలాన్ని స్వామి వారు ఒక్కసారి చూచి, అక్కడ తమపాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ' అన్నాడు. స్వామి, 'నాయనా, నీ పొలంలో ఏమి పైరు వేసావు?' అని అడిగారు. అతడు 'అయ్యా! ఈ సంవత్సరం జొన్నవేశాను. రోజూ మీకు నమస్కరించు కుంటుంటే చేను బాగా పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలుపోసు కుంటున్నది. తమ దయవల్ల రెండునెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది. కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టినవారవుతారు. ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి, నామాట త్రోసి పుచ్చవద్దు. మీరే మా పాలిట రక్షకులు' అని ప్రార్ధించాడు.
శ్రీగురుడు, 'సరే పద, చూచి వద్దాము' అని చెప్పి, అతనితో గూడ చేనువద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలయజూస్తూ, ఏమిరా! మేము చెప్పింది చేస్తానంటే ఒకమాట చెపుతాను' అన్నారు. ఆ రైతు, 'తండ్రి, మీమాట జవదాటుతానా? మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక మరెవరున్నారు? మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే వుండదు. స్వామికి తెలియనిది యేమున్నది? గుర్వాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచనా లేదు' అన్నాడు. ఆ యతివరేణ్యుడు, ‘అలా అయితే మా మాటమీద నమ్మకముంచి, మేము మధ్యాహ్నం యిటుగా వెళ్ళేలోపల యీ చేలోని పైరంతా కోయించు!' అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు.
ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాల పాటించదలచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి, ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే యీ సంవత్సరం గూడ గుత్త చెల్లిస్తానని, పైరు కోయడానికి అనుమతిపత్రం యివ్వమని కోరాడు. కాని ఆ ఏడాది పైరు యెప్పటికంటే యెక్కువగా పెరగడం వలన ఆసామి అందుకొప్పుకొనక, ఆ ముందటి సంవత్సరంకంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం వ్రాయించుకొని, పైరు కోతకు అనుమతిచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీలను పిల్చుకొని పొలంవద్దకు వెళ్ళాడు. 'పైరుకు యింకా పాలుపట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమా!' అని కూలీలు గూడ ఆశ్చర్యపోయారు. కాని, తమకు కూలి దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. అంతలో ఆ సంగతి తెలిసి, అతని భార్యబిడ్డలు నెత్తి, నోరూ మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు. వాళ్ళని పొమ్మని యెంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి, అతడు వాళ్ళమీద రాళ్ళు రువ్వసాగాడు. వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి, 'మహాప్రభూ! మావాడికి దయ్యం పట్టిందో యేమో గాని, కంకులింకా ముదరకముందే పైరు కోయిస్తున్నాడు. వద్దని అడ్డుబోతే మమ్మల్ని రాళ్ళతో కొడుతున్నాడు. ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని, పంటకొస్తున్న పైరే చేతులారా పాడుచేస్తున్నాడు. ఇంకొక నెలరోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్తా యిలా నాశనమై పోతున్నది. మీరైనా అతనిని నిగ్రహించండి' అని గొల్లున యేడ్చారు. ఆ న్యాయాధికారి, 'మీరు నాతో చెబితే నేనేమి చేయగలను? ఏమైనా చేయగల్గితే యజమానే చేయగలడు. అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేసాడు.
వాళ్ళు అప్పుడు ఆ పాలం యజమాని వద్దకువెళ్ళి మొర పెట్టుకుంటే అతడు, 'వాడి యిష్టం! వాడేమి చేసుకుంటే నాకెందుకు? క్రిందటి సంవచ్చరం కంటే రెట్టింపు గుత్త నాకిచ్చేలా వ్రాయించుకున్నాను. అయినా మీరింతగా గోల పెడుతున్నారు గనుక, మా మనిషినిపంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళండి' అని చెప్పి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డుచెప్పగానే ఆ సేద్యగాడు, 'ఏమయ్యా! కాగితం వ్రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలేగాని, నేనేమి చేసుకుంటే అతని కెందుకు? ఆయనకు యివ్వవలసిన ధాన్యం మాయింటి గాదెలోనే వున్నది. అది చాలకుంటే, వాటికి బదులు చెల్లించడానికి నాదగ్గర కావలసినన్ని పశువు లున్నాయిగదా?' అని చెప్పి, అతనిని వెనుకకు పంపివేశాడు. అంతటితో యజమానె వూరుకున్నాడు. పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తిచేయించి, కొడవళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి, శ్రీగురుణ్ణి స్మరిస్తూ, ఆయన సంగమంనుండి మఠానికి వెళ్ళేదారిలోఆయన రాకకై యెదురుచూస్తూ కూర్చున్నాడు. కొంత సేపటికి ఆటుగావస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి, వారిని పొలం వద్దకు తీసుకు వెళ్ళి, ఆ కోసి వేసిన పైరు చూపాడు. స్వామి అది చూచి ఆశ్చర్యం నటిస్తూ, 'అయ్యో! నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే! నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేసావే! ఎంతపని చేసావయ్యా!పాపం, ఇప్పుడు నీ జీవనమెలా? యజమానికి ధాన్యమెలా యిస్తావు? అమాయకుడా? పండనిపైరు కోసి అంతా వ్యర్థం చేసావు గదా!' అన్నారు. కాని పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి, 'స్వామీ! నాకు గురువాక్యమే ప్రమాణము. అదేమాకు శ్రీరామరక్ష. మీరుండగా మాకేమి భయం?' అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీగురుడు లోలోపల సంతోషించి, 'నీకు అంత దృఢమైన విశ్వాసముంటే అలానే అవుతుందిలే!' అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు. ఆ కాపరి గూడ శ్రీగురుడు కనుమరుగయ్యే వరకూ తదేకంగా ఆయనను చూచి, నిశ్చింతగా యింటికి వెళ్ళాడు. దారిలో అతనిని చూచిన వారంతా యెన్నెన్నో మాటలన్నారు గాని, అతడవేమీ పట్టించు కోలేదు.
పర్వతేశుడు యిల్లు చేరేసరికి అతడి భార్య తమకా సంవత్సరం నోటివద్ద కొచ్చిన కూడు పాడై పోయిందని భోరు భోరున ఏడుస్తున్నది. అతడు మాత్రం యెంతో నిబ్బరంగా ఆమెతో, 'ఓసి వెర్రిదానా! నీవలా ఏడవ గూడదు. ఆ గురుదేవుల వాక్కే మన పాలిట కామధేనువు. వారి మహిమ మూఢులకేమి తెలుస్తుంది? ఆయన సాక్షాత్తూ పరమేశ్వరుడే. మనకాయన పెన్నిధిలా దొరికాడు. వారి దయ వుంటేనే అందరమూ సుఖంగా బ్రతుకగలము. మామూలుగా పండవలసిన కంటే యెన్నోరెట్లు యెక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకమున్నది' అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ. చోద్యము చూడవచ్చి, అతని మూఢవిశ్వాసానికి నివ్వెరబోయి, నవ్వుకుంటూ వెళ్ళి పోయారు.
ఒక వారం రోజులు గడిచాయి. ఎనిమిదవరోజు నుండి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది. దాని వలన చుట్టు ప్రక్కల చేలన్నీ వాలిపోయి, -తాలుధాన్యం యేర్పడింది. దానికితోడు ఆ పుష్యమాసంలో భారీయెత్తున అకాలవర్షం కురిసింది. అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడయిపోయాయి. కాని పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ళనుంచి ఒక్కొక్క మొక్కకు పది, పదకొండు చొ॥న పిలకలు వచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అదిచూచిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతడి భార్యగూడ అమిత సంతోషంతో తన భర్త కాళ్ళమీదపడి, 'అయ్యా! తెలియక నేనెంతో గొడవచేసి మీ మనస్సును యెంతగానో నొప్పించాను. తెలివితక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను. చివరకు ఆ మహానుభావుణ్ణి గూడ నిందించాను. అదెంత తప్పో యిప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనస్సులో పెట్టుకోక నన్ను క్షమించు' అని ప్రాధేయపడింది.
అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజచేసి శ్రీగురునివద్దకు వెళ్ళి ఆయన పాదాలమీద పూలువేసి నమస్కరించు కున్నారు. స్వామి నవ్వి, “ఏమిటి విశేషం?' అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, 'స్వామీ, మీ దయవలన మేము కోరినదానికంటే ఫలితమెంతగానో యెక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు, సత్యమూర్తి భూమిమీద యింకెవ రున్నారు? అమృతం వంటి మీమాట అందరూ వినదగినది. అదియే అందరిపాలిట పెన్నిధి; మీ చూపు పాపులను గూడ పావనం చేయగలదు' అన్నారు. పర్వతేశుని భార్య, 'స్వామీ! నేను తెలియక మొదట యేమేమో అన్నాను. మన్నించి మమ్మల్ని మీరు యెప్పుడూ యిలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేమెల్లప్పుడూ మిమ్మల్ని యిలాగే కొల్చుకునేలా అనుగ్రహించండి' అని విన్నవించుకున్నది. తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు. వారి భక్తిని చూచి సంతోషించి శ్రీగురుడు, 'అఖండ శ్రీరస్తు!' అని ఆశీర్వదించి, వాళ్ళను పంపివేసారు. ఆ దంపతులెంతో సంతోషంగా యింటికి పోయారు.
నెల గడిచేసరికి పర్వతేశుని పంటపండి, కంకులు అద్భుతంగా బయటికొచ్చాయి. నిజానికి ఆ ముందటి సంవత్సరంకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చి రాశిపోసి, ఆసామి వద్దకుపోయి, 'అయ్యా! చూచారా, స్వామి దయవలన పైరెంత బాగా పండిందో? మీకుగూడ మనమొప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే యిస్తాను తీసుకోండి. అయినా నాకింత ఎక్కువగా పండింది గనుక మనిద్దరమూ చెరిసగము తీసుకొనడం న్యాయమని నాకనిపిస్తున్నది. మీరు వెంటనే వచ్చి మీభాగం మీరు తీసుకుపోండి' అని చెప్పాడు. కాని ఆసామి ధనాశకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకొని, తనుఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం గూడా ఎక్కువ తీసుకొనడానికి అంగీకరించలేదు. 'అది నీ భక్తిశ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది గనుక అదంతా నీకే చెందాలి' అన్నాడు. అప్పుడా రైతు, రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యమిచ్చాడు. అటుపైన మిగిలినదంతా బండ్లమీద వేసి యిల్లు చేర్చుకున్నాడు. నామధారకా! శ్రీ గురుని మాహాత్మ్యం యెంతటిదో చూచావా? గురుభక్తే అభీష్టాలన్నింటినీ ప్రసాదించగలదు."
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
నామధారకుడు యీ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని, “మహాత్మా! శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తూ త్రిమూర్తుల అవతారమని రూఢి అవుతున్నది. కాని యీ భూమిమీద యెన్నెన్నో పుణ్యక్షేత్రాలు వుండగా ఈయన యీ సంగమ క్షేత్రాన్నే తమ నివాసంగా యెందు కెన్నుకున్నారో తెలియడంలేదు. ఈక్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి" అని కోరాడు. అప్పుడా యోగి యిలా చెప్పసాగారు:
“నాయనా! ఒక అశ్వనీమాసంలో కృష్ణ చతుర్దశినాడు యీ గంధర్వ పురవాసులందరూ దీపావళి పండుగకు యెంతో ఉత్సాహంగా సంసిద్ధులవు తున్నారు. ఆనాడు యీ శ్రీగురుడు తమ శిష్యులనందరినీ పిలచి, 'మనమీనాడు త్రిస్థలియాత్ర చేసివద్దాము' అన్నారు. అప్పుడు భక్తులు, 'స్వామీ! అలా అయితే మేమీ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూట గట్టుకొని, దారి ఖర్చులుగూడా సిద్ధం చేసుకొని వస్తాము' అన్నారు. ఆ మాటలు విని స్వామి, 'అవన్నీ ఎందుకు? త్రిస్థలి మనకు దగ్గరలోనే వున్నది. ఎట్టి సన్నాహాలూ అవసరం లేదు. కనుక మీరందరూ మీమీ కుటుంబాలతో సహా మాతోకూడా రండి' అని ఆదేశించారు. వెంటనే వారందరూ ఆయనతోగూడ సంగమ తీరానికి చేరి, నదిలో స్నానాలు చేస్తారు. అప్పుడు స్వామి, 'నాయనలారా! ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో ' సమానమైన మహత్మ్యం గలది సుమా! ఇచ్చటి షట్కుల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు. ఇది ప్రయాగను గూడా మించినది. ఈ భీమా-అమరజా సంగమం గంగ-యమునా సంగమంకంటే గూడా ఎక్కువ పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేయడంవలన కల్గి పుణ్యం యింతింతని చెప్పనలవిగాదు. ఇచ్చటి ఉత్తర వాహినిలో చేసిన స్నానం యింకా పుణ్యప్రదం. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది వున్నాయి. వీటిలో ఒక్కొక్కదానిని గూర్చి యెంతని చెప్పగలము?' అన్నారు. అప్పుడొక భక్తుడు, 'స్వామీ! ఇచ్చట నదికి “అమరజ" అని పేరు యెలా వచ్చింది? అది యెలా యేర్పడిందో సెలవీయండి!' అన్నాడు. అప్పుడు శ్రీగురుడు యిలా చెప్పసాగారు:
"పూర్వమొకప్పుడు దేవతలకు-రాక్షసులకూ భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో జాలంధరుడనే రాక్షసుడు యెందరో దేవతలను చంపేస్తు న్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి, “మహాదేవా! ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది. అదేమి చిత్రమోగాని, రాక్షసుల దేహాలనుండి కారిన రక్తపు చుక్కలనుండి వేలాదిగా రాక్షసులు పుట్టి, ముల్లోకాలలోని దేవతలను సంహరిస్తున్నారు" అని మొరబెట్టు కున్నారు. వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధు డయ్యాడు. కాని ఇంద్రుడు ప్రార్థించిన మీదట, ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృతభాండం ప్రసాదించాడు. వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్ళి చనిపోయిన దేవతలమీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది. అదే యీ నదిరూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి 'అమరజా' అనే పేరు వచ్చింది. అందువల్లనే సంజీవని వంటి యీ నీరు సర్వ పాపాలనూ నశింపచేయగలదు. ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసినవారికి అపమృత్యు భయముండదు. ఇది అన్ని బాధలను, వ్యాధులను, బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణీసంగమంతో సమానమైనది. ఈ సంగమంలో వైశాఖ, కార్తీక, మాఘ మాసాలలో యథావిధిగా ఉషఃకాలంలో స్నానంచేస్తే యీ లోకంలో సుఖము, అటుపై మోక్షము కల్గుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు, గ్రహణ సమయంలోను, సంక్రమణ, పర్వదినాలలోను, ఏకాదశి మొ॥న తిథులలోనూ యీ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితమొస్తుంది. నిత్యమూ యిందులో స్నానంచేసినా పూర్ణాయుష్మంతులవుతారు.
ఈ అశ్వత్థవృక్షం దగ్గరున్న మనోరథ తీర్ధంలో స్నానంచేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి. భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలిప్రభావం అంటక, మా దర్శనం లభిస్తుంది. కారణం మేమందులో యెల్లప్పుడూ వుంటాము. అట్టి ఈ కల్పవృక్షాన్ని, సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి, త్రయంబక మంత్రం పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జునునివలె యిక్కడ సంగేమేశ్వరుడు సుస్థిరంగా వున్నాడు. ముందు నందీశ్వరునికి నమస్కరించి, తర్వాత శివునికి ప్రదక్షిణంచేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక, ఎడమచేత్తో సందీశ్వరుని వృషణాలు స్పృశించి, కొమ్ములపై బొటన చూపుడువేళ్ళు ఆనించి, వాటిమధ్యనుండి శివలింగాన్ని దర్శించాలి. భక్తితో యిలాచేస్తే అభీష్టాలన్నీ నెరవేరుతాయి. ఇక యీ యెదుటనే వున్న మహాతీర్థం సాక్షాత్తూ వారణాసియే. అది నాగేశ్వరమనే గ్రామంనుండి యిటుగా ప్రవహించినది. దీనిని గురించి ఒక పురాణోపాఖ్యానమున్నది.
పూర్వం భారద్వాజస గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి, పూర్ణ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కల్గుతుండేది. ఆనంద పారవశ్యంతో అతడు ఒళ్ళు మరచి తిరుగుతుంటే, లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు. ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు,పాండురంగడు కాశీకి బయల్దేరుతూ, తమ అన్నయైన అతనిని గూడ రమ్మన్నాడు. అతడు నవ్వి, “కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే వుండగా, కాళ్ళీడ్చుకుంటూ యెక్కడకో వెళ్ళడమెందుకు?" అన్నాడు.“అలా అయితే మాకు చూపించగలవా?" అని వారన్నారు. అతడు అంగీకరించి, సంగమంలో స్నానంచేసి ఈశ్వరుణ్ణి ధ్యానించి, "వ్యోమకేశా! దీనిని కాశీగా చేసి, యిక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు!" అని ప్రార్థించగా, అందరికీ అక్కడే వారణాసి కన్పించింది. ఈ కుండమే మణికర్ణిక అయింది. ఈ నది ఉత్తర వాహిని అయ్యేచోట ఆ కాశి ప్రకటమయింది. కాశీలో వున్న దైవరూపాలన్నీ యిక్కడే కన్పించాయి. అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి యిక్కడే స్నానము, దానము మొ॥నవి చేసారు. అప్పుడాయన మహాజ్ఞానియని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తుండేవాడు. కనుక యిది సాక్షాత్తు కాశీయే.'
స్వామి అటు తర్వాత భక్తులకు పాపవినాశతీర్థం చూపించి, 'ఇందులో స్నానంచేస్తే సర్వపాపాలూ భస్మమవుతాయి' అని చెబుతుండగా, పూర్వాశ్రమంలో వారి సోదరియైన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడకు వచ్చి, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీగురుడు, 'అమ్మాయీ! నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా?' అన్నారు. ఆమె నమస్కరించి, స్వామీ, నేను మూడురాలిని. సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెల్పాలి' అన్నది. అపుడు స్వామి, 'పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది. నీవు చూడకుండా ఆ కుండనిండా నీళ్ళుపోసావు. అవి చచ్చిపోయాయి. అందువలన నీకు పంచమార్జాల హత్యా మహోదోషం చుట్టు కున్నది. ఇంకా చెబుతాను విను' అంటుండగా, అంతలోనే ఆమె శరీరమంతా కుష్టువ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాలమీదపడి, 'ఓ దయానిధీ! ప్రజలు పాపాలు పోగొట్టుకోడానికి కాశీకి వెళ్ళినట్లు, నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను, రక్షించు!' అని ప్రార్థించింది. అప్పుడు శ్రీనృసింహ సరస్వతి, 'నీవెన్నో పాపాలు చేసావు. వాటిని మరుజన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావో, లేక యిప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు!' అన్నారు. ఆమె, 'ఇంకా మరొక జన్మ యెందుకు? నాపాపాలు యిప్పుడే తొలగించి మరలా జన్మలేకుండా చేయండి' అని ప్రార్థించింది. స్వామి, ‘అలా అయితే, నీవు నిత్యమూ ఈ పాపనాశతీర్థంలో స్నానం చేస్తుండు. ఒక్కొక్క స్నానానికి ఏడుజన్మల పాపం నశించిపోతుంది. ఈ కుష్టురోగ మొకలెక్కా?' అని చెప్పారు. అలా చేయగానే ఆమెవ్యాధి మాయమయింది. అది నేను స్వయంగా చూచాను. ఆ క్షేత్ర మహాత్య్యంచూచి ఆమె అక్కడే వుండి పోయింది.
అప్పుడు స్వామి మా అందరికీ యిచ్చటి కోటితీర్థం చూపించి, ‘ఇందులో సర్వతీర్థాలూ వున్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు దానమిచ్చిన ఫలితము ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి గూడ కోటిరెట్లు ఫలితముంటుంది. దీనికి అవతలనున్న రుద్రపాద తీర్థంలో గయలోలాగే, కర్మచేసి రుద్రపాదస్వామిని పూజించాలి' అని చెప్పారు. తర్వాత కేశవస్వామి దగ్గరనున్న చక్రతీర్థం చూపి, అక్కడ స్నానంచేస్తే జ్ఞానం కల్గుతుందని శ్రీగురుడు చెప్పారు. 'కల్లేశ్వరుని దగ్గరనున్న మన్మథతీర్థంలో స్నానంచేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే అష్టశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణ మాసంలో అఖండాభిషేకము, కార్తీకమాసంలో దీపోత్సవమూ చేస్తే అష్టసిద్ధులు, మోక్షమూ గూడ లభిస్తాయి'. స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి, యీ అష్టతీర్థాలలో స్నానంచేసారు. నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేసారు.
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ శ్రీ శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, గురుభ్యో నమః
ప్రస్తావన : 1. కలి ప్రభావం చేత శివకేశవాది భేదాలకు తోడు, ఇతర ' మతాలు మనదేశంలో ప్రవేశించాయి. వాటిన్నింటి మధ్య అసహనం తలెత్తింది. 2. శ్రీదత్తస్వామి వాటిమధ్య గూడ సామరస్యాన్ని నెలకొల్ప సంకల్పించాడు. అందుకే శ్రీ గురుడు ఒక మ్లేచ్ఛరాజును గూడ అనుగ్రహించి హిందువుల పట్ల గౌరవము, ఆదరణా కలిగి ప్రవర్తించేలా చేసాడు. కృతార్ధుని చేసాడు. తర్వాత దత్తావతారాల చరిత్రలలో ఈ అంశం ప్రబలమైంది. 3. సద్గురువు కృపకు పాత్రమైన వంశా లలోతరతరాలు ఆయన యందు దృఢభక్తి నిలిచియుండగలదని గత అధ్యాయాలలో చూచాము. అంతేగాక జన్మాంతరంలోగూడ వారి లౌకికవై అభీష్టాలు ప్రసాదించడమే గాక, మరల సద్గురు సేవను ప్రసాదిస్తుందని యీ అధ్యాయాలు (50,51,52) తెలుపుతాయి 4. సద్గురు నివాసం వల్ల పవిత్రమైనటు వంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై, గురు సాన్ని ధ్యాన్ని భక్తులకు ప్రసా దించగలవని గూడ ఈ అధ్యాయాలలోమనం తెలుసుకోగలము. . అట్టి అనుభవా లెందరివో “సద్గురుజ్యోతి”లో చూడవచ్చు. 5. క్షరము లేక నాశము లేని రూపం ధరించిన శ్రీ గురుతత్త్వమే “శ్రీ గురుచరిత్ర”. దాని పారాయణము శ్రీగురు మానసిక పూజయే, ధ్యానమే. ధ్యానమంటే సజాతీయ భావ పరంపర, నిత్య పారాయణ అనన్య చింతయే.-దాని మననము అనుభవ పూరితమైన పరమార్థ ప్రభోధమే. పారాయణ చేస్తున్నంత సేపూ మనస్సు గురు సన్నిధిలో వుంటుంది గనుక అది సత్సంగమే. సత్సంగం వలన నిస్సంగత్వము, నిశ్చల తత్వము, జీవన్ముక్తి కలగు తాయని శాస్త్రం, సాక్షాత్తూ గురుసన్నిధిలోవుండడమే పారాయణ ప్రయోజనమని గుర్తుంచుకొని పారాయణ చేయాలి. 6. అట్టి ఆసక్తి గూడ సద్గురు కృపకు చిహ్న నని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెబుతున్నాడు.)
నామధారకుడు, "స్వామీ! మీరు పరమపవిత్రమైన క్షేత్ర మాహాత్మ్యం చెప్పారు. మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లున్నది. ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువుంటే అక్కడే దేవతలు, తీర్థాలు వుంటాయి. ఈ సంగమము కృష్ణా-పంచగంగ సంగమము వంటిది. ఇక్కడ పశుపక్ష్యాదులు నీళ్ళుత్రాగి స్నానంచేసి కృతార్ధత పొందాయి. ఇక మానవుల సంగతి చెప్పాలా? దీని మాహాత్మ్యం వింటేనే పాపాలు పోతాయి. ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలామల కమే. స్వామీ! మీ హృదయం శ్రీగురుని లీలలతో నిండివున్నది. వాటినింకా వినాలని వున్నది. దయచేసి వినిపించండి" అన్నాడు. అప్పుడు సిద్ధయోగి, "నాయనా, నీవు ధన్యుడివి. భగవంతుని కృపవల్లనే నీకిట్టి ప్రీతి కల్గింది. అటుపై కథ చెబుతాను
విను:
“వైఢూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు. అతడు విజ్ఞుడు, శుద్ధాత్ముడు, సర్వభూత సముడున్నూ. పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సబ్రాహ్మణులనూ గూడ ఆదరిస్తుండే వాడు. అది సహించక అతని కొలువులోని యవనమత గురువులు అతనితో, 'రాజా!మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించటం మంచిది. ఇప్పుడు మీరు చేసేది, మనము కలలోనైనా తలచరానిది. హిందువుల మతధర్మం బోధించేవేవీ సత్యమైనవిగావు. రాజా! వారు అచేతనములైన శిలలలోనూ, అశ్వత్థాది వృక్షాలలోనూ దేవడుంటాడంటారు. అలా తలచటం మహాపాపమని మనం విశ్వసిస్తాము. కనుక వారిని సమానులుగా గౌరవించటం తగదు' అనేవారు. రాజు, 'సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవులపట్ల సమానమైన ప్రేమ కల్గివుంటాడు. అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతులు జ్ఞానాన్ని పొందే ధర్మాన్నే ప్రసాదించి వుండాలి! మనధర్మానికి మూలమైన గ్రంధం వలెనే వారి వేదాలు గూడ యీ సత్యమే చెబుతున్నాయి. కనుక యిటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమే గాక, మన మతధర్మానికి గూడ కళంకమే సుమా?' అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేదేమీ లేక మంత్రులు వూరకుండేవారు.
మరికొందరు యవన మతగురువులు, 'రాజా! మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు చేసేపని మంచిదికాదు. అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు, యీ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలెలా వుంటాయి?' అనేవారు. వారితో రాజు, 'మీరు బుద్ధిమాంద్యంవలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమే నాల్గు వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మానవుల గుణకర్మలలో భేదముండడం మనం చూస్తున్నాంగదా! మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే, కాని ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగ వుండవు; ఒకే పని చేయలేవు. ఏ అవయవం చేయవలసినపని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపియని మనవలే వారూ విశ్వసిస్తారు. కాని అజ్ఞులైన పామరులు, హృదయశుద్ధి లోపించడం వలన, పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు. పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్ద పెట్టినట్లే, పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యధాతథంగా ధ్యానించగల్గతారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే గాని, ధ్యేయంగాదని వారి మతమే చెబుతుంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనబడదు. శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కన్పిస్తుంది. అలాగే, మలినమైన మనస్సులో ఈశ్వరభావం కల్గదు. ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై, అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథంలాగే, వేదాలు గూడా ఋషులు వినిన వాక్కే గనుక అవీ స్వతఃప్రమాణమే. అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించ వలసిందే. వేదాలు, ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ, మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళవలెనే పూజ్యులు' అనేవాడు.
ఒకప్పుడు విధివశానో, దైవయోగం వల్లనోగాని, ఆ మ్లేఛ్ఛ రాజుకు తొడమీద పుండు లేచింది. అది యెన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజురోజుకూ ఎక్కువ గాసాగింది. ఆ బాధకు అతడికి నిద్రహారాలు గూడ కరువయ్యాయి. చివరికతడు ఒక సదాచారసంపన్నుడైన సద్విపుణ్ణి పిలిపించి, దానికి నివారణో పాయం చెప్పమని కోరాడు. ఆ విప్రుడు, 'రాజా! నీవు యవనుడవు- నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయము గురించి, అది చెప్పినది నేనన్నసంగతీ తెలిస్తే ఈ లోకం నిన్నూ నన్నూ బ్రతకనివ్వదు. అందువలన ఏకాంతంలో చెబుతాను' అన్నాడు. అప్పుడారాజు అతనితో కలిసి ఒక ఏకాంతస్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో యిలా చెప్పాడు: 'రాజా, నిజానికి గతజన్మపాపాలే మానవులందరినీ వ్యాధిరూపంలో బాధిస్తాయి. తీర్థయాత్ర, దేవతారాధన, దానముల వలన కొన్నిపాపాలు, వ్యాధులు, తొలుగుతాయి. కాని వాటన్నిటికంటె శ్రేష్ఠమైనది సాధుదర్శనం. సాధుదర్శనం వలన సర్వపాపాలు, వ్యాధులూ గూడ తొలగిపోతాయి! చివరకు అజ్ఞానమనే భవరోగాన్ని గూడ వారు తొలగించి ముక్తిని గూడ ప్రసాదించగలరు. కనుక రాజా! నీవు మీ వాళ్ళందరితో యేదో ఒకసాకు చెప్పి, యెవరికీ తెలియకుండా వంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలోవున్న పాపనాశ తీర్థానికి వెళ్ళు. అక్కడ స్నానంచేసి దానధర్మాలు చేయి. దాని వలన నీ పాపం తొలగి, ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది. ఆ క్షేత్రంలో యెవరేది కోరితే అదే లభిస్తుంది' అని చెప్పాడు. అప్పుడా మ్లేచ్ఛరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి, అక్కడికి కొద్దిదూరంలోవున్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు. ప్రతిరోజూ అతడు అక్కడి తీర్థంలో స్నానం చేస్తూ, రహస్యంగా వున్నాడు. ఒకరోజతడు తీర్థంలో స్నానంచేసి బయటకు వస్తుండగా అతనికొక యతీశ్వరుడు కనిపించారు. రాజు ఆయనకి నమస్కరించి, తన వుండుగురించి, దాని నివారణకోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించీ నివేదించుకొని యిలా అన్నాడు: 'స్వామి! నేను మ్లేచ్ఛుడనని మీరు ఉపేక్షించవద్దు. నేను యవనుడనైనా, మీ ధర్మాన్ని గూడ ఆదరించేవాడినే! నాకు దయతో ఈవ్యాధి నివారణోపాయం తెల్పండి' అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసిగూడ, సాధుదర్శనము అన్నింటికంటె శ్రేష్ఠమైన తరుణోపాయమని చెప్పాడు. అప్పుడా యవనరాజు ఆయనకు నమస్కరించి, 'యోగీశ్వరా! సాధుదర్శనం అన్నింటికంటే శ్రేష్ఠమంటిరి గదా, అందుకు తార్కాణమేమైనా దయతో వివరించండి' అని వేడుకొన్నాడు. అప్పుడా సన్యాసి యిలా చెప్పాడు: 'నాయనా! వెనుక ఋషభయోగి అనే మహాత్ముని అనుగ్రహంవలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు. ఆ కథ వివరంగా చెప్తాను విను :
పూర్వం అవంతీపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వశుడై స్వధర్మాన్ని విడిచి పెట్టాడు. అతడు గృహస్థు అయివుండిగూడ తన భార్యను విడిచిపెట్టి ఆ వేశ్యయింటివద్దనే త్రాగి పడి ఉండేవాడు. ఒకనాడు సంధ్యవేళ ఋషభయోగి అటుగా వెళుతూంటే చూచి, ఆ నామమాత్ర బ్రాహ్మణుడు, వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి యింట్లోకి తీసుకెళ్ళి, పూజించారు. తర్వాత ఆయనకు భోజనం పెట్టి, రాత్రంతా పాదసేవ చేస్తూ, ఆయనను నిద్రపుచ్చారు. మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అట్టి సాధు సేవవలన ఆ బ్రాహ్మణునికి సద్భుద్ధి అంకురించి, త్వరలో పరివర్తన చెంది కొంత కాలానికి చనిపోయాడు. మరుజన్మలో అతడు దశార్ణదేశంలో వజ్రబాహువనే రాజు యొక్క పట్టపురాణియైన సుమతీదేవి గర్భంలో పడ్డాడు. ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది. కాని అందువలన పట్టమహిషి స్పృహలేకుండా పడిందేగాని, ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కల్గలేదు. అయితే ఆమెకూ, పుట్టిన బిడ్డకీ శరీరమంతటా పుండ్లు లేచాయి. రాజుదుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లీ బిడ్డలకు వళ్ళంతా పురుగులుపడి చీము కారుతూ, యెంతో దుర్వాసనగా వుండేది. పూర్వ జన్మలలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని, వారిని చూడ్డం గూడ పాపమేననీ తలచి రాజు వాళ్ళను భయంకరమైన ఒక అడవిలో విడిచి పెట్టించాడు. అందుకు రాజుగారి రెండవ భార్య ఎంతో సంతోషించింది. ఎన్నడూ కాలైనా క్రింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకను బెట్టుకొని, క్రూరజంతువుల గర్జనలమధ్య ముళ్ళల్లో లేస్తూ, పడుతూ తిరుగుతుండగా ఒక చోట కొందరు పశువుల కాపరులు కనబడితే, వారిని త్రాగడానికి మంచినీళ్ళు అడిగింది. అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్ళే దారి చూపారు. అందులో నీరు త్రాగి, అక్కడకు నీళ్ళకు వచ్చిన స్త్రీలను ఆమె, “అమ్మా, యీ రాజ్యంలో ప్రజలందరూ, సంతోషంగా వున్నారు, మీరాజు యెవరు?” అని విచారించింది. ఆ ప్రాంతపు రాజు, పద్మాకరుడనే వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడని తెలిసి అతనిని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకొని జాలిచెంది ఆశ్రయమిచ్చాడు. అతడుగూడ ఆమె కొడుకుకు యెన్ని చికిత్సలు చేయించినా నిష్పలమై అతడు చనిపోయాడు. ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా శోకించింది. అదృష్టవశాత్తు సరిగా ఆ సమయానికి ఋషభయోగి అచ్చటికి వచ్చారు. ఆయన ఆ తల్లి శోకం విని, "తల్లీ, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. పుట్టినవాడెవడు? చనిపోయినవాడెవడు? అతడెప్పుడైనా కంటికి కనబడ్డాడా? అతడు యీ శరీరమే అనుకుంటున్నావా? జీవుడు కర్మవశాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందినా, ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది. కాని అతడు ఆత్మ స్వరూపం గనుక అతడికి నాశనముండదు. ఇక శోకమెందుకు? త్రిగుణాల వలన అతడికి కర్మబంధము చుట్టుకుంటుంది. సత్వగుణం వలన దేవత్వము, రజోగుణం వలన మానవజన్మ, తమోగుణం వలన తిర్యక్ జన్మలూ కల్గుతాయి. త్రిగుణాతీతస్థితి కల్గినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది. అలా జన్మించాక, అతడు చేసిన కర్మలననుసరించి సుఖదుఃఖాలతో గూడిన జన్మపరంపర కల్గుతుంది. అలా జన్మించిన వారందరూ యెప్పటికైనా మరణించ వలసిందే. కనుకనే వివేకవంతులు జన్మించినవారి గురించి సంతోషం గాని, చనిపోయినవారి గురించి దుఃఖం గాని పొందరు. అంతకంటే భగవన్నామ స్మరణతో యిహపరాలు సాధించుకోవచ్చు గదా! అలాగాక, జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి యేమైనావో చెప్పగలవా? ఇప్పటికైనా నామాట విని ఊరట చెందు" అని ఆమెను ఓదార్చాడు. ఆమె, "ఓ మహాత్మా! నేనొక మహారాజుకు రాణినయ్యాక చివరకు నాకీగతి పట్టింది. అడవులపాలైనా, నావాళ్ళందరికీ దూరమైనా, బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను. అటు వంటప్పుడు వీడు చనిపోతే నేనేంకావాలి? స్వామీ! కరుణార్ద్రహృదయులైన మీరు చెప్పిన తత్త్వం అజ్ఞానినైన నాకెలా తెలుస్తుంది? ఈ కష్టసమయంలో పరమేశ్వరునివలె మీరు నాకు లభించారు. దేనివలన నా యీదుఃఖం నశిస్తుందో దయచేసి దానిని నాకనుగ్రహించండి" అని శోకిస్తూ, ఆ యోగీంద్రుని పాదాలమీద పడింది. ఆ యోగి కరుణార్ద్ర హృదయులై, ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడని తెలుసుకొని, కొంచెం భస్మం మంత్రించి ఆ శవంమీద చల్లాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతడు యెట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో వున్నాడు. ఆ యోగి యొక్క కృపాదృష్టి వలన ఆ తల్లికి గూడ జబ్బు మాయమయింది. ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే, ఆ యోగి ఆమెకు కొంచెం భస్మమిచ్చి, "అమ్మా! నీవు, నీ బిడ్డా యిది ధరించండి. మీ శరీరాలు వజ్రసమానమై వృద్ధాప్యం చెందవు. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు, యశస్వీయై, భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు" అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.
కనుక ఓ రాజా! మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే యెంతటి వ్యాధి యైనా నశించగలదు. నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యమేమున్నది?' అన్నాడు. అప్పుడు రాజు, 'స్వామీ! నావ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెల్పండి' అని వేడుకొన్నాడు. అప్పుడా సాధుపుంగవుడు, గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెల్పారు. వెంటనే ఆ రాజు గాణాపురానికి బయల్దేరాడు.
సరిగా అదే సమయానికి శ్రీగురుడు, 'ఇక్కడికి మ్లేచ్ఛరాజు వస్తాడు. అందువలన ఇచ్చటి ఆచారవంతులైన హిందులకు బాధ కల్గవచ్చు. మా మాహాత్మ్యం లోకమంతటా వెల్లడయింది. కనుక మేము యింక ఎక్కువ కాలం యిక్కడ వుండగూడదు. మేమిక్కడే వుంటే యింకెందరో మ్లేచ్ఛులు గూడ వస్తారు. భక్తీ సదాచారము లేనివారుగూడ పేరాశతో యిక్కడకు వస్తారు కనుక యింక మేము అంతర్థానమవడం మంచిది. బహుధాన్యనామ సం॥లో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమీనదికి పుష్కరం వస్తుంది. అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికని చెప్పి ఈ చోటు విడిచిపోతాము' అని నిశ్చయించు కొన్నారు. ఒక రోజున ఆయన అచ్చటి భక్తులతో, 'ఇక్కడకు ఒక మ్లేచ్ఛరాజు రానున్నాడు గనుక మీరంతా మీ యిండ్లకు వెళ్ళిపోండి. మేము గౌతమీ యాత్రకు బయల్దేరుతాము' అని చెప్పారు. భక్తులు మహాత్మా! మీరు సాక్షాత్తూ దత్తాత్రేయులే. మీరు మా అండనుండగా యిక్కడకు యెవరు వచ్చినా మాకు ధర్మహాని కల్గజాలదు. కనుక మేము మీ సన్నిధి విడిచి యెక్కడకూ పోనవసరంలేదు' అని చెప్పి ఒక్కరు గూడ కదలలేదు. కొద్ది సమయమయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటివారిని, 'ఇక్కడి సన్యాసి యెక్కడున్నారు? దయచేసి ఆయనను చూపండి' అని ప్రార్ధించాడు. అతనిని చూచి, యవనరాజు అక్కడకు రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి, భక్తులు కీడు శంకించి, అతనికేమీ చెప్పడంలేదు. వారి సంశయాన్ని గుర్తించిన రాజు, 'అయ్యలారా! నేను గూడ అర్ధార్ధినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్హుడనే. సంశయించక వారెక్కడున్నారో చెప్పండి' అని వేడుకున్నాడు. అతడు పదేపదే ప్రాధేయపడినమీదట, శ్రీగురుడు అనుష్టానానికని సంగమానికి వెళ్ళారని, మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరనీ ఆ భక్తులు చెప్పారు. రాజు వెంటనే పల్లకి దిగి, తన పరివారమంతటినీ అక్కడే విడిచి, తానొక్కడే త్వరత్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి, చేతులు కట్టుకొని దూరంగా నిలబడ్డాడు. శ్రీగురుడు, 'ఓరి సేవకుడా! ఇన్నాళ్ళకు కన్పించావేమి?' అన్నారు. ఆమాట వినగానే స్వామి అతనిని చూడగానే, రాజుకు పూర్వజన్మ స్మృతి కల్గి, ఆనందభాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరమంతా రోమాంచితమైంది. అతడు ఏమేమో మాట్లాడబోయాడు గాని, సంతో షంతో అతనికి మాట పెగలలేదు. కొంతసేపటికి అతడు తెప్పరిల్లి, 'ప్రభూ! మీరు మా శ్రీపాదస్వామియే. నేను మీసేవకుడనైన చాకలినే! స్వామీ! ఈ దీనుణ్ణి యింత ఉపేక్షించారేమి? మీ పాదసేవ విడిచి యింతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేసారే! రాజవైభవాల భ్రమలో చిక్కి, మిమ్మల్ని మరచి యెంతకాలం గడిపాను! ఇన్నాళ్ళూ దర్శనమే లభించలేదు. చివరికి వ యెదుటకు వచ్చాక గూడ, యిదివరకు అంతగా సేవించుకొన్న మీపాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానమనే మహా సముద్రంలో నన్నిలా పడివుండనివ్వడం మీకు న్యాయమా? జరిగింది చాలు, ఇకనుండైనా మీ పాదాలు విడువను. నన్నుద్ధరించండి!' అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీగురుడు 'అఖిలాభీష్ట సిద్ధిరస్తు!' అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వే వేడుకున్నాడు. స్వామి, 'ఏదిరా, నీ వ్రణం చూపించు!' అనగానే అతడు తన తొడవంక చూచుకొని, ఆ కురుపు మటుమాయమవడంచూచి ఆశ్చర్యచకితుడై, భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీరవదనులై, 'ఏమిరా, నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివితీరా అనుభవించావా, లేక యింకేమైనా కోరికలు మిగిలి యున్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు!' అన్నారు. అప్పుడారాజు, 'మీ దయ వలన సకలైశ్వర్యాలతో చాలాకాలం రాజ్యమేలాను. నాకు కొడుకులు, మనుమలు గూడ కల్గారు. నామనస్సు పూర్తిగా తృప్తిపడింది. కాని భక్తవత్సలా! మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటీ తీరగానే నేను సర్వమూ విడిచి మీ పాదసేవచేస్తూ యిక్కడే పడివుంటాను' అని వేడుకున్నాడు. స్వామి, 'ఓరీ! సన్యాసులమైన మేము పాప భూయిష్టమైన నీ మ్లేచ్ఛ రాజ్యంలో అడుగుపెట్టగూడదు. మీ మతస్థులు గోవులను చంపుతారు. కనుక మాకది తగదు' అన్నారు. 'స్వామీ! నేనుమీ సేవకుడను, మీ రజకుడను గానా? ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే గదా! కర్మవశాన యీ జాతిలో జన్మించానే గాని, నేను మీ సేవకుడనే గదా! మీరు ప్రసాదించిన రాజ్యాన్ని, కొడుకులను, మనుమలను, మీకు చూపాలని నా కోరిక. మీరు దూరంగావుండే మీ కృపాదృష్టి వారిమీద, మా ప్రజలమీద ప్రసరింపజేయండి. మారాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను' అనిచెప్పి శ్రీ గురుణ్ణి కాళ్ళవేళ్లా పడి బ్రతిమలాడుకున్నాడు. స్వామి, 'ఆహా! మా మాహాత్మ్యం వెల్లడవటం వలన నీచులు గూడ యింకెందరెందరో యిక్కడకు వస్తారు. కనుక యీస్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరినది వద్దకు చేరి, ఎవరికీ కన్పించకుండా పోవడం మంచిది. అని తలచి, మొదట రాజు ప్రార్థనను మన్నించారు.
శ్రీగురుని అంగీకారం చెవినిపడగానే ఆ యవనుడు ఉప్పొంగి, వారినొక పల్లకిలో కూర్చోబెట్టి, వారి పాదుకలు తన తలపై పెట్టుకొని కూడా నడవసాగాడు, స్వామి నవ్వుతూ అతడికేసి చూచి, 'నీవు గూడ గుర్రంమీద కూర్చొని ప్రయాణం చేయి. లేకుంటే లోకనిందపాలవుతావు. రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దానుడవై యిలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు' అన్నారు. రాజు, బాబూ! నేనింక యెక్కడి రాజును? అంతకంటే ముందు మీ పాద సేవకుడనైన చాకలినే గదా! పరశువేది స్పర్శవలన యినుము బంగారమైనట్లు, కేవలం మీ కృపాదృష్టి వల్లనే నేను పవిత్రుడనయ్యాను. మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే. మానవమాత్రుడనైన నేను లోకానికి రాజునైనా, నిజానికి మీసేవకుడనే. ఎవరో యోమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా?' అంటూ ముందుకు సాగిపోయి, తాను దూరాన విడిచివచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీగురుడు సంతోషించి, 'మనం చాలాదూరం పోవాలి. నామాట విని, ఇకనైనా. గుర్రంమీద ఎక్కి ప్రయాణంచేయి అన్నారు. అతడు శ్రీగురుణ్ణి, శిష్యులనూ గూడ ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి, వారితోగూడ గుర్రం మీద బయలు దేరాడు. మరికొంత సేపటికి స్వామి, 'నాయనా! నీవు మ్లేచ్ఛుడుగా జన్మించినా, మాపట్ల యెంతో భక్తితో మెలగుతున్నావు. సంతోషమే! కాని సన్యాసులమైన మాకు తోకలసి ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్టానము సక్రమంగా చేసుకొనడం. వీలుపడదు. కనుక మేము ముందుగా వెడతాము. మీరందరూ మెల్లగా వచ్చి, పాపనాశతీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి' అని చెప్పి, రెప్ప పాటులో స్వామి అదృశ్యులయ్యారు. అంతలో ఆయన యెక్కడా కన్పించక పోయేసరికి, అందరూ నివ్వెరపోయారు. ఆయన అలా అదృశ్యమై, వైఢూర్య నగరానికి కొద్దిదూరంలో వున్న పాపనాశతీర్థం చేరి, అక్కడ యోగాసనంలో కూర్చొని అనుష్టానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితోగూడ అక్కడకు చేరి, శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో వుంటున్న సాయందేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయనను ప్రార్ధించి, శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి, అందరికి భిక్షయిచ్చాడు. నాటి సాయంత్రం అతనితో స్వామి, 'నాయనా! యవనరాజును పాపనాశతీర్థానికి రమ్మని చెప్పాము. మేము అక్కడకు పోతాము. లేకుంటే మమ్ము వెతుక్కుంటూ యవనుడు యిక్కడకు వస్తాడు. అతడిక్కడకు వస్తే నీ ఆచారానికి భంగం కల్గుతుంది' అని చెప్పి, శిష్యు లతో కలసి ఆ తీర్ధం దగ్గరకొచ్చి, అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు.
ఇంతలో అక్కడ ఆ యవనరాజు, స్వామి అదృశ్యమవ్వగానే, 'అయ్యో! స్వామి నన్నుపేక్షించి, యిలా నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేనేమి అపరాధం చేసానో! అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారుగదా! అక్కడ నాకోసం వారు వేచియుంటారు' అని తలచి, నలభై క్రోసుల దూరంలోవున్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని, వారి శిష్యులనూ, ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మతధర్మం విడచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూచిన యవనులు అతనిని అసహ్యించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి, సనాతన ధర్మాభిమానియైన అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగడుగుకూ ఆరతులు యిప్పించడము, వింజామరలతో వీస్తుండము చూచిన పురవాసులు స్వామిని చూచి, 'ఈయనెవరో భగవదవతారమేగాని, మానవమాత్రులుగారు. లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు యిలా యెందుకు సేవచేస్తాడు? అయినప్ప టికీ యీ దృశ్యం గూడ కలికాల వైపరీత్యమే!' అనుకొని ఆశ్చర్యపోయారు. ఢక్కా, మృదంగము మొ॥న, వాద్యాల ఘోషతోనూ, వందలకొద్దీ ఏనుగులు, గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా, వందిమాగధులు ఎలుగెత్తి స్వామి కీర్తిని స్తుతిస్తుంటే, అగరు ధూపాలు చిమ్ముకుంటూ, దారిపొడుగునా లెక్కకుమించిన పువ్వులతో, రత్నాలుకలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు, నగర వీధులగుండా తీసుకుపోయాడు. చివరకు పల్లకిని రాజభవనం వద్ద దింపించి, అందము, స్వచ్ఛముయైన క్రొత్తవస్త్రాలు పరచిన దారివెంట స్వామిని లోపలకు తీసుకొనిపోయి, స్వర్ణ సింహాసనంమీద కూర్చుండబెట్టాడు. తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారంచేసి, ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక ప్రక్కన నుంచున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపుర కాంతలు, రాజకుమారులు, కుమార్తె లనూ రప్పించి వారిచేత స్వామికి పాదపూజ చేయించాడు. చివరకు అతడు, 'స్వామీ! నేను జన్మతః హీనుడనైనా తమ కృపవలన యీనాటికి కృతార్థుడ నయ్యాను. నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి' అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి, 'ఓరీ, నీకింకేమైనా కోరవలసినది వుంటే నిస్సంకోచంగా చెప్పకో!' అన్నారు. ఆ రాజు, తనకింక నిరంతర గురుపాదసేవతప్ప వేరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి, 'అలా అయితే ఈ రాజ్య భారము నీ కొడుకులకు అప్పగించి, శ్రీశైలం వెళ్ళు.. మేముగూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడకు వస్తాము. నీకక్కడ మరలా మా దర్శనమవుతుంది', అని ఆదేశించారు. ఆయనతో ఎడబాటు సహించలేని రాజు, 'స్వామీ! అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి' అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతణ్ణి ఆశీర్వదించి, తమ శిష్యులతో కలసి గోదావరీ యాత్రచేయడానికి వెళ్ళారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానంచేసి భీమ-అమరజా సంగమం చేరుకున్నారు.
గంధర్వపురవాసులందరూ పూజాద్రవ్యాలు తీసుకుని ఎదురేగి, 'స్వామీ! మీరు యిక్కడనుండి వెళ్ళినప్పటినుండీ యీ వూరంతా అచేతనమయిపోయింది. తిరిగి మీరాక వలన మరల ప్రాణమొచ్చినట్లయింది' అని ఆయనను స్తుతించి పూజించారు. అప్పుడు స్వామి, 'బిడ్డలారా! మేమెక్కడికో వెళ్ళిపోయామని యెన్నడూ అనుకోవద్దు. ఈ పురం మాకెంతో ప్రియమైనది. ఇక్కడ మమ్మల్ని నిశ్చలభక్తితో కొల్చేవారికి యెప్పుడూ ప్రత్యక్షమవుతుంటాము. ముందుముందు దేశమంతా కలియుగ దోషాలన్నింటికీ నిలయం కానున్నది. కనుక మేము శ్రీశైలం వెళ్ళాలను కుంటున్నాము. అయినప్పటికీ భక్తులను రక్షించటం కోసం వాస్తవంగా గుప్తరూపంలో యిక్కడే వుంటాము. అలా గుప్తంగా వుండటానికి కారణం, రానున్నది కష్టకాలం. ధర్మం రోజు రోజుకూ క్షీణించిపోతుంది. దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతారు. పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆ మ్లేచ్ఛరాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని యెందరెందరో హీనులు గూడ యిక్కడకు వస్తారు. మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కల్గడం వలన అందరికీ యెంతో కీడు జరుగుతుంది. కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒక్కటే కర్తవ్యం' అన్నారు. అది విని పురవాసులు యెంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మల లాగా నిలుచున్నారు.
ఆనాటి వరకూ మానవాకారంతో కన్పిస్తున్న ఆ త్రిమూర్త్యవతారం అటు తర్వాత తమ స్థూలరూపాన్ని గుప్తపరచినప్పటికీ యీ గంధర్వపురంలో సుస్థిరంగా వున్నారు సుమా! అందుకు నేనే సాక్షిని, నేటికీ యీ గంధర్వనగరంలో ఆయనను విశ్వాసంతో భజించిన వారి కోరికలు తీరుతాయి. ఇతర యుగాలలో ఎన్నివేల సంవత్సరాలు తపస్సు చేసినా కన్పించని యీ దత్తమూర్తి, యిప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమై యిక్కడ నిల్చారు. భుక్తి-ముక్తులను ప్రసాదించడానికి యీ భూమిమీద యింతకు మించినదేమున్నది?"
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః
నామధారకుడు, "స్వామీ! శ్రీగురుడు వైఢూర్య నగరం నుండి బయల్దేరి. వెళ్ళి గౌతమీ పుష్కరయాత్ర పూర్తిచేసుకొని, తిరిగి గంధర్వపురం చేరాక యేమి చేసారో సెలవీయండి" అన్నాడు. సిద్ధయోగి యిలా చెప్పారు: "శ్రీగురుడు కొంతకాలం గంధర్వనగరంలోనే వున్నారు. అది ఈశ్వర నామ సంవత్సరం. అప్పుడు బృహస్పతి సింహరాశిలో వున్నాడు. ఒకనాడు ఆయన భక్తులందరితో, తాము శ్రీశైల యాత్రకు బయల్దేరుతున్నామని చెప్పారు. అది తెలిసిన గ్రామస్థులందరూ గూడ మఠం వద్దకు చేరుకొన్నారు. వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీ గురునితో యిలా అన్నారు: 'స్వామీ! మీరిప్పుడు శ్రీశైలయాత్రకు వెళ్ళవలసిన అవసర మేమిటి? తాము తమ అవతారకార్యం పరిసమాప్తి చేయదల్చినట్లు మాకు తోస్తు న్నది. ఇంతకాలమూ మీ అనుగ్రహంతో మా కష్టాలు, అభీష్టాలు తీర్చుకుంటు న్నాము. మీరీ గ్రామంలో విజయం చేయడం వలన యీ గంధర్వపురం భూలోక వైకుంఠమనదగిన మహాపుణ్య క్షేత్రంగా రూపొందింది. నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు. మేము అజ్ఞులము, దీనులము, మాకు మీరుదప్ప వేరు దిక్కులేదు. మమ్మల్ని విడిచి పెట్టిపోవడం మీకు న్యాయమేనా? ఏ తల్లియైనా తన బిడ్డలను యిలా విడిచి వెళ్ళిపోతుందా? ఎప్పుడూ వారిచెంతనే వుండి వాళ్ళను సాకడం ఆమె ధర్మంగాదా?' అన్నారు.
శ్రీనృసింహసరస్వతీస్వామి, వాళ్ళభక్తికి కరిగిపోయి, చిరునవ్వుతో ప్రేమగా యిలా అనునయించారు: 'బిడ్డలారా! మాపై యింత భక్తితో మెలిగే మిమ్మల్ని విడచి మేము మాత్రం పొగలమా? నిజానికి మేము ఎల్లప్పుడూ యీ గంధర్వ పురంలోనే వుంటాము. నిత్యమూ యీ సంగమంలో స్నానము, నిత్యకృత్యములు తీర్చుకొని, మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ యీ మఠంలోనే మీ సేవలందుకుంటూ గుప్తంగా వుంటాము. కేవలం లౌకికుల స్థూలదృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు, యిక్కడ లేనట్లు కన్పిస్తాముగాని నిజానికి మా ప్రతిరూపాలుగా యిక్కడ ప్రతిష్టిస్తున్న మా పాదుకల రూపంలో యిక్కడే వుంటాము. ఇది ముమ్మాటికీ నిజము, ఎట్టి సందేహమూలేదు. మా భక్తులకు మేము ప్రత్యక్షము కానిదెప్పుడూ? ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కని పెట్టివుండే మమ్మల్ని సేవించేవాడు కోరినది యేది లభించదు? మీరందరూ నిత్యమూ యీ సంగమంలో స్నానంచేసి సాక్షాత్తూ కల్పవృక్షమైన యీ అశ్వత్థవృక్షానికి ప్రదక్షిణంచేసి, అనర్థాలన్నింటినీ తొలగించగల యిచ్చటి పాదుకలను అర్చిస్తూంటే సర్వభ్రమలూ తొలగి, సాక్షాత్తూ ఆనందమే సిద్ధిస్తుంది. ఎలాంటి చింతలు గలవారికైనా యిచ్చటి చింతామణి అనబడు విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన సర్వ విఘ్నాలూ నశిస్తాయి. భక్తి శ్రద్ధలతో యీ అష్టతీర్థాలలో స్నానం చేసేవారికి సర్వ సిద్ధులూ సమకూరి, ముక్తిగూడ లభిస్తుంది. మూడు కాలాలలోనూ యీ మఠంలోని మా పాదుకలను పూజించి, నీరాజనమిచ్చి, నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది. ఇకముందు పవిత్రమైన యీ దేశం మ్లేచ్ఛులైన యవనులకు అధీనమవుతుంది. వాళ్ళుగూడ యిక్కడకు వస్తారు. వారు వస్తే యిక్కడ భక్తులకు కష్టం కల్గుతుంది. మేము యిక్కడ లేమని వాళ్ళు అనుకోగలందుకు స్థూలదృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు కన్పిస్తాము గాని, అదృశ్యంగా యిక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా వుంటాము' అని చెప్పి, ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు. వెంటనే ఆయన మఠంనుండి బైటకు వచ్చి, సాయం దేవుణ్ణి, నందిశర్మను, నరహరి కవినీ, నన్నూ కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు. కొందరు శిష్యులు గంధర్వపురంలో వుండిపోయారు. శ్రీగురునివద్ద సన్యాస దీక్ష తీసుకొన్న కృష్ణసరస్వతి, బాల సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి మొ॥న వారు అంతకుముందే శ్రీ గురుని ఆజ్ఞమేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. స్థానిక భక్తులు, మా ఐదుగుర్నీ ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి, చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనుమరుగయ్యేవరకు చూస్తూ నిలబడి, అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు.
అటు తర్వాత జరిగినది చెబుతాను విను వెనుక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయల్దేరినప్పుడు, వారివద్ద సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయల్దేరిన శిష్యులు, వైఢూర్యనగరాన్ని పరిపాలించిన యవనరాజు, శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి, అక్కడ వారి రాకకోసం ఎదురు చూస్తూ వున్నారు. బహుధాన్య నామ సం॥లో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. కుంభరాశిలోకి సూర్యుడు, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు. అది శిశిర ఋతువు. మాఘమాసము, కృష్ణపక్షము, ప్రతిపద (పాడ్యమి) శుక్రవారంనాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలసి శ్రీశైలం వద్దనున్న పాతాళగంగకు చేరారు. అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధంచేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమంతా త్వరత్వరగా పూలు సమృద్ధిగా సేకరించి, వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధంచేసాము. అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై వుంచమని ఆదేశిస్తే మేమలానే చేశాము. అప్పుడాయన, 'మేము యీ పూలనావలో యీ పాతాళగంగ దాటి శ్రీశైలంచేరి, అక్కడ మల్లికార్జునునితో ఐక్యం చెందుతాము. మీరందరూ వెనక్కు తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి' అని చెప్పారు. కాని మేము నివ్వెరబోయాము.
ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే వుండిపోయాము. ఆయన మమ్మల్ని ఓదారుస్తూ యిలా అన్నారు. 'ప్రియ శిష్యులారా! మీరిలా దిగులుపడగూడదు. మీరు గంధర్వపురం వెళ్ళండి. మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది. భక్తిలేనివారికి కన్పించక, భక్తులకు మాత్రమే దర్శనమివ్వదలచి మేమక్కడే గుప్తరూపంలో వుంటాము. మమ్మల్నే నమ్ముకొని కొలిచే భక్తుల యిళ్ళలో మేము ప్రత్యక్షంగా వుంటాము'. పుష్యమీ నక్షత్రంతో గూడిన ఆ శుక్రవారంనాడు, ఆ శుభసమయంలో శ్రీగురుడు ఆ పూలనావమీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ, ఒడ్డున నిలచిన మా అందరితో చివరిమాటగా యిలా చెప్పారు.
'నాయనలారా! మీకు సర్వశుభాలూ ప్రాప్తించుగాక! నల్గురు ఒక్కచోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామసంకీర్తన చేసేవారు మాప్రీతికి పాత్రులవుతారు. మా కథామృతగానం చేసేవారింట్లో నాల్గు పురుషార్ధాలు, సిద్ధులూ నిత్యనివాసం చేస్తాయి, జీవితాంతమూ అపైశ్వర్యాలు, అటుతర్వాత ముక్తీ సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము. మేమచటికి " చేరగానే అందుకు గుర్తుగా మీవద్దకు నాలుగు తామరపువ్వులు యీ నదిలో కొట్టుకొనివస్తాయి. మీరు నలుగురూ వాటిని ప్రసాదంగా తీసుకోండి. మీరు వాటిని ప్రాణంకంటే యెక్కువ విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణం. దీనిని సంశయించరాదు' అన్నారు. ఆనావ ముందుకు సాగి కొద్ది సేపట్లో కనుచూపుమేర దాటిపోయింది. అయినా తాము ధరించిన కాషాయవస్త్రంతో తమ తలనుగూడ కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సులతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది.
ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశమిచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్ళి, ఆకస్మాత్తుగా అంతర్హితులయ్యారు. అంతలోనే ఆ పుష్పాసనంగాని, స్వామిగాని కన్పించకపోయేసరికి మేమందరమూ కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశంకేసి చూస్తూ వుండిపోయాము. కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డునుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్ళు మావద్దకొచ్చి, 'అయ్యా! ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూచాము. వారి కాళ్ళకు బంగారు పాదుకలు న్నాయి. వారు కాషాయ వస్త్రము, చేతిలో దండము ధరించివున్నారు. ఆయన మాతో, 'మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకెదురైనట్లు చెప్పండి. నాలుగు పువ్వులు నదీజలాలపై కొట్టుకుని వారివద్దకొస్తాయి. అవి తీసి వారికి యివ్వండి. మాపేరు నరసింహసరస్వతి. మేము స్థూలరూపంతో కదలీవనం వెడుతున్నాము. కాని, గుప్తరూపంలో యెప్పటికీ గాణాపురంలోనే వుంటాము. అక్కడే ఎల్లప్పుడూ మాసేవలో నిమగ్నమై వుండమని చెప్పండి' అని చెప్పారట. వాళ్ళు ఆ విషయం మాతో చెబుతూండగానే నాలుగు తామరపూవులు నదిలో కొట్టుకు వస్తున్నాయి. శ్రీగురుని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి యీదుకుంటూపోయి, ఆనాల్గు పూవులనూ తెచ్చియిచ్చారు. వారినుండి ఆ పూవులను అందుకుని, సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి యిచ్చాడు. అవి తీసుకొని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వనగరంలోని మఠం చేరుకొన్నాము.
శ్రీగురుడు అక్కడనుండి బయల్దేరి వెళ్ళినప్పుడు, మమ్మల్ని సాగనంపిన గ్రామస్థులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యేవరకూ చూచి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని, అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహసరస్వతీస్వామి యథాపూర్వం తమస్థానంలో కూర్చొని కన్పించారు! ఆయనను చూచి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమయింది. అంతటితో గ్రామస్థుల సంశయాలన్నీ మటుమాయమై, ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచడం యెంతటి అపచారమో వారికి అర్ధమయింది. అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసికొని తమ యిళ్ళకు వెళ్ళిపోయారు."
అప్పుడు నామధారకుడు, "స్వామీ! ఆ పూవులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు?" అని అడిగాడు. సిద్ధయోగి, "స్వామికి శిష్యులెందరో వుండేవారు. వారిలో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైనవారు. వీరేగాక, ఆ శ్రీశైలయాత్రాసమయంలో సాయందేవుడు, నందిశర్మ, నరహరి, నేను మాత్రమే స్వామిని అనుసరించాము. ఆ పూవులు ప్రసాదంగా లభించినవి మాకే. నాకు దొరికిన ప్రసాదమిదిగో చూడు! దీనిని భద్రంగా వుంచుకొని, మనస్సును నిశ్చలంగా గురు పాదాలపై నిలుపుకున్నాను. అందుకు సాధనంగా యీ 'గురుచరిత్ర' కూర్చాను. అంతేగాని గురు మహిమను పూర్తిగా వివరించడము మహామహితాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇహంలో పురుషార్థాలను, అటు తర్వాత పరమార్థాన్నీ ప్రసాదిస్తుంది. దీని పారాయణ వలన సుఖము, పవిత్రత, శాంతి కల్గుతాయి; పాపాలు, రోగాలు నశిస్తాయి" అన్నారు.
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యైనమః.
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
అంతవరకూ ఎంతో ఆసక్తితో శ్రీగురుని లీలలు కోరికోరి చెప్పించు కుంటున్న నామధారకుడు, యీ సారి సిద్ధముని కథ ముగించిన తర్వాత గూడ యేమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై వుండిపోయాడు. నఖశిఖపర్యంతమూ కించిత్తైనా చలనం లేకుండా శిలాప్రతిమలా వుండిపోయాడు. అతని శరీరమంతటా వెంట్రుకలు నిక్కబొడుచుకొని వున్నాయి. చెమట బిందువులు నిల్చాయి. అతని శరీరమంతా కంపించి పోతున్నది. అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి, అతని కన్నులనుండి సంతతధారగా అనందభాష్పాలు కారుతున్నాయి. ఈ ఎనిమిది విధాలైన భక్తిభావాలతోను అతడు సమాధి స్థితిలో వున్నాడని గ్రహించిన సిద్ధముని, లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకొన్నారు. కనుక అతని శరీరాన్ని తమచేతితో నిమిరి, వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని యిలా అన్నారు: "శిష్యోత్తమా! నామధారకా! లే నాయనా! నీవిప్పుడు యీ సంసారసాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు". శ్రీగురులీలామృతం పానం చేసి శ్రీ గురుచరణకమల ధ్యానమనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురుణ్ణి యిలా స్తుతిస్తున్నాడు:
"స్వామీ! అచింత్యులైన మిమ్మెలా ధ్యానించేది? సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది? ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేదెలా? తీర్ధక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాద పద్మాలను దేనితో కడిగేది? విశ్వకర్తవు, సర్వకర్తవూ అయిన మీ చేతులకు అర్ఘ్యం సమర్పించేది ఎలా? సప్తసముద్రాలనే గాక యీ విశ్వమంతటినీ కడుపులో దాచుకొన్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను? శుద్ధసత్యస్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే, మీకేమని స్నానం చేయించేది? ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది? చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వలన కల్గే లాభమేమున్నది? సర్వ జీవుల తాపాన్నీ హరించగల మీకు గంధలేపనమేమి చేయగలదు? ఇచ్ఛలే లేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతినొనర్చగలను? స్వయం సంతుష్టులు, ఆత్మానంద స్వరూపులుయైన మీకు నేను సమర్పించదగిన ధూప మెక్కడున్నది? స్వయం ప్రకాశకులు, జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించడమా? జగత్ పోషకులైన మీకు యేమినైవేద్యం ఇవ్వగలను? నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన యేమి ప్రయోజనం? నక్షత్రగ్రహగోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ, సర్వ జీవుల హృదయాలలోనూ, మరియు విశ్వమందంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనమెలా యివ్వాలో, మిమ్మెలా స్తుతించాలో నాకు తెలియడంలేదు. సర్వగతులైన మీకు ప్రదక్షిణమెలా చేయాలి? ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయివుండగా నేనెక్కడని నమస్కరించేది? నాలోపల, వెలుపలా నిండియున్న మీకు యెచ్చటికని ఉద్వాసన చెప్పేది?" అంటున్నాడు.
అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని "నాయనా! నీవిలా అంతర్ముఖుడవై నిశ్చలసమాధిలో నిలిచిపోతే యీ జగత్తును ఉద్దరించేదెలా? ప్రజలందరూ ఉద్దరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పం. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు, ఆయన అభీష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం. నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవం? కనుక నీవు మేల్కొని శ్రీ గురుచరణాలను స్మరిస్తూ, శాస్త్ర వాక్యాలను అనుసరిస్తూ యీ ప్రపంచంలోనే జీవించాలి" అని చెప్పి, చివరకు అతనిని మేల్కొలిపారు. నామధారకుడు కన్నులు తెరచి సిద్ధమునిని చూచి, "స్వామి! దయామయా! విశ్వాధారా! యీ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌకవంటివారు మీరు. నాపాలిటి శ్రీగురుడు మీరే!" అని, ఆయనకు సవినయంగా నమస్కరించాడు. సిద్ధయోగి సంతోషించి, "నాయనా! శ్రీ గురు కథాశ్రవణమందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిల్చుగాక! నీవు యీ "గురుచరిత్ర" నిత్యపారాయణ చేస్తుంటే యిహపరాలు రెండూ సిద్ధిస్తాయి. ఒక శుభ ముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధిచేసి, రంగవల్లులతో అలంకరించి, అక్కడ 'కూర్చొని మొదట దేశ కాలాలను స్తుతించు. అటు తర్వాత శ్రీ గురునికి మానసోపచారపూజ చేయి. పారాయణ సమయంలో మౌనంపాటిస్తూ మనోవికారా లను శమింపజేసుకో. అప్పుడు దీపం పెట్టి, గురువుకు, పెద్దలకూ మనసా నమస్క రించు. ఉత్తరదిక్కుగానో లేక తూర్పుముఖంగానో కూర్చొని, మొదటి రోజు 9వ అధ్యాయం చివరివరకు, రెండవ రోజు పారాయణ 10వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం చివరి వరకు, మూడవ రోజున 29వ అధ్యాయం చివరి వరకూ, నాల్గవరోజున 35వ అధ్యాయం చివరివరకూ, 5వ రోజున 38వ అధ్యాయం చివరివరకూ 6వ రోజున 43వ అధ్యాయం చివరివరకు, చివరిరోజు, గ్రంధాంతము వరకు విధ్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి. తర్వాత నైవేద్యం పెట్టి, అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి. సప్తాహ పారాయణ చేస్తునంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది. అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణ, తాంబూలాలతో వాళ్ళను సత్కరించాలి. ఇలా నిర్దుష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనమవుతుంది. ఇలా చేస్తే సాటివారందరూగూడ ఆ భగవంతుణ్ణి సేవించుకోగల్గుతారు".
శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యైనమః.
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
ప్రస్తావన : మొదట పరబ్రహ్మమొక్కడే ఉంటాడు. 'నేననేక మౌదునుగాక! అని ఆయన సంకల్పించి త్రిగుణాలనాశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగ ఆవిర్భవించి స్పష్టి స్థితిలయాలు చేస్తాడు. ఈ త్రిమూర్తుల ఐక్యతే పరబ్రహ్మతో చేరిగురుతత్త్వమయింది. కనుక ఈ విశ్వమే గురురూపమని 'గురుగీత' చెబుతుంది..
అంటే సద్గురుని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులయిన వారికి విశ్వం గురురూపమేనని అనుభవమౌతుంది. మోక్షప్రాప్తికి దోహదం చేసే ఆత్మీయుడవు తుంది. అలా అనుగ్రహం పొందినవారికి ఈ జగత్తే కర్మ బంధాలను కల్పించే ప్రతిబంధకమౌతుంది. శ్రీ కృష్ణుడు తననాశ్రయించిన అర్జునుడికి అట్టి అనుభవమే అనుగ్రహించాడు అందుకే ఆయన జగద్గురువు. కనుక అటువంటి గురువును ముముక్షువు ఆశ్రయించి తీరాలి. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని శరణు పొందేవరకు సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రునికి బ్రహ్మజ్ఞానమే లభించలేదు సరికదా, అతడికి ఈ సృష్టి ప్రతిబంధకమై, అనేకసార్లు తపోభంగము చేసింది కూడా. నద్గురువునాశ్రయించక ఎంతటి తపస్వియైనా ముక్తిపొందలేడని యిట్టి పురాణ కథల సారాంశం. విశ్వమంతా తమరూపమేనని భక్తులకు ప్రత్యక్షానుభవాన్ని ప్రసా దించగలవారే నిజమయిన తత్త్వ ద్రష్టలు, సద్గురువులు, విశ్వమంతా వ్యాపించిన నద్గురు తత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామధారకుడికి అవధూతో పాఖ్యానంతో ఉదహరించాడు. శ్రీ శిరిడీ సాయిబాబా వంటి సద్గురువు ఈ నాటికీ తన భక్తులకట్టి అనుభవాలు ప్రసాదిస్తున్నారు. అందుకే వారి చరిత్ర పఠించకుంటే శ్రీ గురుచరిత్రలోనివి, యితర మహనీయుల చరిత్రలలోనివి ఎన్నో అంశాలు అర్ధంగావు.
ఈ అవధూతోపాఖ్యానంలో అవధూత 24 మంది గురువులనుండీ నేర్చిన జ్ఞానాన్ని మూల గ్రంధం టూకీగా సూచించింది. ఈ ఘట్టం గూర్చి ముముక్షువులు మననం చేసి తక్కిన అంశాలను ఊహించుకోవాలి. ఈ ఆంధ్రానువాదంలో ఈ అంశాలను గూడ భక్తుల వినియోగార్థం వివరించడమైనది.
గురు తత్త్వాన్ని సిద్దుడు యిలా ఒక పురాణోపాఖ్యానంతో వివరించాడు. “యయాతి పుత్రుడైన యదుమహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి, ఆ నిర్జనారణ్యంలో కటిక నేలపై పడుకొని వున్న ఒక సర్వసంగపరిత్యాగి, సమర్థుడూ అయిన ఒక అవధూతను చూచి, ఆశ్చర్యపడి, యిలా అడిగాడు: 'స్వామీ! ఆయుష్యము, సంపద, కీర్తి - వీటిని కోరి మానవుడు ధర్మార్థకామాలనే పురుషార్థాలయందు ఆసక్తుడవుతాడు. మీరు మాత్రము ఆసక్తులు గాలేదు. మీరు నైపుణ్యము లేకగాని, చేతగాకగాని, అజ్ఞానం వలనగాని యిలా వున్నారని చెప్పలేము. మీరు నిపుణులు, శక్తిమంతులు, జ్ఞానులూ అనే సంగతి చెప్పకుండానే తెలుస్తున్నది. మీరీ నిర్జనారణ్యంలో ఏ కోరికలూ లేకుండానే పరమానందంగా ఎలా సంచరించ గలుగుతున్నారు?' అపుడాఅవధూత లోక శ్రేయస్సుకై యిలా బోధించాడు: 'నేను 24 మంది గురువులనుండి జ్ఞానాన్ని గ్రహించి, అనుష్టించి, ఆత్మజ్ఞానం పొందాను. దానివల్లనే నిర్హేతుకమూ, శాశ్వతమూ అయిన ఆనందం లభిస్తుంది. నా గురువులెవ్వరో, వారినుండి నేను నేర్చినదేమో యోగ్యుడవైన నీకు వివరిస్తాను.
నా మొదటి గురువు భూమి. పూర్మకర్మననుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలు ప్రసాదించి, వాటి జీవనానికవసరమైనరీతిగా ప్రవర్తింపజేస్తాడు. అటువంటి పశుపక్ష్యాదులెన్నో భూమిపై నివసిస్తున్నాయి. మానవులు భూమిని దున్నుతారు. బావులు, చెరువులు, కోనేళ్ళకోసం భూమిని త్రవ్వుతారు. జీవులన్నీ ఆమెపై మలమూత్రాలు విసర్జిస్తాయి. అయినప్పటికీ భూమి ఓర్పు వహించి, జీవులకు సస్యాలు, ఆశ్రయమూ యిచ్చి పోషిస్తుంది. ఇన్ని జీవులనుండి తనకెంత బాధ కల్గినా చలించక, తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది. అలానే పూర్వకర్మవలన ప్రేరేపింపబడిన సకల భూతాలవలనా పీడింపబడినప్పటికీ ముముక్షువు, ప్రేమ - ఓరిమిలతో సహించి ధర్మమార్గంనుండి చలించకుండా ధైర్యం వహించి వుండాలని భూమినుండి నేర్చుకున్నాను. అలాగే, భూమి పైనున్న కొండలు దేవాలయాలకు, సకాల వర్షానికి కారణమైన అరణ్యాలకూ నెలవులు. ఎన్నో జీవులు వాటి గుహలలో నివసిస్తాయి. మానవులకెంతో ఉపకరించే నదులు వాటిలో జన్మిస్తాయి. గృహ, ఆలయ నిర్మాణాలకు కావలసిన రాళ్ళను ప్రసాదించడమే గాక పరమార్థాన్ని పర్వతం సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే వుంటుంది. ముముక్షువైనవాడు. మానవులకు ప్రసాదించగల యెన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు. అలా జీవించగలగాలని దాని నుండి నేర్చుకున్నాను.
నా రెండవ గురువు వాయువు. వివిధ వస్తువులు శీత-ఉష్ణ, శుచి-అశుచి, సుగంధ - దుర్గంధాలతో సంబంధము లేకనే వాయువు అనాసక్తుడై వాటిమధ్య సంచరిస్తాడు. తాత్కాలికంగా వాటిచేత ప్రభావితుడైనట్లు కనిపించినా మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లెడలా సంచరిస్తాడు. ముముక్షువుగూడ యింద్రియ విషయాల `నుభవమవుతున్నా సుఖ దుఃఖాది ద్వంద్వాలలో తగుల్కొనక హృదయము - వాక్కులకు అనుక్షణమూ సంభవించే విక్షేపాలను తొలగించు కోవడమే జీవిత లక్ష్యమని తలచి, ప్రాణరక్షణ కవసరమైన ఆహారం మాత్రం చేతనే యోగి తృప్తి చెందాలి.
నా మూడవ గురువు ఆకాశము. అప్పుడప్పుడు ఆకాశము, మేఘాలు, ధూళి, సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కన్పించినా, అది సహజంగా దేనికీ అంటనిది. శ్రీ ముని గూడ కాల గతిలో సృష్టించబడిన త్రిగుణాల వికారరూపమైన దేహానికీ, దానివలన కలిగిన మనో వికారాలకూ అంటని వాడై, ఆకాశంలా స్వచ్ఛుడై వుండాలని తెలుసుకున్నాను. అంతేగాక, ఆత్మ ఆకాశంవలె సర్వవ్యాపి. దానియందు గోచరించే వివిధ రూపాలచేత అది అవిభేద్యము, అసంగము, శుద్ధమూ అని గ్రహించాను. అట్టి ఆత్మయే బ్రహ్మంగదా!
నా నాలుగవ గురువు అగ్ని. అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వలిస్తాడు. ఒకప్పుడు నివురుగప్పి మందంగా వెలుగుతాడు. మరొకప్పుడు రాపిడివల్లనే ప్రకటమయ్యే అగ్నితత్త్వంగా వస్తువులలో సూక్ష్మంగా దాగియుంటాడు. అట్టి సామాన్యాగ్ని, మధనంచేత విశేషాగ్నిగా ప్రకటమై, యజ్ఞం చేసేవారి పూర్వపాపాలను హరించి, రానున్న కర్మదోషాలను నివారించడం కోసము ఎవరినుండైనా సరే హవిస్సును గ్రహిస్తాడు. కాని తాను మాత్రం వారి పాపాలచేత అపవిత్రుడుగాకనే, వారి పాపాన్ని దహిస్తాడు. అలానే మునిగూడ తన తపశ్శక్తిని గుప్తంగా వుంచుకుంటూ, జనాన్ని పావన మొనర్చడానికై సర్వులనుండీ భిక్షనుగొని వారిననుగ్రహిస్తాడు. తాను మాత్రం అగ్నివలె యెట్టి భిక్షవల్లనైనా అపవిత్రుడు గాడు. అంతేగాక, అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ, కట్టెను చేరినపుడు ఆ రూపంతో భాసిస్తుంది. అలాగే ఆత్మగూడ, వివిధ దేహాలయందు తాదాత్మ్యం చెంది ఆయా రూపాలలో గోచరిస్తుంది. కాని ఆ ప్రతీతి వాస్తవమైనది గాదు. జీవులన్నీ సకాలంలో జన్మించి మరలా సకాలంలో మరణిస్తున్నా, వాటి ఆద్యంతాలు అట్టి ఉత్పత్తిలయాల వలె, గుప్తమైనవి; మధ్యదశలో మాత్రమే జీవులు గోచరిస్తాయి. కాని వాటి సృష్టి స్థితిలయాలకు ఆధారమైన ఆత్మ శాశ్వతము, వికారరహితము, అవ్యక్తము, సర్వగతమున్నూ, అలానే సామాన్యాగ్నిగూడ. కనుక అగ్నియొక్క తత్త్వాన్ని గూర్చి విచారించి, నేనూ అట్టి తత్త్వజ్ఞానాన్ని పొందాను. అగ్ని వివిధ వస్తువుల గుణభేదాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారుస్తుంది. అలానే ఈ తత్త్వజ్ఞానమనే అగ్ని వివిధమయిన వస్తువులను, గుణాలనూ నిరసించి, సర్వగతమైన విశ్వవిభుని తత్త్వాన్ని గ్రహించి తనలో తానే అణగియుంటుంది.
నా ఐదవ గురువైన సూర్యుడు సహజంగా ఒక్కడే. అయినా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఘటంలోని నీటిలో ఒక్కొక్క ప్రతిబింబముగా భాసిస్తాడు. అలానే సహజంగా ఆత్మ అద్వయమైనప్పటికీ, దేహాది ఉపాధి భేదం చేత వివిధమూ, భిన్నమూ అయినట్లు కనబడుతుంది. అంతేగాదు. సూర్యుడేవిధంగా గ్రీష్మఋతువులో నీటిని తన కిరణాలతో స్వీకరించి వర్షఋతువులో విసర్జిస్తాడో, అలానే జ్ఞానిగూడ విషయాలనుండి అనుభవసారాన్ని సేకరించి, కరించి, సకాలంలో బోధరూపంలో జీవులకు ప్రసాదిస్తాడు. అయినా సూర్యునిలాగ అతడు కర్తృత్వం వహించడు. సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల బాహ్యరూపాలను సర్వులకూ గోచరింపజేసినట్లే, జ్ఞానిగూడ వాటి నిజతత్త్వాన్ని జిజ్ఞాసువులకు తెలియజేస్తాడు. ఒకే సూర్యుని వలన కమలాలు వికసిస్తాయి, కలువలు ముకుళించుకుంటాయి. అలానే, జీవులు వారి వారి పరిపాకాన్ననుసరించి ఆ బోధను గ్రహించగల్గుతాయి. కాని సూర్యుడు మాత్రం అన్ని జీవులకూ వెలుగునూ, ఉష్ణశక్తినీ ప్రసాదించడంలో జీవుల గుణదోషాలను ఎంచనట్టే, మహాత్ముడు తన అనుగ్రహాన్ని సర్వులకూ సమానంగానే ప్రసాదిస్తాడు.
నా ఆరవ గురువు పావురము. ప్రేమ పాశబద్ధులైన ఒక పావురాలజంట పిల్లల్ని పెట్టి, వాటిని ప్రేమతో పోషిస్తుండేవి. ఒక బోయవాడు వలవేసి పిల్లలను పట్టుకున్నాడు. అప్పటికి వాటికాహారం తెచ్చిన ఆడు పావురం గూడ పుత్రవ్యామో హంతో ఆ వలలో దూకింది. దానినెడబాసి జీవించలేక మగపక్షి దానినను సరించింది. అలానే మానవ జన్మమెత్తిగూడ మమకార వ్యామోహాలతో తన వినాశం కొనితెచ్చుకుంటున్నాడని తెలుసుకొన్నాను. సహజంగా స్వేచ్ఛాయుతమైన ఆత్మ దేహేంద్రియాదులతో తాదాత్మ్యం చెంది సంసార దుఃఖాగ్నిలో, కర్మ వలయంలో, యిలాగే తగుల్కొని నశిస్తున్నదని గుర్తించాను.
నా ఏడవ గురువు కొండచిలువ. అది కదలక పడియుండి, యాదృచ్ఛికంగా ప్రాప్తించిన ఆహారంతో మాత్రమే జీవిస్తుంది. అది అల్పం కావచ్చు. అధికం కావచ్చు; రుచికరం కావచ్చు, కాకపోవచ్చు. అలానే మానవుడు గూడ ఇహపర సుఖాలకోసం లా, దైవికంగా లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ, ఆత్మనిష్ఠ, ఓరిమిలతో వుండాలని గ్రహించాను. ఏమీ లభించనప్పుడు గూడ దైవమే గతియని నమ్మి, ఆ కొండచిలువవలె, జాగ్రన్నిద్రాదులు లేనివాడై అంటే ధ్యాననిష్ఠుడై ఇంద్రియ బలమున్నా స్వార్ధ, అభిమానయుక్తమైన యెట్టి కర్మలూ చేయక, బలిష్ఠమైన దేహాన్ని మోస్తాడు. దర్శనాది సామాన్యవ్యాపారాలను సైతం ప్రత్యాహారం ద్వారా 'యోగి- పరిహరించాలని తెలుసుకొన్నాను. అంతేగాక, కొండచిలువకు బాహ్యమైన శుచి - అశుచిలతో నిమిత్తంలేదు. జనసంచారంనుండి, దూరంగా వుంటుంది. నిరంతరం - ధ్యానమనే అంతశ్శుచిలో నిమగ్నుడైన ముని గూడ అలానే జీవించాలని తెలుసుకున్నాను.
నా ఎనిమిదవ గురువు సముద్రం. వర్షఋతువులో నిండుగా పొంగిన నదులెన్ని తనలో కలసినా, సముద్రం పొంగదు. వేసవిలో ఆ నదులు ఎండినా కృంగదు. జ్ఞాని సముద్రంలా పరిపూర్ణుడై సుఖాలకు పొంగక, దుఃఖాలకు కృంగక, ధర్మమనే చెలియలి కట్టను అతిక్రమించక, ఎట్టి పరిస్థితిలోనూ క్షోభించడు. అజేయుడై, తన యోగ రహస్యమెవరికీ అంతుపట్టనివ్వక అపారుడు, ప్రసన్నుడు, చలన రహితుడుగా జీవించాలని తెలుసుకున్నాను. అంతేగాక, సముద్రము తనలోని ముత్యాలను ఎన్నడూ బయటకు విడువదు. బయటనుండి చెత్తను కొంచెం గూడ తనలో చేరనివ్వదు. అలానే ముని తనలోని సద్గుణాలను వీడక, అవగుణాల నొక జీవించాలని తెలుసుకున్నాను.
మిడుత నా తొమ్మిదవ గురువు. అది అగ్నినిచూచి ఆకర్షింపబడి, అందులో దూకి నశిస్తుంది. అలాగే అజ్ఞాని, దుఃఖనిలయాలైన విషయాలు సుఖాలని భ్రమించి వాటిలో చిక్కి నశిస్తాడు. స్త్రీల రూపలావణ్యాలు చూచి మోహం చేత శిస్తాడని తెలుసుకున్నాను. అలాగాక, ముముక్షువు జ్ఞానమనే అగ్నిలో తన అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలని తెలుసుకొన్నాను.
నా పదవ గురువు ఏనుగు. మానవులు అడవిలో నిలిపిన ఆడ ఏనుగు ప్రతిమను చూచి భ్రమించి, దాని స్పర్శకోరి, మగ ఏనుగు దానిని సమీపించి బంధించబడు తుంది. ఆడ ఏనుగును చేరి విహరించే మగ ఏనుగును మరొక మగ ఏనుగు పోతుంది. అలానే రావణ, దుర్యోధనాదులలాగ స్త్రీ స్పర్శను కోరి అజ్ఞుడు సంసారబంధంలో చిక్కి ఆత్మనాశం కొనితెచ్చుకుంటాడని, ముముక్షువు అట్టి మోహాన్ని జయించాలనీ తెలుసుకొన్నాను..
నా పదకొండవ గురువు చీమ. దానివలెనే తానార్జించిన ధనంతో దానధర్మాలు చేయక కూడబెట్టేవాణ్ణి దుర్మార్గులు దోచేస్తారని తెలుసుకున్నాను. అయినా చీమవలెనే, ముముక్షువు గూడ సాధనలో యెన్ని విఘ్నాలు, అపజయాలు వచ్చినా నిస్పృహ చెందక నిరంతర కృషితో జ్ఞానధనం సాధించి కూడబెట్టాలి.
నా పన్నెండవ గురువు చేప. అది జిహ్వచాపల్యంచేత ఎరకాశించి గాలర్ మ్రింగి నశించినట్లే, జిహ్వా చాపల్యానికి లొంగి మానవులు ఆత్మహాని కల్గించు కుంటారు. రుచిపట్ల అనాసక్తి, అల్పరస సేవనాలద్వారా జిహ్వను జయించవచ్చు. 'జితం సర్వం జితే రసే', 'జిహ్వను జయిస్తే సమస్తాన్నీ జయించవచ్చు. ఎరకాశించక, తనకు సహజమైన జలాన్నే ఆశ్రయించిన చేపవలె, తన సహజ నిలయమైన పరమాత్మను ఆశ్రయించినవాడు తప్పక ధన్యుడవుతాడు.
పింగళ అనే వేశ్య నా పదమూడవ గురువు. ఆమె ఒకసారి ధనాశతో ఆనందదాయకమైన నిద్రగూడ పాడుచేసుకొని, ఒక విటునికోసం వేచివేచి, చివరికిలా పరితపించింది: 'నేనెంత మూఢురాలను ఆనందమయుడైన ఆత్మారాముని విడచి అల్పబుద్ధితో భయశోక మోహాదులు కల్గించే మానవాధముని పొందగోరాను. ఇక ముందు ఆత్మను (శరీరాన్ని, జీవాత్మనూ) ఆత్మారామునికే ధనకీర్తుల కోసం సిద్ధులకాశించక, యోగి వైరాగ్యంతో ఆత్మానందాన్నే సాధించాలని పొందుతాను'- ఇట్టి నిశ్చయంతో ధన్యతనొందింది. అలానే గ్రహించా. ఆశయే దుఃఖము; ఆశ లేకపోవడమే సుఖము. ఒకరినుండి స్వీకరించడమే దుఃఖానికి మూలమని తెలిసి అపరిగ్రహమవలంబించాలని పింగళనుండి తెలుసుకున్నాను.
నా పదునాలుగవ గురువు శరకారుడు. అతడు బాణాలను చేయడంలో నిమగ్నుడై, ప్రక్కనుండిపోతున్న ఊరేగింపును గూడ గుర్తించలేదు. లోకులను భ్రమింపజేసే విషయజాలాన్ని విస్మరించి, ఆత్మనిష్ఠుడు గావాలని అతనిని చూచి తెలుసుకున్నాను. ఒక బాలుణ్ణి చూచి, యోగి చింతలు, మానావమానాలు విడచి ఆత్మరతుడై సుఖించాలని తెలుసుకున్నాను గనుక, ఆ బాలుడే నా 15వ గురువు.
కాల ప్రభావంచేత చంద్రకళలు వృద్ధిక్షయాలు పొందినట్లు కనబడతాయేగాని, చంద్రగోళం యెట్టి మార్పులూ చెందదు. అలానే జననం మొదలు మరణం వరకూ గల మార్పులన్నీ దేహానికే; దేహికి సంబంధించవు. చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడేగాని, స్వయంగా ప్రకాశించలేడు. అలానే, దేహియైన, జీవుడు ఆత్మచైతన్యాన్ని ప్రతిబింబిస్తాడే గాని, స్వయంగా ప్రకాశించలేడని గుర్తించాను. కనుక చంద్రుడు నా 16వ గురువు. అతడు సర్వజీవులకూ ఆహ్లాదము, చల్లదనమూ ప్రసాదిస్తున్నా, వాటినుండి యేమీ ఆశించడు. జ్ఞాని భగవదనుగ్రహాన్ని జీవులకు పంచి, వాటి తాపాన్ని హరిస్తూ గూడ నిరపేక్షుడై వుండాలని తెలుసుకున్నాను.
తామరపువ్వుల పరిమళంచేత ఆకర్షింపబడిన తేనెటీగ - రాత్రంతా ముడుచుకొన్న కమలంలో బంధింపబడుతుంది. అలాగే యతిగూడ రుచి, సుగంధముగల పదార్థాలపట్ల ఆసక్తుడైతే వాటిని సమర్పించే గృహస్థుని యింట చిక్కి పతితుడౌతాడు. తేనెటీగ పూవులు నలగకుండా తేనెను గ్రహిస్తుంది. సన్యాసి గృహస్తులకెట్టి కష్టమూ కలుగజేయకుండా వారినుండి స్వల్పంగా మాత్రమే ఆహారాన్ని సంపాదించాలి. అంతేగాక, తుమ్మెద వివిధ రంగులుగల పువ్వులనుండి తేనెమాత్రమే గ్రహించినట్లు, వివేకి సకలశాస్త్రాల సారం మాత్రం గ్రహించాలి గాని, పాండిత్యానికై ప్రాకులాడరాదు. తేనెటీగ రేపటికని, మాపటికనీ తేనె కూడబెట్టడం వలన తేనె అమ్ముకొనేవాడు వాటి తేనెనపహరిస్తాడు. కనుక ముని రాత్రికని, రేపటికనీ ఆహారం కూడబెట్టక చేతులే భిక్షాపాత్రగా, కడుపే కంచంగా జీవించాలి. ఇదంతా నాకు నేర్పిన తేనెటీగ నా 17వ గురువు.
లేడి నా 18వ గురువు. కపటుడైన వేటగాడి సంగీతానికి పరవశించి అతనిచేత చిక్కినట్లు, లౌకికమైన గీతాలు వినగోరే ముమక్షువు గూడ విషయవాంఛలలో
చిక్కి, నశిస్తాడు.
గ్రద్ద నా 19వ గరువు, ఒకప్పుడది ఒక చచ్చిన ఎలుకను కొనిపోతుండగా యెన్నో కాకులు, గ్రద్దలూ ఆ ఎలుకనాసించి ఆ గ్రద్దనెంతగానో బాధించాయి. చివరికి శ్రీ ఎలుకను విడిచింది. పక్షులన్నీ దానికోసం పోగానే గ్రద్ద ప్రశాంతంగా ఒక చెట్టుమీద కూర్చున్నది. పామరులాశించే లౌకిక సుఖాలనాశించడం దుఃఖాన్ని కొని తెచ్చుకొనడమే అవుతుందని, వాటిని విడవడమే శాంతికి మార్గమనీ తెలుసుకున్నాను.
నా 20వ గురువు ఒక కన్య. ఆమెను చూడడానికి మగపెళ్ళివారు. వచ్చినపుడు ఆమె తల్లి యింటలేదు. వారిని సత్కరించడానికి ఆ కన్యయే ధాన్యం దంచుతున్నది. తన చేతిగాజుల సవ్వడి వారెక్కడ వింటారోనని వెరచి, ఒక్కొక్క చేతికి రెండుగాజులు మాత్రముంచుకున్నది. అవిగూడ శబ్దం చేస్తున్నాయి. అపుడు చేతికొక్క గాజుమాత్రముంచుకొని నిశ్శబ్దంగా కార్యం నెరవేర్చుకొన్నది. పలువురొకచోట చేరినా, యిద్దరు చేరినా ముచ్చట్లు, కబుర్లు తప్పవని, యోగి ఏకాంతంగా సాధన చేసుకోవాలనీ నేర్చుకొన్నాను.
నా 21వ గురువు సర్పము. తనకొక గృహం నిర్మించుకొనక చెదలు శ్రమపడి నిర్మించుకొన్న పుట్టను విడిచిపోయాక, అందులో జీవిస్తుంది. చెదలవలె అవివేకులు శ్రమకోర్చి గృహాది ఉపాధులను పెంచుకొంటారు. కాని ముని, యితరులు నిర్మించిన మఠాలలోను, శిథిలాలయాలలోనూ, వృక్షమూలంలోనూ జీవించాలి. అంతేగాక, పాము తన జీవకృత్యాలను యే యితర జీవులకూ తెలియనివ్వదు' అలాగే యోగి గూడ తన అభ్యాస రహస్యాలను గుప్తంగా వుంచు కోవాలి. పాములా ఏకాంతాన్ని ఆశ్రయించిన యోగి, యోగాన్ని నిశ్చింతగా అభ్యసించగలడు. పాము తన కుబుసాన్ని నిశ్చింతగా విడిచినట్లు యోగిగూడ అంత్యకాలంలో యోగసిద్ధి వలన స్వచ్ఛందంగా దేహాన్ని త్యజించగలడు.
సాలెపురుగు నా 22వ గురువు. అది తాను వెడలగ్రక్కిన పదార్థంతో గూడు అల్లుతుంది. కొంతకాలానికి తిరిగి దానిని మ్రింగివేస్తుంది. అలానే బ్రహ్మ, తనలోనుండి ఈ సృష్టిని బహిర్గతం చేసి, తిరిగి తనలోనే లీనం చేసుకుంటాడు. జీవుడు గూడ తన హృదయగతములైన సంస్కారాలతో తన ఉపాధిని పెంచుకొని, మరలా అవసాన దశలో తిరిగి దానిని అంతర్గతం చేసుకుంటాడు. కనుక ఈ జగత్తంతా వాస్తవానికి బ్రహ్మమయమే అయినా, తత్త్వజ్ఞానాన్ని సాధించని వారికి యిది వాసనామయం.
నా 23వ గురువు భ్రమరకీటము, భ్రమరము (తన గుడ్డునుండి బయల్పడిన తన కీటాన్ని తెచ్చి, గూటియందుంచి, దాని చుట్టూ ఝంకారం చేస్తుంది. ఆ భీతివలన కీటం అహర్నిశలూ భ్రమరాన్ని గురించే చింతించి, కొంతకాలానికి తానే భ్రమరమవుతుంది. అలానే సచ్చిష్యుడు తన గురువును నిరంతరం ధ్యానించి, తానే గురురూపుడౌతాడని గుర్తించాను.
నా 24వ గురువు జలము. జలం సర్వజీవులకూ దాహం తీరుస్తుంది. వాటి దేహాలకు శుచి, ఆరోగ్యము, చల్లదనమూ యిస్తుంది. వృక్షాలను, సస్యాలనూ పోషిస్తుంది. అన్ని జీవులకూ అంత మేలు చేస్తున్నా, తాను మాత్రం నమ్రతతో పల్లమైన ప్రాంతాలలోనే నిలుస్తుంది. అలానే ముని, తన్నాశ్రయించిన వారి హృదయ - దేహ తాపాలను తొలగించి రక్షిస్తూ గూడ, వినమ్రుడై యుండాలని గ్రహించాను.”
"శ్రీ గురుచరిత్ర" శ్రీగురుని కాలంలోనే వ్రాయబడిందని గమనించాము. కాని శ్రీగురుని కాలం కొంత స్థూలంగా మాత్రమే నిర్ణయించడం సాధ్యం. వీరు కాశీలో కృష్ణసరస్వతి అనే యతీశ్వరుని వద్ద సన్యాసాశ్రమం స్వీకరించారు. విద్యారణ్యుల శిష్య పరంపరలో మూడవవారు శ్రీ కృష్ణసరస్వతి. విద్యారణ్యులు 14వ శతాబ్ది పూర్వార్థంలో శంకరాచార్యుల పీఠం అలంకరించినట్లు చరిత్ర చెబుతోంది. కనుక కృష్ణసరస్వతి 15వ శతాబ్ది ఆరంభంలో శ్రీగురునికి సన్యాసదీక్ష యిచ్చివుండాలి.
శ్రీగురుడు 9వయేట యిల్లువిడచి వెళ్ళిపోయారు. అటు తర్వాత 30 సం॥నకు ఆయన తిరిగి తన తల్లిని దర్శించారు. అంటే ఆయనకు 38 సం॥లు వుండాలి. ఆయన మాతృదర్శనానికి బయల్దేరే ముందు సాయందేవునితో, మళ్ళీ 16 సం॥ల తర్వాత తమ దర్శనం అతనికి లభించగలదని చెప్పారు. అటు తర్వాత రానున్న బహుధాన్య నామ సం॥లో శ్రీశైలంలో మళ్ళీ తమను కలుసుకోమని ఆదేశించి ఆయన వెళ్ళిపోయారని శ్రీ గురుచరిత్ర చెబుతుంది. అంటే అప్పటికి శ్రీగురుని వయస్సు 54 సం॥లు అయివుండాలని, అంటే ఆయన క్రీ.శ. 1405, పార్థివనామ సం॥లో అవతరించి వుండాలని కొందరు చరిత్రకారులు తలచారు.
శ్రీగురుని చేత యవనరాజు భయంనుండి రక్షించబడిన సాయం దేవుని కుమారుడు నాగనాథరావు. అతని కుమారుడు గంగాధరుడు. అతని కొడుకు శ్రీనృసింహ సరస్వతి శిష్యకోటిలోనివాడు. అతడే సన్యసించి గంగాధర సరస్వతి అను పేర ప్రసిద్ధిచెందాడు. ఇతడు శ్రీగురుని అనుమతితోనే "శ్రీ గురుచరిత్ర" వ్రాసినట్లు ఆ గ్రంథారంభంలోనే స్పష్టంగా వ్రాసాడు. ఆ గ్రంథమంతా సిద్ధనామ ధారక సంవాదంగా వ్రాయబడింది. ఈ సిద్దయోగి శ్రీగురుని ముఖ్యశిష్యులలో ఏడవవాడని శ్రీగురుచరిత్ర చెబుతున్నది. మిగిలిన శిష్యులందరినీ తీర్ధయాత్రలకు - పంపివేసినపుడు గూడ సిద్ధయోగిని మాత్రం తమ చెంతనే వుండనిచ్చారు. కనుక గ్రంథకర్తయైన గంగాధర సరస్వతియే శ్రీ గురుని శిష్యుడైన సిద్ధుడన్నది స్పష్టం. "అయితే అతడు, తన పేరు నామధారకుడని వ్రాసుకోడానికి కారణమేమిటి?
శ్రీగురుని అనుగ్రహము, ఆదేశమూ పొందకముందటి గంగాధరుడే నామధారకుడు. అది పొంది, వారి అనుగ్రహానికి పాత్రుడైన తర్వాత తానే సిద్ధయోగి. అంతకుముందు తాను నామధారకుణ్ణని వ్రాసుకోవడంలో ఒక ధర్మశాస్త్ర సూక్ష్మం యిమిడివున్నది. జన్మతః బ్రాహ్మణుడై గూడ నిర్దుష్టంగా సదాచారం పాటించనివాణ్ణి నామధారకుడంటారని యాజ్ఞావల్క్యాస్మృతి చెబుతున్నది. మొదట తాను అలానే జీవించినట్లు శ్రీగురుచరిత్ర ఆరంభంలో అతడు వ్రాసుకొన్నాడు. శ్రీగురుని అనుగ్రహం పొందిన తర్వాత తన పేరు చివర 'సరస్వతి'యనే గురునామాన్ని తన దీక్షానామంగా ధరించడంవలన గూడ అతడు నామధారకుడయ్యాడు. తన గురువుయొక్క అవతారకార్యాన్ని కొనసాగించడంలో భాగంగా శ్రీగురుని లీలలు ప్రచారం చేయడమే ఈయనకు సాధనగా విధించబడింది. అంటే యీ గ్రంథం 15వ శతాబ్దం ప్రాంతంలో వ్రాయబడి వుండాలి.
కొందరు పండితులు శ్రీగురుని నిర్యాణం క్రీ.శ.1516లో జరిగియుండాలని నిర్ణయించారు. "గురుచరిత్ర" ప్రకారం చంద్రుడు కుంభరాశిలో వుండగా ఒక్క బహుధాన్య సం॥లో శ్రీగురుడు అంతర్థానమయ్యారు. ఇది 1456 మధ్య అయివుండాలని 'అప్రబుద్ధ' అనే చరిత్రకారుడు, కొందరు జ్యోతిశ్శాస్త్రవేత్తల • అన్నారు. కొన్ని వ్రాతప్రతులలో ఆ సం॥రమే ప్రస్తావించబడినట్లు 'నృసింహ సరస్వతి . మరియు దత్తసాంప్రదాయాల చరిత్ర' అనే మరాఠీ గ్రంధంలో రామచంద్ర చింతామణి డేరే వ్రాశారు. 'గురుచరిత్ర వచనం జనవరి 19, 1459కు సరిపోతుందని టి.బి. అభ్యంకరశాస్త్రి, కామత్ పండితులు నిర్ణయించారు.
శ్రీగురుడు 50 సం॥లు జీవించియుండవచ్చని తలచి, వారి జనన సం॥ 1406 ప్రాంతమైయుండాలని. పూర్వ చరిత్రకారుల అంచనా. కాని యీ అంచనా సరిగాదు. ఈ వివరాలను విపర్యయ క్రమంలో వివరిద్దాము: శ్రీగురుని నిర్యాణము 1456; గాణాపురవాసం (23 సం॥) 1433 నుండి 1456 వరకూ; అంతకుముందు వాడీలో తపశ్చర్య 12 సం॥, అనగా 1420 నుండి 1432 వరకూ నరసింహ వాడీలో వున్నారు. ఔదుంబరవాసం 1419; పరలో వైద్యనాథ నివాసం - 1418; గౌతమీ తటయాత్ర 1416 నుండి 1418 వరకూ; పునర్మాతృదర్శనం 1414; సన్యాసాశ్రమ స్వీకారం 1386; గృహ పరిత్యాగం (శ్రీగురు వచనం ప్రకారం పునరాగమనానికి 30 సం॥కుముందు) 1384; ఇది ఉపనయనం తర్వాత 1 సం॥కి, అనగా ఉపనయన సం॥ 1383; జననం - 1376. అంటే శ్రీగురుని ఆయుర్దాయం 80 సం॥లు.
శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వరంలో వుండగా సాయం దేవుని బాధ పెట్టిన యవనరాజే, దేశంలోని బ్రాహ్మణులను చర్చలో పరాభవించమని యిద్దరు పండితులను ప్రోత్సహించియుండవచ్చు. ఈ కుపండితులకు శ్రీగురుడు గర్వమణచినది గాణాపురంలోనే. అంటే సాయందేవుడు సెప్టెంబర్ 24, 1422 నుండి ఫిబ్రవరి 27, 1435 వరకూ రాజ్యపాలన చేసిన అహ్మద్ షా కొలువులోనివాడైయుండాలి. హిందువులపట్ల ఆదరణ కల్గియున్న రెండవ అల్లావుద్దీన్ శ్రీగురునికి భక్తుడైయుండాలి. ఇతడు ఫిబ్రవరి 27, 1435 నుండి ఫిబ్రవరి 13, 1458 వరకూ రాజ్యపాలన చేసాడు. ఇతని మరణానంతరం ఒక సంవత్సరంలోగా శ్రీగురుడు నిర్యాణం చెందియుండాలి.
శ్రీగురుని జీవితకాలంలో ఆరుగురు బహ్మనీ వంశపు యవనరాజులు బీదర్ను పరిపాలించారు. వీరిలో అయిదవవాడైన అహ్మదా 1432లో తన ముఖ్యపట్టణాన్ని బీదర్ (వైఢూర్య నగరము)కు మార్చాడు. తర్వాత రెండవ అల్లావుద్దీన్ 1435 నుండి 1458వ వ్రణంతో బాధపడ్డాడని చరిత్ర చెబుతున్నది. అతడే వెనకు జన్మలో శ్రీపాదులను సేవించిన రజకుడైయుండాలి. రెండవ అల్లావుద్దీన్ కు ప్రణబాధ హిందువైన సన్యాసి మహిమవలన తగ్గిందని ముస్లిం చరిత్రకారులు వ్రాయకపోవడానికి వారి స్వమతాభిమానం కారణమై యుండవచ్చు.
బీదర్ను 'శ్రీగురుచరిత్ర' పలుచోట్ల 'చాహురాష్ట్ర' అని వర్ణిస్తుంది. బీదర్లోని బహ్మనీలు రాజ్యాన్ని నాల్గు భాగాలుగా చేసారని చరిత్ర చెబుతున్నది. రెండవ అల్లావుద్దీన్ ఒక్కడేగాక, మరికొందరు ముస్లిం పరిపాలకులు గూడ శ్రీగురుని భక్తులైనట్లు తెలుస్తున్నది. బీజపూర్లో ఇబ్రహీం బాషా అనే యవనరాజు శ్రీగురుపాదుకలకు మందిరం నిర్మించాడు. బీజాపూర్ రాజైన యూసఫ్ ఆదిల్ షా గూడ బీజపూర్లోని తన కోటలో నిత్యపూజకోసం శ్రీగురుపాదుకా మందిరం నిర్మించాడు. ఇతడే నర్సోబావాడీ క్షేత్ర నిర్వహణకోసం జౌఖేడ్, గౌఖేడ్ అనే గ్రామాలను జాగీర్లుగా సమర్పించుకొన్నట్లు ఆధారాలున్నాయి.
శ్రీగురుని జననానికి, శ్రీపాదుల నిర్యాణానికీ మధ్యకాలం 25 సం॥లని నిర్ణయించి, వారి జీవితకాలం 1330-1351 అని చరిత్రకారులు అంచనావేశారు.
'శ్రీ గురుచరిత్ర' క్రీ.శ. 1460 ప్రాంతంలో మొదట సిద్ధముని శిష్యులొకచేత సంక్షిప్తంగా సంస్కృతంలో వ్రాయబడినదని 'మరాఠీ సారస్వత' అన్న గ్రంథంలో వినాయక లక్ష్మణ్బావే వ్రాశారు. తర్వాత కన్నడదేశీయుడైన గంగాధర సరస్వతి దానిని 7491 ఓవీలు, 51 అధ్యాయలుగల గ్రంథంగా మహారాష్ట్ర భాషలో వ్రాసారు. రచన గాణాపూర్లో జరిగింది. ఆ కాలంలో, ఆ ప్రాంతంలో మహారాష్ట్ర సంస్కృతి బాగా వ్యాపించడం వలన యీ రచనలో మరాఠీ, కన్నడభాషల మిశ్రమం కనబడుతుంది.
శ్రీగురుని శిష్యుడైన సాయం దేవుని తర్వాత అయిదవతరం వాడు సరస్వతీ అంటే అతడు శ్రీగురు నిర్యాణం తర్వాత 75 లేక 80 సం॥లవాడై యుండాలి. అతడు శ్రీగుటని నిర్యాణం తర్వాత సుమారు 100 సం॥లకు, అంటే సుమారు 1556 ప్రాంతంలో, ఈ గ్రంథాన్ని వ్రాసియుండాలి. సాయం దేవుని కుమారుడు నాగనాధరావు. అతనికొడుకు గంగాధరుడు. అతని కొడుకు శ్రీగురుని - శిష్యకోటిలోనివాడే. అతడే సన్యసించి 'గంగాధర సరస్వతి' యైనాడు. ఇతని తల్లిపేరు చంపాదేవి.
శ్రీ సిద్ధనామధారక సంవాదాత్మకమైన ధర్మార్ధ కామమోక్ష ప్రతిపాదకమైన "శ్రీ గురుచరిత్ర" అనే పేరుగల యీ గ్రంథము శ్రీ దత్తాత్రేయస్వామియొక్క ప్రత్యక్షమైన ఆజ్ఞమేరకు - శ్రీ మత్సరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీ గత్తాత్రేయ స్వరూపులూ అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతీ చరణులచేత సంస్కృత భాషలో వెలయించబడిన "శ్రీసంహితాయన గురుద్విసాహస్రి" అనే గ్రంథము. వారి ప్రత్యక్ష శిష్యులు, యోగి పుంగవులూ అయిన కీ.శే. శ్రీ సద్గురు గుళవణి మహరాజు (పూణే) గారి ఆశీస్సులతో స్వయంగా ప్రసాదించబడి, శ్రీ దత్తాత్రేయుని పూర్ణావతారము, సమర్ధ సద్గురుడు అయిన శిరిడీ సాయినాథుని అనుగ్రహం వలన సద్గురు భక్తపాదరేణువైన నా చేత తెనుగు చేయించుకొనబడిన అక్షర ప్రసాదము. తప్పులు అనువాదకునివి. మహిమ స్వామిది.
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీ పాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః
దిగంబరం భస్మ విలేపితాంగం
బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం।
నిర్మానసం శ్యామతనుం భజేహం
దత్తాత్రేయం బ్రహ్మ సమాధి నిష్ఠమ్॥
యోగారూఢం యోగపట్టేన వీతం
హస్తద్వంద్వం జానుయుగ్మే ప్రసార్య
అంసాగ్రస్థ రక్త చంచజ్జటాకం
దత్తాత్రేయం భావయే వీక్షమాణమ్॥
(3వ పంక్తి “అంసాగ్రస్థ దివ్యభూషా జటాలం" అని గూడ చదువవచ్చు)
అనసూయాత్మజం చంద్రానుజం దుర్వాస సో గ్రజం।
నారాయణం మహావిష్ణుం దత్తాత్రేయం నమామ్యహమ్॥
సాధకః ప్రాతరుద్ధాయ కృతశౌచక్రియస్మరేత్।
ఆత్రేయం బ్రహ్మ రంధ్రస్థం ద్విభుజం గురురూపిణమ్ ॥
ఓంకారం ప్రత్యగాత్మానం పరబ్రహ్మ స్వరూపిణమ్।
పరమాత్మాన మవ్యక్తం దత్తాత్రేయం స్మరామ్యహమ్॥
దత్తాత్రేయం త్రిమూర్తిం హృదయమయ మహాపద్మ యంత్రాధి రూఢం।
శంఖం చక్రం త్రిశూలం డమరుకలశా వక్షాలాత్త ముద్రామ్ ॥
షడ్భిర్దర్భిర్ధదానం స్ఫటికమణినిభం షడ్జటా బద్ధ మౌళిం।
సర్వాలంకారయుక్తం భజతి మధుమతీ మోక్షలక్ష్మీ సమేతం॥
మందార మూలే మణి పీఠ సంస్ధం సువర్ణ దానైక నిబద్ధదీక్షం।
ధ్యాయేత్పరీతం నవనిత్య సిద్ధిర్దారిద్య్ర దావానల కాలమేఘమ్॥
దత్తాత్రేయ హరేకృష్ణ ఉన్మత్తానంద దాయక।
దిగంబరమునే బాల పిశాచ జ్ఞానసాగర॥
మాలాకమండలు ధరకరపద్మయుగ్మే
మధ్య పాణి యుగళే డమరు త్రిశూలే।
యస్యస్ధ ఊర్ధ్వకరయోః శుభశంఖ చక్రే
వందే తమత్రివరదం భుజషట్క యుక్తమ్ ॥
వాఖ్యాముద్రాం కరసరసిజే దక్షిణో సందధానో
జానున్యస్తాపర కరసరోజాత్తవేత్రో నతాంసః।
ధ్యానాధ్యానా త్సుఖపరవశా దర్ధమామీలితాక్షో
దత్తాత్రేయో భసిత ధవళః పాతునః కృత్తివాసాః!!
కాషాయ వస్త్రం కరదండ ధారిణం కమండలుం పద్మకరేణ శంఖం।
చక్రం గదా భూషిత భూషణాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ॥
ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః।
చింతామణి గురో: పాదౌ దుర్లభౌ భువనత్రయే॥
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్।
సర్వరోగహరం దేవం దత్తాత్రేయ మహం భజే॥
అస్య శ్రీ దత్తాత్రేయ స్తోత్ర మహామంత్రస్య। భగవాన్ నారదఋషిః।
అనుష్టప్ ఛందఃః। శ్రీ గురుదత్తాత్రేయో దేవతా।
శ్రీ గురు దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్ధే స్తోత్రపారాయణే వినియోగః॥
జగదుత్పత్తి కర్రేచ స్థితిసంహార హేతవే।
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే॥
జరాజన్మ వినాశాయ దేహశుద్ధికరాయ చ।
దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే ॥
కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయచ।
శ్రీరామ్యమైన వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే॥
హ్రస్వ దీర్ఘ కృశ స్థూల నామగోత్ర వివర్జితః।
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే॥
యజ్ఞభోక్రేచ యజ్ఞాయ యజ్ఞ రూపధరాయచ।
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే॥
ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యేప్యంతే దేవ స్సదాశివః।
మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే॥
భోగలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే।
జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే॥
దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ।
సదోదిత పరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే॥
జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపుర నివాసినే।
జయమానం సుతం దేవం దత్తాత్రేయ నమోస్తుతే॥
భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే।
నానా స్వాద్యమయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే॥
బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రమాకాశ భూతలే।
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తుతే॥
అవధూత సదానంద పరబ్రహ్మ స్వరూపిణే।
విదేహ దేహరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే॥
సత్యరూప సదాచార సత్యధర్మపరాయణ।
సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే॥
శూలహస్త గదాపాణే వనమాలా సుకంధర।
యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే॥
క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ।
దత్తముక్తి పరస్తోత్ర దత్తాత్రేయ నమోస్తుతే॥
దత్తవిద్యాయ లక్ష్మీశ దత్తస్యాత్మస్వరూపిణే।
గుణనిర్గుణ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే॥
శత్రునాశనకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్।
సర్వపాపప్రశమనం దత్తాత్రేయ నమోస్తుతే॥
ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్।
దత్తాత్రేయప్రసాదేన నారదేన ప్రకీర్తితమ్॥
అత్రిభూ రనసూయేయో హరిల్లైనాతృకో నుజః।
దుర్వాససో గ్రజః కృష్ణో వధూతః కపిలాగ్రజః॥
కృతాదియో,వేదబోధో వేదవేద ప్రవర్తకః।
కార్తవీర్యప్రియ స్సిద్ధి నిస్సంసారో జితేంద్రియః॥
బాలలీలో జటీ మత్తో బహుధాత్మా కుటీచకః।
హంసః పరమహంసాగ్ర్యః చార్వాకమతభంజనః॥
నాస్తికాచారమథనో బౌద్ధరాద్ధాంతనాశనః।
మధుమాంసాదిసంతుష్ట స్తపోవృద్ధో ద్విజోత్తమః॥
భస్మచ్ఛన్న స్మర్తృగామీ ఖట్వాంగీ యోగపట్టభృత్।
త్రిశక్తీశ స్త్రిశక్త్యాత్మా పీతాంబర విరాజితః॥
దీర్ఘశ్మశ్రుర్దీర్ఘనఖో వేత్రపాణిర్హ సన్ముఖః।
జాంబూనదోత్థవలయో వజ్రకుండల మండితః॥
క్షణే క్షణే రూపభేద దేశభేద సభక్త భాక్।
కోల్లాపురీ జపాసక్తః కాశీస్నానపరాయణః॥
మహూర్యాశీ సహ్యశాయీ నాదబ్రహ్మైక విష్ఠితః।
మృదంగవీణారసిక: త్రిపురాంతక సంస్కృతః॥
జ్ఞానోపదేశ దత్తాత్రేయో దిగంబర:।
షట్పంచాశతికం నామ దత్తాత్రేయన్య యోగినః॥
వరదః కార్తవీర్యాది రాజ రాజ్యప్రదో నఘ।
విశ్వశ్లాఘ్యో మితాచారో దత్తాత్రేయో మునీశ్వరః॥
పరాశక్తి పదా క్లిష్టో యోగానందః సదోన్మదః॥
సమస్తవైరి తేజోహృత్ పరమామృత సాగరః॥
అనసూయా గర్భరత్నం భోగమోక్ష సుఖప్రదం।
శ్రీపాద వల్లభఃపాతు శ్రీనృసింహ సరస్వతీ॥
నమస్తే యోగిరాజేంద్ర దత్తాత్రేయ దయానిధే।
స్మృతిం తే దేహిమాం రక్ష భక్తింతే దేహిమే దృఢం॥
బ్రహ్మ శ్రీశహర స్వరూపమచలం లింగం జగద్వ్యాపకం
సత్వజ్ఞాన మనన్తమక్షర మజం చాంతర్బహిర్వ్యాపకం।
స్వచ్ఛన్దం సుగుణాశ్రితం సదమలం సర్వేశ్వరం శాశ్వతం
వన్దేహం గురుపూర్ణ బోధమనిశం శ్రీదత్త యోగీశ్వరమ్॥
విశ్వస్యాయతనం విరాట్తనుభృతం వేదాన్త సారంవిదు
శ్చన్దాదిత్య కృశానునేత్ర మనఘం జ్యోతిఃపరం జీవనమ్।
ఉత్పత్తిస్థితి నాశనం జగదిదం చైతన్య బీజాత్మకమ్ ॥వన్డే॥
శాస్త్రాకార మనేక కావ్య రచనా దీక్షోపమాంగీకృతం
కాలాతీత మనాది సిద్ధ పరమం కర్పూర గౌరోపమం।
నిశ్శీమం నిగమాదితం నిధిపరం నేతీతి నిర్ధారితం ॥వన్డే॥
భూతానామధి దైవతం నిజమహాతత్త్వం పురాణం పరం
మూలాస్థాన నివాసినం మునివరం మృత్యుంజయం ముక్తిదం।
సర్వోపాధి వివర్జితం చ విషయైః సర్వేన్గియైః స్వాధితం ॥వన్డే॥
ఆధివ్యాధిహరం నృణామతిశయం చారోగ్యమాయుఃకరం
సౌభాగ్యం సకలేప్సితార్థ కరణం సంపత్కరం శోభనం।
కళ్యాణం కలి దుఃఖదోష శమనం కారుణ్య పుణ్యేశ్వరం ॥వన్డే॥
ఆనన్దానన్దకర్తా త్రిభువన గురుః శుద్ధసత్త్వ ప్రధానమ్
అజ్ఞానాం జ్ఞానదాతా గణయతి శయనం శుద్ధసత్త్వ ప్రకాశమ్।
సోహం సర్వాత్మత్త్వే జగదఖిలపదం పూర్ణబోధం పురాణం ॥వన్డే॥
భక్తానామభయంకరం భవభయ కేశాపహారం శుభం,
నిర్విఘ్నం నిరుపద్రవం సునియతం నిత్యోత్సవం నిర్మలం।
శత్రోస్తామసహారిణం లఘునతా తాపత్రయోన్మూలనం ॥వన్డే॥
సో హంహంసః స్వగతవరపరం పూర్ణమానన్దసాక్షీ
వ్యోమాకారం విశాలం విభవప్రభవ భూతమాద్యన్తసాక్షి।
జ్ఞానం జ్ఞానార్ధసారం అహమిహ నియతం అద్వితీయం ॥వన్డే॥
(- శ్రీశంకరాచార్య)
అనేక ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలలోవలె ఈ గ్రంథంలో గూడా స్త్రీలలో సుమంగళులకు పతివ్రతా ధర్మాలు, పతిని కోల్పోయిన వారికి వైధవ్య ధర్మాలు చెప్పబడ్డాయి. ఆధునికులకు ఇవి స్త్రీలను అణచి పెట్టడానికి మన ప్రాచీనులేర్ప రచిన కుయుక్తిలాగా తోస్తాయి. కాని బ్రహ్మచారి, సన్యాసి పాటించవలసిన నియమాలు కూడా అలానే వుండడం గమనార్హం. గురుగీతవంటి ఆధ్యాత్మిక గ్రంధంలో, ధర్మశాస్త్రాలలో, శ్రీ గురుచరిత్రలో దీపకుడు ఆచరించి చూసిన జీవితవిధానము కూడ అలానే వుంటాయి.
ప్రాచీన జీవిత విధానము ముక్తి లేక జ్ఞానము జీవితలక్ష్యంగా కలిగియుండేది, మనస్సును అనుక్షణము మారుతూండే కోరికల ప్రభావం నుండి విడుదల చేసి, అన్ని విషయాలలో ఒకానొక ఏకాగ్రత, తదనుశ్రుతమైన ధర్మానికి కట్టుబడడం సంస్కారానికి పట్టుకొమ్మగా నిలిచాయి. గురువుపట్ల శిష్యుడాచరించవలసిన ధర్మాలు గురుగీతలోనివి, గురుచరిత్రలోని వీ-పతివ్రతా ధర్మాలనెంతగానో పోలివుంటాయి. ఆధ్యాత్మిక రంగంలో ఇష్టదేవతకు, వివాహంలో ఒక జీవిత సహచారికి, తక్కిన జీవితమంతటిలో ఋషిప్రోక్తమైన ధర్మానికి కట్టుబడడమే లక్ష్యం.
కాకుంటే యెప్పుడూ భార్యే భర్తకులోబడి వుండవలసినట్లు శాస్త్రాలెందుకు చెప్పాయి? అన్న ప్రశ్న వస్తుంది. శిష్యుడు గురువుకీ, భక్తుడు దైవానికి కట్టుబడి వుండాలనడానికేది కారణమో అదే, గృహిణి కంటే వయస్సులో పెద్దమైన భర్త గురుసేవలో సుక్షితుడై యుండాలని, శిక్షణ పూర్తియైన అతని సేవలో లౌకిక జీవితంతోబాటు అటు ఆధ్యాత్మిక శిక్షణకూడా స్త్రీకి లభించేలా అలా నియమిం చారు. భర్తయెడల సహజంగా భార్యకుండే ప్రేమ, గురువుపట్ల శిష్యునికి, దైవంపట్ల భక్తునికీ వుండవలసిన ధర్మాలూ పటిష్టమవడమేగాక, తత్కారణంగా మూడూ. సార్థకమవగలవన్న ఈ ధర్మ సూక్ష్మం: అయితే వీటికితోడు కాలాంతరంలో ఈ లక్ష్యాన్ని ఉద్దేశించని అనేక చిల్లర ధర్మాలను యధేచ్ఛగా ధర్మశాస్త్ర గ్రంథాలలో.. ప్రక్షిప్తంచేసి వుండవచ్చు. అదృశ్యమైన ఇష్టదేవతను యావజ్జీవితం ఏకాగ్రతతో ఆయన స్థాపించిన అగ్నిని సేవిస్తూవుండాలని శాస్త్రం. అలానే భర్తరూపం మరుగుపడిన స్త్రీ ఆ భర్తయే గురువు, దైవమూ అనే భావంతో సేవిస్తూ వుండాలని, అపుడు ముక్తి, లేక జ్ఞానానికి అవసరమైన సంస్కరణ జరుగుతుందనీ సూత్రము. ఇట్టి ఆచరణకు మనోవికారాలు అంతరాయాలవుతాయి. కనుక ఆ ప్రమాదాలను ముందుగా ఊహించి, వాటిని నిషేధించడానికవసరమైన దృక్పధమును సాధకు లకు శాస్త్రాలు బోధించాయి. ఒక వంక తల్లిగా, భార్యగా స్త్రీకి అత్యుత్తమైన విలువ నిచ్చిన శాస్త్రాలే బ్రహ్మచారికి, సన్యాసికీ చెప్పబడిన ధర్మాలలో స్త్రీని సర్వ అనర్థాలకూ మూలంగా చిత్రించాయి. ఇవి సహజంగా పురుషునిలో దాగియుండే ప్రకృతి సిద్ధమైన బలహీనత అనే రోగానికి ఔషధంగా మాత్రమే చెప్పబడ్డాయని గుర్తించాలి. సన్యాసికి, విధవరాలుకూ చెప్పబడిన ధర్మాలకుగల పోలికకిదే కారణం. ఏనాడైనా మోక్షము, లేక జ్ఞానమే జీవితపరమావధి అని విశ్వసించిన వ్యక్తులు పాటించవలసిన ధర్మాలే అవి. అట్టి లక్ష్యంలేని వ్యక్తులు గూడ ఆ ధర్మాలను పాటింపజూచినపుడు సామాజిక జీవితంలో అస్తవ్యస్తం తప్పదు.
చదవండి!
|
|
చదివించండి!!
|
"శ్రీ సాయిబాబా జీవితచరిత్ర" పారాయణ ముముక్షువులకు సాటిలేని సాధగము. ఈ విశ్వమంతా తమ రూపమేనని అనుభవ పూర్వకంగా భక్తులకు ఆయన నిరూపించినట్లు యింకెవ్వరూ నిరూపించలేదనే చెప్పవచ్చు. నామరూపాలతో నిండిన యీ సృష్టి విశ్వామిత్రుని వంటి తపస్వులను గూడ భ్రమింపజేసి భగవంతుణ్ణి మరచేలా చేస్తుంది. కాని సాయి చరిత్ర పౌరాయణ, చింతనా చేస్తుంటే అన్ని రూపాలూ భగవంతునివేనన్న గుర్తు సాధకులకు ఎప్పుడూ వుంటుంది. అందరినీ భ్రమింపజేసే యీ విశ్వమే సాయిభక్తులకు గురువై యీ సత్యాన్ని బోధిస్తుంది. వారి నిత్యజీవితమంతా అనన్య చింతతో గూడిన ధ్యానమే అవుతుంది. సాధనన్నది జీవితంలో ఒక భాగం అవటం మాని, వారి జీవితమంతా సాధనగా మారుతుంది. అటువంటి అనన్య భక్తుల యోగ " క్షేమమంతా ఆయనే చూసుకొంటారు. నానాటికీ యాంత్రికము, కేవల సంగీత క్రమంగా మారుతు పూజ మరియు నామ సంకీర్తనలు యీ పారాయణ వలన సజీవము, భావయుక్తమూ అవుతాయి. మానవహృదయంలో భక్తి నాటుకొని పూజ, నామ, జప, సంకీర్తనలు సార్థకంగా చేసుకోగల్గడానికే వాల్మీకి మహర్షి విస్తారమైన రామాయణము, వేదవ్యాసుడు భాగవతము వ్రాసి, తమ శిష్య ప్రశిష్యుల ద్వారా దేశ ప్రజలందరిచేత పారాయణ, శ్రవణము చేయించారు. బుద్ధుడు, క్రీస్తు మరియు మహమ్మద్ ప్రవక్తల జీవిత చరిత్రలే ప్రజలకు స్ఫూర్తినిచ్చి, ఆయా మతధర్మాలు ప్రజలలో దృఢంగా నాటుకొని, నానాటికీ విస్తరించేందుకు వుపయోగపడుతున్నవి. అటువంటప్పుడు "శ్రీ గురుచరిత్ర", "శ్రీసాయిబాబా జీవిత చరిత్ర" రాయణ విస్తారమైన సంప్రదాయంగా ప్రపంచమంతటా వ్యాపించవలసిన అవసరమున్నది.
ప్రతి సంవత్సరము సెప్టెంబరు మొదటి ఆదివారము శ్రీ గురుచరిత్ర కృతజ్ఞతార్చన దినముగా ప్రకటించడమయినది.
గురు బంధువులు, సత్సంగ సభ్యులు, భగవత్ భక్తులు సామూహికంగా, అలా కుదరని పక్షాన తమ తమ గృహములయందు ఈ ఉత్సవాన్ని జరుపుకొనవచ్చును.
ఉదయం సరిగ్గా 10 గంటలకు పూజ ప్రారంభించుకోవాలి.
ఇతర దేశములవారు తమ వీలునుబట్టి ఇదే రోజున ఈ ఉత్సవము జరుపుకొనగలరు.
మొదట రంగవల్లులపై చక్కని పీఠాన్ని అమర్చుకొని, దానిపై ఒక తెల్లటి వస్త్రాన్ని పరుచుకోవాలి. తరువాత అట్టి ఆసనంపై శ్రీ గురు చరిత్ర గ్రంథరాజాన్ని ఆశీనం చేయాలి.
భక్తులందరూ ఈ గ్రంథరూపంలో సాక్షాత్తు శ్రీ గురుడే ఆశీనులై ఉన్నారని హృదయపూర్వకంగా భావన చేసుకోవాలి. ఈ భావన నిలబడేటట్లు తదనుగుణమైన కొన్నిలీలలను మననం చేసుకోవాలి.
గంథ, పుష్ప సహితంగా శ్రీ సాయినాథ పూజా గ్రంథములో వివరించినట్లు శాశ్రోక్తముగా, భావయుక్తంగా అష్టోత్తర నామావళితో పూజించుకోవాలి.
నైవేద్యముతోపాటు అన్ని ఉపచారములు శ్రద్ధగా చేసుకోవాలి.
ఇంత అత్యుత్తమ మార్గాన్ని అందించిన పూజ్య గురుదేవులకు భక్తి శ్రద్ధలతో మంగళహారతి చేసుకోవాలి. ఇలా సామూహికంగా ఉదయం “శ్రీ గురు చరిత్ర” మహాగ్రంథాన్ని అర్చించి, ఎవరి వసతిని బట్టి వారు సాయంత్రం తమ తమ గృహాలలో, ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి ఈ గ్రంథాన్ని తిరిగి పూజించి ఉపోద్ఘాతం చదివి వినిపించడం ఎంతో శ్రేయస్కరం. వీలున్నవారు ఈ గ్రంథ రాజానికి నగర సంకీర్తన మొదలైన కార్యక్రమాలు సాయంత్రం జరుపుకొనడం ఎంతో మంచిది. స్థానిక మందిరాలలో విరివిగా ఈ గ్రంథాన్ని పారాయణ చేయించడం, క్రొత్తవారికి ఈ గ్రంథాన్ని పరిచయం చేయడం, గ్రంథాలను పేదలకు ఉచితంగా పంచడం కూడా ఎంతో శ్రేయస్కరం.
ఈ విధంగా మాస్టర్గారి వలన, వారి రచనల వలన, శ్రీ గురుచరిత్ర గ్రంథం వలన, ఇహపర శ్రేయస్సును పొందుతున్న మనమందరం శ్రద్ధాభక్తులతో, కృతజ్ఞతతో ఈ 'శ్రీ గురుచరిత్ర కృతజ్ఞతార్చన'లో పాల్గొని సద్గురు అనుగ్రహానికి పాతృలం కాగలమని ప్రార్ధన.
మంగ భరద్వాజ ట్రస్ట్
ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారము సాయి లీలామృతం కృతజ్ఞతార్చన దినముగా ప్రకటించడమయినది.
గురు బంధువులు, సత్సంగ సభ్యులు, భగవత్ భక్తులు సామూహికంగా, అలా కుదరని పక్షాన తమ తమ గృహములయందు ఈ ఉత్సవాన్ని జరుపుకొనవచ్చును.
ఉదయం సరిగ్గా 10 గంటలకు పూజ ప్రారంభించుకోవాలి.
ఇతర దేశములవారు తమ వీలునుబట్టి ఇదే రోజున ఈ ఉత్సవము జరుపుకొనగలరు.
మొదట రంగవల్లులపై చక్కని పీఠాన్ని అమర్చుకొని, దానిపై ఒక తెల్లటి వస్త్రాన్ని పరుచుకోవాలి. తరువాత అట్టి ఆసనంపై శ్రీసాయిలీలామృతము గ్రంథరాజాన్ని ఆశీనం చేయాలి.
భక్తులందరూ ఈ గ్రంథరూపంలో సాక్షాత్తు శ్రీ గురుడే ఆశీనులై ఉన్నారని హృదయపూర్వకంగా భావన చేసుకోవాలి. ఈ భావన నిలబడేటట్లు తదనుగుణమైన కొన్నిలీలలను మననం చేసుకోవాలి.
గంథ, పుష్ప సహితంగా శ్రీ సాయినాథ పూజా గ్రంథములో వివరించినట్లు శాశ్రోక్తముగా, భావయుక్తంగా అష్టోత్తర నామావళితో పూజించుకోవాలి.
నైవేద్యముతోపాటు అన్ని ఉపచారములు శ్రద్ధగా చేసుకోవాలి.
ఇంత అత్యుత్తమ మార్గాన్ని అందించిన పూజ్య గురుదేవులకు భక్తి శ్రద్ధలతో మంగళహారతి చేసుకోవాలి. ఇలా సామూహికంగా ఉదయం 'సాయి లీలామృతం' మహాగ్రంథాన్ని అర్చించి, ఎవరి వసతిని బట్టి వారు సాయంత్రం తమ తమ గృహాలలో, ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి ఈ గ్రంథాన్ని తిరిగి పూజించి ఉపోద్ఘాతం చదివి వినిపించడం ఎంతో శ్రేయస్కరం. వీలున్నవారు ఈ గ్రంథ రాజానికి నగర సంకీర్తన మొదలైన కార్యక్రమాలు సాయంత్రం జరుపుకొనడం ఎంతో మంచిది. స్థానిక మందిరాలలో విరివిగా ఈ గ్రంథాన్ని పారాయణ చేయించడం, క్రొత్తవారికి ఈ గ్రంథాన్ని పరిచయం చేయడం, గ్రంథాలను పేదలకు ఉచితంగా పంచడం కూడా ఎంతో శ్రేయస్కరం.
ఈ విధంగా మాస్టర్గారి వలన, వారి రచనల వలన, సాయి లీలామృతం గ్రంథం వలన, ఇహపర వ్రేయస్సును పొందుతున్న మనమందరం శ్రద్ధాభక్తులతో, కృతజ్ఞతతో ఈ 'సాయి లీలామృతం కృతజ్ఞతార్చన' లో పాల్గొని సద్గురు అనుగ్రహానికి పాతృలం కాగలమని ప్రార్ధన.
మంగ భరద్వాజ ట్రస్ట్
గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః ।
గురుర్విశ్వం నచాన్యోస్త్రి తస్మై శ్రీ గురవే నమః ।।